![CII: Industry upbeat on policy continuity as biz confidence index rises to 2-quarter high](/styles/webp/s3/article_images/2024/10/7/BUSINESS-CONFIDENCE.jpg.webp?itok=68SfgSCF)
రెండు త్రైమాసికాల గరిష్టం
విధానాల కొనసాగింపుతో ఉత్సాహం
సీఐఐ బిజినెస్ అవుట్‌లుక్ సర్వే
న్యూఢిల్లీ: సీఐఐ వ్యాపార విశ్వాస సూచీ జూలై–సెప్టెంబర్ కాలంలో రెండు త్రైమాసికాల గరిష్ట స్థాయి 68.2కు చేరింది. కేంద్ర ప్రభుత్వ విధానాల కొనసాగింపుతో పరిశ్రమల్లో ఉత్సాహం వ్యక్తమైంది. సాధారణ ఎన్నికల అనంతరం సీఐఐ నిర్వహించిన మొదటి సర్వే ఇది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నట్టు సీఐఐ తెలిపింది. అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వృద్ధి బలంగా నిలదొక్కుకున్నట్టు పేర్కొంది.
ప్రస్తుత పండుగల సీజన్ ఈ వృద్ధి అవకాశాలను మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది. సీఐఐ 128వ బిజినెస్ అవుట్‌లుక్ సర్వే 2024 సెపె్టంబర్‌లో జరిగింది. అన్ని రంగాలు, ప్రాంతాల నుంచి 200 సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. సర్వేలో పాల్గొన్న కొన్ని కంపెనీలు సుదీర్ఘకాలం పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి.
అలాగే, అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు పెరిగిపోవడం, వెలుపలి డిమాండ్ బలహీనంగా ఉండడాన్ని ప్రస్తావించాయి. మరోవైపు వినియోగం మెరుగుపడడం, వర్షాలు మెరుగ్గా పడడం, సంస్కరణల పట్ల సానుకూల ధోరణి వంటి సానుకూలతలనూ పేర్కొన్నాయి. ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవడం సానుకూలమన్నారు. 2024–25 మొదటి ఆరు నెలల్లో ప్రైవేటు పెట్టుబడులు, అంతకుముందు ఆరు నెలల కాలంతో పోలి్చతే పుంజుకున్నట్టు సర్వేలో 59 శాతం కంపెనీలు తెలిపాయి.
రేట్ల కోతపై అంచనాలు
ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోతను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) మొదలు పెట్టొచ్చని 34% కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపు నాలుగో త్రైమాసికంలో (2025 జనవరి–మార్చి) ఆరంభం కావొచ్చని 31% కంపెనీలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment