అంచనాలు మించిన భారతీ ఎయిర్టెల్
విశ్లేషకులు అంచనావేసిన దానికంటే మెరుగైన ఫలితాలనే దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జూలై-సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ లాభాలు 4.9 శాతం పడిపోయి రూ.1,461 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.1,536 కోట్లగా ఉన్నాయి. స్పెక్ట్రమ్ సంబంధిత ఖర్చులు, నైజీరియన్ కరెన్సీ డివాల్యుయేషన్ వంటి కారణాలతో భారతీ ఎయిర్టెల్ లాభాలు పడిపోయినట్టు కంపెనీ ప్రకటించింది. కానీ విశ్లేషకుల అంచనావేసిన దానికంటే బాగానే ఆపరేషన్ ఫర్ఫార్మెన్స్ను కంపెనీ చూపించినట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. విశ్లేషకుల ముందస్తు అంచనా ప్రకారం భారతీ ఎయిర్టెల్ రూ.25,495 కోట్ల రెవెన్యూలపై రూ.1050 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని తెలిసింది.
గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,053 కోట్లగా ఉన్న నికర వడ్డీ వ్యయాలు రూ.1,603 కోట్లకు ఎగిశాయి. ఈ వ్యయాలు పెరగడానికి ప్రధాన కారణం కూడా స్పెక్ట్రమ్ సంబంధిత వడ్డీ వ్యయాలేనని కంపెనీ వెల్లడించింది. ఉచిత సేవలతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో ఎఫెక్టు భారతీ ఎయిర్టెల్పై పడింది. ఈ క్వార్టర్లో ఎయిర్ టెల్ మొబైల్ వ్యాపారాలు నెమ్మదించాయి. మొత్తంగా అయితే యేటికేటికి 10.1 శాతం రెవెన్యూ వృద్ధి నమోదుచేస్తూ కంపెనీ ఊపందుకున్నట్టు భారతీ ఎయిర్ టెల్ ప్రకటించింది. నాన్-మొబైల్ బిజినెస్ల్లో వృద్ధి నమోదు వల్లే కంపెనీ రెవెన్యూలను పెంచుకోగలిగిందని ఆ సంస్థ సీఈవో, ఎండీ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ తెలిపారు.
సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికి రెవెన్యూలు 10.1 శాతం ఎగిసి రూ.19,219 కోట్లగా నమోదయ్యాయి. యేటికేటికీ డిజిటల్ టీవీ వ్యాపారాల్లో 20.9 శాతం వృద్ధి, ఎయిర్టెల్ బిజినెస్లో రూ.19.2 శాతం, మొబైల్ వ్యాపారాల్లో 7.9 శాతం వృద్ధి కంపెనీ భారత వ్యాపారాల్లో నమోదుచేసినట్టు భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. కంపెనీ మొత్తం ఆదాయం 3.4 శాతం పెరిగి రూ.24,671.5 కోట్లగా కంపెనీ నమోదుచేసింది. అయితే నైజీరియా కరెన్సీ డివాల్యుయేషన్తో కన్సాలిడేటెడ్ రెవెన్యూ వృద్ధి 3.3 శాతం మందగించింది.