పెట్టుబడికి స్థలమే భేష్! | For investments land are best | Sakshi
Sakshi News home page

పెట్టుబడికి స్థలమే భేష్!

Published Fri, Sep 4 2015 11:47 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

పెట్టుబడికి స్థలమే భేష్!

పెట్టుబడికి స్థలమే భేష్!

- ధర విషయంలో జాగ్రత్త అవసరం
- లే అవుట్ కాకుంటే... రక్షణ చర్యలూ ఉండాలి
సాక్షి, హైదరాబాద్:
ఉండటానికైతే ఇల్లో లేకుంటే ఫ్లాటో కొనటం మంచిదే. కానీ పెట్టుబడులు పెట్టాలనుకుంటే...? అందుకు రియల్ ఎస్టేట్‌ను ఎంచుకుంటే...? ఈ ప్రశ్నలు వచ్చినపుడు పెట్టుబడులకైతే  స్థలమే చక్కని మార్గమనేది నిపుణుల సూచన. దీర్ఘకాలం వేచి చూడగలిగితే దీనిపై అధిక రాబడిని అందుకోవచ్చన్నది వారి మాట. ఈ విషయం ఇప్పటికే అనేకసార్లు రుజువైందని కూడా వారు చెబుతున్నారు. నిజానికి దీర్ఘకాలిక పన్ను లాభాలకోసం నివాస సముదాయాల్లో పెట్టుబడి పెట్టడం అందరికీ తెలిసిందే.

కాకపోతే దీనితో పోల్చినపుడు స్థలాలపై పెట్టుబడే ఎక్కువ రాబడినిస్తుందనేది ఇప్పటిదాకా పలుమార్లు నిరూపితమైందని వారు పేర్కొన్నారు. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిపుడు దేశంలో అందుబాటు ఇళ్ల నిర్మాణాలపై దృష్టిసారించాయి. ప్రత్యేక పథకాలతో ముందుకొస్తున్నాయి కూడా. కాబట్టి స్థలాలకు గిరాకీ పెరుగుతుందే తప్ప తగ్గదని, ఎవరిదగ్గరైనా డబ్బులుండి, పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన ఉంటే స్థలానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని వారు చెబుతున్నారు.
 
స్థలమెక్కడ?
నిపుణుల సూచనల ప్రకారం... ముందుగా మీరు స్థలంపై ఎంత పెట్టుబడి పెట్టగలరనే విషయంపై ఓ అవగాహనకు వచ్చాక, ఆ తర్వాత ఎక్కడ కొనాలో నిర్ణయించుకోవాలి. ఇప్పుడు కాకపోయినా ఓ పదేళ్లయ్యాకైనా స్థలం విలువ రెండుమూడు రెట్లు పెరిగే అవకాశం గల ప్రాంతాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఉద్యోగావకాశాలను కల్పించడానికి ఆస్కారమున్న ప్రాంతాలైతే ఉత్తమం. హెచ్‌ఎండీఏ లాంటి స్థానిక సంస్థలు తరచూ వేలం పాటలను నిర్వహిస్తాయి కాబట్టి... వీలుంటే ఓ సారి కనుక్కోండి. క్రమం తప్పకుండా లావాదేవీలు నిర్వహించే మీ బ్యాంకు ఆమోదం ఉన్న లే అవుట్లు ఉన్నాయేమో ఓసారి ఆరా తీయండి. బృహత్ ప్రణాళిక ప్రకారం మీరు కొనే ప్రాంతం రెసిడెన్షియల్ జోన్ పరిధిలో ఉంటే ఉత్తమం.
 
దేని పరిధిలోకి వస్తుంది?
మీరు కొనాలనుకున్న స్థలం దేని పరిధిలోకి వస్తుంది? అంటే రెసిడెన్షియల్ జోన్ కిందికొస్తుందా? కన్జర్వేషన్ జోన్ పరిధిలోకి వస్తుందా? అనే విషయాల్ని కనుక్కోండి. హెచ్‌ఎండీఏ తాజా బృహత్ ప్రణాళిక ప్రకారం.. దాదాపు ఆరు వేల చదరపు కిలో మీటర్లు విస్తరించిన హుడా ఎక్స్‌టెండెడ్ ఏరియాను 12 స్థల వినియోగ  జోన్లుగా వర్గీకరించారు. ఏ స్థలం ఏయే జోన్ పరిధిలోకి వస్తుందో తెలియజేస్తూ మ్యాప్‌లు కూడా విడుదల చేశారు. అయితే ఈ విషయంపై ఒకోసారి హెచ్‌ఎండీఏ అధికారుల్ని అడిగినా సరైన సమాధానం రాకపోవచ్చు. రిక్రియేషన్ జోన్ పరిధిలోని స్థలం కొని విశాలమైన ఇల్లు కట్టుకుంటానంటే కుదరదు. కాబట్టి, ఈ విషయంలో ముందే అవగాహనకు రండి.
 
ధర ఎంత?

మాంద్యం తర్వాత మార్కెట్లో 30 శాతం స్థలాల ధరలు తగ్గుముఖం పట్టాయి. మరి మీరు ఎంపిక చేసుకున్న ప్లాటులో ప్రస్తుతం ధరెంత చెబుతున్నారు? బూమ్ సమయంలో ధర ఎంతుందో బేరీజు వేయండి. ఆ తర్వాత సదరు సంస్థ నుంచి స్థలం పత్రాలు, టైటిల్ డీడ్, పన్ను రశీదులుంటే అడిగి తీసుకోండి. వాటిని లాయర్‌తో పరిశీలింపజేయండి. స్థానిక సంస్థల నుంచి స్థలం కొనాలని భావిస్తే బేరమాడే అవకాశముండదు. అదే ప్రైవేటు సంస్థలనుకోండి.. మీరు ఎంత దాకా పెట్టగలరో సూటిగా చెప్పొచ్చు. ధర విషయంలో మీరో నిర్ణయానికి రాగానే.. సంస్థ నిబంధనల ప్రకారం కొంత సొమ్ము ముందు చెల్లించండి. మిగతా మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో వివరించండి. కొన్ని ప్రైవేటు రియల్టీ సంస్థలూ బ్యాంకులతో అవగాహన కుదుర్చుకుని రుణాలిస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దు.
 
రిజిస్ట్రేషన్ మీ పేరిటే ఉండాలి..
మీరు సొమ్మంతా కట్టేశాక.. స్థలాన్ని మీ పేరిట రిజిస్టర్ చేసుకోండి. ఏదేనీ ఓ లే-అవుట్‌లో స్థలం కొంటే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఖాళీగా ఉన్న ప్రాంతంలో కొంటే ముందుగా పునాది వేసుకోండి. వీలైతే గోడ కూడా కట్టుకోండి. అపరిచితులు ఆక్రమించకుండా ఉండాలంటే మాత్రం మీరు క్రమం తప్పకుండా మీ స్థలంపై దృష్టి సారించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement