
న్యూఢిల్లీ: పండుగల సీజన్, వివిధ రంగాల్లో డిమాండ్ తోడ్పాటుతో ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీ ఫ్లెక్సీ స్టాఫింగ్ పరిశ్రమలో కొత్తగా 78,000 కొలువులు వచ్చాయి. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 6 శాతం పెరిగాయి. ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎఫ్) ఫ్లెక్సీ స్టాఫింగ్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. జనరల్ స్టాఫింగ్, ఐటీ స్టాఫింగ్ కలిపి ఈ గణాంకాలు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. నిర్దిష్ట కాలానికి లేదా ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి నిర్ణీత కాల వ్యవధికి తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవడాన్ని ఫ్లెక్సీ స్టాఫింగ్‌గా వ్యవహరిస్తారు. నివేదిక ప్రకారం ఐటీ కాకుండా మిగతా విభాగాల్లో (ఎఫ్‌ఎంసీజీ, ఈ–కామర్స్, తయారీ, రిటైల్, లాజిస్టిక్స్, బ్యాంకింగ్, ఆతిథ్య, పర్యాటక, బీమా, మౌలిక సదుపాయాల కల్పన మొదలైనవి) నియామకాలు జులై–సెప్టెంబర్‌లో 7.3 శాతం పెరిగాయి. అటు ఐటీలో మాత్రం ఒక మోస్తరుగా 2.2 శాతమే వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో మందగమన ప్రభావాన్ని సూచిస్తూ దేశీ ఐటీ సంస్థలు కూడా కొత్త నియామకాలను తగ్గించుకుంటున్నాయని నివేదిక పేర్కొంది.
నాలుగు త్రైమాసికాలు.. 2.32 లక్షల ఉద్యోగాలు ..
నివేదిక ప్రకారం 2022 అక్టోబర్ నుండి 2023 సెప్టెంబర్‌వరకూ నాలుగు త్రైమాసికాల్లో ఐఎస్‌ఎఫ్‌లో సభ్యత్వం ఉన్న 110 పైచిలుకు కంపెనీలు 2.32 లక్షల కొలువులు ఇచ్చాయి. గడిచిన 10 ఏళ్లలో ఇవి 90 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాయి. లాక్‌డౌన్‌లు పూర్తిగా తొలగించాక వచ్చిన తొలి పండుగ సీజన్‌లో ఉద్యోగులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని స్టాఫింగ్ పరిశ్రమ ముందుగానే ఊహించిందని, తదనుగుణంగానే ఆయా సంస్థలకు సిబ్బందిని సమకూర్చగలిగిందని ఐఎస్‌ఎఫ్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. వార్షిక ప్రాతిపదికన చూస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్త ఉద్యోగాల కల్పన 20 శాతం వృద్ధి చెందిందని ఆయన చెప్పారు.