ఘటనా స్థలం నుంచి మృతదేహాల స్వాధీనం
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి జవాన్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురి జవాన్ల మృతదేహాలను తరలించారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 20మంది జవాన్లు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. మృతుల్లో 15మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, అయిదుగురు పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న వారికి భద్రత కల్పించేందుకు జవాన్లు వెళుతున్న మార్గంలో ముందుగా మందుపాతర పేల్చి, అనంతరం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 150మంది నక్సల్స్ పాల్గొన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో డీఐజీ దీపాంశు కబ్రా తెలిపారు.
కాగా ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయిన విషయం తెలిసిందే. సుకుమా జిల్లా సొంపల అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేయడంతో దాదాపు 20 మంది జవాన్లు అక్కడికక్కడే మరణించారు. మరో 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జగదల్పూర్ తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరోవైపు ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సీఎస్, హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, ముఖ్య ఉన్నత అధికారులతో భేటీ అయ్యారు. దాడిపై చర్చించిన రమణ్ సింగ్...ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మావోయిస్టుల ఎదుర్కొనేందుకు తమ ముందున్న పెద్ద సవాల్ అన్నారు. మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.