July-September quarter
-
పుంజుకున్న ‘వ్యాపార విశ్వాస సూచీ’
న్యూఢిల్లీ: సీఐఐ వ్యాపార విశ్వాస సూచీ జూలై–సెప్టెంబర్ కాలంలో రెండు త్రైమాసికాల గరిష్ట స్థాయి 68.2కు చేరింది. కేంద్ర ప్రభుత్వ విధానాల కొనసాగింపుతో పరిశ్రమల్లో ఉత్సాహం వ్యక్తమైంది. సాధారణ ఎన్నికల అనంతరం సీఐఐ నిర్వహించిన మొదటి సర్వే ఇది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నట్టు సీఐఐ తెలిపింది. అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వృద్ధి బలంగా నిలదొక్కుకున్నట్టు పేర్కొంది. ప్రస్తుత పండుగల సీజన్ ఈ వృద్ధి అవకాశాలను మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది. సీఐఐ 128వ బిజినెస్ అవుట్‌లుక్ సర్వే 2024 సెపె్టంబర్లో జరిగింది. అన్ని రంగాలు, ప్రాంతాల నుంచి 200 సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. సర్వేలో పాల్గొన్న కొన్ని కంపెనీలు సుదీర్ఘకాలం పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే, అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు పెరిగిపోవడం, వెలుపలి డిమాండ్ బలహీనంగా ఉండడాన్ని ప్రస్తావించాయి. మరోవైపు వినియోగం మెరుగుపడడం, వర్షాలు మెరుగ్గా పడడం, సంస్కరణల పట్ల సానుకూల ధోరణి వంటి సానుకూలతలనూ పేర్కొన్నాయి. ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవడం సానుకూలమన్నారు. 2024–25 మొదటి ఆరు నెలల్లో ప్రైవేటు పెట్టుబడులు, అంతకుముందు ఆరు నెలల కాలంతో పోలి్చతే పుంజుకున్నట్టు సర్వేలో 59 శాతం కంపెనీలు తెలిపాయి. రేట్ల కోతపై అంచనాలు ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) మొదలు పెట్టొచ్చని 34% కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపు నాలుగో త్రైమాసికంలో (2025 జనవరి–మార్చి) ఆరంభం కావొచ్చని 31% కంపెనీలు అంచనా వేస్తున్నాయి. -
హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు జూలై–సెపె్టంబర్ కాలంలో సుమారు 42 శాతం మేర తక్కువగా నమోదవుతాయని రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. 12,082 యూనిట్ల విక్రయాలు ఉండొచ్చని, క్రితం ఏడాది ఇదే త్రైమాసిక కాలంలో విక్రయాలు 20,658 యూనిట్లుగా ఉన్నట్టు తన తాజా నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన పట్టణాల్లో సెపె్టంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు మొత్తం మీద 18 శాతం తగ్గి 1,04,393 యూనిట్లుగా ఉండొచ్చని తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,26,848 యూనిట్లుగా ఉన్నాయి. తొమ్మిది పట్టణాలకు గాను ఢిల్లీ ఎన్సీఆర్లో 22 శాతం, నవీ ముంబైలో ఇళ్ల అమ్మకాల్లో 4 శాతం చొప్పున వృద్ధి ఉంటుందని పేర్కొంది. మిగిలిన అన్ని పట్టణాల్లో క్షీణించొచ్చని అంచనా వేసింది. పట్టణాల వారీగా.. → బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు జూలై–సెపె్టంబర్ కాలంలో 26% క్షీణించి 13,355 యూని ట్లుగా ఉంటాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 17,978 యూనిట్ల విక్రయాలు జరిగాయి. → చెన్నై మార్కెట్లో 18 శాతం తక్కువగా 4,634 యూనిట్ల విక్రయాలు జరగొచ్చు. → కోల్‌కతా మార్కెట్లో 23% తక్కువగా 3,590 యూనిట్లు అమ్ముడుపోవచ్చు. → పుణెలోనూ 19% క్షీణించి అమ్మకాలు 21,306 యూనిట్లుగా ఉంటాయి. → ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు 10% తగ్గి 20,460 యూనిట్లుగా ఉండొచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో 22,802 యూనిట్ల విక్రయాలు జరిగాయి. → ముంబైలో 17 శాతం తక్కువగా 10,966 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదు కావచ్చు. అదే నవీ ముంబైలో మాత్రం 4 శాతం అధికంగా 7,737 యూనిట్ల అమ్మకాలు జరగొచ్చు. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 22 శాతం వృద్ధితో 10,263 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదు అవుతాయి. సాధారణమే.. ‘‘రియల్ ఎస్టేట్ పరిశ్రమలో డిమాండ్ బలంగానే ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో విక్రయాలు కొత్త ఆవిష్కరణల కంటే ఎక్కువే ఉన్నాయి. కానీ, అమ్మకాల్లో స్వల్ప క్షీణత అన్నది చరిత్రాత్మకంగా ఉన్న ధోరణే కానీ, ప్రతికూల పరిస్థితులకు సూచిక కాదు’’ అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు. -
ఐఫోన్ల విక్రయాలు కొత్త రికార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల విపణిలో యాపిల్ కొత్త రికార్డు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై–సెపె్టంబర్ కాలంలో 25 లక్షల యూనిట్లకుపైగా ఐఫోన్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 34 శాతం అధికంగా సాధించడం విశేషం. ఒక త్రైమాసికంలో భారత్‌లో కంపెనీ ఖాతాలో ఇదే ఇప్పటి వరకు రికార్డు. ఖరీదైన మోడళ్లకు మార్కెట్ మళ్లుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. సెపె్టంబర్ త్రైమాసికంలో భారత్‌లో 17.2 శాతం వాటాతో శామ్సంగ్ తొలి స్థానంలో నిలిచింది. నాలుగు త్రైమాసికాలుగా శామ్సంగ్ అగ్రస్థానాన్ని కొనసాగిస్తోందని పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ బుధవారం వెల్లడించింది. ఏ, ఎం సిరీస్ ఫోన్లు ఇందుకు దోహదం చేసిందని తెలిపింది. ఇక 16.6 శాతం వాటాతో షావొమీ రెండవ స్థానం ఆక్రమించింది. రూ.30–45 వేల ధరల శ్రేణి విభాగంలో వన్‌ప్లస్ 29 శాతం వాటాతో సత్తా చాటుతోంది. ఫోల్డబుల్ మోడళ్లకు.. ప్రీమియం విభాగం, 5జీ లక్ష్యంగా కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. రూ.45,000 ఆపైన ఖరీదు చేసే అల్ట్రా ప్రీమియం మోడళ్లకు డిమాండ్ ప్రతి త్రైమాసికంలోనూ పెరుగుతూ వస్తోంది. సెప్టెంబర్ క్వార్టర్లో అల్ట్రా ప్రీమియం మోడళ్ల అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 44 శాతం దూసుకెళ్లాయి. సులభ వాయిదాలు, ఇతర ప్రోత్సాహకాలు, నూతన టెక్నాలజీవైపు కస్టమర్ల మొగ్గు ఇందుకు దోహదం చేశాయి. ఫోల్డబుల్ మోడళ్లకు డిమాండ్ దూసుకెళ్తోంది. ఈ విభాగంలోకి కంపెనీలు క్రమంగా ప్రవేశిస్తున్నాయి. అన్ని బ్రాండ్ల అమ్మకాల్లో 5జీ స్మార్ట్ఫోన్ల వాటా ఏకంగా 53 శాతానికి ఎగబాకింది. 10–15 వేల ధరల శ్రేణిలో ఎక్కువ మోడళ్లను కంపెనీలు ప్రవేశపెట్టాయి. వీటిలో 5జీ మోడళ్ల వాటా ఏడాదిలో 7 నుంచి 35 శాతానికి చేరింది. ఆసక్తికర విషయం ఏమంటే 5జీ, అధిక ర్యామ్ (8జీబీ) వంటి కీలక ఫీచర్లు రూ.10,000లోపు సరసమైన స్మార్ట్ఫోన్లకు విస్తరించాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జోరు
ముంబై: మార్టిగేజ్ దిగ్గజం, మాతృ సంస్థ.. హెచ్డీఎఫ్సీ విలీనం తదుపరి ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో రూ. 16,811 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టాండెలోన్ నికర లాభం రూ. 15,976 కోట్లకు చేరింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో విలీన సంస్థ నికర లాభం రూ. 11,162 కోట్లుగా మదింపు వేసింది. ఇక గత క్యూ2 స్టాండెలోన్ లాభం రూ. 10,606 కోట్లుగా లెక్కకట్టింది. మార్జిన్లు డీలా గతంలో 4 శాతానికిపైగా నికర వడ్డీ మార్జిన్లు సాధిస్తూ వచ్చిన నంబర్ వన్ ప్రైవేట్ రంగ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ ప్రస్తుత సమీక్షా కాలంలో 3.4 శాతం మార్జిన్లు ప్రకటించింది. ఇందుకు విలీనం తదుపరి బ్యాలన్స్షీట్లో తక్కువ ఈల్డ్స్ ఆర్జించే సెక్యూర్డ్ ఆస్తులు(రుణాలు) పెరగడం ప్రభావం చూపింది. అంతేకాకుండా విలీనానికి మార్కెట్ రుణ సమీకరణ వ్యయాలు సైతం పెరిగాయి. అయితే నికర వడ్డీ మార్జిన్లు పుంజుకోనున్నట్లు బ్యాంక్ సీఎఫ్‌వో శ్రీనివాసన్ వైద్యనాథన్ పేర్కొన్నారు. అధిక ఈల్డ్స్ అందించే ఆస్తులు పెరగడం, చౌకగా సమీకరించిన డిపాజిట్లతో మార్కెట్ రుణాలను రీప్లేస్ చేసిన తదుపరి మార్జిన్లు మెరుగుపడనున్నట్లు వివరించారు. 30 శాతం అప్ ఈ ఏడాది క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 30 శాతం జంప్‌చేసి రూ. 27,385 కోట్లను తాకింది. గతేడాది క్యూ2లో రూ. 21,021 కోట్ల వడ్డీ ఆదాయాన్ని సాధించాయి. ఇక ఇతర ఆదాయం రూ. 7,596 కోట్ల నుంచి రూ. 10,708 కోట్లకు జంప్ చేసింది. అటు డిపాజిట్లు, ఇటు అడ్వాన్సులు(రుణాలు).. రూ. లక్ష కోట్ల చొప్పున నమోదయ్యాయి. డిపాజిట్లు 5.3 శాతం, అడ్వాన్సులు 4.9 శాతం చొప్పున వృద్ధి చూపాయి. స్థూల మొండిబకాయిలు 1.41 శాతం నుంచి 1.34 శాతానికి తగ్గాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,240 కోట్ల నుంచి రూ. 2,903 కోట్లకు వెనకడుగు వేశాయి. ఎడ్యుకేషన్ రుణాలందించే క్రెడిలా విక్రయాన్ని పూర్తి చేయవలసి ఉన్నట్లు వైద్యనాథన్ పేర్కొన్నారు. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లిస్టింగ్ ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. నికరంగా 16,000 మంది ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1.98 లక్షలకు చేరినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 1,530 వద్ద ముగిసింది. -
ప్రయివేట్ ఈక్విటీ పెట్టుబడుల నేలచూపు
ముంబై: దేశీయంగా ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు ఈ కేలండర్ ఏడాది(2023) మూడో త్రైమాసికంలో 65 శాతం క్షీణించాయి. 1.81 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2022) జులై–సెప్టెంబర్(క్యూ3)లో ఏకంగా 5.23 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ నమోదయ్యాయి. లండన్ స్టాక్ ఎక్స్చేంజీ గ్రూప్ బిజినెస్ సంస్థ రెఫినిటివ్ వివరాల ప్రకారం లావాదేవీలు సైతం భారీగా 50 శాతం నీరసించాయి. 465 నుంచి భారీగా తగ్గి 232కు పరిమితమయ్యాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ2)లో నమోదైన 353తో పోలిస్తే డీల్స్ 34 శాతం వెనకడుగు వేయగా.. విలువ(2.79 బిలియన్ డాలర్లు) 35 శాతం క్షీణించింది. కాగా.. 2023 జనవరి–సెప్టెంబర్‌లో డీల్స్ 414 నుంచి 283కు తగ్గాయి. ఇంటర్నెట్ ఆధారిత కంపెనీలలో 2.8 బిలియన్ డాలర్లు, ఐటీ సంస్థలలో 1.48 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించాయి. -
రియల్ ఎస్టేట్‌లో తగ్గిన సంస్థాగత పెట్టుబడులు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు (ఇనిస్టిట్యూషన్స్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ కాలంలో 21 శాతం తక్కువగా నమోదయ్యాయి. 793.4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.6,600 కోట్లు) పెట్టుబడుల రూపంలో వచ్చినట్టు కొలియర్స్ ఇండియా తెలిపింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇనిస్టిట్యూషన్స్ పెట్టుబడులు రియల్ ఎస్టేట్ రంగంలో 1,002 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ముఖ్యంగా ఆఫీస్ ఆస్తులపై పెట్టుబడులు గణనీయంగా తగ్గి 79 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆఫీస్ ఆస్తులపై ఇనిస్టిట్యూషన్స్ చేసిన పెట్టుబడులు 694 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనించొచ్చు. మిశ్రమ వినియోగ ఆస్తులపైనా పెట్టుబడులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 73 శాతం తక్కువగా 27.2 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వీటికి విరుద్ధంగా నివాస గృహ ప్రాజెక్టుల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 47 శాతం అధికంగా 274.6 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇండస్ట్రియల్ వేర్ హౌసింగ్ ఆస్తులు గణనీయంగా 340 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. క్రితం ఏడాది ఇదే విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు కేవలం 20 మిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ఇక డేటా సెంటర్లు, స్టూడెంట్ హౌసింగ్ (విద్యార్థుల వసతి సముదాయాలు), సీనియర్ హౌసింగ్, హాలిడే హోమ్స్ తదితర వాటితో కూడిన ప్రత్యామ్నాయ సాధనాల్లోకి 72 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది మొత్తం మీద అప్ సెప్టెంబర్ క్వార్టర్లో రియల్ ఎస్టేట్ రంగంలోకి నికరంగా సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు తగ్గినప్పటికీ.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ కాలానికి చూస్తే నికరంగా 27 శాతం వృద్ధి నెలకొన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలియజేసింది. 4,558 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. రియల్ ఎస్టేట్‌లోకి వచ్చిన సంస్థాగత పెట్టుబడుల్లో 77 శాతం విదేశీ ఇన్వెస్టర్లు సమకూర్చినవి. జనవరి–సెప్టెంబర్ మధ్య ఆఫీస్ ఆస్తుల్లోకి క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 60 అధికంగా 2,887 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. నివాస ఆస్తుల్లోకి పెట్టుబడులు రెండు రెట్లు అధికంగా 708 మిలియన్ డాలర్ల మేర వచ్చినట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. ప్రత్యామ్నాయ ఆస్తుల్లోకి పెట్టుబడులు 42 శాతం తగ్గి 230 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
ఆఫీస్ స్పేస్ లీజులో హైదరాబాద్ టాప్
బెంగళూరు: ఆఫీస్ స్పేస్ లీజు (కార్యాలయ వసతి) పరంగా హైదరాబాద్ మార్కెట్ మంచి వృద్ధిని చూపించింది. జూలై–సెపె్టంబర్ కాలంలో స్థూల లీజు పరిమాణం ఏకంగా రెండున్న రెట్లు పెరిగి 2.5 మిలియన్ చదరపు అడుగులుగా (ఎస్ఎఫ్టీ) నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆఫీస్ స్పేస్ లీజు ఒక మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగానే ఉంది. దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పట్టణాల్లో స్థూల ఆఫీస్ స్పేస్ లీజు సెపె్టంబర్ త్రైమాసికంలో 2 శాతం వృద్ధితో 13.2 ఎస్‌ఎఫ్‌టీగా నమోదైనట్టు కొలియర్స్ ఇండియా తెలిపింది. ఇందుకు సంబంధించి గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో స్థూల లీజు పరిమాణం 12.9 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. స్థూల లీజు పరిమాణంలో లీజు రెన్యువల్, ఆసక్తి వ్యక్తీకరణపై సంతకం చేసిన లావాదేవీలను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రధానంగా హైదరాబాద్‌తోపాటు ముంబై, పుణె, చెన్నై మార్కెట్లలో ఆఫీస్ స్పేస్ లీజుకు డిమాండ్ పెరిగినట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. పట్టణాల వారీగా.. ► బెంగళూరులో స్థూల ఆఫీస్ స్పేస్ లీజు (తాజా) సెపె్టంబర్ క్వార్టర్లో 3.4 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలోని 4.4 మిలియన్ ఎస్ఎఫ్టీతో పోలిస్తే తగ్గింది. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కట్లోనూ స్థూల లీజు పరిమాణం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 4.3 మిలియన్ చదరపు అడుగుల నుంచి 3.2 మిలియన్ చదరపు అడుగులకు క్షీణించింది. ► ముంబైలో స్పల్ప వృద్ధితో 1.6 మిలియన్ నుంచి 1.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. ► చెన్నైలో ఒక మిలియన్ నుంచి 1.4 మిలియన్‌కు, పుణెలో 0.6 మిలియన్ నుంచి ఒక మిలియన్ చదరపు అడుగులకు స్థూల ఆఫీస్ స్పేస్ లీజు వృద్ధి చెందింది. ఇదే ధోరణి కొనసాగొచ్చు.. ‘‘భారత ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో (జనవరి–సెపె్టంబర్) 2022లో మాదిరే ఉంది. దేశ స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉండడం ఆఫీస్ స్పేస్ డిమాండ్‌కు మద్దతునిచి్చంది. ఇదే ధోరణి చివరి త్రైమాసికంలోనూ (అక్టోబర్–డిసెంబర్) కొనసాగొచ్చు’’అని కొలియర్స్ ఇండియా ఎండీ పీయూష్ జైన్ తెలిపారు. 2022లో నమోదైన చారిత్రక ఆఫీస్ స్పేస్ లీజు రికార్డు 2023లో అధిగమిస్తుందేమో చూడాలన్నారు. చివరి త్రైమాసికంలో హైదరాబాద్, చెన్నైలో డిమాండ్ బలంగా ఉంటుందని కొలియర్స్ ఇండియాకు చెందిన అరి్పత్ మెహరోత్రా పేర్కొన్నారు. బెంగళూరు దేశ ఆఫీస్ సేŠప్స్ లీజులో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందన్నారు. -
సెప్టెంబర్ క్వార్టర్లో 78 వేల కొలువులు
న్యూఢిల్లీ: పండుగల సీజన్, వివిధ రంగాల్లో డిమాండ్ తోడ్పాటుతో ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీ ఫ్లెక్సీ స్టాఫింగ్ పరిశ్రమలో కొత్తగా 78,000 కొలువులు వచ్చాయి. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 6 శాతం పెరిగాయి. ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) ఫ్లెక్సీ స్టాఫింగ్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. జనరల్ స్టాఫింగ్, ఐటీ స్టాఫింగ్ కలిపి ఈ గణాంకాలు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. నిర్దిష్ట కాలానికి లేదా ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి నిర్ణీత కాల వ్యవధికి తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవడాన్ని ఫ్లెక్సీ స్టాఫింగ్గా వ్యవహరిస్తారు. నివేదిక ప్రకారం ఐటీ కాకుండా మిగతా విభాగాల్లో (ఎఫ్ఎంసీజీ, ఈ–కామర్స్, తయారీ, రిటైల్, లాజిస్టిక్స్, బ్యాంకింగ్, ఆతిథ్య, పర్యాటక, బీమా, మౌలిక సదుపాయాల కల్పన మొదలైనవి) నియామకాలు జులై–సెప్టెంబర్‌లో 7.3 శాతం పెరిగాయి. అటు ఐటీలో మాత్రం ఒక మోస్తరుగా 2.2 శాతమే వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో మందగమన ప్రభావాన్ని సూచిస్తూ దేశీ ఐటీ సంస్థలు కూడా కొత్త నియామకాలను తగ్గించుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. నాలుగు త్రైమాసికాలు.. 2.32 లక్షల ఉద్యోగాలు .. నివేదిక ప్రకారం 2022 అక్టోబర్ నుండి 2023 సెప్టెంబర్‌వరకూ నాలుగు త్రైమాసికాల్లో ఐఎస్ఎఫ్లో సభ్యత్వం ఉన్న 110 పైచిలుకు కంపెనీలు 2.32 లక్షల కొలువులు ఇచ్చాయి. గడిచిన 10 ఏళ్లలో ఇవి 90 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాయి. లాక్డౌన్లు పూర్తిగా తొలగించాక వచ్చిన తొలి పండుగ సీజన్లో ఉద్యోగులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని స్టాఫింగ్ పరిశ్రమ ముందుగానే ఊహించిందని, తదనుగుణంగానే ఆయా సంస్థలకు సిబ్బందిని సమకూర్చగలిగిందని ఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. వార్షిక ప్రాతిపదికన చూస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్త ఉద్యోగాల కల్పన 20 శాతం వృద్ధి చెందిందని ఆయన చెప్పారు. -
హైదరాబాద్ రియల్టీలో 6% పెరిగిన ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. చదరపు అడుగు ధర సగటున 6 శాతం పెరిగి రూ.4,977కు చేరినట్టు తెలిపింది. ఇక కార్యాయల అద్దెలను చూస్తే హైదరాబాద్ మార్కెట్లో సగటు నెలవారీ అద్దె 7 శాతం పెరిగి చదరపు అడుగుకు 65కు చేరింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు సెప్టెంబర్ త్రైమాసికంలో 3–10 శాతం మధ్య పెరిగాయి. కార్యాలయ అద్దెలు 13 శాతం పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా మంగళవారం విడుదల చేసిన ’ఇండియా రియల్ ఎస్టేట్ – ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ మార్కెట్’ నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చి ఇందులో గణాంకాలను పొందుపరిచింది. పట్టణాల వారీగా.. ►బెంగళూరు మార్కెట్లో ఇళ్ల ధరలతోపాటు, కార్యాలయ అద్దెల పరంగా మంచి వృద్ధి నమోదైంది. ఇళ్ల ధర చదరపు అడుగుకు 10 శాతం పెరిగి రూ.5,428కి చేరింది. కార్యాలయ అద్దెలు 13 శాతం పెరిగి చదరపు అడుగునకు రూ.81కి చేరింది. ►ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధర 8 శాతం పెరిగింది. చదరపు అడుగు ధర రూ.4,489గా ఉంది. కార్యాలయ అద్దె స్థిరంగా చదరపు అడునకు (నెలకు) 81.90గా ఉంది. ►ముంబై మార్కెట్లో ఇళ్ల ధర చదరపు అడుగుకు 6 శాతం పెరిగి రూ.7,170గా ఉంది. కార్యాలయ అద్దె చదరపు అడుగుకు 4 శాతం పెరిగి రూ.110కి చేరుకుంది. ►పుణె మార్కెట్లో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగాయి. చదరపు అడుగునకు రూ.4,250గా ఉంది. ఇదే పట్టణంలో కార్యాలయ అద్దె నెలకు చదరపు అడుగునకు 9 శాతం పెరిగి రూ.71గా నమోదైంది. ►చెన్నై మార్కెట్లో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగాయి. చదరపు అడుగునకు రూ.4,300కు చేరింది. చెన్నైలో కార్యాలయ అద్దె 5 శాతం పెరిగి 61కి చేరింది. ►కోల్‌కతా పట్టణంలో ఇళ్ల ధర సగటున 4 శాతం పెరిగి.. చదరపు అడుగునకు రూ.3,350కు చేరుకుంది. కార్యాలయ అద్దె స్థిరంగా చదరపు అడుగుకు 34.7వద్దే ఉంది. ►అహ్మదాబాద్ పట్టణంలో ఇళ్ల ధర 3 శాతం పెరిగి రూ.2,885గా ఉంటే, కార్యాలయ అద్దె చదరపు అడుగుకు ఏ మాత్రం మార్పు లేకుండా రూ.40.1 వద్ద ఉంది. ►ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడంతో కార్యాలయ స్థలాలకు డిమాండ్ నెలకొంది. ►కార్యాలయ స్థలం సెప్టెంబర్ త్రైమాసికంలో వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 29 శాతం పెరిగి 16.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. -
హైదరాబాద్ మార్కెట్లో అధికంగా ఇళ్ల విక్రయాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్టీ మార్కెట్ మురిసింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 35 శాతం అధికంగా ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. 10,570 ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 7,810 ఇళ్ల యూనిట్లు అమ్ముడు కావడం గమనార్హం. బెంగళూరు కంటే కూడా హైదరాబాద్ మార్కెట్ తన సత్తా చాటింది. బెంగళూరులో ఇళ్ల విక్రయాలు 20 శాతం వృద్ధితో 7,890 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 6,550 యూనిట్లు మాత్రమే. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 49 శాతం వృద్ధిని చూశాయి. మొత్తం 83,220 యూనిట్లు విక్రయమైనట్టు ప్రాపర్‌టైగర్ పోర్టల్ ఈ ఏడాది మూడో త్రైమాసికానికి సంబంధించిన నివేదికలో వెల్లడించింది. ఇళ్ల ధరలు పెరిగినా, వడ్డీ రేట్లు పెరిగినా కానీ, గతంలో నిలిచిన డిమాండ్ తోడు కావడంతో ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగినట్టు ప్రాప్ టైగర్ నివేదిక వివరించింది. 2021 సెప్టెంబర్ క్వార్టర్లో దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో అమ్ముడుపోయిన ఇళ్ల యూనిట్లు 55,910గా ఉన్నాయి. అంతేకాదు ఈ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు కరోనా ముందు నాటి గణాంకాలను మించి నమోదు కావడం డిమాండ్ బలంగా ఉన్నట్టు తెలియజేస్తోంది. ప్రతికూలతలను అధిగమించి.. రియల్ ఎస్టేట్ పరిశ్రమ కరోనా మహమ్మారి, తదనంతర అవరోధాలను అధిగమించినట్టు ప్రాప్ టైగర్ డాట్ కామ్ గ్రూపు సీఎఫ్‌వో వికాస్ వాధ్వాన్ తెలిపారు. గృహ రుణాల రేట్లు పెరిగినప్పటికీ ఇళ్లకు డిమాండ్ తగ్గలేదన్నారు. సొంతిల్లు కలిగి ఉండాలన్న ఆకాంక్షే డిమాండ్ పుంజుకోవడానికి కారణంగా పేర్కొన్నారు. మార్కెట్ ధోరణులను పరిశీలిస్తే రానున్న త్రైమాసికాల్లో నివాసిత గృహాలకు సానుకూల డిమాండ్ ఉంటుందని తెలుస్తోందని ప్రాప్ టైగర్ డాట్ కామ్ రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ తెలిపారు. పండుగల తగ్గింపులు, సులభతర చెల్లింపుల ప్లాన్లు ఇవన్నీ కలసి డిమాండ్‌ను బలంగా నిలబెడతాయని అంచనా వేశారు. పట్టణాల వారీగా.. ► ముంబైలో ఇళ్ల విక్రయాలు సెప్టెంబర్ క్వార్టర్లో 28,800 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 14,160 యూనిట్లతో పోలిస్తే రెట్టింపయ్యాయి. ► పుణెలో 55 శాతం పెరిగి 15,700 యూనిట్లు అమ్ముడుపోయాయి. ► అహ్మదాబాద్ మార్కెట్లోనూ 44 శాతం అధికంగా ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. ఇక్కడ 7,880 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ► చెన్నై, కోల్‌కతా మార్కెట్లో అమ్మకాలు క్షీణించాయి. చెన్నై మార్కెట్లో 6 శాతం తగ్గి 4,420 యూనిట్లు, కోల్‌కతా మార్కెట్లో 4 శాతం తగ్గి 2,530 యూనిట్ల అమ్మకాలకు పరిమితమయ్యాయి. -
ఓరియంట్ ఎలక్ట్రిక్ లాభం రూ. 35 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఓరియంట్ ఎలక్ట్రిక్ సంస్థ లాభం 7 శాతం పెరిగి రూ. 35 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 32 కోట్లు. తాజాగా ఆదాయం రూ. 434 కోట్ల నుంచి రూ. 594 కోట్లకు పెరిగింది. సమీక్షా కాలంలో వివిధ విభాగాల పనితీరు మెరుగ్గా ఉందని, ఆదాయం 37 శాతం వృద్ధి నమోదు చేసిందని సంస్థ వెల్లడించింది. ఎంట్రీ స్థాయి ఉత్పత్తులు, ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. ఇక ఎగుమతి మార్కెట్లు కూడా తెరుచుకుంటూ ఉండటంతో కొత్త ఆర్డర్లు కూడా లభించాయని ఓరియంట్ ఎలక్ట్రిక్ తెలిపింది. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం, మూడో క్వార్టర్లో పండుగ సీజన్, వర్షపాతం మెరుగ్గా ఉండటం తదితర అంశాలు డిమాండ్‌కు దోహదపడగలవని ఆశిస్తున్నట్లు పేర్కొంది. వేసవి సీజన్లో దీని సానుకూల ప్రభావం ఉండవచ్చని భావిస్తున్నట్లు వివరించింది. -
చైనా ‘వృద్ధి’ దూకుడు
బీజింగ్: ప్రధాన ఆర్థిక వ్యవస్థలుసహా ప్రపంచంలోని పలు దేశాల ఎకానమీలు కరోనా ప్రేరిత అంశాలతో క్షీణతలోకి జారుతున్న నేపథ్యంలో... ఈ మహమ్మారికి పుట్టినిల్లు చైనా మాత్రం వృద్ధి బాటన సాగుతోంది. ఈ ఏడాది వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును (2019 ఇదే కాలంతో పోల్చి) నమోదుచేసుకుంది. నిజానికి సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా ఆర్థిక వ్యవస్థ 5.2 శాతం వృద్ధి సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే దీనికన్నా 30 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తక్కువ వృద్ధి నమోదయ్యింది. కరోనా సవాళ్లతో మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. డిమాండ్, వినియోగానికి ఊతం ఇవ్వడానికి చైనా ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపనలు దేశం వృద్ధి బాటన నడవడానికి కారణమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. చైనా జాతీయ గణాంకాల విభాగం (ఎన్బీఎస్) సోమవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. -
ఐపీవోలు కళకళ
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు జూలై–సెప్టెంబర్ కాలంలో ర్యాలీ చేయడం ప్రైమరీ మార్కెట్‌కు కలిసొచ్చింది. సుమారు ఎనిమిది కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. 850 మిలియన్ డాలర్ల (రూ.6,290 కోట్ల) నిధులను సమీకరించాయి. ప్రస్తుత ఏడాది రెండో అర్ధభాగం (జూలై–డిసెంబర్)లో ప్రైమరీ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణ మెరుగ్గా ఉండొచ్చని ఈవై నివేదిక తెలియజేసింది. ఈ సంస్థ 2020 సంవత్సరం మూడో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) ఐపీవో ధోరణులపై సోమవారం నివేదిక విడుదల చేసింది. రియల్ ఎస్టేట్, ఆతిథ్యం, నిర్మాణం, టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ కంపెనీలు నిధుల సమీకరణలో చురుగ్గా ఉన్నాయి. 2019 సెప్టెంబర్ త్రైమాసికంలో 12 ఐపీవోలు రాగా, ప్రస్తుత ఏడాది ఇదే కాలంలో ఇవి ఎనిమిదికి పరిమితం కావడం గమనార్హం. అయితే, ఐపీవోలు సంఖ్యాపరంగా తక్కువగానే కనిపించినా సమీకరించిన నిధులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అధికంగా ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ క్వార్టర్లో 12 ఐపీవోలు కలసి సమీకరించిన మొత్తం 652 మిలియన్ డాలర్లు (రూ.4,824 కోట్లు)గానే ఉంది. బడా ఐపీవో ఒక్కటే... ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్ ఆర్ఈఐటీ ఐపీవో అతిపెద్దదిగా ఉంది. ఈ సంస్థ 602 మిలియన్ డాలర్లను (రూ.4,320 కోట్లు) సమీకరించింది. ‘‘ప్రధాన మార్కెట్లలో (బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) 2020 క్యూ3లో నాలుగు ఐపీవోలు వచ్చాయి. కానీ 2019 క్యూలో 3 ఐపీవోలే వచ్చాయి. ఇక ఈ ఏడాది రెండో క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లో ఒక్క ఐపీవో లేదు. దీంతో 2020 సెప్టెంబర్ క్వార్టర్లో 33 శాతం వృద్ధి కనిపిస్తోంది’’ అని ఈవై ఇండియా తెలిపింది. ఇక ఎస్ఎంఈ మార్కెట్లలో నాలుగు ఐపీవోలు నిధుల సమీకరణ పూర్తి చేసుకున్నాయి. 2020లో ఇప్పటి వరకు ఐపీవోల సంఖ్యా పరంగా భారత్ అంతర్జాతీయంగా తొమ్మిదో స్థానంలో ఉన్నట్టు ఈవై ఇండియా తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు ఐపీవో కార్యకలాపాలు 14 శాతం పెరిగాయని.. 872 ఐపీవోలు 43 శాతం అధికంగా 165.3 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయని ఈ నివేదిక వివరించింది. కల్యాణ్ జువెల్లర్స్ ఐపీవోకి గ్రీన్ సిగ్నల్ న్యూఢిల్లీ: ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెల్లర్స్ ఇండియా ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆమోదముద్ర లభించింది. ఈ ఐపీవో ద్వారా సుమారు రూ. 1,750 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగా రూ. 1,000 కోట్లు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద రూ. 750 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనుంది. కల్యాణ్ జువెల్లర్స్ ప్రమోటర్ టీఎస్ కల్యాణరామన్ దాదాపు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను, హైడెల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సుమారు రూ. 500 కోట్లు విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనున్నాయి. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను కల్యాణ్ జువెల్లర్స్ నిర్వహణ మూలధన అవసరాలు, ఇతరత్రా కార్యకలాపాల కోసం వినియోగించనుంది. ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి కంపెనీకి దేశవ్యాప్తంగా 107, మధ్యప్రాచ్య దేశాల్లో 30 షోరూమ్‌లు ఉన్నాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ ఆఫర్ ప్రారంభం ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మంగళవారం(అక్టోబర్ 20న) ఐపీఓ ప్రారంభం కానుం ది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఇష్యూ గురువారం(అక్టోబర్ 22న)ముగిస్తుంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ.517.6 కోట్లు సమీకరించనుంది. ఈ ఏడాదిలో 12వదైన ఈ ఐపీఓ ధర శ్రేణి రూ.32–33 మధ్య ఉంది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 18% అప్
న్యూఢిల్లీ: వివిధ వ్యాపార విభాగాలు మెరుగైన పనితీరు కనపర్చడంతో జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం 18.5 శాతం వృద్ధి చెందింది. రూ. 3,142 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 2,651 కోట్లు. మరోవైపు, ఆదాయం 6 శాతం పెరిగి రూ. 17,528 కోట్ల నుంచి రూ. 18,594 కోట్లకు చేరింది. షేరు ఒక్కింటికి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ‘కొత్త ఆర్డర్లు భారీగా వచ్చాయి. గత క్వార్టర్‌తో పోలిస్తే 35 శాతం పెరిగాయి‘ అని సంస్థ సీఈవో సీ విజయకుమార్ వెల్లడించారు. త్రైమాసికాలవారీగా చూస్తే ఒప్పందాల సంఖ్య ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో నమోదైందని వివరించారు. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్, కెనడా తదితర మార్కెట్లలో పెట్టుబడులను పెంచనున్నట్లు విజయకుమార్ చెప్పారు. మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఆదాయ వృద్ధి సగటున 1.5–2.5 శాతం ఉండగలదని హెచ్‌సీఎల్ టెక్ గైడెన్స్ ఇచ్చింది. హెచ్–1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వ ఆంక్షల అంశం మీద స్పందిస్తూ తమ ఉద్యోగుల్లో మూడింట రెండొంతుల మంది స్థానికులే ఉన్నారని విజయకుమార్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యయాలపరంగా తమపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని, వచ్చే ఏడాది మాత్రం కొంత ఉండవచ్చని తెలిపారు. షేరు డౌన్..: లాభాల స్వీకరణతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు దాదాపు 4 శాతం తగ్గింది. బీఎస్ఈలో ఒక దశలో 4.47% క్షీణించి రూ. 821 స్థాయిని కూడా తాకింది. చివరికి 3.76 శాతం క్షీణతతో రూ. 827.10 వద్ద క్లోజయ్యింది. బీఎస్ఈ 30లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. ఎన్ఎస్ఈలో 3.48 శాతం తగ్గి రూ. 830.05 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 7.23 లక్షలు, ఎన్ఎస్ఈలో 2.89 కోట్ల షేర్లు చేతులు మారాయి. వేతనాల పెంపు.. అక్టోబర్ 1, జనవరి 1 నుంచి వర్తించేలా దశలవారీగా వివిధ స్థాయిల ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు విజయకుమార్ చెప్పారు. కరోనా వైరస్ పరిణామాల కారణంగా వేతనాల పెంపు గతంలో వాయిదా పడింది. దేశీయంగా ఉన్న ఉద్యోగులకు గతేడాది తరహాలోనే సగటున 6 శాతం స్థాయిలో పెంపు ఉండొచ్చని అంచనా. సెప్టెంబర్ ఆఖరు నాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 1,53,085గా ఉంది. ఐటీ సేవల విభాగంలో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) 12.2 శాతంగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 1,500 పైచిలుకు ఫ్రెషర్స్‌ను కంపెనీ రిక్రూట్ చేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో సుమారు 7,000 నుంచి 9,000 వేల మంది దాకా ఫ్రెషర్లను తీసుకోవాలని యోచిస్తున్నట్లు హెచ్‌సీఎల్ టెక్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ అప్పారావు వీ తెలిపారు. క్యూ1, క్యూ2లో 3,000 మంది దాకా ఫ్రెషర్లను తీసుకున్నట్లు వివరించారు. -
రాబడిలో జియో టాప్
సాక్షి, న్యూఢిల్లీ : ఆకర్షణీయ ఆఫర్లతో టెలికాం రంగంలో నూతన ఒరవడి సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో సర్ధుబాటు చేసిన స్ధూల ఆదాయం (ఏజీఆర్)లో ముందువరుసలో నిలిచింది. ట్రాయ్ డేటా ప్రకారం జియో ఈ క్వార్టర్లో రూ 8271 కోట్లనుమ ఆర్జించింది. ఇక రూ 7528 కోట్ల ఏజీఆర్‌తో వొడాఫోన్ ఐడియా తర్వాతి స్ధానంలో నిలువగా, భారతి ఎయిర్టెల్ రూ 6720 కోట్ల ఏజీఆర్‌తో మూడవ స్ధానంలో నిలిచింది. ఇదే త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ రెవిన్యూ మార్కెట్ వాటా రూ 1284 కోట్లుగా నమోదైంది. ఆయా కంపెనీల ఏజీఆర్‌ల ఆధారంగానే లైసెన్స్ ఫీజు, ఇతర ఫీజుల ద్వారా ప్రభుత్వానికి సమకూరే రాబడిని లెక్కిస్తారు. ఇక గత ఏడాది రిలయన్స్ జియో ఏజీఆర్ ఈ త్రైమాసికంలో రూ 7125 కోట్లుగా నమోదైంది. ఇక స్ధూల రాబడిలో వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌ల తర్వాత జియో మూడో స్ధానానికి పరిమితమైంది. రూ 13,542 కోట్లతో వొడాఫోన్ ఐడియా ట్రాయ్ జాబితాలో ముందువరుసలో నిలవగా, రూ 11,596 కోట్ల స్ధూల రాబడితో ఎయిర్టెల్ తర్వాత స్ధానంలో నిలిచింది. ఇక రిలయన్స్ జియో రూ 10,738 కోట్ల స్థూలలాభాన్ని ఆర్జించింది. మరోవైపు ఏజీఆర్ మార్కెట్ వాటాలో 22 టెలికాం సర్కిళ్లలో 11 సర్కిళ్లలో జియో ముందుండగా, ఆరు సర్కిళ్లలో ఎయిర్టెల్, 5 టెలికాం సర్కిళ్లలో వొడాఫోన్ ఐడియా భారీ రాబడిని రాబట్టాయని ట్రాయ్ గణాంకాలు వెల్లడించాయి. -
అంచనాలు మించిన భారతీ ఎయిర్టెల్
విశ్లేషకులు అంచనావేసిన దానికంటే మెరుగైన ఫలితాలనే దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జూలై-సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ లాభాలు 4.9 శాతం పడిపోయి రూ.1,461 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.1,536 కోట్లగా ఉన్నాయి. స్పెక్ట్రమ్ సంబంధిత ఖర్చులు, నైజీరియన్ కరెన్సీ డివాల్యుయేషన్ వంటి కారణాలతో భారతీ ఎయిర్టెల్ లాభాలు పడిపోయినట్టు కంపెనీ ప్రకటించింది. కానీ విశ్లేషకుల అంచనావేసిన దానికంటే బాగానే ఆపరేషన్ ఫర్ఫార్మెన్స్ను కంపెనీ చూపించినట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. విశ్లేషకుల ముందస్తు అంచనా ప్రకారం భారతీ ఎయిర్టెల్ రూ.25,495 కోట్ల రెవెన్యూలపై రూ.1050 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని తెలిసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,053 కోట్లగా ఉన్న నికర వడ్డీ వ్యయాలు రూ.1,603 కోట్లకు ఎగిశాయి. ఈ వ్యయాలు పెరగడానికి ప్రధాన కారణం కూడా స్పెక్ట్రమ్ సంబంధిత వడ్డీ వ్యయాలేనని కంపెనీ వెల్లడించింది. ఉచిత సేవలతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో ఎఫెక్టు భారతీ ఎయిర్‌టెల్‌పై పడింది. ఈ క్వార్టర్లో ఎయిర్ టెల్ మొబైల్ వ్యాపారాలు నెమ్మదించాయి. మొత్తంగా అయితే యేటికేటికి 10.1 శాతం రెవెన్యూ వృద్ధి నమోదుచేస్తూ కంపెనీ ఊపందుకున్నట్టు భారతీ ఎయిర్ టెల్ ప్రకటించింది. నాన్-మొబైల్ బిజినెస్‌ల్లో వృద్ధి నమోదు వల్లే కంపెనీ రెవెన్యూలను పెంచుకోగలిగిందని ఆ సంస్థ సీఈవో, ఎండీ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ తెలిపారు. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికి రెవెన్యూలు 10.1 శాతం ఎగిసి రూ.19,219 కోట్లగా నమోదయ్యాయి. యేటికేటికీ డిజిటల్ టీవీ వ్యాపారాల్లో 20.9 శాతం వృద్ధి, ఎయిర్టెల్ బిజినెస్‌లో రూ.19.2 శాతం, మొబైల్ వ్యాపారాల్లో 7.9 శాతం వృద్ధి కంపెనీ భారత వ్యాపారాల్లో నమోదుచేసినట్టు భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. కంపెనీ మొత్తం ఆదాయం 3.4 శాతం పెరిగి రూ.24,671.5 కోట్లగా కంపెనీ నమోదుచేసింది. అయితే నైజీరియా కరెన్సీ డివాల్యుయేషన్తో కన్సాలిడేటెడ్ రెవెన్యూ వృద్ధి 3.3 శాతం మందగించింది. -
కోల్ ఇండియా లాభం 16% అప్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు గనుల కంపెనీ కోల్ ఇండియా నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో 16 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.2,192 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.2,544 కోట్లకు పెరిగిందని కోల్ ఇండియా తెలిపింది. అమ్మకాలు అధికంగా ఉండటంతో నికర లాభం పెరిగిందని పేర్కొంది. నికర అమ్మకాలు రూ.15,678 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.16,958 కోట్లకు పెరిగాయని వివరించింది. అధిక ఉత్పత్తి కారణంగా అమ్మకాలు పెరిగాయని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.14,145 కోట్ల నుంచి రూ.15,068 కోట్లకు ఎగిశాయని తెలిపింది. గత క్యూ2లో 102.42 మిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తి ఈ క్యూ2లో 108.2 మిలియన్ టన్నులకు చేరిందని కోల్ ఇండియా తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కోల్ ఇండియా షేర్ 2.6 శాతం వృద్ధితో రూ.338 వద్ద ముగిసింది. -
కెనరా బ్యాంక్ లాభం 16 శాతం డౌన్
న్యూఢిల్లీ: కెనరా బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు 16 శాతం క్షీణించింది. గత క్యూ2లో రూ.627 కోట్లు గా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.529 కోట్లకు తగ్గిపోయిందని కెనరా బ్యాంక్ పేర్కొం ది. మొత్తం ఆదాయం మాత్రం రూ.11,915 కోట్ల నుంచి రూ.12,478 కోట్లకు పెరిగిందని తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.814 కోట్ల నుంచి రూ. 1,212 కోట్లకు పెరిగాయని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 2.92 శాతం నుంచి 4.27 శాతానికి, నికర మొండి బకాయిలు 2.3 శాతం నుంచి 2.9 శాతానికి పెరిగాయని వెల్లడించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కెనరా బ్యాంక్ షేర్ బీఎస్ఈలో 1.8 శాతం క్షీణించి రూ.274 వద్ద ముగిసింది.