TCS Reports A Rise Of 8.4% In Net Income To Rs 10,431 Crore In September Quarter - Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ లాభం రూ. 10 వేల కోట్లు

Published Tue, Oct 11 2022 4:09 AM | Last Updated on Tue, Oct 11 2022 9:57 AM

TCS reports over percent rise in Q2 net profit at Rs 10,431 crore - Sakshi

ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) అంచనాలకు అనుగుణమైన లాభాలతో  రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల సీజన్‌కు బోణీ కొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ లాభం 8.4 శాతం పెరిగి రూ. 10,431 కోట్లుగా నమోదైంది. టీసీఎస్‌ లాభాలు ఒక త్రైమాసికంలో రూ. 10వేల కోట్ల మైలురాయిని అధిగమించడం ఇదే ప్రథమం. ఇక సమీక్షా కాలంలో ఆదాయం 18 శాతం ఎగిసి రూ. 55,309 కోట్లకు చేరింది.

కంపెనీ గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ. 46,867 కోట్ల ఆదాయంపై రూ. 9,624 కోట్ల లాభం నమోదు చేసింది. సీక్వెన్షియల్‌గా చూస్తే లాభం 10 శాతం, ఆదాయం 5 శాతం పెరిగాయి. ‘మా సర్వీసులకు డిమాండ్‌ పటిష్టంగా ఉంది. వివిధ విభాగాలు, మార్కెట్లలో లాభదాయకతపరంగా మెరుగైన వృద్ధి నమోదు చేశాం‘ అని సంస్థ సీఈవో రాజేశ్‌ గోపీనాథన్‌ తెలిపారు. అయితే, వ్యాపార పరిస్థితులు ‘సవాళ్లతో‘ కూడుకుని ఉన్నాయని, మరింత ‘అప్రమత్తంగా‘ వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా అనిశ్చితి రిస్కుల ప్రభావం కంపెనీపై పడకుండా సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తామని స్పష్టం చేశారు. భౌగోళిక, రాజకీయపరమైన సవాళ్లపై ఆందోళనల కారణంగా క్లయింట్లు దీర్ఘకాలిక డీల్స్‌కు దూరంగా ఉంటున్నారని సీవోవో గణపతి సుబ్రమణియం చెప్పారు. ధరలపరంగా పరిస్థితి స్థిరంగానే ఉందని, రూపా యి క్షీణత కారణంగా ఒత్తిళ్లేమీ లేవని పేర్కొన్నారు.  

మరిన్ని విశేషాలు..
► షేరు ఒక్కింటికి రూ. 8 చొప్పున టీసీఎస్‌ రెండో మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. రికార్డు తేదీ అక్టోబర్‌ 18 కాగా, నవంబర్‌ 7న చెల్లిస్తుంది.
► క్యూ2లో నిర్వహణ మార్జిన్‌ 1.6% క్షీణించి 24%కి పరిమితమైంది.  నాలుగో త్రైమాసికం నాటికి దీన్ని 25%కి పెంచుకోవాలని.. తర్వాత 26–28%కి చేరుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది.  
► విభాగాల వారీగా చూస్తే సమీక్షా కాలంలో రిటైల్, సీపీజీ (కన్జూమర్‌ ప్యాకేజ్డ్‌ గూడ్స్‌) 22.9%, కమ్యూనికేషన్స్‌.. మీడియా 18.7 శాతం, టెక్నాలజీ .. సర్వీసులు 15.9 శాతం, తయారీ 14.5 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ 13.1% మేర వృద్ధి నమోదు చేశాయి.
► కంపెనీ ఆర్డరు బుక్‌ విలువ సెప్టెంబర్‌ త్రైమాసికంలో 8.1 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇందులో 400 మిలియన్‌ డాలర్ల ఒప్పందమే అతి పెద్దది.  
► క్యూ2లో కొత్తగా 9,840 మంది ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 6,16,171కి చేరింది. మహిళా సిబ్బంది వాటా 35.7 శాతంగా ఉంది. అట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలసలు) జూన్‌ త్రైమాసికంలో 19.7 శాతంగా ఉండగా క్యూ2లో 21.5 శాతానికి చేరింది. అయితే, ఇది దాదాపు గరిష్ట స్థాయికి చేరినట్లేనని, ఇక్కడి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని లక్కడ్‌ తెలిపారు.  


టీసీఎస్‌ షేరు సోమవారం 2% పెరిగి 3,121 వద్ద క్లోజైంది. మార్కెట్‌ ముగిశాక ఫలితాలు వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement