multiple
-
ఒకరికి రెండు పాలసీలు.. క్లెయిమ్ ఎలా?
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవలి కాలంలో వేతన జీవుల్లో చాలా మంది రెండు హెల్త్ పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స వ్యయం బీమా కవరేజీని మించిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాలను ఒకటికి మించిన పాలసీలతో సులభంగా గట్టెక్కొచ్చు. కానీ, ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉంటే క్లెయిమ్ ఎలా చేయాలనే విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విషయంలో నిపుణుల సూచనలు అందించే కథనమిది.గతంలో వేరు.. ఒక వ్యక్తికి ఒకటికి మించిన బీమా సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే, క్లెయిమ్ మొత్తాన్ని ఆయా సంస్థలు సమానంగా భరించాలనే నిబంధన లోగడ ఉండేది. 2013లో దీన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) తొలగించింది. దీంతో ఇప్పుడు ఒకటికి మించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉన్నా కానీ, పాలసీదారు తనకు నచ్చిన చోట లేదంటే రెండు సంస్థల వద్దా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. క్లెయిమ్ ఎలా? రెండు ప్లాన్లు కలిగిన వారు ఆస్పత్రిలో చేరిన తర్వాత రెండు బీమా సంస్థలకు తప్పనిసరిగా సమాచారం అందించాలి. ఒకటికి మించిన సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కలిగి ఉంటే, అప్పుడు ముందుగా ఒక బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తే సరిపోతుంది. నగదు రహిత, రీయింబర్స్మెంట్ మార్గాల్లో దేనినైనా వినియోగించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం ఒక హెల్త్ ప్లాన్ కవరేజీ దాటనప్పుడు ఒక బీమా సంస్థ వద్దే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక పాలసీ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు వచి్చనప్పుడు, రెండో బీమా సంస్థ వద్ద మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అంతే కానీ, ఒకేసారి ఒకే క్లెయిమ్‌ను రెండు సంస్థల వద్ద దాఖలు చేసేందుకు అవకాశం లేదు. ఉదాహరణకు రూ.5 లక్షల చొప్పున రెండు ప్లాన్లు ఉన్నాయని అనుకుందాం. ఆస్పత్రి బిల్లు రూ.7 లక్షలు వచి్చంది. అప్పుడు తొలుత ఒక సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేయాలి. అక్కడి నుంచి వచి్చన చెల్లింపులు మినహాయించి, అప్పుడు మిగిలిన మొత్తానికి రెండో బీమా సంస్థ నుంచి పరిహారం కోరాలి. ఒక పాలసీలో రూమ్‌రెంట్ పరంగా పరిమితులు ఉండి, దానివల్ల క్లెయిమ్ పూర్తిగా రాని సందర్భాల్లోనూ.. మిగిలిన మొత్తాన్ని రూమ్‌రెంట్ పరిమితులు లేని మరో పాలసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. కొన్ని పాలసీల్లో రూమ్ రెంట్, కొన్ని చికిత్సలకు పరిమితులు ఉంటాయి. ముఖ్యంగా గ్రూప్ హెల్త్ ప్లాన్లలో ఇవి చూడొచ్చు. అలాంటప్పుడు రూ.5 లక్షల కవరేజీ ఉన్నప్పటికీ పూర్తి మొత్తం రాకపోవచ్చు. ఉదాహరణకు రూ.7లక్షల ఆస్పత్రి బిల్లుకు సంబంధించి రూ. 5 లక్షల గ్రూప్ పాలసీలో రూ.4 లక్షలే క్లెయిమ్ కింద వచి్చందని అనుకుంటే.. అప్పుడు మిగిలిన రూ. 3 లక్షలను రెండో పాలసీ కింద రీయింబర్స్మెంట్ కోరవచ్చు. ఒక బీమా సంస్థ క్లెయిమ్ దరఖాస్తును తిరస్కరించినా, రెండో బీమా సంస్థను సంప్రదించవచ్చు. వేతన జీవులు పనిచేసే సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ ప్లాన్, వ్యక్తిగతంగా ఫ్యామిలీ ఫ్లోటర్ లేదా ఇండివిడ్యు వల్ ప్లాన్ కలిగి ఉన్నప్పుడు.. మొదట గ్రూప్ హెల్త్ ప్లాన్ నుంచి క్లెయిమ్‌కు వెళ్లడం మంచి ఆప్షన్. గ్రూప్ హెల్త్ ప్లాన్‌లో క్లెయిమ్ సెటిల్మెంట్ సులభంగా ఉంటుంది. క్లెయిమ్ మొత్తం ఒక బీమా పాలసీ కవరేజీ పరిధిలోనే ఉంటే ఒక్క సంస్థ వద్దే క్లెయిమ్‌కు పరిమితం కావాలి. దీనివల్ల రెండో ప్లాన్‌లో నో క్లెయిమ్ బోనస్ నష్టపోకుండా చూసుకోవచ్చు.నగదు రహిత చికిత్సబీమా సంస్థ నెట్వర్క్ పరిధిలోని అన్ని ఆస్పత్రుల నుంచి నగదు రహిత చికిత్స తీసుకోవచ్చు. ఏ ఆస్పత్రిలో అయినా నగదు రహిత చికిత్సకు బీమా సంస్థలు నేడు అవకాశం కలి్పస్తున్నాయి. కాకపోతే ఆస్పత్రి నిషేధిత జాబితాలో లేని వాటికే ఈ సదుపాయం పరిమితమని గుర్తుంచుకోవాలి. రెండు ప్లాన్లలోనూ నగదు రహిత చికిత్సకు వెళ్లొచ్చు. కానీ, ఒక సంస్థ నుంచే నగదు రహిత క్లెయిమ్‌కు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇస్తుంటాయి. మిగిలిన మొత్తం కోసం రీయింబర్స్మెంట్ విధానానికి వెళ్లాలని సూచిస్తుంటాయి. అలాంటప్పుడు నగదు రహిత విధానంలో గరిష్ట పరిమితి మేరకే ఒక బీమా సంస్థ నుంచి చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మిగిలిన మొత్తాన్ని సొంతంగా చెల్లించి, దాన్ని రాబట్టుకునేందుకు రెండో బీమా సంస్థను సంప్రదించాలి. దీనికోసం మొదట క్లెయిమ్ చేసిన బీమా సంస్థ నుంచి ‘క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీ’ తీసుకోవాలి. అలాగే, హాస్పిటల్ బిల్లులు, చికిత్సకు సంబంధించి అన్ని పత్రాల ఫొటో కాపీలను సరి్టఫై (అటెస్టేషన్) చేసి ఇవ్వాలని మొదటి బీమా సంస్థను కోరాలి. వీటితో రెండో బీమా సంస్థ వద్ద రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దరఖాస్తు దాఖలు చేసుకోవాలి. రెండు బీమా సంస్థల వద్ద రీయింబర్స్మెంట్ విధానంలో క్లెయిమ్ చేసుకోవాలన్నా సరే.. మొదట ఒక సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆస్పత్రి నుంచి అన్ని బిల్లుల కాపీలు, డిశ్చార్జ్ సమ్మరీ, ల్యాబ్ రిపోర్ట్లు తీసుకుని బీమా సంస్థకు సమర్పించాలి. క్లెయిమ్ ఆమోదం అనంతరం, క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీతోపాటు, అన్ని డాక్యుమెంట్ల ఫొటో కాపీలతో రెండో సంస్థ వద్ద రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలుకు కాలపరిమితి ఉంటుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 15–30 రోజులు దాటకుండా క్లెయిమ్ దాఖలు చేసుకోవాలి. ఒకరికి ఎన్ని ప్లాన్లు? అసలు ఒకటికి మించి హెల్త్ పాలసీలు ఎందుకు? అనే సందేహం రావచ్చు. ఒక్కొక్కరి అవసరాలే దీన్ని నిర్ణయిస్తాయి. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ కవరేజీ సాధారణంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచి్చనా లేదంటే ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో.. తిరిగి ఉపాధి లభించేందుకు కొంత సమయం పట్టొచ్చు. కంపెనీలు కలి్పంచే గ్రూప్ హెల్త్ కవరేజీ.. ఉద్యోగానికి రాజీనామా చేయడంతోనే ముగిసిపోతుంది. అందుకే వ్యక్తిగతంగా మరో ప్లాన్ కలిగి ఉంటే, ఉద్యోగం లేని సమయంలోనూ ఉపయోగపడుతుంది. వైద్య చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో రెండు ప్లాన్లను కలిగి ఉండడం మంచి నిర్ణయమే అవుతుంది. లేదంటే బేస్ ప్లాన్ ఒకటి తీసుకుని, దానిపై మరింత మెరుగైన కవరేజీతో సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకోవడం మరొక మార్గం.రీయింబర్స్‌మెంట్‌కు కావాల్సిన డాక్యుమెంట్లు డిశ్చార్జ్ సమ్మరీ, నగదు/కార్డు ద్వారా చెల్లింపులకు సంబంధించి రసీదులు, ల్యాబ్ రిపోర్ట్లు, వైద్యులు రాసిచి్చన ప్రిస్కిప్షన్లు, ఎక్స్‌రే ఫిల్మ్‌లు, క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీ.ఏడాదిలో ఎన్ని క్లెయిమ్‌లు? ఏడాదిలో ఎన్ని క్లెయిమ్‌లు అన్న దానితో సంబంధం లేకుండా, గరిష్ట బీమా కవరేజీ పరిధిలో ఎన్ని విడతలైనా పరిహారం పొందొచ్చు. కొన్ని బీమా సంస్థలు క్లెయిమ్‌ల సంఖ్య పరంగా పరిమితులు విధించొచ్చు. కనుక పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్‌ను తప్పకుండా చదివి ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. రెండు రకాల పాలసీలు హెల్త్ ఇన్సూరెన్స్ సాధారణంగా రెండు రకాలు. ఇండెమ్నిటీ ఒక రకం అయితే, ఫిక్స్డ్ బెనిఫిట్‌తో కూడినవి రెండో రకం. ఇండెమ్నిటీ పాలసీలు ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలతోపాటు.. ఎంపిక చేసిన డేకేర్ ప్రొసీజర్స్ (చికిత్స తర్వాత అదే రోజు విడుదలయ్యేవి)కు మాత్రమే కవరేజీ ఇస్తాయి. ఇక క్రిటికల్ ఇల్నెస్ పాలసీలను ఫిక్స్డ్ బెనిఫిట్ పాలసీలుగా చెబుతారు. ఇందులో కేన్సర్, గుండె జబ్బులు, మూత్ర పిండాల వైఫల్యం, కాలేయ వైఫల్యం తదితర తీవ్ర వ్యాధుల్లో ఏదైనా నిర్ధారణ అయిన వెంటనే నిర్ణీత పరిహారాన్ని బీమా సంస్థలు ఒకే విడత చెల్లించేస్తాయి. కనుక క్లెయిమ్ విషయంలో ఈ రెండింటి పరంగా గందరగోళం అక్కర్లేదు. ఇండెమ్నిటీ ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ రెండూ కలిగిన వారు.. ఏదైనా తీవ్ర వ్యాధి (క్రిటికల్ ఇల్నెస్) బారిన పడినప్పుడు ఇండెమ్నిటీ ప్లాన్ కింద కవరేజీ పొందొచ్చు. అలాగే, వ్యాధి నిర్ధారణ పత్రాలతో క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కింద క్లెయిమ్ దాఖలు చేసి పూర్తి ప్రయోజనాన్ని అందుకోవచ్చు. దీనివల్ల ఆయా వ్యాధులకు సంబంధించి ఎదురయ్యే భారీ వ్యయాలను తట్టుకోవడం సాధ్యపడుతుంది. టాపప్, సూపర్ టాపప్ ప్లాన్లు ఇక హెల్త్ ఇన్సూరెన్స్‌లో టాపప్, సూపర్ టాపప్ ప్లాన్లు కూడా ఉంటాయి. ఇందులో సూపర్ టాపప్ ఎక్కువ అనుకూలం. ఇవి డిడక్షన్ క్లాజుతో వస్తాయి. ఉదాహరణకు రూ.5 లక్షల కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న వారు, రూ.50 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ కూడా జోడించుకున్నారని అనుకుందాం. ఆస్పత్రి బిల్లు మొదటి రూ.5 లక్షలు దాటిన తర్వాతే సూపర్ టాపప్ ప్లాన్ కింద కవరేజీ పొందగలరు. రూ.50 లక్షల వరకు బిల్లు ఎంత వచ్చినా సరే.. మొదటి రూ.5 లక్షలకు సూపర్ టాపప్‌లో పరిహారం రాదు. దాన్ని సొంతంగా భరించడం లేదంటే బేస్ ప్లాన్ నుంచి కవరేజీ తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా రూ.50 లక్షల బేస్ ఇండెమ్నిటీ ప్లాన్‌తో పోలి్చతే.. రూ.5–10 లక్షల మేర బేస్ ప్లాన్ తీసుకుని, 50 లక్షలకు సూపర్ టాపప్ తీసుకోవడం వల్ల ప్రీమియం భారం కొంత తగ్గుతుంది. -
తన రంగును మార్చుకునే.. సరస్సును ఎప్పుడైనా చూశారా!
ప్రకృతి అద్భుతాల్లో ఒకటి.. మహర్లూ సరస్సు. దక్షిణ ఇరాన్ లోని షిరాజ్ నగరానికి సమీపంలో దాదాపు 600 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందీ ఉప్పు నీటి సరస్సు. ఓ పక్క తెలుపు, మరో పక్క లేత గులాబీ రంగుతో.. సందర్శకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఎత్తైన ప్రాంతంలో కొలువుదీరిన ఈ కొలను కాలానుగుణంగా తన రంగును మార్చుకుంటుంది.షిరాజ్‌కు ఆగ్నేయంగా 27.0 కిమీల (16.8 మైళ్ళు) వరకూ ప్రవహిస్తుంది. సాధారణంగా వేసవి చివరి నాటికి ఆవిరైపోతుంది. ఆ సమయంలోనే ఇది పింక్ కలర్లోకి మారి.. ప్రకృతి ప్రియుల్ని ఆకర్షిస్తుంది. సూక్ష్మజీవుల కారణంగా ఇది పింక్ కలర్లోకి మారుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. నీటి మట్టం మరింత తగ్గగానే ముదురు గులాబీ రంగులోకి మారుతుంది. ఇందులో పేరుకున్న ఉప్పే.. ఈ సరస్సు మధ్యలో లేదా తీరంలో నిలబడటానికి.. దిమ్మలా, ఒడ్డులా మారుతుంది.ఇలాంటి పింక్ సరస్సులు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఉన్నాయి. రష్యాలోని ఆల్టై పర్వత ప్రాంతంలో ఉన్న సైబీరియన్ పింక్ లేక్ కూడా గతంలో వైరల్ అయ్యింది. ఆ సరస్సు మధ్యలోంచి రైలు పట్టాలు వేయడంతో సందర్శకులను అది మరింత ఆకట్టుకుంటోంది. ‘ఆర్టెమియా సాలినా’ అనే ఉప్పు నీటి రొయ్యల జాతి కారణంగానే ఆగస్ట్ సమయంలో.. సైబీరియన్ సరస్సుకి గులాబీ రంగు వస్తుందని నిపుణులు తేల్చారు.ఇవి చదవండి: అవును.. అది నిజంగా మృత్యుగుహే! -
రణ్వీర్ దశావతార్
తమ అభిమాన హీరో బొమ్మ గీసి ముచ్చటపడే అభిమానులు మనకు కొత్తేమీ కాదు. అయితే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ అభిమాని పౌమిల్ కత్రి వినూత్న శైలితో తన అభిమానాన్ని చాటుకున్నాడు. రకరకాల స్కెచ్‌లు ఉన్న పరికరంతో కాన్వాస్‌పై ఒకే సమయంలో వివిధ సినిమాలలోని రణ్వీర్ క్యారెక్టర్లను గీసి నెటిజనులను ఆశ్చర్యచకితుల్ని చేశాడు. ‘మేడ్ 10 స్కెచెస్ ఆఫ్ రణ్‌వీర్‌సింగ్ ఎట్ ఏ సేమ్ టైమ్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియో చూసి ముచ్చటపడిన రణ్‌వీర్‌సింగ్ పౌమిల్ను ప్రశంసిస్తూ కామెంట్ పెట్టడం మరో విశేషం. ఇక టాలెంటెడ్ ఆర్టిస్ట్ పౌమిల్ కత్రి విషయానికి వస్తే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన కత్రికి ఇన్‌స్టాగ్రామ్‌లో వందలాదిమంది ఫాల్వర్స్ ఉన్నారు. -
ఆధునిక మానవుని పుట్టుకపై అధ్యయనం..మనది ఒకే మూలం కాదట
ఆధునిక మానవుని మూలాలు ఎక్కడున్నాయి? ఆఫ్రికా అన్నది అందరూ చెప్పే సమాధానం. తొలి మానవులు అక్కడే పుట్టి, అక్కణ్నుంచే ప్రపంచమంతా వ్యాపించారని దశాబ్దాలుగా వింటూ వస్తున్నాం కూడా. అంతవరకూ నిజమే అయినా మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామన్న సిద్ధాంతం మాత్రం తప్పంటోంది ఓ తాజా అధ్యయనం. మన మూలాలు ఆఫ్రికాలోని కనీసం రెండు విభిన్న జాతుల్లో ఉన్నాయని చెబుతోంది. కనుక ఆధునిక మానవుని జన్మస్థలం ఫలానా అంటూ ఇదమిత్థంగా తేల్చి చెప్పలేమన్నది దాని సారాంశం.. మన ఆవిర్భావానికి ఒకే మూలమంటూ లేదని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. 10 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికావ్యాప్తంగా ఉనికిలో ఉన్న పలు ఆదిమ మానవ జాతులు హోమోసెపియన్గా పిలిచే ఆధునిక మానవుని పుట్టుకకు కారణమని అంటోంది. ‘‘ఆ కాలంలో ఆఫ్రికాలో నివసించి, క్రమంగా ఆ ఖండమంతటా వ్యాపించి పరస్పరం కలిసిపోయిన కనీసం రెండు ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూలం. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారి జన్యు డేటాను లోతుగా పరిశోధించిన మీదట ఈ నిర్ణయానికి వచ్చాం’’ అని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు చెబుతున్నారు. దీని వివరాలను జర్నల్ నేచర్‌లో ప్రచురించారు. ‘‘మన ఆవిర్భావానికి కారకుడైన ఆదిమ మానవులు ఒకే జాతికి చెందిన వారని మానవ వికాసంపై దశాబ్దాలుగా జరిగిన పరిశోధనల్లో చాలావరకు చెప్పుకొచ్చాయి. వారు ఆఫ్రికాలో తొలుత చెట్లపై నివసించి, అనంతరం క్రమంగా నేల మీదికి దిగారన్నది వాటి సారాంశం. కానీ ఆఫ్రికావ్యాప్తంగా మానవ ఆవాసాలకు సంబంధించిన శిలాజ, పురాతత్వ రికార్డులు ఈ వాదనతో సరిపోలడం లేదు. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో సంచరించిన ఒకటికి మించిన ఆదిమ జాతులు వేలాది ఏళ్లపాటు పరస్పర వలసలు తదితరాల ద్వారా కలగలిసిపోయి క్రమంగా ఆధునిక మానవుని ఆవిర్భావానికి దారితీశాయన్నది మా పరిశోధనలో తేలింది. హేతుబద్ధంగా ఆలోచించినా ‘ఒకే మూలం’ సిద్ధాంతం కంటే ఇదే సమంజసంగా తోస్తోంది కూడా’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా జెనెటిసిస్ట్ డాక్టర్ బ్రెన్నా హెన్ వివరించారు. ఆ ఆధారాలే ఉంటేనా...! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరి మూలాలూ కచ్చితంగా 10 లక్షల ఏళ్ల నాటి ఈ రెండు ఆదిమ జాతుల్లోనే ఉన్నట్టు కచ్చితంగా చెప్పగలమని బృందం సభ్యుడైన విస్కాన్సిన్–మాడిసన్ వర్సిటీ పాపులేషన్ జెనెటిసిస్ట్ ఆరన్ రాగ్స్డేల్ అంటున్నారు. ఎలా చూసినా మనందరి జన్మస్థానం ఆఫ్రికా లోని ఒకే ప్రాంతమన్న వాదనకు కాలం చెల్లినట్టేనని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘కాకపోతే 10 లక్షల ఏళ్ల నాటి మానవ శిలాజ తదితర జన్యు ఆధారాలేవీ ఇప్పటిదాకా మనకు దొరకలేదు. లేదంటే ఆధునిక మానవుని (హోమోసెపియన్) ఆవిర్భావం, విస్తరణ తదితరాలపై ఈ పాటికే మరింత స్పష్టత వచ్చేది’’ అన్నారాయన. ఇలా చేశారు... డాక్టర్ హెన్ సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశల్లోని ప్రఖ్యాత సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. ఆఫ్రికాలోని పలు ప్రాంతాలకు చెందిన 290 మంది జన్యు అమరికను వారు లోతుగా విశ్లేషించారు. దాంతోపాటు ఆఫ్రికాలో ఉన్న భిన్న జాతుల వారి డీఎన్ఏను ఇందుకు ఎంచుకున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో సియెరా లియోన్‌లో నివసించే మెండే రైతు జాతి, ఇథియోపియాలో ఆదిమ వేటగాళ్ల నుంచి రూపాంతరం చెందిన గుముజ్ జాతి, అమ్హరాగా పిలిచే అక్కడి రైతులతో పాటు నమా అనే దక్షిణాఫ్రికాలోని వేటగాళ్ల సంతతి నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించారు. వాటిలోని వైవిధ్యాన్ని బట్టి లక్షల ఏళ్ల క్రితం ఆ డీఎన్ఏలు ఎలా ఉండేవో, ఇన్నేళ్ల పరిణామక్రమంలో ఏ విధంగా మారుతూ వచ్చాయో అత్యాధునిక సాఫ్ట్వేర్ ఆధారంగా సిమ్యులేషన్ విధానంలో ఆవిష్కరిస్తూ వచ్చారు. ఇప్పటిదాకా లభించిన అతి పురాతన మానవ శిలాజం (3 లక్షల ఏళ్ల నాటిది) ఆఫ్రికాకు చెందినదే. అంతేగాక అతి పురాతన రాతి పనిముట్లు కూడా అక్కడే దొరికాయి. ప్రధానంగా ఈ రెండింటి ఆధారంగానే ఆఫ్రికానే మన జన్మస్థానమని గత అధ్యయనాల్లో చాలావరకు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికావాసుల డీఎన్ఏను బ్రిటిష్ వారి డీఎన్ఏతోనూ, క్రొయేషియాలో దొరికిన దాదాపు 50 వేల ఏళ్ల నాటి మన పూర్వీకుడైన నియాండర్తల్ మానవుని డీఎన్ఏతోనూ పోల్చి చూశారు. ఆఫ్రికావ్యాప్తంగా ఒకటికి మించిన ఆదిమ జాతులు వేల ఏళ్ల క్రమంలో తమలో తాము కలిసిపోయిన ఫలితంగానే మనం పుట్టుకొచ్చామని తేల్చారు. కనీసం రెండు ప్రధాన ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూల కారకులని డాక్టర్ హెన్ సూత్రీకరించారు. వాటికి స్టెమ్1, స్టెమ్2గా పేరు పెట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎంపీ విజయసాయిరెడ్డి బిల్లుపై ముందుకు.. కేంద్రం సానుకూలం!
సాక్షి, ఢిల్లీ: రాజధానుల ఏర్పాటుపై ఆయా రాష్ట్రాలకే అధికారం ఉండాలన్న వైఎస్సార్సీపీ విధానానికి కేంద్రం మద్దతు తెలపనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ దిశగా బీజేపీ అధిష్ఠానం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పరిధిలో రాజధానుల ఏర్పాటుపై ఆ రాష్ట్ర అసెంబ్లీకి స్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ కోరుతూ మొన్నటి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు మెంబరు బిల్లును ప్రవేశపెట్టారు. చదవండి: ఏపీ ప్రభుత్వం తరపున సీజేఐ ఎన్వీ రమణకు విందు రాజధానుల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్ధంగా తిరుగులేని అధికారం ఉందన్న పార్టీ విధానాన్ని విజయసాయిరెడ్డి పెద్దల సభలో స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్టికల్ 3కు రాజ్యాంగ సవరణ చేసి 3ఏను చేర్చాలని ఆ బిల్లులో ఆయన డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై పార్లమెంటు వచ్చే శీతాకాల సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలిసింది. దీనిపై కేంద్రం కూడా పూర్తి సానుకూలంగా ఉందంటూ జాతీయ మీడియా పేర్కొంది. ప్రైవేట్ బిల్లుకు బదులుగా అధికారపార్టీనే ఆర్టికల్ 3 సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందని జాతీయ మీడియా పేర్కొంది. అంతేకాదు.. ప్రైవేటు బిల్లును ఉపసంహరించుకోవాలని విజయసాయిరెడ్డికి బీజేపీ అధిష్ఠానం సూచించనున్నట్టు తెలిపింది. ఈ మధ్యకాలంలో జనతాదళ్ యునైటెడ్ లాంటి పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వెళ్లడంతో బీజేపీ బలం రాజ్యసభలో 108కి తగ్గింది. పెద్దల సభలో ప్రతిపక్షాలకు 129 మంది సభ్యులున్నారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాలంటే.. అధికారపార్టీకి మరో 79 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. -
విస్మయపరుస్తున్న అపరిచితురాలు
మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తిత్వాలను అపరిచితుడు వంటి సినిమాల్లో చూశాం. కానీ ఇప్పుడు బహుళ వ్యక్తిత్వాలు కలిగిన ఓ జర్మన్ యువతి వైద్య ప్రపంచాన్నే విస్తుపోయేలా చేస్తోంది. ఇరవై ఏళ్ళ వయసులో ప్రమాదంలో దృష్టి కోల్పోయిన ఆమె.. విభిన్న వ్యక్తిత్వాలు కలిగి ఉండటంతో... 37 ఏళ్ళ వయసులోనూ ఓ చిన్నవయసు వ్యక్తిలా చూడగలుగుతోంది. డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ తో బాధపడుతున్న ఆమెను అప్పట్లో అంధురాలుగానే గుర్తించారు. అయితే ఆమె అంధత్వం ఇప్పుడు మానసికమైనది కాకుండా శరీరానికి సంబంధించినదిగా భావిస్తున్నారు. అకస్మాత్తుగా మారే వ్యక్తిత్వాలు ఆమెకు కంటి చూపును ప్రసాదిస్తున్నాయి. ఇరవై సంవత్సరాల వయసులో ప్రమాదంలో మెదడు భాగం దెబ్బతినడంతో ఆమె దృష్టిని కోల్పోయినట్లు వైద్యులు గుర్తించారు. ఆమె కార్టికల్ బ్లైండ్ నెస్ బారిన పడినట్లు సూచించారు. అయితే ఇప్పుడామె పది విభిన్న వ్యక్తిత్వాలు కలిగి ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. చికిత్స సమయంలో ఏదో లోపం జరగడం వల్ల ఈ డిజార్డర్ సంభవించినట్లు చెబుతున్నారు. అందుకే ఆమె యుక్త వయసులోని బాలిక చూడగలిగే సామర్థ్యాన్ని పొందిందని వైద్యులు విశ్వసిస్తున్నారు. చికిత్సా కాలంలో ఆమెకున్న పది వ్యక్తిత్వాల్లోని ఎనిమిదికి సంబంధించిన చూపును తిరిగి ఆమె చేజిక్కించుకుంది. సెకన్లలో మారిపోతున్న ఆమె దృష్టి ఇప్పుడు ఆమె వ్యక్తిత్వం పై ఆధారపడి ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆమెకు సంభవించిన అంధత్వం మెదడు దెబ్బతినడం వల్ల కాదని, శారీరకమైనదిగా భావిస్తున్నారు. జర్మన్ మనస్తత్వవేత్తలు హన్స్ స్ట్రాస్ బర్గర్, బ్రూనో వాల్డ్ వోగల్ నిర్వహించిన ఈఈజీ అధ్యయనాల ద్వారా అమె మెదడులోని దృశ్య సంబంధిత స్పందనలను గమనించారు. పేషెంట్ అంధత్వంతో ఉన్నపుడు మెదడు ఎలాంటి దృశ్యాన్ని స్వీకరించడం లేదని, అయితే విభిన్న వ్యక్తిత్వాలుగా మారుతున్నపుడు ఆమె సాధారణ దృష్టిని కలిగి ఉంటోందని తెలుసుకున్నారు. ఆమె స్పందనలను ఈసీజీ మానిటర్ ద్వారా కనుగొన్నారు. ప్రాధమిక నిర్థారణ సమయంలో ఆమె ఆరోగ్య రికార్డులను పరిశీలించిన వైద్యులు... ఆమెకు ప్రత్యేక అద్దాలు, లైట్లు, లేజర్లు వినియోగించి దృష్టి పరీక్షలు నిర్వహించారు. ఆమె కళ్ళకు ఎటువంటి భౌతిక నష్టం కలుగలేదని, కేవలం మెదడు దెబ్బతినడం వల్లే సమస్య ఉత్పన్నమైందని భావించారు. ఆమెలోని కొన్ని వ్యక్తిత్వాలు చిన్నవయసులో ఆమె నివసించిన ప్రదేశాన్ని బట్టి, ఆయా భాషల్లో మాట్లాడటాన్ని బట్టి తెలుసుకున్నారు. నాలుగు సంవత్సరాల చికిత్స అనంతరం బాలికలా ప్రవర్తించడాన్ని గమనించిన వైద్యులు... ఆమె భావోద్వేగాలను బట్టి, స్పందనలను బట్టి దృష్టి మారుతున్నట్లుగా భావిస్తున్నారు. అంతే కాక ఆమె చూడాలనుకున్న సమయంలో చూడగలదని, వద్దనుకుంటే అంధురాలిగా మారిపోతుంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం వైద్య నిపుణులకు సైతం ఆమె పరిస్థితి ఓ అధ్యయనంగా మారింది.