న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు (ఇనిస్టిట్యూషన్స్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ కాలంలో 21 శాతం తక్కువగా నమోదయ్యాయి. 793.4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.6,600 కోట్లు) పెట్టుబడుల రూపంలో వచ్చినట్టు కొలియర్స్ ఇండియా తెలిపింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇనిస్టిట్యూషన్స్ పెట్టుబడులు రియల్ ఎస్టేట్ రంగంలో 1,002 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ముఖ్యంగా ఆఫీస్ ఆస్తులపై పెట్టుబడులు గణనీయంగా తగ్గి 79 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆఫీస్ ఆస్తులపై ఇనిస్టిట్యూషన్స్ చేసిన పెట్టుబడులు 694 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనించొచ్చు. మిశ్రమ వినియోగ ఆస్తులపైనా పెట్టుబడులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 73 శాతం తక్కువగా 27.2 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వీటికి విరుద్ధంగా నివాస గృహ ప్రాజెక్టుల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 47 శాతం అధికంగా 274.6 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ఇండస్ట్రియల్ వేర్ హౌసింగ్ ఆస్తులు గణనీయంగా 340 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. క్రితం ఏడాది ఇదే విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు కేవలం 20 మిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ఇక డేటా సెంటర్లు, స్టూడెంట్ హౌసింగ్ (విద్యార్థుల వసతి సముదాయాలు), సీనియర్ హౌసింగ్, హాలిడే హోమ్స్ తదితర వాటితో కూడిన ప్రత్యామ్నాయ సాధనాల్లోకి 72 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
ఈ ఏడాది మొత్తం మీద అప్
సెప్టెంబర్ క్వార్టర్‌లో రియల్ ఎస్టేట్ రంగంలోకి నికరంగా సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు తగ్గినప్పటికీ.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ కాలానికి చూస్తే నికరంగా 27 శాతం వృద్ధి నెలకొన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలియజేసింది. 4,558 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. రియల్ ఎస్టేట్‌లోకి వచ్చిన సంస్థాగత పెట్టుబడుల్లో 77 శాతం విదేశీ ఇన్వెస్టర్లు సమకూర్చినవి.
జనవరి–సెప్టెంబర్ మధ్య ఆఫీస్ ఆస్తుల్లోకి క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 60 అధికంగా 2,887 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. నివాస ఆస్తుల్లోకి పెట్టుబడులు రెండు రెట్లు అధికంగా 708 మిలియన్ డాలర్ల మేర వచ్చినట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. ప్రత్యామ్నాయ ఆస్తుల్లోకి పెట్టుబడులు 42 శాతం తగ్గి 230 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment