Business expansion
-
Bharati Sumaria: చేదు అనుభవాలే తీపి విజయాలకు మెట్లు
జీవితంలో చెడు రోజులను ఎదుర్కోవడం ఎంతో కష్టంగా అనిపిస్తుంది. కానీ, మనలో దాగి ఉన్న ప్రతిభ, సామర్థ్యం, ధైర్యం గురించి మనల్ని మనం తెలుసుకునే సమయం ఇదే’ అంటుంది భారతీ సుమారియా. జీవించాలనే ఆశను కోల్పోయి అత్తవారింటి నుంచి ఖాళీ చేతులతో బయటకు వచ్చేసిన ఆమె నేడు ఏడాదికి నాలుగు కోట్ల బిజినెస్ టర్నోవర్‌కి చేరుకునేంతగా ఎదిగింది. ముంబైలో పదేళ్ల క్రితం టూత్‌బ్రష్, టిఫిన్‌బాక్స్, వాటర్ బాటిల్ .. వంటి చిన్న చిన్న నిత్యావసర వస్తువులను ఉత్పత్తి చేసే పనిని ప్రారంభించి, ఒంటరి పోరాటంతో ఎదిగిన భారతీ సుమారియా ధైర్యం ప్రతి ఒక్కరికీ పాఠం అవుతుంది. చేదు అనుభవాలే మనకు విజయవంతమైన మార్గానికి దారులు వేస్తాయి. దీనిని భారతీ సుమారియా చేసి చూపెట్టింది. సమస్యను సవాల్‌గా తీసుకొని ఎదిగిన వనితగా తనను తాను నిరూపించుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘నేను ముంబైలోని భివాండి ప్రాంతంలో పుట్టాను. కొన్నేళ్లకు ములుండ్కి వెళ్లాం. మా కుటుంబం సాధారణ మధ్యతరగతికి చెందినదే. ఆడపిల్లలకు ఎన్నో ఆంక్షలు. పదో తరగతి వరకు మాత్రమే చదవగలిగాను. పెళ్లయ్యాక వంటింటిని నడపాలి కానీ, ఆడపిల్లను చదివించి ఏం లాభం అనే మనస్తత్వం ఉన్న కుటుంబంలో పెరిగాను. అలా నా ప్రపంచం కూడా కుటుంబానికే పరిమితం అయ్యింది. నాకేమీ చేయాలనే కోరిక ఉండేది కాదు. నా ప్రపంచంలో నేను సంతోషంగానే ఉన్నాను. సక్సెస్ సాధించిన స్త్రీని చూసినా, అలాంటి వారి గురించి విన్నా, చదివినా నేను ఏదైనా చేయగలనా అనే ఆలోచన నా మదిలో మెదిలేది. కానీ, నా మనసులోని భావాలను కుటుంబ సభ్యులకు చెప్పుకునే ధైర్యం ఉండేది కాదు. పెళ్లితో మారిన జీవితం.. ఆడపిల్లలకు పెళ్లే జీవిత లక్ష్యంగా ఉన్న రోజుల్లో 20ఏళ్ల వయసులో నాకు వివాహం చేశారు. మా అమ్మనాన్నలు చెప్పినట్టుగా నా భర్త సలహాలను అనుసరించాను. అత్తమామల బాధ్యతలను నెరవేర్చడంలో తీరిక లేకుండా గడిపాను. అత్తింటిలో అడుగుపెట్టినప్పుడు అదే నా ప్రపంచం అయ్యింది. అయితే, నా భర్త ఏ పనీ చేసేవాడు కాదు. నేను ఆర్థికంగా స్వతంత్రురాలిని కాదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు, నా పిల్లలకు నోటిలో నాలుగు వేళ్లూ పోక కనీసావసరాలు తీరక నా భర్త నాపై తన కోపాన్ని, చిరాకును ప్రదర్శించటం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడూ చేయి కూడా చేసుకునేవాడు. ఇది నన్ను బాగా ప్రభావితం చేసింది. దీంతో నాకు ఆ ఇంట్లో ఉండటం కష్టంగా మారింది. మామగారు పనిచేసేవారు. కానీ, నా భర్త అస్సలు పనిచేసేవాడు కాదు. పిల్లల ఖర్చులు కూడా మామగారే భరించేవారు. 20 ఏళ్లు నా కోసం నేను ఎలాంటి షాపింగ్ చేయలేదు. మా అక్క బట్టలు నాకు ఇచ్చేది. వాటిని సంతోషంగా తీసుకునేదాన్ని. అత్తింట్లో రోజు రోజుకీ నా పరిస్థితి దిగజారడం మొదలయ్యింది. అమ్మ నా పరిస్థితి గమనించి పుట్టింటికి తీసుకువచ్చింది. ఆ సమయంలో నేను చాలా నిస్సహాయంగా ఉన్నాను. జీవించాలనే కోరికను కూడా కోల్పోయాను. డిప్రెషన్‌కు గురయ్యాను. ఏం చేయాలో అర్థం కాక గంటల తరబడి మౌనంగా కూర్చునేదాన్ని. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో కూడా నాకు తెలియదు. ఆరు లక్షల రూపాయలతో.. దీపావళికి, పుట్టిన రోజుకి నాన్న డబ్బులు ఇస్తుండేవారు. ఆ డబ్బు కూడా మా అత్తింట్లో ఖర్చయిపోయేది. దీంతో నాకు డబ్బు ఇవ్వకుండా డిపాజిట్ చేయమని, భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పాను. అత్తింటి నుంచి బయటకు వచ్చాక ఏం చేయలేని పరిస్థితిలో నాన్న నాకోసం డిపాజిట్ చేసిన డబ్బు ఆరు లక్షలకు పెరిగిందని తెలిసింది. 2005లో ఆ ఆరు లక్షల రూపాయలతో 300 అడుగల విస్తీర్ణంలో ఉన్న ఓ ప్లేస్ అద్దెకు తీసుకొని టూత్‌బ్రష్, టిఫిన్‌బాక్స్, వాటర్‌బాటిల్ వంటి చిన్న చిన్న నిత్యావసర వస్తువులను తయారుచేసే పనిని ప్రారంభించాను. నా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పగలు రాత్రి కష్టపడ్డాను. త్వరలోనే సిప్లా, బిస్లరీ వంటి పెద్ద బ్రాండ్ల నుండి ఆర్డర్లను పొందడం ప్రారంభించాను. ఈ రోజు నా ఫ్యాక్టరీ లక్షా ఇరవై వేల అడుగుల విస్తీర్ణంలో విస్తరించింది. భయం బలంగా మారింది ఎప్పుడూ పని కోసం ఇల్లు వదిలి వెళ్లలేదు. కానీ నాకు పని తప్ప వేరే మార్గం కనిపించలేదు. నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని భావించి, రాత్రింబగళ్లు కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాను. చెడు సమయాలు నన్ను నేను తెలుసుకునేలా చేశాయి. నా సామర్థ్యాలను తెలుసుకునే అవకాశం కల్పించింది. ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా ఎలా చేయగలిగాను అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతగా సహించానో అంతగా కష్టాలు పెరిగాయి. నాకు దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంది. భగవంతుడు నా బలాన్ని గ్రహించి విజయపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు చుట్టూ అలాంటి వాతావరణం సృష్టించాడని అనిపించింది. నా పురోభివృద్ధికి నా భర్త కోపం, తగాదాలే కారణమయ్యాయి. దాని వల్లనే నేను ఇదంతా చేయగలిగాను. పిల్లలే నా ప్రపంచం భార్యగా దృఢంగా ఉండలేకపోయినా పిల్లల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ అలిసిపోవడానికి, వదులుకోవడానికి సిద్ధంగా లేనని నన్ను నేను బలంగా తయారుచేసుకున్నాను. జీవించాలనే కోరిక కూడా కోల్పోయిన ఆ భారతి ఈమేనా అని అందరూ ఆశ్చర్యపోయారు. నా పిల్లల మంచి భవిష్యత్తు కోసం నేను కృష్టి చేయాల్సిందే అని గట్టిగా అనుకున్నాను. నేను నా పని మొదలుపెట్టినప్పుడు పిల్లలు నాకు పూర్తిగా మద్దతు ఇచ్చారు. అప్పట్లో నా కూతురు ఎనిమిదో తరగతి, కొడుకులిద్దరూ ఐదో తరగతి చదువుతున్నారు. నా కూతురు తన చదువుతో పాటు తన తమ్ముళ్లనూ చూసుకుంటుంది. నేను ఇంటికి వెళ్లడం లేట్ అయితే ఆమే స్వయంగా వంట చేసి, తమ్ముళ్లకు పెట్టి, తినిపించి, నిద్రపుచ్చేది. పిల్లలను తండ్రి నుంచి దూరం చేయలేదు ఎప్పుడూ పిల్లలను వారి తండ్రి నుంచి కానీ, వారి కుటుంబం నుంచి కానీ దూరం చేయలేదు. పిల్లలు తల్లిదండ్రులిద్దరి ప్రేమను పొందాలని నమ్ముతాను. భార్యాభర్తల మధ్య తగాదాల వల్ల పిల్లలు బాధపడకూడదు. పెళ్లయిన పాతికేళ్ల తర్వాత నా పిల్లలు వారి పూర్వీకుల ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. అక్కడ నుంచి మా ఇంటికి మారిపోయాం. నా పోరాటం నా పిల్లలను కూడా బలపరిచినందుకు సంతోషంగా ఉంది’’ అని వివరిస్తుంది భారతీ సుమారియా. మహిళలకు మద్దతు లభించాలి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ ఆదుకోకపోవడమే ఆడవాళ్లకున్న పెద్ద సమస్య. వాళ్ల అమ్మ ఇల్లు గానీ, అత్తమామల ఇల్లు గానీ తమ సొంతమని భావించరు. తల్లిదండ్రుల నుంచి ఆదరణ లభించక చాలా మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆసరా దొరికితే ఎంతోమంది ఆడపిల్లల ప్రాణాలు తీసుకోకుండా జీవించగలుగుతారు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. నా పరిస్థితి చూసి మా తల్లిదండ్రులు నన్ను సొంతంగా వ్యాపారం చేయమని ప్రోత్సహించారు. నాన్న 3వ తరగతి వరకు మాత్రమే చదివారు. ముంబైలో బట్టల షాప్ పెట్టుకొని, మమ్మల్ని పోషించారు. మేం నలుగురం అక్కచెల్లెళ్లం. మా పెంపకం బాధ్యత అమ్మ తీసుకుంది. ఇంటిని చూసుకోవడంతో పాటు చుట్టుపక్కలవారితో ఎప్పుడూ కలుపుకోలుగా ఉండేది. ఇప్పుడు కూడా మా చుట్టుపక్కల వాళ్లకు సహాయం చేయడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. -
సొంత ఫిన్‌టెక్ ఏర్పాటులో ఎల్ఐసీ
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తాజాగా సొంత ఫిన్‌టెక్ విభాగాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను మదింపు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ సిద్ధార్థ మహంతి తెలిపారు. మరోవైపు, కార్యకలాపాల డిజిటలీకరణ కోసం ప్రాజెక్ట్ డైవ్ (డిజిటల్ ఇన్నోవేషన్, వేల్యూ ఎన్హాన్స్మెంట్)ను చేపట్టామని, దీనికి కన్సల్టెంట్‌ను నియమించుకున్నామని పేర్కొన్నారు. కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా కస్టమర్లు తమ ఇంటి దగ్గరే మొబైల్ ఫోన్‌తో అన్ని సరీ్వసులను పొందగలిగేలా వివిధ ప్రక్రియలను సులభతరం చేస్తున్నట్లు మహంతి పేర్కొన్నారు. -
ఫోన్‌పే దూకుడు.. కొత్త వ్యాపారాలకు నిధుల సమీకరణ
వాల్‌మార్ట్ యాజమాన్యంలోని భారతీయ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే (PhonePe) దూకుడు పెంచింది. వ్యాపార విస్తరణ కోసం నిధుల సమీకరణ చేపట్టిన ఫిన్‌టెక్ కంపెనీ అందులో భాగంగా తాజాగా మరో 100 మిలియన్ డాలర్లను (సుమారు రూ.820 కోట్లు) సమీకరించింది. (గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..) 12 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ ఉన్న ఫోన్‌పే వ్యాపార విస్తరణలో భాగంగా 1 బిలియన్ డాలర్లను విడతలవారీగా సమీకరించినట్లు గత జనవరిలో ప్రకటించింది. అప్పటి నుంచి ఈ ఫిన్‌టెక్ కంపెనీ జనరల్ అట్లాంటిక్ నుంచి 350 మిలియన్ డాలర్లు, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ నుంచి 100 మిలియన్ డాలర్లు, వాల్‌మార్ట్ నుంచి 200 మిలియన్ డాలర్లు సమీకరించింది. (ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. స్టోరేజ్ సమస్యకు పరిష్కారం) భారతదేశంలో తమ చెల్లింపులు, బీమా వ్యాపారాలను విస్తరించడంతో పాటు బ్యాంకింగ్, స్టాక్‌బ్రోకింగ్, ఓఎన్డీసీ ( ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) ఆధారిత షాపింగ్ వంటి కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు సమీకరించిన నిధులను వినియోగించనున్నట్లు ఫోన్‌పే గత ప్రకటనల్లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలోనే ‘పిన్‌కోడ్’ అనే ఓఎన్డీసీ ఆధారిత ఈ-కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు కొత్త హంగులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం నుంచి ఎగుమతుల వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు కార్యకలాపాలను విస్తృతం చేయాలని తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇన్నాళ్లూ ఎగుమతుల వాణిజ్యంపై ఎగుమతిదారులు, ఉత్పత్తిదారులు, పారిశ్రామికవేత్తల కోసం ఎగ్జిబిషన్లు, వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహించిన టీఎస్‌టీపీసీ మౌలిక వసతుల కల్పనపైనా దృష్టి సారిస్తోంది. కంటెయినర్ ఫ్రైట్ స్టేషన్లు, ఇన్లాండ్ కంటెయినర్ డిపోలు, కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లు, వేర్ హౌజ్‌లు తదితరాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటితో పాటు ట్రక్ పార్కింగ్ టెర్మినళ్లు, ట్రేడ్ ఫెయిర్, ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్లను నిర్మించేందుకు టీఎస్‌టీపీసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.13 కోట్లతో కంటెయినర్ ఫ్రైట్ స్టేషన్ హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాలకు చెందిన వాణిజ్య, పారిశ్రామిక సంస్థల ఎగుమతులు, దిగుమతుల కోసం శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో మామిడిపల్లి వద్ద కంటెయినర్ ఫ్రైట్ స్టేషన్‌ను నిర్మించారు. రూ.13 కోట్లతో 7.10 ఎకరాల్లో నిర్మించిన ఈ ఫ్రైట్ స్టేషన్ నిర్వహణ కోసం ఓపెన్ టెండర్ విధానంలో ఏజెన్సీని ఎంపిక చేయాల్సి ఉంది. వరంగల్‌లో 30 ఎకరాల విస్తీర్ణంలో ట్రేడ్ ఫెయిర్ కాంప్లెక్సు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నా, భూ కేటాయింపు ప్రతిపాదన కలెక్టర్ వద్ద పెండింగులో ఉంది. 150 ఎకరాల్లో లాజిస్టిక్ పార్కులు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో సుమారు 150 ఎకరాల్లో నాలుగు భారీ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు బాధ్యతను నాలుగు ప్రైవేటు సంస్థలకు టీఎస్‌టీపీసీ అప్పగించింది. జీఎంఆర్, ఎంబసీ, హెచ్‌డీఎంఏ ప్రైవేట్ లిమిటెడ్, టీవీఎస్ లాజిస్టిక్ సంస్థల ఆధ్వర్యంలో లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇదిలాఉంటే హైదరాబాద్‌లో ట్రేడ్ సెంటర్, వరంగల్‌లో ట్రేడ్ ఫేర్ కాంప్లెక్సు, ప్యాక్ హౌజ్‌లు, పీక్యూ ల్యాబ్‌లు, వేపర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు తదితర ప్రాజెక్టుల సవివర నివేదికలు (డీపీఆర్) రూపొందించే బాధ్యతను గ్రాంట్ థార్న్టన్ కన్సల్టెన్సీకి టీఎస్‌టీపీసీ అప్పగించింది. వాణిజ్య ఎగుమతులు ప్రోత్సహించేందుకు టీఎస్‌టీపీసీ ప్రతిపాదనలను వీలైనంత త్వరగా అమలయ్యేలా చూస్తామని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
రిలయన్స్ కార్ట్‌లో నెట్‌మెడ్స్!
బెంగళూరు: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార విస్తరణ ప్రణాళికలు మరింత జోరందుకున్నాయి. ఇటీవలే జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాలను ప్రీమియం రేటుకు విక్రయించిన రిలయన్స్ ఈసారి ఆన్లైన్ ఫార్మా సేవల సంస్థ నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాల కొనుగోలుపై దృష్టి సారించింది. దీనికి సంబంధించి చర్చలు తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు 150 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,150 కోట్లు) ఉండవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చివరి విడత నిధుల సమీకరణ సమయంలో నెట్‌మెడ్స్‌కి లభించిన వేల్యుయేషన్ కన్నా కాస్త ప్రీమియం రేటు చెల్లించవచ్చని పేర్కొన్నాయి. దీంతో పాటు కార్యకలాపాల విస్తరణకు మరిన్ని నిధులు కూడా సమకూర్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి. అనుబంధ సంస్థ ద్వారా రిలయన్స్ ఈ డీల్ పూర్తి చేయొచ్చని వివరించాయి. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడానికి ముందు నుంచే రిలయన్స్, నెట్‌మెడ్స్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు రిలయన్స్, నెట్‌మెడ్ వర్గాలు నిరాకరించాయి. కొత్త వ్యాపార అవకాశాల మదింపు నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని, మార్కెట్ ఊహాగానాలపై వ్యాఖ్యానించలేమని రిలయన్స్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై వ్యాఖ్యానించలేమని నెట్‌మెడ్స్ వ్యవస్థాపకుడు ప్రదీప్ దాధా పేర్కొన్నారు. కస్టమర్లకు నిత్యావసరాలు మొదలైన వాటి సరఫరా కోసం మాత్రమే ప్రస్తుతం రిలయన్స్ రిటైల్‌తో జట్టు కట్టినట్లు వివరించారు. జోరుగా విస్తరణ .. ఆన్లైన్–టు–ఆఫ్‌లైన్ (ఓ2ఓ) వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నెట్‌మెడ్స్‌తో డీల్ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యాపారాల విస్తరణలో భాగంగా ఇటీవలే రిలయన్స్ రిటైల్, వాట్సాప్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. రిలయన్స్ టెలికం, డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాట్సాప్ మాతృసంస్థ ఫేస్బుక్ 9.99 శాతం వాటాలను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 5.7 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. ఇక కంపెనీల కొనుగోళ్లపైనా రిలయన్స్ భారీగానే వెచ్చిస్తోంది. కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం 2017 నుంచి ప్రధానంగా జియో, రిలయన్స్ రిటైల్ వ్యాపార విభాగాల విస్తరణకు దాదాపు 3 బిలియన్ డాలర్ల దాకా వెచ్చించింది. సావన్, ఎంబైబ్, ఫైండ్, గ్రాబ్, హ్యాప్టిక్, రెవరీ, నౌఫ్లోట్స్ వంటి సంస్థలను కొనుగోలు చేసింది. ఫార్మాలో రిలయన్స్‌కు రెండో డీల్.. నెట్‌మెడ్స్‌ను కొనుగోలు చేస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి.. ఫార్మా రంగంలో ఇది రెండో డీల్ కానుంది. గతేడాదే బెంగళూరుకు చెందిన సి–స్క్వేర్ ఇన్ఫో సొల్యూషన్స్‌లో రిలయన్స్ 82% వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 82 కోట్లు వెచ్చించింది. ఫార్మా రంగంలోని డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లు, సేల్స్ సిబ్బందికి అవసరమైన సాఫ్ట్వేర్ ను ఈ సంస్థ రూపొంది స్తుంది. అపోలో ఫార్మసీ, యాడ్‌కాక్ ఇన్‌గ్రామ్ వంటి కంపెనీలు దీనికి క్లయింట్లు. నెట్‌మెడ్స్ కథ ఇదీ.. ప్రదీప్ దాధా 2015లో నెట్‌మెడ్స్‌ను ప్రారంభించారు. ఆయన కుటుంబం.. సన్ ఫార్మాస్యూటికల్స్ ఔషధాలను తొలినాళ్లలో పంపిణీ చేసేది. ఆ తర్వాత ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని సన్ ఫార్మా కొనుగోలు చేసింది. నెట్‌మెడ్స్ ఇప్పటిదాకా మూడు విడతల్లో 100 మిలియన్ డాలర్ల దాకా నిధులు సమీకరించింది. దాధాల ఫ్యామిలీ ఆఫీస్‌తో పాటు హెల్త్‌కేర్ రంగ ఇన్వెస్టరు ఆర్బిమెడ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఎంఏపీఈ అడ్వైజరీ, సిస్టెమా ఆసియా ఫండ్, సింగపూర్‌కి చెందిన దౌన్ పెన్ కంబోడియా గ్రూప్ మొదలైనవి నెట్మెడ్లో ఇన్వెస్టర్లు. కొత్తగా మరో 12 గిడ్డంగుల ఏర్పాటు ద్వారా మొత్తం వేర్‌హౌస్‌లను 26కి పెంచుకోనున్నట్లు నెట్‌మెడ్స్ గతేడాది ప్రకటించింది. కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ నివేదిక ప్రకారం ప్రస్తుతం నెట్‌మెడ్స్ .. నెలవారీ లావాదేవీల యూజర్ల సంఖ్య సుమారు ఆరు లక్షలుగా ఉంది. కంపెనీ ఆదాయాల్లో దాదాపు 90 శాతం వాటా .. ప్రిస్క్రిప్షన్ ఔషధాలు, ఓవర్ ది కౌంటర్ ఔషధాల విక్రయాలదే ఉంటోంది. ఈ రంగంలో 1ఎంజీ, మెడ్‌లైఫ్, ఫార్మ్ఈజీ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీవ్ర అనారోగ్యాలతో తరచూ ఔషధాలు తప్పనిసరిగా కొనుగోలు చేసే వర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఈ–ఫార్మా @ 6 బిలియన్ డాలర్లు కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ నివేదిక ప్రకారం ఈ–ఫార్మా పరిశ్రమ (కన్సల్టెన్సీ, డయాగ్నాస్టిక్స్ కూడా కలిపి) ప్రస్తుతం 1.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. వచ్చే అయిదేళ్లలో ఇది 16 బిలియన్ డాలర్ల దాకా చేరొచ్చని అంచనా. ఇప్పటికే దాదాపు నలభై లక్షల పైగా కుటుంబాలు ఆన్లైన్లో ఔషధాలను కొనుగోలు చేస్తున్నాయి. సాధారణంగా ఈ–ఫార్మా ప్లాట్‌ఫామ్ లపై సగటు కొనుగోలు లావాదేవీ విలువ రూ.1,400–1,700 స్థాయి లో ఉంటోంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తితో లబ్ది పొందిన అతి కొద్ది రంగాల్లో ఈ–ఫార్మా పరిశ్రమ కూడా ఒకటి. -
ఏడాదిలో 3.68 కోట్ల ఉద్యోగాలు...
బీజింగ్ : చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ భారీగా ఉద్యోగావకాశాలను కల్పించింది. వ్యాపార విస్తరణలో భాగంగా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పించనుంది. తాజా నివేదికల ప్రకారం 2017 సంవత్సరంలో 3.68 కోట్ల ఉద్యోగాలు కల్పించినట్టు ఓ సర్వే ద్వారా వెల్లడైంది. అలీబాబా గ్రూప్ నిర్వహిస్తున్న వివిధ సంస్థల ద్వారా 50కోట్ల వినియోగదారులకు సేవలందిస్తుందని, అన్లైన్ రిటైల్ విభాగంలోనే కొత్తగా 1.4 కోట్ల ఉద్యోగాలను కల్పించినట్టు పేర్కొంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, నిత్యవసరాలు, గృహోపకరణాల విభాగాలు ఈ నియామకాల్లో అగ్రభాగాన ఉన్నాయని తెలిపింది. ఆర్ అండ్ డీ, డిజైన్, తయారీ, లాజిస్టిక్స్ రంగాల్లోని నిపుణలకు డిమాండ్ పెరగడానికి అన్లైన్ రిటైల్ సేవల విస్తరణ ఎంతగానో దోహదపడినట్టు, కేవలం ఈ రంగాల్లోనే 2.27 కోట్ల ఉద్యోగాలు కల్పించగలిగారని నివేదించింది. గత ఏడాదితో పోల్చితే 2017 నాలుగో త్రైమాసికంలో ఆదాయంలో 56 శాతం వృద్ధి సాధించినట్టు అలీబాబా గ్రూప్ పేర్కొంది. భవిష్యత్తులో ఈ కామర్స్ రంగం మరింత కీలకంగా మారనున్నట్టు వెల్లడించింది. వ్యాపార విధానాలను సంస్కరించడం, అఫ్లైన్ రిటైల్ వ్యాపారాన్ని డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని ఈ రిపోర్ట్ తెలిపింది. -
వర్ధమాన మార్కెట్లపై డాక్టర్ రెడ్డీస్ దృష్టి
క్యూ2లో రికార్డుస్థాయి ఫలితాలు 26% వృద్ధితో రూ. 722 కోట్ల నికర లాభం రూ. 3,989 కోట్లకు చేరిన ఆదాయం వ్యాపార విస్తరణకు విలీనాలపై దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో వర్ధమాన దేశాల్లో వ్యాపార విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. ఇందుకోసం అవసరమైతే ఆయా దేశాల్లోని కంపెనీలను, ప్రాచుర్యం పొందిన బ్రాండ్లను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇందుకోసం ఇప్పటికే బ్రెజిల్, కొలంబియా దేశాల్లో గల అవకాశాలను పరిశీలించడానికి ప్రతినిధులను నియమించినట్లు డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) సౌమెన్ చక్రవర్తి తెలిపారు. వర్ధమాన దేశాల్లో 5 నుంచి 10 మిలియన్ డాలర్ల వ్యాపారస్థాయికి చేరుకోవాలన్నా చాలా సమయం పడుతుందని, అందుకే స్థానిక కంపెనీలు, బ్రాండ్ల కొనుగోలుపై దృష్టిసారించినట్లు తెలిపారు. ద్వితీయ త్రైమాసిక ఫలితాలను ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికా, యూరప్ తర్వాత వర్ధమాన దేశాల మార్కెట్లో విస్తరణ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సౌమెన్ చక్రవర్తి తెలిపారు. క్యూ2 లాభం 26 శాతం జూమ్... ద్వితీయ త్రైమాసికం(క్యూ2)లో డాక్టర్ రెడ్డీస్ అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించింది. ఒక త్రైమాసికంలో రికార్డుస్థాయి ఆదాయాన్ని, లాభాలను ఆర్జించింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 26 శాతం వృద్ధితో రూ. 574 కోట్ల నుంచి రూ. 722 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆదాయం 11% వృద్ధితో రూ. 3,588 కోట్ల నుంచి రూ. 3,989 కోట్లకు పెరిగింది. యూరప్ ఆదాయంలో 65%, అమెరికా 32% వృద్ధి నమోదు కావడం, కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదల చేయడం లాభాలు పెరగడానికి ప్రధాన కారణంగా డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ తెలిపారు. సమీక్షా కాలంలో ప్రధానమైన అమెరికా మార్కెట్ ఆదాయం రూ. 1,403 కోట్ల నుంచి రూ. 1,856 కోట్లకు చేరితే, యూరప్ ఆదాయం రూ. 128 కోట్ల నుంచి రూ. 212 కోట్లకు పెరిగింది. ఇక దేశీయ వ్యాపారం 14% వృద్ధితో రూ. 480 కోట్ల నుంచి రూ. 546 కోట్లకు పెరిగింది. రష్యా కరెన్సీ రూబుల్ బలహీనత వల్ల వర్ధమాన దేశాల ఆదాయం 22% క్షీణించి రూ. 849 కోట్ల నుంచి రూ. 662 కోట్లకు తగ్గింది. రూపాయల్లో చూస్తే రష్యా వ్యాపారం తగ్గినట్లు కనిపిస్తున్నా... రూబుల్స్‌లో 11% వృద్ధి నమోదైనట్లు ముఖర్జీ తెలిపారు. ఫలితాల నేపథ్యంలో గురువారం బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 2.5% పెరిగి రూ.4,214 వద్ద ముగసింది. -
మరిన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్లు!
- వ్యాపార విస్తరణకు సంస్థల అడుగులు - ప్రాతీయ మార్కెట్‌పై దృష్టి - సంప్రదాయ రూట్లో పీవీఆర్, ఐనాక్స్ - భారీ డీల్స్‌తో పెరుగుతున్న కార్నివాల్ సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీతో సినిమా ప్రొడక్షన్ వ్యయం తగ్గింది. దీనికి తగ్గట్టే సినిమాల నిర్మాణం పెరిగింది. దీంతో ప్రాంతీయ భాషా చిత్రాల సంఖ్యలోనూ వృద్ధి కనిపిస్తోంది. వీటన్నిటికీ తోడు ఇపుడు ఏ సినిమా అయినా సాధారణంగా రెండు మూడు భాషల్లో విడుదలవుతోంది. ఇవన్నీ కలిసి సినిమా థియేటర్లకు గిరాకీ పెంచుతున్నాయి. సరిగ్గా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే మల్టీప్లెక్స్‌లు భారీ విస్తరణకు ప్రణాళికలు వేస్తున్నాయి. సినిమాల సంఖ్యకు తగ్గట్టుగా థియేటర్లు పెరగటం లేదని, ఈ లోటును భర్తీ చేయటానికి తాము ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాలపై దృష్టి సారిస్తున్నామని మల్టీప్లెక్స్ సంస్థలు చెబుతున్నాయి. ఇపుడు ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో మాల్స్ కూడా భారీగా వస్తుండటంతో థియేటర్లు ఏర్పాటు చేయటమూ వాటికి పెద్ద కష్టం కావటం లేదు. ప్రాంతీయ మార్కెట్‌పై మల్టీప్లెక్స్‌ల కన్ను భవిష్యత్తు అవకాశాలన్నీ ప్రాంతీయ మార్కెట్లోనే ఉన్నాయని భావిస్తున్న మల్టీప్లెక్స్ సంస్థలు.. తమ దృష్టిని జాతీయ మార్కెట్ నుంచి ప్రాంతీయ మార్కెట్‌పైకి మళ్లిస్తున్నాయి. ‘‘దేశంలో అధిక సంఖ్యలో చిన్న చిన్న పట్టణాలున్నాయి. వీటిల్లో సినిమాలను వీక్షించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకని మల్టీప్లెక్స్ థియేటర్ సంస్థలు ఈ పట్టణాలపై దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది’’ అనేది మల్టీప్లెక్స్ వ్యాపారంలో అత్యధిక వాటా కలిగి ఉన్న పీవీఆర్ గ్రూప్ అభిప్రాయం. ఎక్కువ థియేటర్లున్న ఐనాక్స్, సినీ పోలిస్, కార్నివాల్ సినిమాస్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే బావుంటుందన్నది సంస్థ అభిప్రాయం. పెరగనున్న మల్టీప్లెక్స్ స్క్రీన్లు: నిజానికి ఇప్పటిదాకా పీవీఆర్, సినీ పోలిస్లు సంప్రదాయ విస్తరణపైనే (మల్టీప్లెక్స్ స్క్రీన్ల నిర్మాణం) ఎక్కువ దృష్టి కేంద్రీకరించాయి. అంతే తప్ప వేరే సంస్థను కొనుగోలు చేయటం వంటివేమీ చేయలేదు. పీవీఆర్ గత రెండేళ్ల నుంచీ ఏడాదికి 70-75 స్క్రీన్లను పెంచుకుంటూ వెళుతోంది. ఇపుడు ఈ సంఖ్యను 100కు చేర్చే యోచనతో ఉంది. ‘‘దేశంలో సినిమా ప్రదర్శనలో మార్పులు జరుగుతున్నాయి. ఈ సమయంలో సంప్రదాయక విస్తరణ అత్యవసరం. దీనివల్ల కొత్త స్క్రీన్లు వస్తాయి. కార్నివాల్ సంస్థ విస్తరణను స్వాగతిస్తున్నాము. కానీ దీనివల్ల మల్టీప్లెక్స్ స్క్రీన్ల సంఖ్యలో ఎలాంటి మార్పూ ఉండదు. మారింది కేవలం మల్టీప్లెక్స్‌ల ముందు బ్యానర్ మాత్రమే’’ అని పీవీఆర్ గ్రూప్ పేర్కొంది. కార్నివాల్ సంస్థ ఇటీవల రిలయన్స్ మీడియా వర్క్స్‌కు చెందిన ‘బిగ్ సినిమాస్’లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి ఆ సంస్థను చేజిక్కించుకుంది. దీనివల్ల బిగ్ సినిమాస్ థియేటర్లన్నీ ఇకపై కార్నివాల్ సినిమాస్‌గా మారతాయని, అంతేతప్ప కొత్తగా స్క్రీన్లు పెరగటం వంటిది జరగదనేది పీవీఆర్ అభిప్రాయం. మరో అగ్రశ్రేణి సంస్థ సినీపోలిస్ కూడా మల్టీప్లెక్స్ స్క్రీన్ల సంఖ్యను మరో 60కి పెంచటానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ‘‘దేశంలో మల్టీప్లెక్స్ పరిశ్రమ మరింత విస్తరించే అవకాశాలున్నాయి. ఫన్ సినిమాతో ఒప్పందం చేసుకునేదాకా మేం ఒంటరిగానే వ్యాపార విస్తరణను చేపట్టాం. ప్రస్తుతం దేశంలో చాలా చైన్ మల్టీప్లెక్స్‌లు మావే. సంప్రదాయక విస్తరణపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాం. ఉనికి, లాభదాయకతపైనే వ్యాపార వృద్ధి అధారపడి ఉంటుంది’’ అని గ్రూప్ అభిప్రాయపడింది. ఈ ఏడాది కార్నివాల్ కూడా తన స్క్రీన్ల సంఖ్యను 500కు పెంచటానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ సంస్థలు కొత్త స్క్రీన్లను మొదట కోల్‌కతా, తర్వాత బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీలలో నిర్మించనున్నాయి. మనకు థియేటర్ల సంఖ్య సమస్యేనా? ‘‘సినిమాల సంఖ్య పరంగా చూస్తే మనకు ఎలాంటి సమస్యా లేదు. ఎందుకంటే దేశంలో ఏటా 1000కి పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. సంవత్సరానికి 4 బిలియన్ల టికెట్లను విక్రయిస్తున్నాం. మనకు ఉన్న సమస్యల్లా వాటి ప్రదర్శనకు తగినన్ని థియేటర్లు లేకపోవటమే’’ అనేది ఐనాక్స్ గ్రూప్ మాట. 10 లక్షల జనాభాకు మనం 9 స్క్రీన్లను (2 మల్టీప్లెక్స్‌లు) మాత్రమే కలిగి ఉంటే చైనా 25 స్క్రీన్లను కలిగి ఉందని సంస్థ వెల్లడించింది. మన దేశంలోని మొత్తం మల్టీప్లెక్స్ స్క్రీన్లు 2,050 మాత్రమే. -
ఎస్బీఐ ఫాలో ఆన్ ఆఫర్ త్వరలో?
రూ.15,000 కోట్ల సేకరణపై దృష్టి ముంబై: వ్యాపార విస్తరణకు కావలసిన మూల ధన సేకరణపై దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దృష్టి సారించింది. ఇందులో భాగంగా రూ.15,000 కోట్లు సమీకరించడానికి బోర్డు ఆమోదించింది. ఇదే విషయాన్ని ఎస్బీఐ మంగళవారం ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఈ అదనపు మూలధనాన్ని సమీకరించడానికి ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూకు (ఎఫ్‌పీఓ) రావటం, లేదా ప్రైవేట్ ప్లేస్మెంట్ చేయటం, ఇవి కాని పక్షంలో రైట్స్, క్విప్ ఇష్యూలు చేయటం వంటి మార్గాలను పరిశీలిస్తున్నట్లు బ్యాంకు తెలియజేసింది. గతేడాది జనవరిలో ఎస్బీఐ రూ.8,032 కోట్లు సమీకరించించి. ఈ ఇష్యూకి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ) నుంచి అంతగా స్పందన లేకపోవడంతో ఇష్యూలో 40 శాతాన్ని దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ సబ్‌స్క్రైబ్ చేసింది. కానీ ఇప్పుడు మార్కెట్ పరిస్థితులు పూర్తిగా మారాయి. ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున సెంకడరీ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేస్తుండటంతో ఈసారి ఇష్యూకి పెద్ద ఎత్తున స్పందన వచ్చే అవకాశం ఉందనేది మార్కెట్ వర్గాల అంచనా. ప్రస్తుతం ఎస్బీఐలో ప్రభుత్వ వాటా 58.6%. పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 52% వరకు తగ్గించుకోవడానికి అనుమతిస్తామని కేంద్రం ప్రకటించిన తర్వాత వస్తున్న మొదటి ఇష్యూ ఇదే. 2018-19 నాటికి దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకులు బాసెల్-3 నిబంధనలను చేరుకోవడానికి రూ.1.5-2.2 లక్షల కోట్ల మూలధనం అవసరమవుతుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. -
ఉందిలే మంచికాలం..!
దేశంలో ఉద్యోగ మార్కెట్ ముఖ చిత్రం మారబోతోంది. కంపెనీలు వ్యాపార విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వడం.. విదేశాల్లో కార్యకలాపాలను ప్రారంభించడానికి ఉత్సాహం చూపిస్తుండటం.. ప్రస్తుతం ఉన్న రంగాలతోపాటు నూతన రంగాల్లోకి ప్రవేశించడానికి ప్రణాళికలు రచిస్తుండడం.. వెరసి నిరుద్యోగులకు వరంగా మారనుంది. ఆర్థిక వ్యవస్థలో ఆశాజనక పరిస్థితుల కారణంగా కంపెనీలు తాజా గ్రాడ్యుయే ట్లను నియమించుకోవడంతోపాటు అనుభవం కలిగిన ఉద్యోగు లను మిడిల్ మేనేజ్మెంట్ స్థాయిలో రిక్రూట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వివిధ సర్వేలు అంచనా వేస్తున్నాయి. వివిధ రంగాల కంపెనీలకు నెలవైన మన హైదరాబాద్‌లోనూ యువతకు అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో.. ఉద్యోగాలకు వేదికగా నిలిచే రంగాలు.. ఆయా రంగాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవడానికి మార్గాలపై ప్రత్యేక కథనం.. - ఫైనాన్స్ / అకౌంటింగ్ - సేల్స్ అండ్ మార్కెటింగ్ - హ్యూమన్ రీసోర్సెస్ - బ్యాంకింగ్ ఫైనాన్స్/అకౌంటింగ్ చిన్నాపెద్ద ప్రతి కంపెనీకి ఫైనాన్స/అకౌంటింగ్ విభాగం అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. ఫైనాన్స్/అకౌంటింగ్ రంగంలో నియామక ప్రక్రియ గతేడాది మాదిరిగానే స్థిరంగా ఊర్ధ్వ దిశగా కొనసాగుతోంది. అంతేకాకుండా వేతనాల్లో 18-20 శాతం వృద్ధి చోటుచేసుకునే అవకాశముంది. ముఖ్యంగా బహుళ జాతి సంస్థలు స్థానిక మార్కెట్లోకి ప్రవేశించాలని వ్యూహాలు రచిస్తుండటం, స్వదేశీ కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించడానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో వచ్చే 12 నెలల కాలంలో ఈ రంగంలో అవకాశాలు గణనీయంగా పెరగనున్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. ఇందులో స్థిరపడాలంటే ఎంబీఏ (ఫైనాన్స్) లేదా ఫైనాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఈ రంగంలో రాణించేందుకు సంబంధిత అర్హతలతోపాటు కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. ఫైనాన్షియల్ స్కిల్స్ ఉండి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలున్న మానవ వనరులకు డిమాండ్ అధికంగా ఉంది. మారుతున్న అవసరాలను బట్టి సంస్థను సమర్థంగా నడిపించగలిగే నాయకత్వ లక్షణాలతోపాటు వ్యాపార విస్తరణకు దోహదపడే యువత కు ఈ రంగం స్వాగతం పలుకుతోంది. సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏటా స్థిరంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్న రంగం.. సేల్స్ అండ్ మార్కెటింగ్. ఈ విభాగంలోని రిటైల్, హెల్త్‌కేర్, లైఫ్ సెన్సైస్ రంగాలు 12 శాతం వృద్ధిని సాధించాయి. దీంతో ఈ రంగానికి సంబంధించిన కార్యకలాపాలను మెట్రోసిటీల నుంచి చిన్న పట్టణాలకు సైతం విస్తరించడానికి సదరు సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. దాని ఫలితమే మనకు కనిపిస్తున్న సూపర్ మార్కెట్ చైన్లు, బ్రాండెడ్ ఫార్మసీ అవుట్లెట్లు. వీటికి వినియోగదారుల నుంచి నుంచి పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. దాంతో విస్తరణకు మార్గం చూపే ఏ చిన్న అవకాశాన్నీ ఈ సంస్థలు వదులుకోవడం లేదు. ఫలితంగా వాటిని నిర్వహించే మేనేజర్/ఫ్లోర్ మేనేజర్ నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ వరకు ఎన్నో అవకాశాలను యువత అందిపుచ్చుకోవచ్చు. ఈ రంగంలో స్థిరపడాలంటే.. డిగ్రీ, లేదా మార్కెటింగ్‌లో ఎంబీఏ చేసి ఉండాలి. వినియోగదారులతో నేరుగా సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది కాబట్టి సృజనాత్మక ఆలోచనలు, కమ్యూనికేషన్ స్కిల్స్, సందర్భానుసారంగా నిర్ణయం తీసుకునే చాతుర్యం, మార్కెటింగ్ వ్యూహాలను పసిగట్టే నేర్పు ఉన్న నిపుణులకు డిమాండ్ అధికంగా ఉంటోంది. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) రంగంలో లెక్కకు మించిన అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. హ్యూమన్ రీసోర్సెస్ ప్రతి కంపెనీకి హ్యూమన్ రీసోర్సెస్ విభాగం తప్పనిసరి. ఎందుకంటే.. నియామకాలు, శిక్షణ, పేరోల్స్ తయారీ వంటి వ్యవహారాలను పక్కాగా నిర్వహించాల్సింది ఈ విభాగమే! కాబట్టి హ్యూమన్ రీసోర్సెస్ రంగంలో మానవ వనరుల అవసరం ఎప్పుడూ అధికంగానే ఉంటోంది. ఈ రంగంలో నియామకాలు గతేడాది కాలంగా ఆశాజనకంగా ఉన్నాయని, హైరింగ్ మరింత ఊపందుకునే పరిస్థితి కనిపిస్తోందని రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి. పని చేస్తున్న ప్రదేశం, త దితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఉద్యోగుల వేతనాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హ్యూమన్ రిసోర్సెస్ రంగంలో స్థిరపడాలంటే.. సంబంధిత విభాగంలో ఎంబీఏ/ఎంఏ/ఎంఎస్సీ/పీజీడీఎం వంటి కోర్సులు చేసి ఉండాలి. అంతేకాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ ఆపరేటింగ్, వివిధ వ్యవహారాలను మార్కెట్లోకి కొత్తగా వస్తున్న సాఫ్ట్వేర్ల సహాయంతో నిర్వహించే నేర్పు ఉండాలి. ఎక్కువ వేతనం పొందాలంటే మాత్రం కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి. బ్యాంకింగ్ కొంతకాలంగా నియామకాల విషయంలో అన్ని రంగాల కంటే ముందంజలో నిలుస్తోంది.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం. ముఖ్యంగా నూతనంగా బ్యాంకుల ఏర్పాటు కోసం లెసైన్స్‌లను మంజూరు చేయడం, విదేశీ పెట్టుబడిదారులు స్థానిక మార్కెట్‌పై దృష్టిసారించడం వంటివి ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. దాంతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, పలు ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా రిక్రూట్మెంట్లకు తె రదీస్తున్నాయి. స్థానిక బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులు పెరగడం కూడా హైరింగ్ ప్రక్రియ జోరుగా మారడానికి ఒక కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. 25 నుంచి 33 శాతం అధిక పే ప్యాకేజ్లతో కొత్తగా సిబ్బందిని నియమించుకోవడానికి సంబంధిత సంస్థలు ఉత్సాహం చూపిస్తున్నాయి. కాబట్టి హైరింగ్‌కు సంబంధించి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగం రోజురోజుకూ ఆశాజనకంగా మారుతోంద ని చెప్పొచ్చు. ఈ రంగంలో స్థిరపడాలంటే బ్యాంకింగ్/ ఫైనాన్షియల్ సబ్జెక్ట్‌లు ప్రధానంగా ఎంబీఏ/ఎంకామ్/ ఎంఏ/ఎంఎస్సీ/ పీజీడీఎం/డిప్లొమా వంటి కోర్సులను పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు మార్కెట్లను విశ్లేషించడం, తదనుగుణంగా వ్యూహాలను రూపొందించడం, తార్కిక వివేచన వంటి నైపుణ్యాలు ఉంటే కెరీర్లో త్వరగా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. నైపుణ్యాలపై ప్రధాన దృష్టి: కే వలం ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడానికే పరిమితం కాకుండా.. వారిని మరింత సమర్థులుగా, నాయకులుగా తీర్చిదిద్దడానికి వీలుగా శిక్షణ కార్యక్రమాలను చేపట్టడానికి కంపెనీలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికేతర (నాన్ ఫైనాన్షియల్) రంగంలో ఈ విషయానికి పెద్దపీట వేస్తున్నారు. తద్వారా ఉద్యోగి ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు దీర్ఘకాలంపాటు సేవలు అందించే అవకాశం ఉంటుందని కూడా కంపెనీలు భావిస్తున్నాయి. అంతేకాకుండా వ్యాపారాన్ని విస్తరించినప్పుడు కొత్తవారి రిక్రూట్మెంట్ కంటే సొంత ఉద్యోగులను మిడిల్ మేనేజ్మెంట్ నిపుణులుగా తీర్చిదిద్దడమే మేలని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. వయా సోషల్ మీడియా: జాబ్ మార్కెట్లో అవకాశాలను అందుకోవాలంటే.. మారుతున్న టెక్నాలజీని తెలివిగా ఉయోగించుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే బహుళ జాతి కంపెనీలు సంప్రదాయ విధానాల కంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్‌ను హైరింగ్ కోసం విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. స్వల్ప సమయంలో తక్కువ ఖర్చుతో ప్రతిభావంతులను ఆకర్షించే, గుర్తించే సులువైన మాధ్యమం సోషల్ మీడియా అని భావిస్తున్నాయి. దాంతో అన్ని రంగాలకు చెందిన కంపెనీల హెచ్ఆర్ విభాగంలో ‘సోషల్ రిక్రూట్మెంట్’ కొత్తగా చోటు సంపాదించుకుంది. కంపెనీలో ప్రస్తుత ఖాళీల వివరాలను తెలియజేస్తూ.. అర్హతలు, కావల్సిన నైపుణ్యాలు, తదితర వివరాలను పోస్ట్ చేస్తున్నారుు. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్‌పై యువత వెచ్చిస్తున్న సమయం కూడా కంపెనీలు ఈ మాధ్యమం ద్వారా నియామకాలు చేపట్టడానికి కారణమవుతోంది. కాబట్టి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్‌లో ప్రొఫైల్స్‌ను జాగ్రత్తగా నిర్వహించాలి. ఫేస్బుక్, లింకిడ్ఇన్, గూగుల్‌ప్లస్, మైస్పేస్, స్కిల్‌పేజెస్ వంటి సైట్లు ఈ విషయంలో ముందుంటున్నాయి. గమనించాల్సినవి - అన్ని రంగాల్లో ప్రారంభంలో వేతనాలు సంవత్సరానికి రూ. 2 లక్షలపైనే ఉంటాయి. - నైపుణ్యాలకనుగుణంగా వేతనాలు, కెరీర్లో ఉన్నతి ఉంటుంది. - సంప్రదాయ విధానాల కంటే అవసరాలకనుగుణంగా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలి. - సామాజిక మాధ్యమాల(సోషల్ నెట్వర్కింగ్ సైట్స్)ను ఉద్యోగాన్వేషణకు ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. - అవకాశాలన్నీ మార్కెటింగ్‌తో ముడిపడి ఉంటాయి కాబట్టి మార్కెట్లో మార్పులను అంచనా వేసుకుంటూ తదనుగుణంగా ప్రణాళికలు రచించే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. -
బీమాపై అన్ని రంగాలవారికీ ఆసక్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ బీమా రంగంలో అపారమైన అవకాశాలున్నాయని, వ్యాపార విస్తరణకు, మూలధనం పెంపునకు ఎటువంటి సంబంధం లేదని బీమా నియంత్రణ అభివృద్ధి మండలి(ఐఆర్డీఏ) చైర్మన్ టి.ఎస్ విజయన్ అన్నారు. మూల ధనం పెంచుకున్నంత మాత్రాన పెరుగుతుందని లేదని, చాలా కాలంపాటు ఎల్ఐసీ కేవలం రూ. 5 కోట్ల మూలధనంతోనే వ్యాపారం భారీ వ్యాపారం నమోదు చేసిందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐల వాటాను 49 శాతానికి పెంచిన విషయంపై ఆయన మాట్లాడుతూ ఎంతో కీలకమైన రక్షణరంగంలోనే ఎఫ్‌డీఐలకు అనుమతించినా అంతగా పట్టించుకోని వారు సైతం బీమా రంగంలో ఎఫ్‌డీఐ పెంపుపై మాత్రం అమితాసక్తిని చూపిస్తున్నారన్నారు. ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మూల ధనం పెంచుకోవడం కన్నా సరైన మార్కెటింగ్, నిపుణులైన సిబ్బంది అవసరం అని విజయన్ పేర్కొన్నారు. నాలుగేళ్లుగా బీమా రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా, ఈ రంగంలో పెట్టుబడులు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్‌మేనేజ్‌మెంట్(ఐఐఆర్ఎం) తొమ్మిదవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విజయన్ మాట్లాడుతూ జన ధన యోజన పథకం విజయవంతం కావడానికి ఉచిత బీమా ఆఫరు కూడా ఒక కారణమన్నారు. అందరికీ ఒకే రకమైన పథకాలు కాకుండా ఎవరి అవసరాలకు అనుగుణంగా వారికోసం ప్రత్యేక పథకాలను రూపొం దించినప్పుడే విజయం సాధిం చగలరని, ఈ అంశంపై బీమా కంపెనీలు దృష్టిసారించాలని కోరారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జీవిత బీమా వ్యాపారంలో 15% వృద్ధి నమోదైందని, రానున్న కాలంలోనూ ఇదే విధమైన వృద్ధి కొనసాగగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) ఎండీ,సీఈవో చిత్రా రామకృష్ణ మాట్లాడుతూ బీమా సాంద్రత, అధిక జనాభా వంటి అన్ని గణాంకాలు ఈ రంగ వృద్ధికి అనుకూలంగానే ఉన్నాయన్నారు. ఐఐఆర్ఎం డిప్లొమో కోర్సుల్లో అత్యధిక మార్కులు పొందిన సౌమ్య కుప్పిలి, ఆర్. చారులతలకు చిత్రా రామకృష్ణ, విజయన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్‌తో పాటు లక్ష రూపాయల అవార్డును అందచేశారు.