బలగాల వాహనం పేల్చివేత | Sakshi
Sakshi News home page

బలగాల వాహనం పేల్చివేత

Published Mon, May 21 2018 3:41 AM

Maoists blow up police vehicle in Chhattisgarh - Sakshi

రాయ్‌పూర్‌ / చర్ల / చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతేవాడ జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు గస్తీ నిర్వహిస్తున్న బలగాల వాహనాన్ని ఆదివారం మందుపాతరతో పేల్చివేశారు. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు దుర్మరణం చెందారు. మావోల దాడిని పిరికిపందల చర్యగా ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌ అభివర్ణించారు. దంతేవాడ జిల్లాలోని బచేలి–చోల్నార్‌ రోడ్డు నిర్మాణ పనులకు సామగ్రిని తరలిస్తున్న వాహనాలకు ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌(సీఏఎఫ్‌), డిస్ట్రిక్‌ ఫోర్స్‌(డీఎఫ్‌) సంయుక్త బలగాలు రక్షణ కల్పిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందులోభాగంగా గస్తీ నిర్వహిస్తున్న బలగాల వాహనం చోల్నార్‌ గ్రామ సమీపంలోకి రాగానే మావోలు శక్తిమంతమైన మందుపాతరను పేల్చారన్నారు.

ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ దాడిలో బలగాల వాహనం తునాతునకలైందని వెల్లడించారు. ల్యాండ్‌మైన్‌ పేలుడు అనంతరం దాదాపు 200 మంది మావోలు బలగాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారన్నారు.  ఐదుగురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారని పేర్కొన్నారు. మృతుల్లో డీఎఫ్‌ బలగాలకు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ రామ్‌కుమార్, కానిస్టేబుల్‌ తికేశ్వర్‌ ధ్రువ్, అసిస్టెంట్‌ కానిస్టేబుల్‌ షాలిక్‌రామ్, సీఏఎఫ్‌ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ విక్రమ్‌ యాదవ్, కానిస్టేబుళ్లు రాజేశ్‌ కుమార్, రవినాథ్‌ పటేల్, అర్జున్‌ రాజ్‌భర్‌లు ఉన్నారు. దాడి అనంతరం బలగాల దగ్గరున్న ఆయుధాల్ని మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. ఇటీవల గడ్చిరోలీ, మల్కన్‌గిరితో పాటు బీజాపూర్‌లో భద్రతాబలగాల దాడిలో భారీగా నష్టపోయిన మావోలు.. ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్లు పోలీస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement