న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 6 శాతం వృద్ధితో రూ. 1,066 కోట్లను తాకింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు తోడ్పడింది.
గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,007 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,533 కోట్ల నుంచి రూ. 10,483 కోట్లకు బలపడింది. ఈ కాలంలో 15.2 లక్షల మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను విక్రయించింది. గత క్యూ2లో 14.16 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి.
మూడు మోడళ్లు రెడీ...
క్యాష్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా పటిష్ట క్యాష్‌ఫ్లోను సాధిస్తున్నామని, దీంతో ఆర్థికంగా మరింత బలపడుతున్నట్లు కంపెనీ సీఈవో నిరంజన్ గుప్తా పేర్కొన్నారు. ఎంట్రీ, డీలక్స్ విభాగాల్లో మరిన్ని బ్రాండ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. తద్వారా ప్రీమియం విభాగంలో పటిష్ట పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకుంటున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: కేటీఎం దూకుడు.. ఒకేసారి మార్కెట్లోకి 10 కొత్త బైక్‌లు
రానున్న ఆరు నెలల్లో ఎక్స్‌పల్స్ 210, ఎక్స్‌ట్రీమ్ 250ఆర్, కరిజ్మా ఎక్స్‌ఎంఆర్ 250 బైకులను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఏడాది చివరికల్లా ప్రీమియా విభాగంలో 100 స్టోర్లను అధిగమించనున్నట్లు తెలియజేశారు. హీరో మోటో షేరు బీఎస్‌ఈలో 2% బలపడి రూ. 4,604 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment