విహార యాత్రల కోసం విదేశాలకు వెళుతున్నారా..? ఎన్ని రోజులు వెళ్లాలి.. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా..? మరి, వెళ్లినచోట ఏదైనా అనారోగ్య పరిస్థితి ఎదురైతే..వెంటతీసుకెళ్లిన సామాగ్రి పోగొట్టుకుంటే.. కంగారు పడకండి.. అలాంటి వారికోసమే చాలా కంపెనీలు ప్రయాణబీమా అందిస్తున్నాయి. అందుకు సంబంధించిన ప్రీమియం చెల్లించి విదేశీ ప్రయాణాన్ని మరింత ధీమాగా పూర్తి చేయవచ్చు. అయితే ఈ ప్రయాణ బీమాకు సంబంధించిన కొన్ని అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
విహారయాత్రలు, ఇతర పనుల నిమిత్తం కొంతకాలంపాటు విదేశాలకు వెళ్లేవారు ప్రయాణానికి సంబంధించి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఊహించని ఖర్చులు ఎదురైతే మొత్తం ప్రయాణంపై ప్రభావం పడుతుంది. అందుకోసం వారు సిద్ధంగా ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లోనే ప్రయాణ బీమా భరోసానిస్తుంది. ఇందుకు సంబంధించి కంపెనీలు ఎలాంటి పాలసీలను అందిస్తున్నాయో తెలుసుకుందాం.
ఆరోగ్య అవసరాల కోసం..
నిత్యం మనదేశం నుంచి వేలసంఖ్యలో విద్యార్థులు, పర్యటకులు, వ్యాపారవేత్తలు విదేశాలకు వెళ్తుంటారు. వారికి ఎప్పుడైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి రావొచ్చు. అలాంటి వారి అవసరాలకు తగ్గట్టుగా ప్రయాణ బీమా పాలసీలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల చికిత్సలు కవర్ అయ్యేలా ఉండే బీమా పాలసీను ఎంచుకోవాలి. ఎలాంటి షరతులూ, నిబంధనలు లేకుండా పూర్తి వైద్య ఖర్చులను చెల్లించే పాలసీను తీసుకువాలి.
ఒకటికి మించి దేశాలకు ఒకే పాలసీ..
ఒకసారి బీమా తీసుకుంటే చాలా ప్రయాణాలకు ఉపయోగపడే పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివి ముఖ్యంగా వ్యాపారవేత్తలకు సరిపోతాయి. ఒకటికి మించి దేశాలకు ప్రయాణించే వారు ఆయా దేశాలన్నింటిలోనూ వర్తించేలా ఒకే పాలసీని తీసుకోవచ్చు. అమెరికాలో ఏడు రోజులపాటు పర్యటించాలనుకుంటే బీమా ప్రీమియం కంపెనీను అనుసరించి దాదాపు రూ.700-రూ.800 వరకూ ఉంటుంది.
సామగ్రి అందకపోయినా..
ఒకటి కంటే ఎక్కువ దేశాలకు ప్రయాణించేవారు నిత్యం సామగ్రి వెంట తీసుకెళ్లాలంటే కష్టం. కాబట్టి ఇతరదేశంలోని చిరునామాలో తమ సామగ్రి చేరేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక్కోసారి ఆ సామగ్రి చేరడం ఆలస్యం అవుతుంది. దాంతో వారు ఇబ్బందులు పడకుండా బీమా సంస్థ పరిహారం ఇచ్చేలా పాలసీలున్నాయి. మొదటిసారి విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు సామగ్రి అందకపోతే ఆర్థికంగా ఎంతో నష్టపోతారు. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణ బీమా వారికి పరిహారం అందిస్తుంది.
ఈ ప్రయాణ బీమా పాలసీలను ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంల ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. బీమా సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, కావాల్సిన విధంగా పాలసీని ఎంచుకోవచ్చు. ప్రయాణ వ్యవధి, ఎంత మొత్తానికి బీమా కావాలి, ప్రయాణం రద్దు, ఆరోగ్య అవసరాల్లాంటివన్నీ పాలసీలో ఉండేలా చూసుకోవాలి. బీమా కంపెనీలు ఆయా ప్రాంతాల్లోని కొన్ని ఆసుపత్రులతో ఒప్పందం చేసుకొని ఉంటాయి. ఆ జాబితాను ఒకసారి పరిశీలించాలి.
ఇదీ చదవండి: మొబైల్‌లో ఆర్డర్‌చేసి కిచెన్‌లోకి వెళితే వంట రెడీ!
పాలసీ తీసుకునేపుడు గుర్తుంచుకోవాల్సినవి..
పాలసీ తీసుకునేటప్పుడు మీ పర్యటన జరిగే అన్ని రోజులకు వర్తించేలా చూసుకోవాలి. పాలసీలోని మినహాయింపులు, పరిమితులు ముందే తెలుసుకోవాలి. ముందస్తు వ్యాధుల చికిత్సకు వర్తిస్తుందా లేదా చూసుకోవాలి. కొన్ని ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రత్యేక అవసరాలు ఉండొచ్చు. వాటికీ పాలసీ వర్తించేలా చూసుకోవాలి. ఏ క్షణమైనా మీకు సేవలను అందించేలా సహాయ కేంద్రాలు పనిచేస్తున్నాయా.? మీరు వెళ్లే ప్రాంతాల్లో ఎన్ని ఆసుపత్రులతో ఒప్పందాలున్నాయి అనే విషయాన్ని పరిశీలించాలి.
Comments
Please login to add a commentAdd a comment