ముంబై: మార్టిగేజ్ దిగ్గజం, మాతృ సంస్థ.. హెచ్‌డీఎఫ్‌సీ విలీనం తదుపరి ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో రూ. 16,811 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టాండెలోన్ నికర లాభం రూ. 15,976 కోట్లకు చేరింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో విలీన సంస్థ నికర లాభం రూ. 11,162 కోట్లుగా మదింపు వేసింది. ఇక గత క్యూ2 స్టాండెలోన్ లాభం రూ. 10,606 కోట్లుగా లెక్కకట్టింది.
మార్జిన్లు డీలా
గతంలో 4 శాతానికిపైగా నికర వడ్డీ మార్జిన్లు సాధిస్తూ వచ్చిన నంబర్ వన్ ప్రైవేట్ రంగ బ్యాంక్.. హెచ్‌డీఎఫ్‌సీ ప్రస్తుత సమీక్షా కాలంలో 3.4 శాతం మార్జిన్లు ప్రకటించింది. ఇందుకు విలీనం తదుపరి బ్యాలన్స్‌షీట్‌లో తక్కువ ఈల్డ్స్ ఆర్జించే సెక్యూర్డ్ ఆస్తులు(రుణాలు) పెరగడం ప్రభావం చూపింది. అంతేకాకుండా విలీనానికి మార్కెట్ రుణ సమీకరణ వ్యయాలు సైతం పెరిగాయి. అయితే నికర వడ్డీ మార్జిన్లు పుంజుకోనున్నట్లు బ్యాంక్ సీఎఫ్‌వో శ్రీనివాసన్ వైద్యనాథన్ పేర్కొన్నారు. అధిక ఈల్డ్స్ అందించే ఆస్తులు పెరగడం, చౌకగా సమీకరించిన డిపాజిట్లతో మార్కెట్ రుణాలను రీప్లేస్ చేసిన తదుపరి మార్జిన్లు మెరుగుపడనున్నట్లు వివరించారు.
30 శాతం అప్
ఈ ఏడాది క్యూ2లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 30 శాతం జంప్‌చేసి రూ. 27,385 కోట్లను తాకింది. గతేడాది క్యూ2లో రూ. 21,021 కోట్ల వడ్డీ ఆదాయాన్ని సాధించాయి. ఇక ఇతర ఆదాయం రూ. 7,596 కోట్ల నుంచి రూ. 10,708 కోట్లకు జంప్ చేసింది. అటు డిపాజిట్లు, ఇటు అడ్వాన్సులు(రుణాలు).. రూ. లక్ష కోట్ల చొప్పున నమోదయ్యాయి. డిపాజిట్లు 5.3 శాతం, అడ్వాన్సులు 4.9 శాతం చొప్పున వృద్ధి చూపాయి. స్థూల మొండిబకాయిలు 1.41 శాతం నుంచి 1.34 శాతానికి తగ్గాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,240 కోట్ల నుంచి రూ. 2,903 కోట్లకు వెనకడుగు వేశాయి. ఎడ్యుకేషన్ రుణాలందించే క్రెడిలా విక్రయాన్ని పూర్తి చేయవలసి ఉన్నట్లు వైద్యనాథన్ పేర్కొన్నారు. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ లిస్టింగ్ ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. నికరంగా 16,000 మంది ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1.98 లక్షలకు చేరినట్లు వెల్లడించారు.
ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు బీఎస్‌ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 1,530 వద్ద ముగిసింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జోరు
Published Tue, Oct 17 2023 4:26 AM | Last Updated on Tue, Oct 17 2023 4:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment