వేపపుల్ల అందుకోబోయి ఒకరి మృతి
Published Tue, Aug 30 2016 9:51 PM | Last Updated on Wed, May 29 2019 2:58 PM
ఎల్లారెడ్డిపేట : పళ్లు తోమడానికి వేపపుల్ల తెంపుకోబోయిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. ఎల్లారెడ్డిపేటకు చెందిన గుండాడి నర్సింహరెడ్డి(66) కుటుంబంతో కొంతకాలంగా హైదరాబాద్‌లోని కుకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో నివాసం ఉంటున్నాడు. అక్కడి యోగా కేంద్రానికి నర్సింహరెడ్డి ముఖ్య సలహాదారుడు, శిక్షకుడిగా పనిచేస్తున్నారు. తన ఇంటి సమీపంలోని ఓ పార్కులో నిత్యం వ్యాయామంతోపాటు యోగా చేస్తారు. రోజు లాగే మంగళవారం వ్యాయామం ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో ఓ వేపచెట్టు కొమ్మను తెంపడానికి ద్విచక్ర వాహనంపైకి ఎక్కాడు. కొమ్మ అందుకునే ప్రయత్నంలో అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నర్సింహరెడ్డి మృతదేహాన్ని ఎల్లారెడ్డిపేటకు తీసుకురాగా.. ఆయన అభిమానులు, బంధువులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. కేడీసీసీబీ వైస్ చైర్మన్ ఉచ్చిడి మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ తోట ఆగయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, వ్యాపారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుడికి భార్య రాధమ్మ, కుమారుడు మల్లారెడ్డి, కూతుళ్లు ఉన్నారు.
Advertisement