న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (క్యూ2) ప్రభుత్వరంగ ఆయిల్ ఇండియా లిమిటెడ్ మంచి ఫలితాలను నమోదు చేసింది. నికర లాభం రెట్టింపునకు పైగా పెరిగి రూ.504 కోట్లకు చేరింది. షేరువారీ ఆర్జన రూ.4.65గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.239 కోట్లు (షేరువారీ ఆర్జన రూ.2.20)గా ఉండడం గమనార్హం. కంపెనీ ఉత్పత్తి చేసిన ప్రతీ బ్యారెల్ ముడి చమురుపై 71.35 డాలర్ల మేర ధర గిట్టుబాటు కావడం లాభాల వృద్ధికి దోహదపడింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో బ్యారెల్ ముడిచమురు ధర 43 డాలర్ల స్థాయిలో ఉంది. కంపెనీ చమురు ఉత్పత్తిలో పెద్దగా మార్పు లేకుండా 0.76 మిలియన్ టన్నులుగా ఉంటే, సహజ వాయువు ఉత్పత్తి 2 శాతం మేర పెరిగింది. కంపెనీ ఆదాయం రూ.2,281 కోట్ల నుంచి రూ.3,679 కోట్లకు వృద్ధి చెందింది. ఏప్రిల్–సెప్టెంబర్ ఆరు నెలల్లో కంపెనీ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ.1,012 కోట్లుగా నమోదైంది. ఎబిట్డా రూ.1,281 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment