జీవితంలో చెడు రోజులను ఎదుర్కోవడం ఎంతో కష్టంగా అనిపిస్తుంది. కానీ, మనలో దాగి ఉన్న ప్రతిభ, సామర్థ్యం, ధైర్యం గురించి మనల్ని మనం తెలుసుకునే సమయం ఇదే’ అంటుంది భారతీ సుమారియా. జీవించాలనే ఆశను కోల్పోయి అత్తవారింటి నుంచి ఖాళీ చేతులతో బయటకు వచ్చేసిన ఆమె నేడు ఏడాదికి నాలుగు కోట్ల బిజినెస్ టర్నోవర్‌కి చేరుకునేంతగా ఎదిగింది. ముంబైలో పదేళ్ల క్రితం టూత్‌బ్రష్, టిఫిన్‌బాక్స్, వాటర్ బాటిల్ .. వంటి చిన్న చిన్న నిత్యావసర వస్తువులను ఉత్పత్తి చేసే పనిని ప్రారంభించి, ఒంటరి పోరాటంతో ఎదిగిన భారతీ సుమారియా ధైర్యం ప్రతి ఒక్కరికీ పాఠం అవుతుంది.
చేదు అనుభవాలే మనకు విజయవంతమైన మార్గానికి దారులు వేస్తాయి. దీనిని భారతీ సుమారియా చేసి చూపెట్టింది. సమస్యను సవాల్‌గా తీసుకొని ఎదిగిన వనితగా తనను తాను నిరూపించుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
‘‘నేను ముంబైలోని భివాండి ప్రాంతంలో పుట్టాను. కొన్నేళ్లకు ములుండ్‌కి వెళ్లాం. మా కుటుంబం సాధారణ మధ్యతరగతికి చెందినదే. ఆడపిల్లలకు ఎన్నో ఆంక్షలు. పదో తరగతి వరకు మాత్రమే చదవగలిగాను. పెళ్లయ్యాక వంటింటిని నడపాలి కానీ, ఆడపిల్లను చదివించి ఏం లాభం అనే మనస్తత్వం ఉన్న కుటుంబంలో పెరిగాను. అలా నా ప్రపంచం కూడా కుటుంబానికే పరిమితం అయ్యింది. నాకేమీ చేయాలనే కోరిక ఉండేది కాదు. నా ప్రపంచంలో నేను సంతోషంగానే ఉన్నాను. సక్సెస్ సాధించిన స్త్రీని చూసినా, అలాంటి వారి గురించి విన్నా, చదివినా నేను ఏదైనా చేయగలనా అనే ఆలోచన నా మదిలో మెదిలేది. కానీ, నా మనసులోని భావాలను కుటుంబ సభ్యులకు చెప్పుకునే ధైర్యం ఉండేది కాదు.
పెళ్లితో మారిన జీవితం..
ఆడపిల్లలకు పెళ్లే జీవిత లక్ష్యంగా ఉన్న రోజుల్లో 20ఏళ్ల వయసులో నాకు వివాహం చేశారు. మా అమ్మనాన్నలు చెప్పినట్టుగా నా భర్త సలహాలను అనుసరించాను. అత్తమామల బాధ్యతలను నెరవేర్చడంలో తీరిక లేకుండా గడిపాను. అత్తింటిలో అడుగుపెట్టినప్పుడు అదే నా ప్రపంచం అయ్యింది. అయితే, నా భర్త ఏ పనీ చేసేవాడు కాదు. నేను ఆర్థికంగా స్వతంత్రురాలిని కాదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు, నా పిల్లలకు నోటిలో నాలుగు వేళ్లూ పోక కనీసావసరాలు తీరక నా భర్త నాపై తన కోపాన్ని, చిరాకును ప్రదర్శించటం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడూ చేయి కూడా చేసుకునేవాడు. ఇది నన్ను బాగా ప్రభావితం చేసింది.
దీంతో నాకు ఆ ఇంట్లో ఉండటం కష్టంగా మారింది. మామగారు పనిచేసేవారు. కానీ, నా భర్త అస్సలు పనిచేసేవాడు కాదు. పిల్లల ఖర్చులు కూడా మామగారే భరించేవారు. 20 ఏళ్లు నా కోసం నేను ఎలాంటి షాపింగ్ చేయలేదు. మా అక్క బట్టలు నాకు ఇచ్చేది. వాటిని సంతోషంగా తీసుకునేదాన్ని. అత్తింట్లో రోజు రోజుకీ నా పరిస్థితి దిగజారడం మొదలయ్యింది. అమ్మ నా పరిస్థితి గమనించి పుట్టింటికి తీసుకువచ్చింది. ఆ సమయంలో నేను చాలా నిస్సహాయంగా ఉన్నాను. జీవించాలనే కోరికను కూడా కోల్పోయాను. డిప్రెషన్‌కు గురయ్యాను. ఏం చేయాలో అర్థం కాక గంటల తరబడి మౌనంగా కూర్చునేదాన్ని. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో కూడా నాకు తెలియదు.
ఆరు లక్షల రూపాయలతో..
దీపావళికి, పుట్టిన రోజుకి నాన్న డబ్బులు ఇస్తుండేవారు. ఆ డబ్బు కూడా మా అత్తింట్లో ఖర్చయిపోయేది. దీంతో నాకు డబ్బు ఇవ్వకుండా డిపాజిట్ చేయమని, భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పాను. అత్తింటి నుంచి బయటకు వచ్చాక ఏం చేయలేని పరిస్థితిలో నాన్న నాకోసం డిపాజిట్ చేసిన డబ్బు ఆరు లక్షలకు పెరిగిందని తెలిసింది. 2005లో ఆ ఆరు లక్షల రూపాయలతో 300 అడుగల విస్తీర్ణంలో ఉన్న ఓ ప్లేస్ అద్దెకు తీసుకొని టూత్‌బ్రష్, టిఫిన్‌బాక్స్, వాటర్‌బాటిల్ వంటి చిన్న చిన్న నిత్యావసర వస్తువులను తయారుచేసే పనిని ప్రారంభించాను. నా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పగలు రాత్రి కష్టపడ్డాను. త్వరలోనే సిప్లా, బిస్లరీ వంటి పెద్ద బ్రాండ్‌ల నుండి ఆర్డర్లను పొందడం ప్రారంభించాను. ఈ రోజు నా ఫ్యాక్టరీ లక్షా ఇరవై వేల అడుగుల విస్తీర్ణంలో విస్తరించింది.
భయం బలంగా మారింది
ఎప్పుడూ పని కోసం ఇల్లు వదిలి వెళ్లలేదు. కానీ నాకు పని తప్ప వేరే మార్గం కనిపించలేదు. నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని భావించి, రాత్రింబగళ్లు కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాను. చెడు సమయాలు నన్ను నేను తెలుసుకునేలా చేశాయి. నా సామర్థ్యాలను తెలుసుకునే అవకాశం కల్పించింది. ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా ఎలా చేయగలిగాను అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతగా సహించానో అంతగా కష్టాలు పెరిగాయి. నాకు దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంది. భగవంతుడు నా బలాన్ని గ్రహించి విజయపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు చుట్టూ అలాంటి వాతావరణం సృష్టించాడని అనిపించింది. నా పురోభివృద్ధికి నా భర్త కోపం, తగాదాలే కారణమయ్యాయి. దాని వల్లనే నేను ఇదంతా చేయగలిగాను.
పిల్లలే నా ప్రపంచం
భార్యగా దృఢంగా ఉండలేకపోయినా పిల్లల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ అలిసిపోవడానికి, వదులుకోవడానికి సిద్ధంగా లేనని నన్ను నేను బలంగా తయారుచేసుకున్నాను. జీవించాలనే కోరిక కూడా కోల్పోయిన ఆ భారతి ఈమేనా అని అందరూ ఆశ్చర్యపోయారు. నా పిల్లల మంచి భవిష్యత్తు కోసం నేను కృష్టి చేయాల్సిందే అని గట్టిగా అనుకున్నాను. నేను నా పని మొదలుపెట్టినప్పుడు పిల్లలు నాకు పూర్తిగా మద్దతు ఇచ్చారు. అప్పట్లో నా కూతురు ఎనిమిదో తరగతి, కొడుకులిద్దరూ ఐదో తరగతి చదువుతున్నారు. నా కూతురు తన చదువుతో పాటు తన తమ్ముళ్లనూ చూసుకుంటుంది. నేను ఇంటికి వెళ్లడం లేట్ అయితే ఆమే స్వయంగా వంట చేసి, తమ్ముళ్లకు పెట్టి, తినిపించి, నిద్రపుచ్చేది.
పిల్లలను తండ్రి నుంచి దూరం చేయలేదు
ఎప్పుడూ పిల్లలను వారి తండ్రి నుంచి కానీ, వారి కుటుంబం నుంచి కానీ దూరం చేయలేదు. పిల్లలు తల్లిదండ్రులిద్దరి ప్రేమను పొందాలని నమ్ముతాను. భార్యాభర్తల మధ్య తగాదాల వల్ల పిల్లలు బాధపడకూడదు. పెళ్లయిన పాతికేళ్ల తర్వాత నా పిల్లలు వారి పూర్వీకుల ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. అక్కడ నుంచి మా ఇంటికి మారిపోయాం. నా పోరాటం నా పిల్లలను కూడా బలపరిచినందుకు సంతోషంగా ఉంది’’ అని వివరిస్తుంది భారతీ సుమారియా.
మహిళలకు మద్దతు లభించాలి
కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ ఆదుకోకపోవడమే ఆడవాళ్లకున్న పెద్ద సమస్య. వాళ్ల అమ్మ ఇల్లు గానీ, అత్తమామల ఇల్లు గానీ తమ సొంతమని భావించరు. తల్లిదండ్రుల నుంచి ఆదరణ లభించక చాలా మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆసరా దొరికితే ఎంతోమంది ఆడపిల్లల ప్రాణాలు తీసుకోకుండా జీవించగలుగుతారు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. నా పరిస్థితి చూసి మా తల్లిదండ్రులు నన్ను సొంతంగా వ్యాపారం చేయమని ప్రోత్సహించారు. నాన్న 3వ తరగతి వరకు మాత్రమే చదివారు. ముంబైలో బట్టల షాప్ పెట్టుకొని, మమ్మల్ని పోషించారు. మేం నలుగురం అక్కచెల్లెళ్లం. మా పెంపకం బాధ్యత అమ్మ తీసుకుంది. ఇంటిని చూసుకోవడంతో పాటు చుట్టుపక్కలవారితో ఎప్పుడూ కలుపుకోలుగా ఉండేది. ఇప్పుడు కూడా మా చుట్టుపక్కల వాళ్లకు సహాయం చేయడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment