విస్మయపరుస్తున్న అపరిచితురాలు
మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తిత్వాలను అపరిచితుడు వంటి సినిమాల్లో చూశాం. కానీ ఇప్పుడు బహుళ వ్యక్తిత్వాలు కలిగిన ఓ జర్మన్ యువతి వైద్య ప్రపంచాన్నే విస్తుపోయేలా చేస్తోంది. ఇరవై ఏళ్ళ వయసులో ప్రమాదంలో దృష్టి కోల్పోయిన ఆమె.. విభిన్న వ్యక్తిత్వాలు కలిగి ఉండటంతో... 37 ఏళ్ళ వయసులోనూ ఓ చిన్నవయసు వ్యక్తిలా చూడగలుగుతోంది. డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ తో బాధపడుతున్న ఆమెను అప్పట్లో అంధురాలుగానే గుర్తించారు. అయితే ఆమె అంధత్వం ఇప్పుడు మానసికమైనది కాకుండా శరీరానికి సంబంధించినదిగా భావిస్తున్నారు.
అకస్మాత్తుగా మారే వ్యక్తిత్వాలు ఆమెకు కంటి చూపును ప్రసాదిస్తున్నాయి. ఇరవై సంవత్సరాల వయసులో ప్రమాదంలో మెదడు భాగం దెబ్బతినడంతో ఆమె దృష్టిని కోల్పోయినట్లు వైద్యులు గుర్తించారు. ఆమె కార్టికల్ బ్లైండ్ నెస్ బారిన పడినట్లు సూచించారు. అయితే ఇప్పుడామె పది విభిన్న వ్యక్తిత్వాలు కలిగి ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. చికిత్స సమయంలో ఏదో లోపం జరగడం వల్ల ఈ డిజార్డర్ సంభవించినట్లు చెబుతున్నారు. అందుకే ఆమె యుక్త వయసులోని బాలిక చూడగలిగే సామర్థ్యాన్ని పొందిందని వైద్యులు విశ్వసిస్తున్నారు.
చికిత్సా కాలంలో ఆమెకున్న పది వ్యక్తిత్వాల్లోని ఎనిమిదికి సంబంధించిన చూపును తిరిగి ఆమె చేజిక్కించుకుంది. సెకన్లలో మారిపోతున్న ఆమె దృష్టి ఇప్పుడు ఆమె వ్యక్తిత్వం పై ఆధారపడి ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆమెకు సంభవించిన అంధత్వం మెదడు దెబ్బతినడం వల్ల కాదని, శారీరకమైనదిగా భావిస్తున్నారు.
జర్మన్ మనస్తత్వవేత్తలు హన్స్ స్ట్రాస్ బర్గర్, బ్రూనో వాల్డ్ వోగల్ నిర్వహించిన ఈఈజీ అధ్యయనాల ద్వారా అమె మెదడులోని దృశ్య సంబంధిత స్పందనలను గమనించారు. పేషెంట్ అంధత్వంతో ఉన్నపుడు మెదడు ఎలాంటి దృశ్యాన్ని స్వీకరించడం లేదని, అయితే విభిన్న వ్యక్తిత్వాలుగా మారుతున్నపుడు ఆమె సాధారణ దృష్టిని కలిగి ఉంటోందని తెలుసుకున్నారు. ఆమె స్పందనలను ఈసీజీ మానిటర్ ద్వారా కనుగొన్నారు. ప్రాధమిక నిర్థారణ సమయంలో ఆమె ఆరోగ్య రికార్డులను పరిశీలించిన వైద్యులు... ఆమెకు ప్రత్యేక అద్దాలు, లైట్లు, లేజర్లు వినియోగించి దృష్టి పరీక్షలు నిర్వహించారు. ఆమె కళ్ళకు ఎటువంటి భౌతిక నష్టం కలుగలేదని, కేవలం మెదడు దెబ్బతినడం వల్లే సమస్య ఉత్పన్నమైందని భావించారు.
ఆమెలోని కొన్ని వ్యక్తిత్వాలు చిన్నవయసులో ఆమె నివసించిన ప్రదేశాన్ని బట్టి, ఆయా భాషల్లో మాట్లాడటాన్ని బట్టి తెలుసుకున్నారు. నాలుగు సంవత్సరాల చికిత్స అనంతరం బాలికలా ప్రవర్తించడాన్ని గమనించిన వైద్యులు... ఆమె భావోద్వేగాలను బట్టి, స్పందనలను బట్టి దృష్టి మారుతున్నట్లుగా భావిస్తున్నారు. అంతే కాక ఆమె చూడాలనుకున్న సమయంలో చూడగలదని, వద్దనుకుంటే అంధురాలిగా మారిపోతుంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం వైద్య నిపుణులకు సైతం ఆమె పరిస్థితి ఓ అధ్యయనంగా మారింది.