క్యాష్ బ్యాక్‌తో భవిత భద్రం
ఆశయాలను బట్టి ఒక్కొక్కరికీ ఒక్కో విధమైనవి ఉంటాయి. అయితే, వారు, వీరు అని భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ కామన్‌గా ఉండే లక్ష్యాలు కొన్ని ఉంటాయి. కనుక భవిష్యత్ కోసం ప్లానింగ్ చేసుకోవడంతో పాటు వర్తమాన అవసరాలను కూడా తీర్చుకోగలగడం ముఖ్యం. అటు దీర్ఘకాలికమైన లక్ష్యాలపై ఎంతగా దృష్టి పెడతామో .. ఇటు స్వల్పకాలిక, మధ్యకాలికమైన మైలురాళ్లను సాధించడం కూడా అంతే ముఖ్యం. మొట్టమొదటి కారు కావొచ్చు, సొంత ఇల్లు కావొచ్చు, పిల్లల చదువు లేదా పెళ్లిళ్లు కావొచ్చు.. ఇవన్నీ కూడా ఆ కోవకే చెందుతాయి. కుటుంబానికి సంతోషాన్ని పంచే.. వీటన్నింటినీ సాధించేందుకు తగినన్ని నిధులు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలికమైన వాటితో పాటు స్వల్పకాలికమైన లక్ష్యాల సాధనకు కూడా తోడ్పడే క్యాష్ బ్యాక్ బీమా పాలసీలను గురించి వివరించేదే ఈ కథనం.
క్యాష్ బ్యాక్ ప్లాన్ ప్రయోజనాలు..
ఇది చాలా సింపుల్ జీవిత బీమా పథకం. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై ప్రతికూల ప్రభావం పడకుండా.. స్వల్ప, మధ్యకాలిక లక్ష్యాల సాధనకు వివిధ సమయాల్లో నిర్దిష్ట మొత్తం పాలసీదారు చేతికి అందిస్తుంది. ఇంటి కొనుగోలు, పిల్లల చదువు, విహారయాత్రలు లాంటి భవిష్యత్ లక్ష్యాలను సాధించేందుకు తోడ్పాటు అందిస్తుంది.
ప్రత్యేకతలేమిటంటే ...
పరిమిత కాలం పాటు ప్రీమియంలు కడితే చాలు దీర్ఘకాలికమైన పెట్టుబడి ప్రయోజనాలు అందించడం ఈ తరహా ప్లాన్ల ప్రత్యేకత. ఉదాహరణకు ఇండియాఫస్ట్ క్యాష్ బ్యాక్ ప్లాన్ విషయం తీసుకుంటే 5/7/10 సంవత్సరాల పాటు పేమెంటు టర్మ్ ఉంటే .. 9/12/15 సంవత్సరాల పాటు పాలసీ కొనసాగుతుంది. ప్లాన్ కాల వ్యవధి కొనసాగినంత కాలం.. మధ్య మధ్యలో గ్యారంటీగా చెల్లించే మొత్తాలు చేతికి వస్తూ ఉంటాయి. ప్లాన్ మెచ్యూరిటీ వేళ అదనంగా లాయల్టీ బోనస్ కూడా లభిస్తుంది. ఇక, ఈ ప్లాన్‌లో జీవిత బీమా కవరేజీతో పాలసీదారు కుటుంబానికి ఇన్సూరెన్స్‌పరమైన భద్రత లభిస్తుంది. అలాగే, కట్టిన ప్రీమియంలు, పొందే ప్రయోజనాలపైనా పన్నులపరమైన ప్రయోజనాలు లభిస్తాయి.
పన్ను ప్రయోజనాలు ...
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద చాలా మటుకు క్యాష్ బ్యాక్ ప్లాన్లకు సుమారు రూ. 1,50,000 దాకా కట్టే ప్రీమియంలకు ట్యాక్స్ డిడక్షన్ లభిస్తుంది. మెచ్యూరిటీ మొత్తంపైన, విత్‌డ్రాయల్స్ పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. డెత్ బెనిఫిట్స్‌పై కూడా పన్నులు ఉండవు.
ఎవరికి అనువైనవి ...
భవిష్యత్ లక్ష్యాల సాధన కోసం సంసిద్ధులుగా ఉండాలనుకునే వారెవరికైనా కూడా ఈ పాలసీలు అనువైనవే. ఇది సింపుల్ ఎండోమెంట్ ప్లాన్. ప్లాన్ ఆఖర్లో మెచ్యూరిటీ మొత్తాన్ని (బోనస్ లాంటి వాటితో పాటు) అందుకోవడంతో పాటు ప్లాన్ కొనసాగినంత కాలం మధ్య మధ్యలో కాస్త కాస్త చొప్పున నగదు కూడా చేతికి వస్తుండాలని కోరుకునే వారికి ఈ ప్లాన్లు అనువైనవి.