సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం నుంచి ఎగుమతుల వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు కార్యకలాపాలను విస్తృతం చేయాలని తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇన్నాళ్లూ ఎగుమతుల వాణిజ్యంపై ఎగుమతిదారులు, ఉత్పత్తిదారులు, పారిశ్రామికవేత్తల కోసం ఎగ్జిబిషన్లు, వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహించిన టీఎస్‌టీపీసీ మౌలిక వసతుల కల్పనపైనా దృష్టి సారిస్తోంది. కంటెయినర్ ఫ్రైట్ స్టేషన్లు, ఇన్‌లాండ్ కంటెయినర్ డిపోలు, కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లు, వేర్ హౌజ్‌లు తదితరాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటితో పాటు ట్రక్ పార్కింగ్ టెర్మినళ్లు, ట్రేడ్ ఫెయిర్, ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్లను నిర్మించేందుకు టీఎస్‌టీపీసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
రూ.13 కోట్లతో కంటెయినర్ ఫ్రైట్ స్టేషన్
హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాలకు చెందిన వాణిజ్య, పారిశ్రామిక సంస్థల ఎగుమతులు, దిగుమతుల కోసం శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో మామిడిపల్లి వద్ద కంటెయినర్ ఫ్రైట్ స్టేషన్‌ను నిర్మించారు. రూ.13 కోట్లతో 7.10 ఎకరాల్లో నిర్మించిన ఈ ఫ్రైట్ స్టేషన్ నిర్వహణ కోసం ఓపెన్ టెండర్ విధానంలో ఏజెన్సీని ఎంపిక చేయాల్సి ఉంది. వరంగల్‌లో 30 ఎకరాల విస్తీర్ణంలో ట్రేడ్ ఫెయిర్ కాంప్లెక్సు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నా, భూ కేటాయింపు ప్రతిపాదన కలెక్టర్ వద్ద పెండింగులో ఉంది.
150 ఎకరాల్లో లాజిస్టిక్ పార్కులు
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో సుమారు 150 ఎకరాల్లో నాలుగు భారీ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు బాధ్యతను నాలుగు ప్రైవేటు సంస్థలకు టీఎస్‌టీపీసీ అప్పగించింది. జీఎంఆర్, ఎంబసీ, హెచ్‌డీఎంఏ ప్రైవేట్ లిమిటెడ్, టీవీఎస్ లాజిస్టిక్ సంస్థల ఆధ్వర్యంలో లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇదిలాఉంటే హైదరాబాద్‌లో ట్రేడ్ సెంటర్, వరంగల్‌లో ట్రేడ్ ఫేర్ కాంప్లెక్సు, ప్యాక్ హౌజ్‌లు, పీక్యూ ల్యాబ్‌లు, వేపర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు తదితర ప్రాజెక్టుల సవివర నివేదికలు (డీపీఆర్) రూపొందించే బాధ్యతను గ్రాంట్ థార్న్‌టన్ కన్సల్టెన్సీకి టీఎస్‌టీపీసీ అప్పగించింది. వాణిజ్య ఎగుమతులు ప్రోత్సహించేందుకు టీఎస్‌టీపీసీ ప్రతిపాదనలను వీలైనంత త్వరగా అమలయ్యేలా చూస్తామని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment