![LocalCircles group revealed widespread use of deceptive practices by online insurance platforms](/styles/webp/s3/article_images/2024/05/17/insu01.jpg.webp?itok=CZgLlxc-)
ఆన్‌లైన్ బీమా ప్లాట్‌ఫామ్‌లు పాలసీ సమయంలో మోసపూరిత పద్ధతులను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో 36వేల మంది పాలసీదారులు ఈ సర్వేలో పాల్గొన్నారని సంస్థ తెలిపింది. ఇందులో 66 శాతం మంది పురుషులు కాగా, 34 శాతం మంది మహిళలు ఉన్నట్లు చెప్పింది. 49% మంది టైర్ 1 సిటీ నుంచి, 24% మంది టైర్ 2 సిటీ, 27% మంది టైర్ 3, 4, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు సర్వేలో పాల్గొన్నట్లు లోకల్‌సర్కిల్స్ తెలియజేసింది.
సర్వేలోని వివరాల ప్రకారం.. ఆన్‌లైన్ బీమాను కొనుగోలు చేసిన 61 శాతం మంది ‘సబ్‌స్క్రిప్షన్ ట్రాప్’లో పడుతున్నారు. తర్వాత తమ పాలసీని రద్దు చేసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. 86% బీమా ప్లాట్‌ఫారమ్‌లు తరచూ ‘నగ్గింగ్’ విధానాన్ని ఉపయోగిస్తున్నాయి. పాలసీని రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సరైన పరిష్కారం చూపకుండా సందేశాలతో సమాధానమిస్తున్నాయి. 57% మంది పాలసీదారుల నుంచి ఆన్‌లైన్ బీమా ప్లాట్‌ఫామ్‌లు అనవసరమైన వ్యక్తిగత వివరాలు కోరుతున్నాయి. ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి.
‘జీవిత బీమా, ఆరోగ్య బీమా, మోటారు, ఆస్తి.. వంటి బీమా పాలసీలను అమ్మేప్పుడు పాలసీదారులకు ఏజెంట్లు పూర్తి వివరాలు తెలియజేయడం లేదు. తమ టార్గెట్లు చేరుకోవాలనే ప్రయత్నంలో ఎక్కువ ఇన్సెంటివ్ ఉన్నవాటికే ఏజెంట్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులోని పరిమితులు, నిబంధనలను చెప్పడంలేదు. పాలసీదారులు కూడా ఆ ‘టర్మ్స్ అండ్ కండిషన్’ పత్రాలను పూర్తిగా చదవకుండానే పూర్తిగా ఏజెంట్‌ను నమ్మి బీమా తీసుకుంటున్నారు. ఏదైనా ఒక పాలసీ పరిమిత కాలంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని వినియోగదారులకు తప్పుడు సమాచారం ఇస్తూ లేనిఅత్యవసరాన్ని సృష్టిస్తున్నారు’ అని లోకల్ సర్కిల్స్ తెలిపింది.
ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీమా రెన్యువల్, రద్దుకు సంబంధించిన ఫిర్యాదులు అధికమవుతున్నాయని నివేదిక తెలిపింది. గత 9 నెలల్లో ఆన్‌లైన్ బీమా ప్లాట్‌ఫామ్‌లపై మిస్ సెల్లింగ్, మానిప్యులేటివ్ సెల్లింగ్ ఫిర్యాదులు ఎక్కువయ్యాయని సర్వే ద్వారా తెలిసింది.
ఇదీ చదవండి: ట్రక్‌ట్యాక్సీను ఢీకొట్టిన 180 మంది ప్రయాణిస్తున్న విమానం!
ఆన్‌లైన్ బీమా ప్లాట్‌ఫామ్‌లు పాటించకూడని 13 అంశాలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) గతేడాది నవంబర్‌లో నిషేధం విధించినట్లు నివేదిక తెలిపింది. అందులో ప్రధానంగా అత్యవసరాన్ని సృష్టించడం, వినియోగదారులకు పాలసీ లేదంటూ హేళన చేయడం, బలవంతంగా పాలసీని కట్టబెట్టడం, సబ్‌స్క్రిప్షన్ ట్రాప్, ప్లాన్ ధర తగ్గినట్లు చూపడం, అస్పష్టమైన ప్రకటనలు.. వంటి అంశాలపై నిషేధం విధించారు.
Comments
Please login to add a commentAdd a comment