ఇప్పుడు ఏ షేర్లు బెటర్? | Now Which Better shares | Sakshi
Sakshi News home page

ఇప్పుడు ఏ షేర్లు బెటర్?

Published Sun, Aug 30 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

ఇప్పుడు ఏ షేర్లు బెటర్?

ఇప్పుడు ఏ షేర్లు బెటర్?

గత సోమవారం... సెన్సెక్స్ ఏకంగా 1600 పైచిలుకు పాయింట్లు నష్టపోయింది. రూ. 7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద చూస్తుండగానే గాల్లో కలిసిపోయింది. ఆ మర్నాడు 300 పైచిలుకు పాయింట్లు పెరిగినప్పటికీ... బుధవారం మళ్లీ పెరిగిందంతా పడిపోయింది. మళ్లీ వారాంతంలో 500 పాయింట్లపైన పెరిగి కాస్త ఊరటనిచ్చింది. సరే! ఇదంతా బాగానే ఉంది. మరి ఇలా దారుణంగా పతనమవుతూ... అంతలోనే పెరుగుతూ... అసలు ఏమవుతుందో తెలియని అనిశ్చితిలో మార్కెట్లుంటే సామాన్య మదుపరుల సంగతేంటి? ఈ అయోమయంలో అసలు స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు సురక్షితమేనా... కాదా? ఒకవేళ మార్కెట్ ఎటు నుంచి ఎటు తిరిగినా తమ పెట్టుబడి సురక్షితంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఎలాంటి షేర్లు ఎంచుకోవాలి? ఆ షేర్లు ఎంచుకోవటానికి ఏఏ అంశాలు చూడాలి? వీటన్నిటిపై పలువురు మార్కెట్ నిపుణులను ‘సాక్షి’ ప్రాఫిట్ ప్రతినిధులు సంప్రదించారు. వారిచ్చిన సూచనల మేరకు అందిస్తున్న ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం...
 
- ఈ పతనంలో లాభాన్నిచ్చేవీ  ఉంటాయి
- కొనే ముందు ఐదంశాలు తప్పక చూడాలి
- మరింత పడిపోకుండా ఉండేవి గమనించాలి
- ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ నిపుణుల సూచనలు

 
(సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం)
గతవారంతో పోలిస్తే మార్కెట్లిపుడు కాస్త తగ్గే ఉన్నాయి. అందుకని చక్కని లాభం ఇచ్చే అవకాశమున్న షేర్లవంక చూస్తే ఇబ్బంది లేదు. నిజానికి మార్కెట్లు బాగా పడిపోతున్నపుడు కొనే అవకాశాన్ని చాలామంది కోల్పోతూనే ఉంటారు. ఎందుకంటే మార్కెట్లు ఎంతవరకూ పడతాయన్నది తెలియకపోవటం... ఇంకా పడతాయేమోనని ఎదురుచూడటం సహజం. అయితే ఇలా పడి... పెరిగిన తరవాత కూడా చాలా షేర్లు అంతకు ముందటి ధరలతో పోలిస్తే చౌకగానే దొరుకుతాయన్నది గ్రహించాలి. మనం చేయాల్సిందల్లా వీటిలో బాగా పెరిగే అవకాశమున్న వాటిని గుర్తించటమే!! మరి గుర్తించేదెలా..?
 
ఆత్మస్థయిర్యం అవసరం...
మార్కెట్లు బాగా పడుతున్నపుడు ఏ షేరైనా కొనాలంటే చాలా ధైర్యం కావాలి. సెన్సెక్స్ సోమవారం 1,600 పాయింట్లపైగా... బుధవారం మరో 400 పాయింట్లపైగా పడింది. అలాంటపుడు షేర్లు కొనాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఇంకా పడుతుందేమోననే భయాన్ని జయించాలి కనక. ఇక వారాంతంలో కొంత పెరిగి... ప్రస్తుతానికి మార్కెట్లు సెటిలైనట్లే కనిపిస్తున్నాయి. మార్కెట్లు స్థిరపడినా, స్థిరపడకపోయినా కూడా పెట్టిన పెట్టుబడికి ఇబ్బంది లేని, దీర్ఘకాలంలో లాభాలిచ్చే షేర్లను ఎంచుకోవటమే ఈ సమయంలో మంచిదన్నది నిపుణుల సూచన. నిజానికి మార్కెట్లు బాగా పడ్డాక మంచి షేర్లను ఎంచుకోవాలంటే పలు మార్గాలున్నాయి. నిజానికి తాజా పతనం... మళ్లీ ఎగియటం వంటి సందర్భాల్లో ఇంతకుముందు ఫేవరెట్లుగా ఉన్నవే మళ్లీ పెరుగుతాయి. వీటిని కొనటం సురక్షితమే. కాకపోతే రిస్క్-రివార్డ్ నిష్పత్తిని చూడాలి. బాగా తగ్గి, తక్కువ ధరలో ఉన్నవి కొంటే... ఒకవేళ మళ్లీ మార్కెట్ పడినా వీటి పతనం మాత్రం తక్కువే ఉంటుందన్నది గమనించాలి. వీటిని గుర్తించడానికి చూడాల్సిన అంశాలివీ...
 
1. వాల్యుయేషన్లు

విలువ పరంగా బాగా తగ్గి ఉన్నవాటిని ఎంచుకోవటం మంచిదే. ఎందుకంటే తాజా పతనం తరవాత ఫ్రంట్‌లైన్, మిడ్‌క్యాప్ షేర్లలో చాలావరకూ ఆకర్షణీయమైన విలువల్లో దొరుకుతున్నాయి. ఇవి వాటి దీర్ఘకాలిక సగటుకన్నా తక్కువగా కూడా ఉన్నాయి. బహుశా! కొన్ని కనిష్ట స్థాయిల వద్దే ఉన్నాయని భావించవచ్చు. వీటిలో భవిష్యత్తులో పటిష్ఠమైన వృద్ధి కనబరిచేవి పెట్టుబడికి చక్కని అవకాశమున్న స్టాక్స్‌గా భావించవచ్చు.
 
2. నగదు నిల్వలు.. పెట్టుబడుల స్థాయి

కంపెనీ తాలూకు నగదు నిల్వలు, పెట్టుబడులు చక్కని సూచికగా పనికొస్తాయి. ఎందుకంటే మార్కెట్లు నిట్టనిలువునా పడినపుడు చాలా కంపెనీల షేర్లు వాటి దగ్గరుండే నగదు, అవి పెట్టిన పెట్టుబడుల విలువకు సమాన స్థాయికి పడిపోతాయి. కొన్ని అంతకన్నా తగ్గుతాయి కూడా. దానర్థం అవి చేసే వ్యాపారాన్ని స్టాక్ మార్కెట్ పరిగణనలోకి తీసుకోలేదన్న మాట. ఇలా నగదు రిజర్వులు, వాటి పెట్టుబడుల హోల్డింగ్స్ మొత్తం విలువకు దగ్గర్లో దాని షేరు విలువ కూడా ఉన్నట్లయితే... అలాంటి వాటిలోకి స్మార్ట్ మనీ ప్రవహిస్తుందనేది కాదనలేని వాస్తవం. ఇలాంటివి చక్కని రివార్డ్‌నిస్తాయని చెప్పొచ్చు.
 
3. డివిడెండ్ ఈల్డ్
కంపెనీలు డివిడెండ్ ఇవ్వటం సర్వసాధారణం. అయితే ఈ డివిడెండ్ ఎంతనేది కాకుండా డివిడెండ్ ఈల్డ్ ఎంతనేది చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకు..
ఎక్స్- కంపెనీ షేరు ధర దాదాపు 2,000 దగ్గర ఉందనుకుందాం. దాని ముఖ విలువ రూ. 10. ఏ కంపెనీ అయినా డివిడెండ్‌ను దాని ముఖవిలువపైనే ప్రకటిస్తుందని గుర్తుంచుకోవాలి. సదరు కంపెనీ 200% డివిడెండ్‌ను ప్రకటించిందనుకోండి. షేరుకు రూ.20 డివిడెండ్ వస్తుంది. అయితే రూ.2,000 వద్ద షేరు కొన్న వ్యక్తికి ఆ రూ. 20  డివిడెండ్ ఎంత శాతం? కేవలం 1%. అదే ఈల్డ్ అన్నమాట.
 వై- కంపెనీ షేరు ముఖ విలువ కూడా పది రూపాయలే. అది రూ.200 వద్ద ట్రేడవుతోందని అనుకుందాం. సదరు కంపెనీ గనక 100 శాతం డివిడెండ్ ఇస్తే షేరుకు రూ.10 వస్తుంది. రూ. 200 పెట్టి కొన్న వ్యక్తికి రూ.10 అంటే... దాదాపు 5 శాతం ఈల్డ్ (రాబడి) వచ్చినట్టన్న మాట. ఈ లెక్కన చూసినపుడు 200 శాతం డి విడెండ్ ఇచ్చిన ఎక్స్ కంపెనీకన్నా 100 శాతం డివిడెండ్ ఇచ్చిన వై కంపెనీయే బెటరని భావించాలి. నిజానికి కొన్ని కంపెనీల డివిడెండ్ ఈల్డ్ 6 నుంచి 10 శాతం మధ్యన కూడా ఉంటుంది. ఇవి క్రమంతప్పకుండా డివిడెండ్ ఇస్తాయి కూడా. బ్యాంకు వడ్డీ కన్నా ఎక్కువ రాబడి రావటంతో పాటు, దీర్ఘకాలంలో షేరు ధర పెరుగుతుంది కనక వీటిద్వారా ఆ రకంగానూ లాభపడవచ్చు.
 
4. ఈ అనిశ్చితి వల్ల లాభమెవరికి?
భవిష్యత్తులో బాగా పెరిగే అవకాశమున్న షేర్లవైపే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు చూస్తుంటారు. ఫండమెంటల్స్ బలంగా ఉండటంతో పాటు భవిష్యత్తు పరిణామాలు అనుకూలంగా ఉన్న షేర్లవైపు ఇలాంటి పతనంలో అంతా చూస్తారు. బ్రోకింగ్ సంస్థ ‘నొముర’ మాటల్లో చెప్పాలంటే... ఇలాంటి పతనాల సమయంలో అలాంటి షేర్లను గుర్తించటానికి ప్రస్తుత పరిణామాలను జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు కమోడిటీ ధరలు బాగా తగ్గి ఉన్నాయి కనక... రూపాయి కూడా పతనమైంది కనక... ఈ రెండు పరిణామాల వల్ల లాభం కలిగే కంపెనీలను గుర్తిస్తే భవిష్యత్తులో వాటి ధర పెరిగి చక్కని రివార్డు వచ్చే అవకాశముంది.
 
5. రిలేటివ్ స్ట్రెంగ్త్...
ఇక చివరిగా చూడాల్సిన షేర్ల విషయానికొస్తే... ఇంతటి మార్కెట్ పతనంలో కూడా బాగా పడిపోకుండా నిలదొక్కుకుని ఉన్నవేంటో చూడాలి. ట్రెండ్‌కు వ్యతిరేకంగా పెరిగిన షేర్లను గమనించాలి. సాధారణంగా ఈ షేర్లను డిఫెన్సివ్ షేర్లుగా పేర్కొంటుంటారు. ఇలాంటి షేర్లు ఒకవేళ అనిశ్చితి కొనసాగినప్పటికీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ బాగా గమనించాల్సిందొకటుంది. కొన్ని చిన్న కంపెనీల షేర్లు చాలావరకూ ప్రమోటర్లు, వారి కనుసన్నల్లో ఉండే బ్రోకర్ల చేతిలోనే ఉంటాయి. అతికొద్ది షేర్లు మాత్రం సాధారణ ఇన్వెస్టర్ల దగ్గరుంటాయి. అలాంటి షేర్లు ఇంతటి పతనంలో కూడా ఎవ్వరూ అమ్మరు కనక పడవు. అలా పడలేదు కాబట్టి అవి మంచి షేర్లనుకోవటం మొదటికే మోసం. అందుకే ఏ షేర్లను ఎంచుకున్నా... అవి ఫ్రంట్‌లైన్, భారీ పరిమాణంలో లావాదేవీలు జరిగే మంచి మిడ్‌క్యాప్ షేర్లయి ఉండాలనేది నిపుణులు చెబుతున్న ప్రధాన నియమం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement