సాక్షి, హైదరాబాద్: దేశం నుంచి జరిగే సరుకులు, సేవల ఎగుమతుల్లో తెలంగాణ వాటా 3 శాతమని.. అన్నిరకాల సదుపాయాలను మెరుగుపర్చుకోవడం ద్వారా రాష్ట్రం తన వాటాను పెంచుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పారిశ్రామికవేత్తలు ఎగుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ‘ఇండియా–యూఏఈ, ఇండియా– ఆస్ట్రేలియాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై భాగస్వాముల అవగాహన’కార్యక్రమం జరిగింది.
రాష్ట్రంలోని పరిశ్రమలు, ఎగుమతిదారులకు.. సూక్ష్మ–చిన్న–మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు ఈ ఒప్పందాలతో లభించే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు దీనిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పారిశ్రామిక ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోందని తెలిపారు. తెలంగాణ పరిశ్రమలు, ఎగుమతిదారులు కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ సౌకర్యాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కాగా.. ఫార్మాస్యూటికల్స్, లెదర్, రత్నాలు–ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల వంటి రంగాలలో ఎగుమతులకు తెలంగాణ కేంద్రంగా మారే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జిల్లాస్థాయి ఎగుమతి ప్రోత్సాహక మండళ్ల ఏర్పాటును ప్రశంసించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నతాధికారులు, 150 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment