Expert references
-
ఒకరికి రెండు పాలసీలు.. క్లెయిమ్ ఎలా?
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవలి కాలంలో వేతన జీవుల్లో చాలా మంది రెండు హెల్త్ పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స వ్యయం బీమా కవరేజీని మించిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాలను ఒకటికి మించిన పాలసీలతో సులభంగా గట్టెక్కొచ్చు. కానీ, ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉంటే క్లెయిమ్ ఎలా చేయాలనే విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విషయంలో నిపుణుల సూచనలు అందించే కథనమిది.గతంలో వేరు.. ఒక వ్యక్తికి ఒకటికి మించిన బీమా సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే, క్లెయిమ్ మొత్తాన్ని ఆయా సంస్థలు సమానంగా భరించాలనే నిబంధన లోగడ ఉండేది. 2013లో దీన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) తొలగించింది. దీంతో ఇప్పుడు ఒకటికి మించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉన్నా కానీ, పాలసీదారు తనకు నచ్చిన చోట లేదంటే రెండు సంస్థల వద్దా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. క్లెయిమ్ ఎలా? రెండు ప్లాన్లు కలిగిన వారు ఆస్పత్రిలో చేరిన తర్వాత రెండు బీమా సంస్థలకు తప్పనిసరిగా సమాచారం అందించాలి. ఒకటికి మించిన సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కలిగి ఉంటే, అప్పుడు ముందుగా ఒక బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తే సరిపోతుంది. నగదు రహిత, రీయింబర్స్మెంట్ మార్గాల్లో దేనినైనా వినియోగించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం ఒక హెల్త్ ప్లాన్ కవరేజీ దాటనప్పుడు ఒక బీమా సంస్థ వద్దే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక పాలసీ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు వచి్చనప్పుడు, రెండో బీమా సంస్థ వద్ద మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అంతే కానీ, ఒకేసారి ఒకే క్లెయిమ్‌ను రెండు సంస్థల వద్ద దాఖలు చేసేందుకు అవకాశం లేదు. ఉదాహరణకు రూ.5 లక్షల చొప్పున రెండు ప్లాన్లు ఉన్నాయని అనుకుందాం. ఆస్పత్రి బిల్లు రూ.7 లక్షలు వచి్చంది. అప్పుడు తొలుత ఒక సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేయాలి. అక్కడి నుంచి వచి్చన చెల్లింపులు మినహాయించి, అప్పుడు మిగిలిన మొత్తానికి రెండో బీమా సంస్థ నుంచి పరిహారం కోరాలి. ఒక పాలసీలో రూమ్‌రెంట్ పరంగా పరిమితులు ఉండి, దానివల్ల క్లెయిమ్ పూర్తిగా రాని సందర్భాల్లోనూ.. మిగిలిన మొత్తాన్ని రూమ్‌రెంట్ పరిమితులు లేని మరో పాలసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. కొన్ని పాలసీల్లో రూమ్ రెంట్, కొన్ని చికిత్సలకు పరిమితులు ఉంటాయి. ముఖ్యంగా గ్రూప్ హెల్త్ ప్లాన్లలో ఇవి చూడొచ్చు. అలాంటప్పుడు రూ.5 లక్షల కవరేజీ ఉన్నప్పటికీ పూర్తి మొత్తం రాకపోవచ్చు. ఉదాహరణకు రూ.7లక్షల ఆస్పత్రి బిల్లుకు సంబంధించి రూ. 5 లక్షల గ్రూప్ పాలసీలో రూ.4 లక్షలే క్లెయిమ్ కింద వచి్చందని అనుకుంటే.. అప్పుడు మిగిలిన రూ. 3 లక్షలను రెండో పాలసీ కింద రీయింబర్స్మెంట్ కోరవచ్చు. ఒక బీమా సంస్థ క్లెయిమ్ దరఖాస్తును తిరస్కరించినా, రెండో బీమా సంస్థను సంప్రదించవచ్చు. వేతన జీవులు పనిచేసే సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ ప్లాన్, వ్యక్తిగతంగా ఫ్యామిలీ ఫ్లోటర్ లేదా ఇండివిడ్యు వల్ ప్లాన్ కలిగి ఉన్నప్పుడు.. మొదట గ్రూప్ హెల్త్ ప్లాన్ నుంచి క్లెయిమ్‌కు వెళ్లడం మంచి ఆప్షన్. గ్రూప్ హెల్త్ ప్లాన్‌లో క్లెయిమ్ సెటిల్మెంట్ సులభంగా ఉంటుంది. క్లెయిమ్ మొత్తం ఒక బీమా పాలసీ కవరేజీ పరిధిలోనే ఉంటే ఒక్క సంస్థ వద్దే క్లెయిమ్‌కు పరిమితం కావాలి. దీనివల్ల రెండో ప్లాన్‌లో నో క్లెయిమ్ బోనస్ నష్టపోకుండా చూసుకోవచ్చు.నగదు రహిత చికిత్సబీమా సంస్థ నెట్వర్క్ పరిధిలోని అన్ని ఆస్పత్రుల నుంచి నగదు రహిత చికిత్స తీసుకోవచ్చు. ఏ ఆస్పత్రిలో అయినా నగదు రహిత చికిత్సకు బీమా సంస్థలు నేడు అవకాశం కలి్పస్తున్నాయి. కాకపోతే ఆస్పత్రి నిషేధిత జాబితాలో లేని వాటికే ఈ సదుపాయం పరిమితమని గుర్తుంచుకోవాలి. రెండు ప్లాన్లలోనూ నగదు రహిత చికిత్సకు వెళ్లొచ్చు. కానీ, ఒక సంస్థ నుంచే నగదు రహిత క్లెయిమ్‌కు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇస్తుంటాయి. మిగిలిన మొత్తం కోసం రీయింబర్స్మెంట్ విధానానికి వెళ్లాలని సూచిస్తుంటాయి. అలాంటప్పుడు నగదు రహిత విధానంలో గరిష్ట పరిమితి మేరకే ఒక బీమా సంస్థ నుంచి చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మిగిలిన మొత్తాన్ని సొంతంగా చెల్లించి, దాన్ని రాబట్టుకునేందుకు రెండో బీమా సంస్థను సంప్రదించాలి. దీనికోసం మొదట క్లెయిమ్ చేసిన బీమా సంస్థ నుంచి ‘క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీ’ తీసుకోవాలి. అలాగే, హాస్పిటల్ బిల్లులు, చికిత్సకు సంబంధించి అన్ని పత్రాల ఫొటో కాపీలను సరి్టఫై (అటెస్టేషన్) చేసి ఇవ్వాలని మొదటి బీమా సంస్థను కోరాలి. వీటితో రెండో బీమా సంస్థ వద్ద రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దరఖాస్తు దాఖలు చేసుకోవాలి. రెండు బీమా సంస్థల వద్ద రీయింబర్స్మెంట్ విధానంలో క్లెయిమ్ చేసుకోవాలన్నా సరే.. మొదట ఒక సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆస్పత్రి నుంచి అన్ని బిల్లుల కాపీలు, డిశ్చార్జ్ సమ్మరీ, ల్యాబ్ రిపోర్ట్లు తీసుకుని బీమా సంస్థకు సమర్పించాలి. క్లెయిమ్ ఆమోదం అనంతరం, క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీతోపాటు, అన్ని డాక్యుమెంట్ల ఫొటో కాపీలతో రెండో సంస్థ వద్ద రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలుకు కాలపరిమితి ఉంటుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 15–30 రోజులు దాటకుండా క్లెయిమ్ దాఖలు చేసుకోవాలి. ఒకరికి ఎన్ని ప్లాన్లు? అసలు ఒకటికి మించి హెల్త్ పాలసీలు ఎందుకు? అనే సందేహం రావచ్చు. ఒక్కొక్కరి అవసరాలే దీన్ని నిర్ణయిస్తాయి. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ కవరేజీ సాధారణంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచి్చనా లేదంటే ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో.. తిరిగి ఉపాధి లభించేందుకు కొంత సమయం పట్టొచ్చు. కంపెనీలు కలి్పంచే గ్రూప్ హెల్త్ కవరేజీ.. ఉద్యోగానికి రాజీనామా చేయడంతోనే ముగిసిపోతుంది. అందుకే వ్యక్తిగతంగా మరో ప్లాన్ కలిగి ఉంటే, ఉద్యోగం లేని సమయంలోనూ ఉపయోగపడుతుంది. వైద్య చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో రెండు ప్లాన్లను కలిగి ఉండడం మంచి నిర్ణయమే అవుతుంది. లేదంటే బేస్ ప్లాన్ ఒకటి తీసుకుని, దానిపై మరింత మెరుగైన కవరేజీతో సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకోవడం మరొక మార్గం.రీయింబర్స్‌మెంట్‌కు కావాల్సిన డాక్యుమెంట్లు డిశ్చార్జ్ సమ్మరీ, నగదు/కార్డు ద్వారా చెల్లింపులకు సంబంధించి రసీదులు, ల్యాబ్ రిపోర్ట్లు, వైద్యులు రాసిచి్చన ప్రిస్కిప్షన్లు, ఎక్స్‌రే ఫిల్మ్‌లు, క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీ.ఏడాదిలో ఎన్ని క్లెయిమ్‌లు? ఏడాదిలో ఎన్ని క్లెయిమ్‌లు అన్న దానితో సంబంధం లేకుండా, గరిష్ట బీమా కవరేజీ పరిధిలో ఎన్ని విడతలైనా పరిహారం పొందొచ్చు. కొన్ని బీమా సంస్థలు క్లెయిమ్‌ల సంఖ్య పరంగా పరిమితులు విధించొచ్చు. కనుక పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్‌ను తప్పకుండా చదివి ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. రెండు రకాల పాలసీలు హెల్త్ ఇన్సూరెన్స్ సాధారణంగా రెండు రకాలు. ఇండెమ్నిటీ ఒక రకం అయితే, ఫిక్స్డ్ బెనిఫిట్‌తో కూడినవి రెండో రకం. ఇండెమ్నిటీ పాలసీలు ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలతోపాటు.. ఎంపిక చేసిన డేకేర్ ప్రొసీజర్స్ (చికిత్స తర్వాత అదే రోజు విడుదలయ్యేవి)కు మాత్రమే కవరేజీ ఇస్తాయి. ఇక క్రిటికల్ ఇల్నెస్ పాలసీలను ఫిక్స్డ్ బెనిఫిట్ పాలసీలుగా చెబుతారు. ఇందులో కేన్సర్, గుండె జబ్బులు, మూత్ర పిండాల వైఫల్యం, కాలేయ వైఫల్యం తదితర తీవ్ర వ్యాధుల్లో ఏదైనా నిర్ధారణ అయిన వెంటనే నిర్ణీత పరిహారాన్ని బీమా సంస్థలు ఒకే విడత చెల్లించేస్తాయి. కనుక క్లెయిమ్ విషయంలో ఈ రెండింటి పరంగా గందరగోళం అక్కర్లేదు. ఇండెమ్నిటీ ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ రెండూ కలిగిన వారు.. ఏదైనా తీవ్ర వ్యాధి (క్రిటికల్ ఇల్నెస్) బారిన పడినప్పుడు ఇండెమ్నిటీ ప్లాన్ కింద కవరేజీ పొందొచ్చు. అలాగే, వ్యాధి నిర్ధారణ పత్రాలతో క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కింద క్లెయిమ్ దాఖలు చేసి పూర్తి ప్రయోజనాన్ని అందుకోవచ్చు. దీనివల్ల ఆయా వ్యాధులకు సంబంధించి ఎదురయ్యే భారీ వ్యయాలను తట్టుకోవడం సాధ్యపడుతుంది. టాపప్, సూపర్ టాపప్ ప్లాన్లు ఇక హెల్త్ ఇన్సూరెన్స్‌లో టాపప్, సూపర్ టాపప్ ప్లాన్లు కూడా ఉంటాయి. ఇందులో సూపర్ టాపప్ ఎక్కువ అనుకూలం. ఇవి డిడక్షన్ క్లాజుతో వస్తాయి. ఉదాహరణకు రూ.5 లక్షల కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న వారు, రూ.50 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ కూడా జోడించుకున్నారని అనుకుందాం. ఆస్పత్రి బిల్లు మొదటి రూ.5 లక్షలు దాటిన తర్వాతే సూపర్ టాపప్ ప్లాన్ కింద కవరేజీ పొందగలరు. రూ.50 లక్షల వరకు బిల్లు ఎంత వచ్చినా సరే.. మొదటి రూ.5 లక్షలకు సూపర్ టాపప్‌లో పరిహారం రాదు. దాన్ని సొంతంగా భరించడం లేదంటే బేస్ ప్లాన్ నుంచి కవరేజీ తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా రూ.50 లక్షల బేస్ ఇండెమ్నిటీ ప్లాన్‌తో పోలి్చతే.. రూ.5–10 లక్షల మేర బేస్ ప్లాన్ తీసుకుని, 50 లక్షలకు సూపర్ టాపప్ తీసుకోవడం వల్ల ప్రీమియం భారం కొంత తగ్గుతుంది. -
ఐటీ సర్క్యులర్ వచ్చిందోచ్.. ఈ విషయాలపై క్లారిటీ ఉందా మీకు?
డిసెంబర్ 7వ తేదీన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఇలా విడుదల చేస్తారు. ఇది కేవలం ఉద్యోగస్తులకు సంబంధించినది అని చెప్పవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి చట్టంలోని అంశాలు, రూల్సు, అవసరమైన ఫారాలు, వివరణలు, వివిధ రిఫరెన్సులు, సులువుగా అర్థమయ్యే పది ఉదాహరణలతో ఈ సర్క్యులర్ వచ్చింది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇందులో అంశాలు మీకోసం క్రోడీకరించి ఒకే చోట విశదీకరించారు. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఏమి ఉంటాయి అంటే.. ► జీతం అంటే ఏమిటి.. పెర్క్స్ అంటే ఏమిటి, జీతంలో కలిసే ఇతర అంశాల నిర్వచనాలు ► శ్లాబులు, రేట్లు, రిబేట్లు మొదలైనవి ► టీడీఎస్ ఎలా లెక్కించాలి ► ఇద్దరు యజమానులుంటే ఎలా చేయాలి ► ఎరియర్స్ జీతం, అడ్వాన్స్ జీతం లెక్కింపు ► జీతం మీద ఆదాయం కాకుండా ఇతర ఏదైనా ఆదాయం ఎలా తెలియజేయాలి ► ఇంటి లోన్ మీద వడ్డీ, షరతులు ► విదేశాల నుంచి వచ్చే జీతం ► టీడీఎస్ రేట్లు, ఎలా రికవరీ చేయాలి, ఎప్పుడు చెల్లించాలి, ఎలా చెల్లించాలి, రిటర్నులు ఎలా దాఖలు చేయాలి, టీడీఎస్ సర్టిఫికెట్ ఫారం 16 ఎలా జారీ చేయాలి, ఎప్పుడు దాఖలు చేయాలి ► పైవన్నీ సకాలంలో చేయకపోతే, వడ్డీ, పెనాల్టీల వివరాలు ► ఏయే మినహాయింపులు ఉన్నాయి ► ఏయే కాగితాలు, రుజువులు ఇవ్వాలి. ఇలా ఎన్నో.. ► ఫారాలు 12బీఏ, 12బీబీ, 16.. ఇతర రిటర్నులు .. 10బీఏ.. ఇలా పది ఉన్నాయి ► సంబంధిత సర్క్యులర్లు, రిఫరెన్సులు, పద్ధతులు, నోటిఫికేషన్లు ► డ్రాయింగ్ ఆఫీసర్లు చేయాల్సిన విధులు ► పలు ఉదాహరణలు. ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని, ఏయే సందర్భాలుంటాయి, ఆ సందర్భాలను.. ఆ కేసులను తీసుకుని.. నిజమైన కేస్ స్టడీలాగా రూపొందించి ఉదాహరణలను తయారు చేశారు. అవి చదువుతుంటే మీ కేసునే తీసుకుని తయారు చేశారా అన్నంత ఆశ్చర్యం వేస్తుంది. ఒక సజీవ కేసు.. ఒక నిజమైన లెక్కింపు.. ఒక ప్రాక్టికల్ ప్రోబ్లెమ్కి రెడీమేడ్ సొల్యూషన్.. రెడీ రిఫరెన్స్.. రెడీ రెకనార్ . చదవండి.. చదివించండి. అర్థం చేసుకుంటే మీరే నిపుణులు. -
పెట్టుబడికి స్థలమే భేష్!
- ధర విషయంలో జాగ్రత్త అవసరం - లే అవుట్ కాకుంటే... రక్షణ చర్యలూ ఉండాలి సాక్షి, హైదరాబాద్: ఉండటానికైతే ఇల్లో లేకుంటే ఫ్లాటో కొనటం మంచిదే. కానీ పెట్టుబడులు పెట్టాలనుకుంటే...? అందుకు రియల్ ఎస్టేట్‌ను ఎంచుకుంటే...? ఈ ప్రశ్నలు వచ్చినపుడు పెట్టుబడులకైతే స్థలమే చక్కని మార్గమనేది నిపుణుల సూచన. దీర్ఘకాలం వేచి చూడగలిగితే దీనిపై అధిక రాబడిని అందుకోవచ్చన్నది వారి మాట. ఈ విషయం ఇప్పటికే అనేకసార్లు రుజువైందని కూడా వారు చెబుతున్నారు. నిజానికి దీర్ఘకాలిక పన్ను లాభాలకోసం నివాస సముదాయాల్లో పెట్టుబడి పెట్టడం అందరికీ తెలిసిందే. కాకపోతే దీనితో పోల్చినపుడు స్థలాలపై పెట్టుబడే ఎక్కువ రాబడినిస్తుందనేది ఇప్పటిదాకా పలుమార్లు నిరూపితమైందని వారు పేర్కొన్నారు. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిపుడు దేశంలో అందుబాటు ఇళ్ల నిర్మాణాలపై దృష్టిసారించాయి. ప్రత్యేక పథకాలతో ముందుకొస్తున్నాయి కూడా. కాబట్టి స్థలాలకు గిరాకీ పెరుగుతుందే తప్ప తగ్గదని, ఎవరిదగ్గరైనా డబ్బులుండి, పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన ఉంటే స్థలానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని వారు చెబుతున్నారు. స్థలమెక్కడ? నిపుణుల సూచనల ప్రకారం... ముందుగా మీరు స్థలంపై ఎంత పెట్టుబడి పెట్టగలరనే విషయంపై ఓ అవగాహనకు వచ్చాక, ఆ తర్వాత ఎక్కడ కొనాలో నిర్ణయించుకోవాలి. ఇప్పుడు కాకపోయినా ఓ పదేళ్లయ్యాకైనా స్థలం విలువ రెండుమూడు రెట్లు పెరిగే అవకాశం గల ప్రాంతాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఉద్యోగావకాశాలను కల్పించడానికి ఆస్కారమున్న ప్రాంతాలైతే ఉత్తమం. హెచ్ఎండీఏ లాంటి స్థానిక సంస్థలు తరచూ వేలం పాటలను నిర్వహిస్తాయి కాబట్టి... వీలుంటే ఓ సారి కనుక్కోండి. క్రమం తప్పకుండా లావాదేవీలు నిర్వహించే మీ బ్యాంకు ఆమోదం ఉన్న లే అవుట్లు ఉన్నాయేమో ఓసారి ఆరా తీయండి. బృహత్ ప్రణాళిక ప్రకారం మీరు కొనే ప్రాంతం రెసిడెన్షియల్ జోన్ పరిధిలో ఉంటే ఉత్తమం. దేని పరిధిలోకి వస్తుంది? మీరు కొనాలనుకున్న స్థలం దేని పరిధిలోకి వస్తుంది? అంటే రెసిడెన్షియల్ జోన్ కిందికొస్తుందా? కన్జర్వేషన్ జోన్ పరిధిలోకి వస్తుందా? అనే విషయాల్ని కనుక్కోండి. హెచ్ఎండీఏ తాజా బృహత్ ప్రణాళిక ప్రకారం.. దాదాపు ఆరు వేల చదరపు కిలో మీటర్లు విస్తరించిన హుడా ఎక్స్టెండెడ్ ఏరియాను 12 స్థల వినియోగ జోన్లుగా వర్గీకరించారు. ఏ స్థలం ఏయే జోన్ పరిధిలోకి వస్తుందో తెలియజేస్తూ మ్యాప్‌లు కూడా విడుదల చేశారు. అయితే ఈ విషయంపై ఒకోసారి హెచ్ఎండీఏ అధికారుల్ని అడిగినా సరైన సమాధానం రాకపోవచ్చు. రిక్రియేషన్ జోన్ పరిధిలోని స్థలం కొని విశాలమైన ఇల్లు కట్టుకుంటానంటే కుదరదు. కాబట్టి, ఈ విషయంలో ముందే అవగాహనకు రండి. ధర ఎంత? మాంద్యం తర్వాత మార్కెట్లో 30 శాతం స్థలాల ధరలు తగ్గుముఖం పట్టాయి. మరి మీరు ఎంపిక చేసుకున్న ప్లాటులో ప్రస్తుతం ధరెంత చెబుతున్నారు? బూమ్ సమయంలో ధర ఎంతుందో బేరీజు వేయండి. ఆ తర్వాత సదరు సంస్థ నుంచి స్థలం పత్రాలు, టైటిల్ డీడ్, పన్ను రశీదులుంటే అడిగి తీసుకోండి. వాటిని లాయర్‌తో పరిశీలింపజేయండి. స్థానిక సంస్థల నుంచి స్థలం కొనాలని భావిస్తే బేరమాడే అవకాశముండదు. అదే ప్రైవేటు సంస్థలనుకోండి.. మీరు ఎంత దాకా పెట్టగలరో సూటిగా చెప్పొచ్చు. ధర విషయంలో మీరో నిర్ణయానికి రాగానే.. సంస్థ నిబంధనల ప్రకారం కొంత సొమ్ము ముందు చెల్లించండి. మిగతా మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో వివరించండి. కొన్ని ప్రైవేటు రియల్టీ సంస్థలూ బ్యాంకులతో అవగాహన కుదుర్చుకుని రుణాలిస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. రిజిస్ట్రేషన్ మీ పేరిటే ఉండాలి.. మీరు సొమ్మంతా కట్టేశాక.. స్థలాన్ని మీ పేరిట రిజిస్టర్ చేసుకోండి. ఏదేనీ ఓ లే-అవుట్లో స్థలం కొంటే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఖాళీగా ఉన్న ప్రాంతంలో కొంటే ముందుగా పునాది వేసుకోండి. వీలైతే గోడ కూడా కట్టుకోండి. అపరిచితులు ఆక్రమించకుండా ఉండాలంటే మాత్రం మీరు క్రమం తప్పకుండా మీ స్థలంపై దృష్టి సారించాలి. -
ఇప్పుడు ఏ షేర్లు బెటర్?
గత సోమవారం... సెన్సెక్స్ ఏకంగా 1600 పైచిలుకు పాయింట్లు నష్టపోయింది. రూ. 7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద చూస్తుండగానే గాల్లో కలిసిపోయింది. ఆ మర్నాడు 300 పైచిలుకు పాయింట్లు పెరిగినప్పటికీ... బుధవారం మళ్లీ పెరిగిందంతా పడిపోయింది. మళ్లీ వారాంతంలో 500 పాయింట్లపైన పెరిగి కాస్త ఊరటనిచ్చింది. సరే! ఇదంతా బాగానే ఉంది. మరి ఇలా దారుణంగా పతనమవుతూ... అంతలోనే పెరుగుతూ... అసలు ఏమవుతుందో తెలియని అనిశ్చితిలో మార్కెట్లుంటే సామాన్య మదుపరుల సంగతేంటి? ఈ అయోమయంలో అసలు స్టాక్మార్కెట్లో పెట్టుబడులు సురక్షితమేనా... కాదా? ఒకవేళ మార్కెట్ ఎటు నుంచి ఎటు తిరిగినా తమ పెట్టుబడి సురక్షితంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఎలాంటి షేర్లు ఎంచుకోవాలి? ఆ షేర్లు ఎంచుకోవటానికి ఏఏ అంశాలు చూడాలి? వీటన్నిటిపై పలువురు మార్కెట్ నిపుణులను ‘సాక్షి’ ప్రాఫిట్ ప్రతినిధులు సంప్రదించారు. వారిచ్చిన సూచనల మేరకు అందిస్తున్న ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం... - ఈ పతనంలో లాభాన్నిచ్చేవీ ఉంటాయి - కొనే ముందు ఐదంశాలు తప్పక చూడాలి - మరింత పడిపోకుండా ఉండేవి గమనించాలి - ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ నిపుణుల సూచనలు (సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం) గతవారంతో పోలిస్తే మార్కెట్లిపుడు కాస్త తగ్గే ఉన్నాయి. అందుకని చక్కని లాభం ఇచ్చే అవకాశమున్న షేర్లవంక చూస్తే ఇబ్బంది లేదు. నిజానికి మార్కెట్లు బాగా పడిపోతున్నపుడు కొనే అవకాశాన్ని చాలామంది కోల్పోతూనే ఉంటారు. ఎందుకంటే మార్కెట్లు ఎంతవరకూ పడతాయన్నది తెలియకపోవటం... ఇంకా పడతాయేమోనని ఎదురుచూడటం సహజం. అయితే ఇలా పడి... పెరిగిన తరవాత కూడా చాలా షేర్లు అంతకు ముందటి ధరలతో పోలిస్తే చౌకగానే దొరుకుతాయన్నది గ్రహించాలి. మనం చేయాల్సిందల్లా వీటిలో బాగా పెరిగే అవకాశమున్న వాటిని గుర్తించటమే!! మరి గుర్తించేదెలా..? ఆత్మస్థయిర్యం అవసరం... మార్కెట్లు బాగా పడుతున్నపుడు ఏ షేరైనా కొనాలంటే చాలా ధైర్యం కావాలి. సెన్సెక్స్ సోమవారం 1,600 పాయింట్లపైగా... బుధవారం మరో 400 పాయింట్లపైగా పడింది. అలాంటపుడు షేర్లు కొనాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఇంకా పడుతుందేమోననే భయాన్ని జయించాలి కనక. ఇక వారాంతంలో కొంత పెరిగి... ప్రస్తుతానికి మార్కెట్లు సెటిలైనట్లే కనిపిస్తున్నాయి. మార్కెట్లు స్థిరపడినా, స్థిరపడకపోయినా కూడా పెట్టిన పెట్టుబడికి ఇబ్బంది లేని, దీర్ఘకాలంలో లాభాలిచ్చే షేర్లను ఎంచుకోవటమే ఈ సమయంలో మంచిదన్నది నిపుణుల సూచన. నిజానికి మార్కెట్లు బాగా పడ్డాక మంచి షేర్లను ఎంచుకోవాలంటే పలు మార్గాలున్నాయి. నిజానికి తాజా పతనం... మళ్లీ ఎగియటం వంటి సందర్భాల్లో ఇంతకుముందు ఫేవరెట్లుగా ఉన్నవే మళ్లీ పెరుగుతాయి. వీటిని కొనటం సురక్షితమే. కాకపోతే రిస్క్-రివార్డ్ నిష్పత్తిని చూడాలి. బాగా తగ్గి, తక్కువ ధరలో ఉన్నవి కొంటే... ఒకవేళ మళ్లీ మార్కెట్ పడినా వీటి పతనం మాత్రం తక్కువే ఉంటుందన్నది గమనించాలి. వీటిని గుర్తించడానికి చూడాల్సిన అంశాలివీ... 1. వాల్యుయేషన్లు విలువ పరంగా బాగా తగ్గి ఉన్నవాటిని ఎంచుకోవటం మంచిదే. ఎందుకంటే తాజా పతనం తరవాత ఫ్రంట్‌లైన్, మిడ్‌క్యాప్ షేర్లలో చాలావరకూ ఆకర్షణీయమైన విలువల్లో దొరుకుతున్నాయి. ఇవి వాటి దీర్ఘకాలిక సగటుకన్నా తక్కువగా కూడా ఉన్నాయి. బహుశా! కొన్ని కనిష్ట స్థాయిల వద్దే ఉన్నాయని భావించవచ్చు. వీటిలో భవిష్యత్తులో పటిష్ఠమైన వృద్ధి కనబరిచేవి పెట్టుబడికి చక్కని అవకాశమున్న స్టాక్స్‌గా భావించవచ్చు. 2. నగదు నిల్వలు.. పెట్టుబడుల స్థాయి కంపెనీ తాలూకు నగదు నిల్వలు, పెట్టుబడులు చక్కని సూచికగా పనికొస్తాయి. ఎందుకంటే మార్కెట్లు నిట్టనిలువునా పడినపుడు చాలా కంపెనీల షేర్లు వాటి దగ్గరుండే నగదు, అవి పెట్టిన పెట్టుబడుల విలువకు సమాన స్థాయికి పడిపోతాయి. కొన్ని అంతకన్నా తగ్గుతాయి కూడా. దానర్థం అవి చేసే వ్యాపారాన్ని స్టాక్ మార్కెట్ పరిగణనలోకి తీసుకోలేదన్న మాట. ఇలా నగదు రిజర్వులు, వాటి పెట్టుబడుల హోల్డింగ్స్ మొత్తం విలువకు దగ్గర్లో దాని షేరు విలువ కూడా ఉన్నట్లయితే... అలాంటి వాటిలోకి స్మార్ట్ మనీ ప్రవహిస్తుందనేది కాదనలేని వాస్తవం. ఇలాంటివి చక్కని రివార్డ్నిస్తాయని చెప్పొచ్చు. 3. డివిడెండ్ ఈల్డ్ కంపెనీలు డివిడెండ్ ఇవ్వటం సర్వసాధారణం. అయితే ఈ డివిడెండ్ ఎంతనేది కాకుండా డివిడెండ్ ఈల్డ్ ఎంతనేది చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఎక్స్- కంపెనీ షేరు ధర దాదాపు 2,000 దగ్గర ఉందనుకుందాం. దాని ముఖ విలువ రూ. 10. ఏ కంపెనీ అయినా డివిడెండ్‌ను దాని ముఖవిలువపైనే ప్రకటిస్తుందని గుర్తుంచుకోవాలి. సదరు కంపెనీ 200% డివిడెండ్‌ను ప్రకటించిందనుకోండి. షేరుకు రూ.20 డివిడెండ్ వస్తుంది. అయితే రూ.2,000 వద్ద షేరు కొన్న వ్యక్తికి ఆ రూ. 20 డివిడెండ్ ఎంత శాతం? కేవలం 1%. అదే ఈల్డ్ అన్నమాట. వై- కంపెనీ షేరు ముఖ విలువ కూడా పది రూపాయలే. అది రూ.200 వద్ద ట్రేడవుతోందని అనుకుందాం. సదరు కంపెనీ గనక 100 శాతం డివిడెండ్ ఇస్తే షేరుకు రూ.10 వస్తుంది. రూ. 200 పెట్టి కొన్న వ్యక్తికి రూ.10 అంటే... దాదాపు 5 శాతం ఈల్డ్ (రాబడి) వచ్చినట్టన్న మాట. ఈ లెక్కన చూసినపుడు 200 శాతం డి విడెండ్ ఇచ్చిన ఎక్స్ కంపెనీకన్నా 100 శాతం డివిడెండ్ ఇచ్చిన వై కంపెనీయే బెటరని భావించాలి. నిజానికి కొన్ని కంపెనీల డివిడెండ్ ఈల్డ్ 6 నుంచి 10 శాతం మధ్యన కూడా ఉంటుంది. ఇవి క్రమంతప్పకుండా డివిడెండ్ ఇస్తాయి కూడా. బ్యాంకు వడ్డీ కన్నా ఎక్కువ రాబడి రావటంతో పాటు, దీర్ఘకాలంలో షేరు ధర పెరుగుతుంది కనక వీటిద్వారా ఆ రకంగానూ లాభపడవచ్చు. 4. ఈ అనిశ్చితి వల్ల లాభమెవరికి? భవిష్యత్తులో బాగా పెరిగే అవకాశమున్న షేర్లవైపే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు చూస్తుంటారు. ఫండమెంటల్స్ బలంగా ఉండటంతో పాటు భవిష్యత్తు పరిణామాలు అనుకూలంగా ఉన్న షేర్లవైపు ఇలాంటి పతనంలో అంతా చూస్తారు. బ్రోకింగ్ సంస్థ ‘నొముర’ మాటల్లో చెప్పాలంటే... ఇలాంటి పతనాల సమయంలో అలాంటి షేర్లను గుర్తించటానికి ప్రస్తుత పరిణామాలను జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు కమోడిటీ ధరలు బాగా తగ్గి ఉన్నాయి కనక... రూపాయి కూడా పతనమైంది కనక... ఈ రెండు పరిణామాల వల్ల లాభం కలిగే కంపెనీలను గుర్తిస్తే భవిష్యత్తులో వాటి ధర పెరిగి చక్కని రివార్డు వచ్చే అవకాశముంది. 5. రిలేటివ్ స్ట్రెంగ్త్... ఇక చివరిగా చూడాల్సిన షేర్ల విషయానికొస్తే... ఇంతటి మార్కెట్ పతనంలో కూడా బాగా పడిపోకుండా నిలదొక్కుకుని ఉన్నవేంటో చూడాలి. ట్రెండ్‌కు వ్యతిరేకంగా పెరిగిన షేర్లను గమనించాలి. సాధారణంగా ఈ షేర్లను డిఫెన్సివ్ షేర్లుగా పేర్కొంటుంటారు. ఇలాంటి షేర్లు ఒకవేళ అనిశ్చితి కొనసాగినప్పటికీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ బాగా గమనించాల్సిందొకటుంది. కొన్ని చిన్న కంపెనీల షేర్లు చాలావరకూ ప్రమోటర్లు, వారి కనుసన్నల్లో ఉండే బ్రోకర్ల చేతిలోనే ఉంటాయి. అతికొద్ది షేర్లు మాత్రం సాధారణ ఇన్వెస్టర్ల దగ్గరుంటాయి. అలాంటి షేర్లు ఇంతటి పతనంలో కూడా ఎవ్వరూ అమ్మరు కనక పడవు. అలా పడలేదు కాబట్టి అవి మంచి షేర్లనుకోవటం మొదటికే మోసం. అందుకే ఏ షేర్లను ఎంచుకున్నా... అవి ఫ్రంట్‌లైన్, భారీ పరిమాణంలో లావాదేవీలు జరిగే మంచి మిడ్‌క్యాప్ షేర్లయి ఉండాలనేది నిపుణులు చెబుతున్న ప్రధాన నియమం.