హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.4,600 కోట్లు | HDFC Q2 profit more than halves to Rs 4,600 cr | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.4,600 కోట్లు

Published Tue, Nov 3 2020 5:44 AM | Last Updated on Tue, Nov 3 2020 5:44 AM

HDFC Q2 profit more than halves to Rs 4,600 cr - Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ రుణ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నిటితో కలిపి) రూ.4,600 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.10,389 కోట్లతో పోలిస్తే 57.5 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ.32,851 కోట్ల నుంచి రూ.34,090 కోట్లకు వృద్ధి చెందింది. ‘2019 సెప్టెంబర్‌ క్వార్టర్‌లో అనుబంధ సంస్థ గృహ్‌ ఫైనాన్స్‌ను బంధన్‌ బ్యాంక్‌లో విలీనం చేసేందుకు, వాటా విక్రయించిన కారణంగా రూ.8,000 కోట్ల లాభం లభించింది’ అని హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. ‘వాస్తవానికి, డివిడెండ్‌ ఆదాయాన్ని, వాటాల విక్రయం, అలాగే అంచనా క్రెడిట్‌ నష్టం(ఈసీఎల్‌) కేటాయింపులను తీసివేస్తే, క్యూ2లో నికర లాభం 27 శాతం పెరిగినట్లు లెక్క’ అని హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌–చైర్మన్, సీఈఓ కేకి మిస్త్రీ పేర్కొన్నారు.  

స్టాండెలోన్‌గానూ 28 శాతం తగ్గుదల...
కేవలం మార్ట్‌గేజ్‌ కార్యకలాపాలపై మాత్రమే చూస్తే (స్టాండెలోన్‌గా), క్యూ2లో హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం 28 శాతం తగ్గి రూ.2,870 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,962 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం సైతం రూ.13,494 కోట్ల నుంచి రూ.11,733 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం మాత్రం 21 శాతం పెరుగుదలతో రూ.3,021 కోట్ల నుంచి రూ. 3,647 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ 3.3 శాతంగా ఉంది. ఇక మొండిబాకీ(ఎన్‌పీఏ)ల విషయానికొస్తే, క్యూ2లో స్థూల ఎన్‌పీఏలు 1.81 శాతంగా (రూ.8,511 కోట్లు) నమోదయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులో సంస్థ రూ.10,000 కోట్ల ఈక్విటీ నిధులను సమీకరించింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో వాటా అమ్మకం ద్వారా హెచ్‌డీఎఫ్‌సీకి రూ.1,241 కోట్ల స్థూల లాభం వచ్చింది. కాగా, కోవిడ్‌ ప్రభావంతో సహా క్యూ2లో కేటాయింపులు (ప్రొవిజనింగ్‌) రూ.436 కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే క్వార్టర్‌లో కేటాయింపులు రూ.754 కోట్లు.
 హెచ్‌డీఎఫ్‌సీ షేరు సోమవారం బీఎస్‌ఈలో
6 శాతం పెరిగి రూ. 2,043 వద్ద స్థిరపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement