ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల వాహన రుణ పుస్తకం గణనీయంగా పెరిగి 2025 మార్చి నాటికి రూ.8.1 లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. 2023 మార్చి నాటికి ఇది రూ.5.9 లక్షల కోట్లుగా ఉంది. వాణిజ్య వాహనాలు, కార్లు, యుటిలిటీ వాహనాలు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు డిమాండ్‌కు తోడు.. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడాన్ని అనుకూలమైన అంశాలుగా పేర్కొంది.
రుణ చెల్లింపులు మెరుగ్గా ఉండడంతో, ఆస్తుల నాణ్యత మరింత బలపడుతుందని తెలిపింది. 2023 నాటికి మొత్తం వాహన రుణాల్లో 50 శాతం వాణిజ్య వాహనాల కోసం తీసుకున్నవేనని పేర్కొంది. ఆ తర్వాత కార్లు, యుటిలిటీ వాహన రుణాలు 29 శాతం, ద్విచక్ర/త్రిచక్ర వాహన రుణాలు 11 శాతం, ట్రాక్టర్ల కోసం తీసుకున్న రుణాలు 10 శాతంగా ఉన్నాయి. ‘‘వాణిజ్య వాహనాల ఫైనాన్స్ ఏటా 12–14 శాతం చొప్పున 2023–25 మధ్య కాలంలో వృద్ధి చెందుతుంది. వాణిజ్య వాహనాలను వినియోగించే సిమెంట్, స్టీల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో వినియోగం పెరగనుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు.
కొత్త వాహనాల ధరలు పెరగడంతో, యూజ్డ్ (అప్పటికే ఒకరు వాడిన) వాహన రుణాలకు డిమాండ్ పెరుగుతున్నట్టు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఆస్తుల నాణ్యత మెరుగుపడడం వాహన రుణ సంస్థల పరపతికి మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. వాహన రుణాల మార్కెట్లో 90 శాతం వాటా కలిగిన సంస్థల బ్యాలన్స్ షీట్లను పరిశీలించినప్పుడు, 90 రోజులకు పైగా బకాయి ఉన్న రుణాల శాతం 1.2 శాతం తగ్గి 4.7 శాతానికి పరిమితమైనట్టు ఈ నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment