ఒకరికి రెండు పాలసీలు.. క్లెయిమ్‌ ఎలా? Health Insurance Claim from Multiple Policies | Sakshi
Sakshi News home page

ఒకరికి రెండు పాలసీలు.. క్లెయిమ్‌ ఎలా?

Published Mon, Jun 17 2024 4:32 AM

Health Insurance Claim from Multiple Policies

ఆస్పత్రి బిల్లు పాలసీ పరిధి దాటినప్పుడే..

ముందుగా ఒక పాలసీ కిందే క్లెయిమ్‌

అది పరిష్కారమైన తర్వాత రెండో దానికి చాన్స్‌

నగదు రహితం లేదా రీయింబర్స్‌మెంట్‌

ఆస్పత్రిలో చేరితే రెండు సంస్థలకూ చెప్పాల్సిందే  

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రాధాన్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవలి కాలంలో వేతన జీవుల్లో చాలా మంది రెండు హెల్త్‌ పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స వ్యయం బీమా కవరేజీని మించిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాలను ఒకటికి మించిన పాలసీలతో సులభంగా గట్టెక్కొచ్చు. కానీ, ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉంటే క్లెయిమ్‌ ఎలా చేయాలనే విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విషయంలో నిపుణుల సూచనలు అందించే కథనమిది.

గతంలో వేరు.. 
ఒక వ్యక్తికి ఒకటికి మించిన బీమా సంస్థల నుంచి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు ఉంటే, క్లెయిమ్‌ మొత్తాన్ని ఆయా సంస్థలు సమానంగా భరించాలనే నిబంధన లోగడ ఉండేది. 2013లో దీన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) తొలగించింది. దీంతో ఇప్పుడు ఒకటికి మించిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు కలిగి ఉన్నా కానీ, పాలసీదారు తనకు నచ్చిన చోట లేదంటే రెండు సంస్థల వద్దా క్లెయిమ్‌ దాఖలు చేసుకోవచ్చు.  

క్లెయిమ్‌ ఎలా? 
రెండు ప్లాన్లు కలిగిన వారు ఆస్పత్రిలో చేరిన తర్వాత రెండు బీమా సంస్థలకు తప్పనిసరిగా సమాచారం అందించాలి. ఒకటికి మించిన సంస్థల నుంచి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లు కలిగి ఉంటే, అప్పుడు ముందుగా ఒక బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తే సరిపోతుంది. నగదు రహిత, రీయింబర్స్‌మెంట్‌ మార్గాల్లో దేనినైనా వినియోగించుకోవచ్చు. 

క్లెయిమ్‌ మొత్తం ఒక హెల్త్‌ ప్లాన్‌ కవరేజీ దాటనప్పుడు ఒక బీమా సంస్థ వద్దే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక పాలసీ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు వచి్చనప్పుడు, రెండో బీమా సంస్థ వద్ద మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్‌ చేసుకోవాలి. అంతే కానీ, ఒకేసారి ఒకే క్లెయిమ్‌ను రెండు సంస్థల వద్ద దాఖలు చేసేందుకు అవకాశం లేదు. ఉదాహరణకు రూ.5 లక్షల చొప్పున రెండు ప్లాన్లు ఉన్నాయని అనుకుందాం. 

ఆస్పత్రి బిల్లు రూ.7 లక్షలు వచి్చంది. అప్పుడు తొలుత ఒక సంస్థ వద్ద క్లెయిమ్‌ దాఖలు చేయాలి. అక్కడి నుంచి వచి్చన చెల్లింపులు మినహాయించి, అప్పుడు మిగిలిన మొత్తానికి రెండో బీమా సంస్థ నుంచి పరిహారం కోరాలి. ఒక పాలసీలో రూమ్‌రెంట్‌ పరంగా పరిమితులు ఉండి, దానివల్ల క్లెయిమ్‌ పూర్తిగా రాని సందర్భాల్లోనూ.. మిగిలిన మొత్తాన్ని రూమ్‌రెంట్‌ పరిమితులు లేని మరో పాలసీ కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చు. 

కొన్ని పాలసీల్లో రూమ్‌ రెంట్, కొన్ని చికిత్సలకు పరిమితులు ఉంటాయి. ముఖ్యంగా గ్రూప్‌ హెల్త్‌ ప్లాన్లలో ఇవి చూడొచ్చు. అలాంటప్పుడు రూ.5 లక్షల కవరేజీ ఉన్నప్పటికీ పూర్తి మొత్తం రాకపోవచ్చు. ఉదాహరణకు రూ.7లక్షల ఆస్పత్రి బిల్లుకు సంబంధించి రూ. 5 లక్షల గ్రూప్‌ పాలసీలో రూ.4 లక్షలే క్లెయిమ్‌ కింద వచి్చందని అనుకుంటే.. అప్పుడు మిగిలిన రూ. 3 లక్షలను రెండో పాలసీ కింద రీయింబర్స్‌మెంట్‌ కోరవచ్చు. 

ఒక బీమా సంస్థ క్లెయిమ్‌ దరఖాస్తును తిరస్కరించినా, రెండో బీమా సంస్థను సంప్రదించవచ్చు. వేతన జీవులు పనిచేసే సంస్థ నుంచి గ్రూప్‌ హెల్త్‌ ప్లాన్, వ్యక్తిగతంగా ఫ్యామిలీ ఫ్లోటర్‌ లేదా ఇండివిడ్యు వల్‌ ప్లాన్‌ కలిగి ఉన్నప్పుడు.. మొదట గ్రూప్‌ హెల్త్‌ ప్లాన్‌ నుంచి క్లెయిమ్‌కు వెళ్లడం మంచి ఆప్షన్‌. గ్రూప్‌ హెల్త్‌ ప్లాన్‌లో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ సులభంగా ఉంటుంది. క్లెయిమ్‌ మొత్తం ఒక బీమా పాలసీ కవరేజీ పరిధిలోనే ఉంటే ఒక్క సంస్థ వద్దే క్లెయిమ్‌కు పరిమితం కావాలి. దీనివల్ల రెండో ప్లాన్‌లో నో క్లెయిమ్‌ బోనస్‌ నష్టపోకుండా చూసుకోవచ్చు.

నగదు రహిత చికిత్స
బీమా సంస్థ నెట్‌వర్క్‌ పరిధిలోని అన్ని ఆస్పత్రుల నుంచి నగదు రహిత చికిత్స తీసుకోవచ్చు. ఏ ఆస్పత్రిలో అయినా నగదు రహిత చికిత్సకు బీమా సంస్థలు నేడు అవకాశం కలి్పస్తున్నాయి. కాకపోతే ఆస్పత్రి నిషేధిత జాబితాలో లేని వాటికే ఈ సదుపాయం పరిమితమని గుర్తుంచుకోవాలి. రెండు ప్లాన్లలోనూ నగదు రహిత చికిత్సకు వెళ్లొచ్చు. కానీ, ఒక సంస్థ నుంచే నగదు రహిత క్లెయిమ్‌కు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇస్తుంటాయి. 

మిగిలిన మొత్తం కోసం రీయింబర్స్‌మెంట్‌ విధానానికి వెళ్లాలని సూచిస్తుంటాయి. అలాంటప్పుడు నగదు రహిత విధానంలో గరిష్ట పరిమితి మేరకే ఒక బీమా సంస్థ నుంచి చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మిగిలిన మొత్తాన్ని సొంతంగా చెల్లించి, దాన్ని రాబట్టుకునేందుకు రెండో బీమా సంస్థను సంప్రదించాలి. దీనికోసం మొదట క్లెయిమ్‌ చేసిన బీమా సంస్థ నుంచి ‘క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ సమ్మరీ’ తీసుకోవాలి. 

అలాగే, హాస్పిటల్‌ బిల్లులు, చికిత్సకు సంబంధించి అన్ని పత్రాల ఫొటో కాపీలను సరి్టఫై (అటెస్టేషన్‌) చేసి ఇవ్వాలని మొదటి బీమా సంస్థను కోరాలి. వీటితో రెండో బీమా సంస్థ వద్ద రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ దరఖాస్తు దాఖలు చేసుకోవాలి. రెండు బీమా సంస్థల వద్ద రీయింబర్స్‌మెంట్‌ విధానంలో క్లెయిమ్‌ చేసుకోవాలన్నా సరే.. మొదట ఒక సంస్థ వద్ద క్లెయిమ్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.

 ఇందుకోసం ఆస్పత్రి నుంచి అన్ని బిల్లుల కాపీలు, డిశ్చార్జ్‌ సమ్మరీ, ల్యాబ్‌ రిపోర్ట్‌లు తీసుకుని బీమా సంస్థకు సమర్పించాలి. క్లెయిమ్‌ ఆమోదం అనంతరం,  క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ సమ్మరీతోపాటు, అన్ని డాక్యుమెంట్ల ఫొటో కాపీలతో రెండో సంస్థ వద్ద రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ దాఖలుకు కాలపరిమితి ఉంటుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత 15–30 రోజులు దాటకుండా క్లెయిమ్‌ దాఖలు చేసుకోవాలి.  

ఒకరికి ఎన్ని ప్లాన్లు? 
అసలు ఒకటికి మించి హెల్త్‌ పాలసీలు ఎందుకు? అనే సందేహం రావచ్చు. ఒక్కొక్కరి అవసరాలే దీన్ని నిర్ణయిస్తాయి. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్‌ హెల్త్‌ కవరేజీ సాధారణంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచి్చనా లేదంటే ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో.. తిరిగి ఉపాధి లభించేందుకు కొంత సమయం పట్టొచ్చు.

 కంపెనీలు కలి్పంచే గ్రూప్‌ హెల్త్‌ కవరేజీ.. ఉద్యోగానికి రాజీనామా చేయడంతోనే ముగిసిపోతుంది. అందుకే వ్యక్తిగతంగా మరో ప్లాన్‌ కలిగి ఉంటే, ఉద్యోగం లేని సమయంలోనూ ఉపయోగపడుతుంది. వైద్య చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో రెండు ప్లాన్లను కలిగి ఉండడం మంచి నిర్ణయమే అవుతుంది. లేదంటే బేస్‌ ప్లాన్‌ ఒకటి తీసుకుని, దానిపై మరింత మెరుగైన కవరేజీతో సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ జోడించుకోవడం మరొక మార్గం.

రీయింబర్స్‌మెంట్‌కు కావాల్సిన డాక్యుమెంట్లు 
డిశ్చార్జ్‌ సమ్మరీ, నగదు/కార్డు ద్వారా చెల్లింపులకు సంబంధించి రసీదులు, ల్యాబ్‌ రిపోర్ట్‌లు, వైద్యులు రాసిచి్చన ప్రిస్కిప్షన్లు, ఎక్స్‌రే ఫిల్మ్‌లు, క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ సమ్మరీ.

ఏడాదిలో ఎన్ని క్లెయిమ్‌లు? 
ఏడాదిలో ఎన్ని క్లెయిమ్‌లు అన్న దానితో సంబంధం లేకుండా, గరిష్ట బీమా కవరేజీ పరిధిలో ఎన్ని విడతలైనా పరిహారం పొందొచ్చు. కొన్ని బీమా సంస్థలు క్లెయిమ్‌ల సంఖ్య పరంగా పరిమితులు విధించొచ్చు. కనుక పాలసీ వర్డింగ్స్‌ డాక్యుమెంట్‌ను తప్పకుండా చదివి ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి.  

రెండు రకాల పాలసీలు 
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సాధారణంగా రెండు రకాలు. ఇండెమ్నిటీ ఒక రకం అయితే, ఫిక్స్‌డ్‌ బెనిఫిట్‌తో కూడినవి రెండో రకం. ఇండెమ్నిటీ పాలసీలు ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలతోపాటు.. ఎంపిక చేసిన డేకేర్‌ ప్రొసీజర్స్‌ (చికిత్స తర్వాత అదే రోజు విడుదలయ్యేవి)కు మాత్రమే కవరేజీ ఇస్తాయి. ఇక క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలను ఫిక్స్‌డ్‌ బెనిఫిట్‌ పాలసీలుగా చెబుతారు. 

ఇందులో కేన్సర్, గుండె జబ్బులు, మూత్ర పిండాల వైఫల్యం, కాలేయ వైఫల్యం తదితర తీవ్ర వ్యాధుల్లో ఏదైనా నిర్ధారణ అయిన వెంటనే నిర్ణీత పరిహారాన్ని బీమా సంస్థలు ఒకే విడత చెల్లించేస్తాయి. కనుక క్లెయిమ్‌ విషయంలో ఈ రెండింటి పరంగా గందరగోళం అక్కర్లేదు.

 ఇండెమ్నిటీ ప్లాన్, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌ రెండూ కలిగిన వారు.. ఏదైనా తీవ్ర వ్యాధి (క్రిటికల్‌ ఇల్‌నెస్‌) బారిన పడినప్పుడు ఇండెమ్నిటీ ప్లాన్‌ కింద కవరేజీ పొందొచ్చు. అలాగే, వ్యాధి నిర్ధారణ పత్రాలతో క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌ కింద క్లెయిమ్‌ దాఖలు చేసి పూర్తి ప్రయోజనాన్ని అందుకోవచ్చు. దీనివల్ల ఆయా వ్యాధులకు సంబంధించి ఎదురయ్యే భారీ వ్యయాలను తట్టుకోవడం సాధ్యపడుతుంది.  

టాపప్, సూపర్‌ టాపప్‌ ప్లాన్లు 
ఇక హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో టాపప్, సూపర్‌ టాపప్‌ ప్లాన్లు కూడా ఉంటాయి. ఇందులో సూపర్‌ టాపప్‌ ఎక్కువ అనుకూలం. ఇవి డిడక్షన్‌ క్లాజుతో వస్తాయి. ఉదాహరణకు రూ.5 లక్షల కవరేజీతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకున్న వారు, రూ.50 లక్షల సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ కూడా జోడించుకున్నారని అనుకుందాం.

 ఆస్పత్రి బిల్లు మొదటి రూ.5 లక్షలు దాటిన తర్వాతే సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ కింద కవరేజీ పొందగలరు. రూ.50 లక్షల వరకు బిల్లు ఎంత వచ్చినా సరే.. మొదటి రూ.5 లక్షలకు సూపర్‌ టాపప్‌లో పరిహారం రాదు. దాన్ని సొంతంగా భరించడం లేదంటే బేస్‌ ప్లాన్‌ నుంచి కవరేజీ తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా రూ.50 లక్షల బేస్‌ ఇండెమ్నిటీ ప్లాన్‌తో పోలి్చతే.. రూ.5–10 లక్షల మేర బేస్‌ ప్లాన్‌ తీసుకుని, 50 లక్షలకు సూపర్‌ టాపప్‌ తీసుకోవడం వల్ల ప్రీమియం భారం కొంత తగ్గుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement