విదేశీ పెట్టుబడులపై ఇన్వెస్టర్ల దృష్టి
మార్కెట్ల నడకపై నిపుణుల అంచనా
బుధవారం (20న) మార్కెట్లకు సెలవు
ఈ వారం ట్రేడింగ్ 4 రోజులకే పరిమితం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) ఫలితాల సీజన్ ముగింపు దశకు చేరడంతో ఇకపై దేశీ స్టాక్ మార్కెట్లకు అంతర్జాతీయ పరిణామాలే దిక్సూచిగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశీయంగా ప్రభావిత అంశాలు కొరవడటం దీనికి కారణమని తెలియజేశారు. వివరాలు చూద్దాం.
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ క్యూ2 ఫలితాలు దాదాపు ముగియనున్నాయి. దీంతో ఇకపై ఇన్వెస్టర్లు విదేశీ మార్కెట్లు, పెట్టుబడులు, గణాంకాలవైపు దృష్టి సారించనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. బుధవారం(20న) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి.
కొద్ది రోజులుగా మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొంతమేర షార్ట్‌కవరింగ్‌కు వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని తెలియజేశారు. 288మంది సభ్యుల మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీసహా పలు పారీ్టలు ఎన్నికలలో పోటీ పడుతుండటంతో ఫలితాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
యూఎస్ ఎఫెక్ట్
కొత్త ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతోంది. గత వారాంతాన ఒక దశలో 106.66ను తాకింది. దీంతో దేశీ కరెన్సీ బలహీనపడుతూ వస్తోంది. గురువారం(14న) రూపాయి సరికొత్త కనిష్టం 84.41 వద్ద ముగిసింది. దీనికితోడు యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ సైతం మెరుగుపడుతున్నాయి. గత వారం చివర్లో 4.5 శాతానికి చేరాయి.
మరోవైపు చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీస్తోంది. రియల్టీ రంగానికి వెసులుబాటు కల్పించింది. 5.3 ట్రిలియన్ డాలర్ల విలువైన మార్టీగేజ్ రుణ వ్యయాలుసహా.. డౌన్ పేమెంట్‌ను తగ్గించడం వంటి చర్యలు చేపట్టింది. ఈ అంశాల నేపథ్యంలో ఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్ నుంచి విదేశీ పెట్టుబడులు భారీ స్థాయిలో తరలివెళుతున్నాయి. ఈ వారం జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. యూఎస్ నిరుద్యోగిత, తయారీ, సరీ్వసుల రంగ గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి.
10 శాతం దిద్దుబాటు..
గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో డీలా పడ్డాయి. సెన్సెక్స్ 1,906 పాయింట్లు కోల్పోయి 77,580 వద్ద ముగిసింది. వెరసి రికార్డ్ గరిష్టం(86,000స్థాయి) నుంచి 8,395 పాయింట్లు(10 శాతం) పడిపోయింది. ఇక గత వారం నిఫ్టీ సైతం 616 పాయింట్లు క్షీణించి 23,533 వద్ద స్థిరపడింది. ఈ బాటలో చరిత్రాత్మక గరిష్టం(26,277) నుంచి 2,745 పాయింట్లు పతనమైంది.
వర్ధమాన మార్కెట్లకు దెబ్బ
యూఎస్ బాండ్ల ఈల్డ్స్, డాలరు బలపడటంతో వర్ధమాన మార్కెట్లపై ప్రభావం పడుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. క్యూ2 ఫలితాల సీజన్ ముగియడంతో ఇకపై మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్ల తీరు ఆధారంగా కదలవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ట్రేడర్లు ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌ను అనుసరించే వీలున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాల నేపథ్యంలో ఈ వారం దేశీ మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదిలే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అంచనా వేశారు.
అమ్మకాల బాటలోనే...
దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 22,420 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. యూఎస్ డాలర్‌తోపాటు ట్రెజరీ ఈల్డ్స్ బలిమి, చైనా ప్యాకేజీలు, దేశీ మార్కెట్ల గరిష్ట విలువల కారణంగా అమ్మకాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో గత నెల(అక్టోబర్)లో కొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఈ స్థాయిలో రూ. 61,973 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే ఈ ఏడాది సెపె్టంబర్‌లో 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment