డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం 720 కోట్లు | Dr Reddys Labs Q2 profit falls 30percent to Rs 762 crore | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం 720 కోట్లు

Published Thu, Oct 29 2020 4:49 AM | Last Updated on Thu, Oct 29 2020 4:51 AM

Dr Reddys Labs Q2 profit falls 30percent to Rs 762 crore - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 720 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో నమోదైన రూ. 1,092 కోట్లతో పోలిస్తే లాభం సుమారు 30 శాతం తగ్గింది. కొన్ని ఉత్పత్తులను అవుట్‌–లైసెన్సింగ్‌ చేయడం, పన్నుపరమైన ప్రయోజనాలు వంటివి కూడా గతంలో కలిపి చూపించిన నేపథ్యంలో .. దానితో పోల్చితే తాజా క్యూ2లో లాభం తగ్గిందని సంస్థ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో) సౌమేన్‌ చక్రవర్తి తెలిపారు. ఉత్పాదకత మెరుగుపడటం, సానుకూల విదేశీ మారక రేట్ల ఊతంతో స్థూల లాభాల మార్జిన్‌పై ప్రతికూల ప్రభావం కొంత తగ్గిందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన ఉత్పత్తులతో పాటు కోవిడ్‌ చికిత్సలో ఉపయోగపడే అవకాశాలు ఉన్న పలు ఔషధాలపై తమ పరిశోధన బృందాలు కసరత్తు చేస్తున్నాయని డీఆర్‌ఎల్‌ సహ చైర్మన్‌ జీవీ ప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని విశేషాలు..
n కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం తదితర అంశాల ఊతంతో గ్లోబల్‌ జనరిక్స్‌ విభాగం ఆదాయం 21 శాతం పెరిగి రూ. 3,980 కోట్లుగా నమోదైంది.  
n ఉత్తర అమెరికా మార్కెట్‌ 28% పెరిగి రూ. 1,830 కోట్లకు చేరింది. విదేశీ మారకం రేటు అనుకూలత, కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టడం ఇందుకు దోహదపడింది.
n యూరప్‌ ఆదాయాలు 36% పెరిగి రూ. 380 కోట్లకు చేరాయి. కొత్తగా ఆస్ట్రియా మార్కెట్లోకి కూడా కంపెనీ ప్రవేశించింది. అటు వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 4% వృద్ధితో రూ. 860 కోట్లకు చేరింది. రూబుల్‌ బలహీనపడటం రష్యాలో ఆదాయంపై ప్రభావం చూపింది.
n భారత్‌ మార్కెట్లో ఆదాయం 21 శాతం వృద్ధి చెంది రూ. 910 కోట్లకు చేరింది. వొకార్డ్‌ వ్యాపారం కొనుగోలు, కొత్త ఉత్పత్తుల అమ్మకాలు ఇందుకు తోడ్పడ్డాయి.
n  ఫార్మాసూటికల్‌ సర్వీసెస్, యాక్టివ్‌ ఇంగ్రీడియంట్స్‌ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం 20 శాతం పెరిగి రూ. 850 కోట్లుగా నమోదైంది.  
బీఎస్‌ఈలో డీఆర్‌ఎల్‌ షేరు సుమారు 3 శాతం క్షీణించి రూ. 4,950 వద్ద క్లోజయ్యింది.

సైబర్‌ దాడి ప్రభావమేమీ లేదు  
అక్టోబర్‌ 22న కంపెనీ సర్వర్లపై సైబర్‌ దాడులు చోటుచేసుకోవడంపై చక్రవర్తి స్పందించారు. దీనిపై సత్వరం బైటి సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల సహాయం తీసుకున్నామని, కార్యకలాపాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడకుండా జాగ్రత్తపడ్డామని ఆయన తెలిపారు. ఇప్పటిదాకానైతే తమ విచారణలో డేటా చౌర్యం వంటివేమీ జరిగిన దాఖలాలేమీ బైటపడలేదని చక్రవర్తి వివరించారు. కోవిడ్‌–19 టీకా స్పుత్నిక్‌ వి రెండో దశ ట్రయల్స్‌ డిసెంబర్‌ నాటికి పూర్తి కాగలవని సంస్థ సీఈవో ఎరెజ్‌ ఇజ్రేలీ తెలిపారు. పరిస్థితులను బట్టి మూడో దశ పరీక్షలు మార్చి ఆఖరు నాటికి పూర్తి కావొచ్చన్నారు. మరోవైపు, సౌమేన్‌ చక్రవర్తి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో సీఎఫ్‌వోగా పరాగ్‌ అగర్వాల్‌ నియమితులయ్యారని కంపెనీ తెలిపింది. డిసెంబర్‌ 1న అగర్వాల్‌ బాధ్యతలు చేపడతారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement