స్టాక్ మార్కెట్‌లో నయా ట్రెండ్
కొత్తగా ప్రతి నాలుగు డీమ్యాట్ అకౌంట్లలో ఒకటి మహిళదే
2021 నుంచి ఏటా 3 కోట్లకుపైగా డీమ్యాట్ ఖాతాలు
ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడుల్లో అత్యధికంగా మహిళా ఇన్వెస్టర్లు
హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్ నగరాల్లో ఎక్కువ ఆసక్తి
2014లో పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.12,068 కోట్ల నిధులు సేకరణ
2024లో రూ.1.60 లక్షల కోట్ల సేకరణ
కోవిడ్ తర్వాత ఇన్వెస్టర్లలో 30 ఏళ్లలోపు వారే ఎక్కువ
మ్యూచువల్ ఫండ్స్‌లో ఏటా రూ.రెండు లక్షల కోట్లకుపైగా ఇన్వెస్ట్‌మెంట్స్
ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: స్టాక్ మార్కెట్లో బుల్ స్వారీ చేయడానికి మహిళా ఇన్వెస్టర్లు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం 2022 తర్వాత ప్రారంభమవుతున్న ప్రతి నాలుగు డిమ్యాట్ అకౌంట్లలో ఒకటి మహిళా ఖాతాగా ఉన్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
2021 నుంచి సగటున ఏటా మూడు కోట్ల ఖాతాలు ప్రారంభమవ్వగా, ఈ ఏడాది ఇప్పటికే నాలుగు కోట్లకు పైగా డిమ్యాట్ ఖాతాలు ప్రారంభం కావడం గమనార్హం. 2014లో దేశం మొత్తం మీద 2.2 కోట్ల ఖాతాలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 17 కోట్లు దాటింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య క్రమేపి పెరుగుతూ వస్తోంది.
2014 ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.12,068 కోట్ల నిధులు సేకరిస్తే, 2024లో రూ.1.60 లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ ద్వారా సేకరించడం గమనార్హం. ఇదే సమయంలో సిప్ విధానం ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఏటా రూ.రెండు లక్షల కోట్లకుపైగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు.
కొత్త ఇన్వెస్టర్లలో హైదరాబాదీలు అధికం
మహిళా ఇన్వెస్టర్ల విషయంలో పెద్ద రాష్ట్రాల్లో ఢిల్లీ 29.8%, మహారాష్ట్ర 27.7%, తమిళనాడు 27.5%తో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. చిన్న రాష్ట్రాలు కూడా కలుపుకుంటే గోవా 32%తో మొదటి స్థానంలో ఉంది. మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా ఉన్నాయి. 2022లో ఏపీలో మొత్తం ఇన్వెస్టర్లలో మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య 19.5% ఉండగా, అది ఇప్పుడు 22.7 శాతానికి పెరిగింది.
మహిళా ఇన్వెస్టర్లు వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండవ స్థానంలో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ 3.7% వృద్ధితో మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 3.2% వృద్ధితో రెండవ స్థానంలో నిలిచింది. కోవిడ్ తర్వాత నుంచి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే 30 ఏళ్లలోపు వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 2018లో మొత్తం ఇన్వెస్టర్లలో 22.9 శాతంగా ఉన్న 30 ఏళ్లలోపు ఇన్వెస్టర్ల సంఖ్య ఇప్పుడు 40 శాతానికి చేరుకుంది.
కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వారిలో అత్యధికంగా హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్ వంటి పట్టణ ఇన్వెస్టర్లు ఉంటున్నట్లు ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment