హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ బీమా రంగంలో అపారమైన అవకాశాలున్నాయని, వ్యాపార విస్తరణకు, మూలధనం పెంపునకు ఎటువంటి సంబంధం లేదని బీమా నియంత్రణ అభివృద్ధి మండలి(ఐఆర్‌డీఏ) చైర్మన్ టి.ఎస్ విజయన్ అన్నారు. మూల ధనం పెంచుకున్నంత మాత్రాన పెరుగుతుందని లేదని, చాలా కాలంపాటు ఎల్‌ఐసీ కేవలం రూ. 5 కోట్ల మూలధనంతోనే వ్యాపారం భారీ వ్యాపారం నమోదు చేసిందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.
బీమా రంగంలో ఎఫ్‌డీఐల వాటాను 49 శాతానికి పెంచిన విషయంపై ఆయన మాట్లాడుతూ ఎంతో కీలకమైన రక్షణరంగంలోనే ఎఫ్‌డీఐలకు అనుమతించినా అంతగా పట్టించుకోని వారు సైతం బీమా రంగంలో ఎఫ్‌డీఐ పెంపుపై మాత్రం అమితాసక్తిని చూపిస్తున్నారన్నారు. ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మూల ధనం పెంచుకోవడం కన్నా సరైన మార్కెటింగ్, నిపుణులైన సిబ్బంది అవసరం అని విజయన్ పేర్కొన్నారు. నాలుగేళ్లుగా బీమా రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా, ఈ రంగంలో పెట్టుబడులు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన చెప్పారు.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్‌మేనేజ్‌మెంట్(ఐఐఆర్‌ఎం) తొమ్మిదవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విజయన్ మాట్లాడుతూ జన ధన యోజన పథకం విజయవంతం కావడానికి ఉచిత బీమా ఆఫరు కూడా ఒక కారణమన్నారు. అందరికీ ఒకే రకమైన పథకాలు కాకుండా ఎవరి అవసరాలకు అనుగుణంగా వారికోసం ప్రత్యేక పథకాలను రూపొం దించినప్పుడే విజయం సాధిం చగలరని, ఈ అంశంపై బీమా కంపెనీలు దృష్టిసారించాలని కోరారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జీవిత బీమా వ్యాపారంలో 15% వృద్ధి నమోదైందని, రానున్న కాలంలోనూ ఇదే విధమైన వృద్ధి కొనసాగగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ) ఎండీ,సీఈవో చిత్రా రామకృష్ణ మాట్లాడుతూ బీమా సాంద్రత, అధిక జనాభా వంటి అన్ని గణాంకాలు ఈ రంగ వృద్ధికి అనుకూలంగానే ఉన్నాయన్నారు. ఐఐఆర్‌ఎం డిప్లొమో కోర్సుల్లో అత్యధిక మార్కులు పొందిన సౌమ్య కుప్పిలి, ఆర్. చారులతలకు చిత్రా రామకృష్ణ, విజయన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్‌తో పాటు లక్ష రూపాయల అవార్డును అందచేశారు.
బీమాపై అన్ని రంగాలవారికీ ఆసక్తి
Published Thu, Sep 4 2014 12:54 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
Advertisement