బీమా ఐపీవోలకు త్వరలో కొత్త మార్గదర్శకాలు
ఐఆర్‌డీఏ చీఫ్ టీఎస్ విజయన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెట్టుబడి పరిమితులను సడలించిన అనంతరం బీమా రంగ సంస్థల్లోకి సుమారు రూ. 15 వేల కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ చైర్మన్ టీఎస్ విజయన్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం హెల్త్, నాన్-లైఫ్ బీమా విభాగాలు సుమారు 14 శాతం, జీవిత బీమా విభాగం 12% వృద్ధి నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
బీమా సంస్థల ఐపీవోలకు సంబంధించి త్వరలో సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశమున్నట్లు బుధవారమిక్కడ ఐఐఆర్‌ఎఫ్‌ఏ వార్షిక సదస్సు వివరాల వెల్లడికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విజయన్ తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సంస్థలు ఐపీవో యోచనలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నెల 26 నుంచి ఐఐఆర్‌ఎఫ్‌ఏ సదస్సు..
మరోవైపు, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ రేట్‌మేకింగ్ ఫోరం ఆఫ్ ఏషియా (ఐఐఆర్‌ఎఫ్‌ఏ) వార్షిక సదస్సును ఈ ఏడాది హైదరాబాద్‌లో మే 26,27 తారీఖుల్లో నిర్వహించనున్నట్లు ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సీఈవో ఆర్ రాఘవన్ తెలిపారు. భారత్ సహా జపాన్, థాయ్‌లాండ్ తదితర ఏడు సభ్య దేశాలకు చెందిన సుమారు 200 మంది పైగా ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని వివరించారు.
బీమా రంగానికి డేటా సేకరణ, విశ్లేషణ కీలకంగా మారిన నేపథ్యంలో ఆయా దేశాల బీమా రంగ తీరుతెన్నులను తెలుసుకునేందుకు ఈ సదస్సు తోడ్పడగలదన్నారు. ప్రధానంగా వివిధ రిస్కుల ప్రాతిపదికగా ప్రీమియంల నిర్ణయానికి తోడ్పడే రేట్‌మేకింగ్.. అనలిటిక్స్, కొంగొత్త టెక్నాలజీలు మొదలైన వాటిపై సదస్సులో చర్చించడం జరుగుతుందని రాఘవన్ చెప్పారు.