strokes
-
బీడీ, సిగరెట్ తాగుతున్నారా? ప్రతి ఐదుగురిలో ఆ ఒక్కరు కాకండి!
మన దేశంలో 26.7 కోట్ల మంది పొగతాగడం లేదా పొగాకు ఉత్పాదనలను వినియోగిస్తున్నారు. ఆ అలవాటు కారణంగా వచ్చే క్యాన్సర్లు, పక్షవాతం, గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలూ వంటి వాటితో మన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 13.50 లక్షల మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తం మీద 172 కోట్ల మంది సిగరెట్లు తాగుతున్నారు. వీళ్లంతా ప్రతిరోజూ 2000 కోట్ల సిగరెట్లను కాలుస్తుంటారు. వీళ్లలో 35 ఏళ్ల వయసు పైబడి, పొగతాగే అలవాటున్న వ్యక్తులు వివిధ రకాల జబ్బుల పాలబడి, తమ ఆరోగ్యం కోసం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా 1,77,342 కోట్లు! సొంత ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ మరీ మనం చేసే వృథా ఇది!! ఈ నెల 31న ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం’ సందర్భంగా ఆరోగ్యానికి చేటు తెచ్చుకునేలా ఎన్నెన్ని అనర్థాల్ని చేజేతులారా ఆహ్వానిస్తున్నామో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. పొగాకు అలవాటు రెండు రకాలుగా ఉంటుంది. చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి నిప్పుతో కాలుస్తూ పొగవెలువరించే అలవాటుతో పాటు... పొగ ఏదీ లేకుండానే గుట్కా, ఖైనీ. తమలపాకుతో నమిలే జర్దారూపంలో పొగాకు నమలడం, నశ్యం రూపంలో పీల్చడం ద్వారా కూడా పొగాకుకు బానిసలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చనిపోయే ప్రతి ఐదుగురిలో ఒకరు కేవలం పొగాకు వల్లనే ప్రాణాలొదులుతున్నారు. అణువణువునా విషం... అత్యంత హానికరమైన, ఆరోగ్యానికి ప్రమాదకరమైన వాటిల్లో ప్రపంచమంతటా లీగల్‌గా అమ్మే రెండు ఉత్పాదనల్లో మరీ ప్రమాదకరమైనవి సిగరెట్లు, బీడీల వంటివి మాత్రమే. మరొకటి మద్యం. నాలుగు అంగుళాల పొడవుండే సిగరెట్లో 4,800 హానికరమైన రసాయనాలుంటాయి. అందులో మళ్లీ 70 – 72 రసాయనాలు తప్పక క్యాన్సర్‌ను కలగజేసేవే. ఒకసారి పొగతాగడం అంటూ మొదలుపెడితే... వీళ్లలో దాదాపు సగం మంది (50% మంది) దీని వల్ల వచ్చే అనర్థాలు, అనారోగ్యాల కారణంగానే మరణించే అవకాశం ఉందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రతి అవయవానికీ క్యాన్సర్ ముప్పు... వెలుపల మన తల నుంచి కాలి చివరలు మొదలుకొని దేహం లోపలా ఉన్న అన్ని అంతర్గత అవయవాల వరకు దేన్నీ వదలకుండా పొగాకు తన దుష్ప్రభావాలకు గురిచేస్తుంది. దాదాపు 30 శాతం వరకు క్యాన్సర్లకు పొగాకే కారణం. తల నుంచి లెక్క తీసుకుంటే... హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు పొగాకు కారణంగానే ఎక్కువగా వస్తాయి. నోరు మొదలుకొని... దేహంలోపలికి వెళ్లే కొద్దీ... ల్యారింగ్స్, ఈసోఫేగస్, పెద్దపేగు (కొలోన్), మలద్వార (కోలోరెక్టల్) క్యాన్సరు, బ్లడ్‌క్యాన్సర్లు, కాలేయ క్యాన్సర్లు, పాంక్రికాటిక్ క్యాన్సర్లు, బ్లాడర్ క్యాన్సర్లు... వీటన్నింటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొగాకే కారణం. ఇక ప్రోస్టేట్ క్యాన్సర్‌కూ, పొగాకుకూ నేరుగానే సంబంధం ఉంది. పొగాకులోని బెంజీన్ రసాయనం ‘అక్యూట్ మైలాయిడ్ లుకేమియా’ (ఒకరకం బ్లడ్‌క్యాన్సర్)కు కారణమవుతుంది. ఈ క్యాన్సర్లతో పాటు ఇక గుండెజబ్బులు, పక్షవాతం, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు... ఇలా శరీరంలోని ప్రతి కీలక అవయవాన్నీ పొగాకు దెబ్బతీస్తుంది. పొగమానేసిన మరుక్షణమే ప్రయోజనాలు... పొగతాగడం మానేసిన మరుక్షణం మనకు కలగాల్సిన ప్రయోజనాలు మొదలవుతాయి. చివరి సిగరెట్ తర్వాత 20 నిమిషాల్లో గుండె వేగం నార్మల్కు వస్తుంది. 12 గంటల తర్వాత దేహంలో కార్బన్‌మోనాక్సైడ్ మోతాదులు తగ్గడంతో బాటు రక్తంలో ప్రమాదకరమైన విషాల మోతాదులు తగ్గుతాయి. లంగ్స్ మూడు నెలల్లో నార్మల్కు వస్తాయి. ఏడాది తర్వాత హార్ట్ఎటాక్ వచ్చే ముప్పు (రిస్క్) సగానికి తగ్గిపోతుంది. పదిహేనేళ్లు మానేయగలిగితే... సిగరెట్ అలవాటుకు ముందు ఎలాంటి ఆరోగ్యం ఉంటుందో... అదే ఆరోగ్యం మళ్లీ సమకూరుతుంది. ఆరోగ్యాన్నీ వాతావరణాన్నే కాదు... సిగరెట్ వ్యర్థాలతో భూమిని సైతం... సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగే సమయంలో వెలువడే పొగతో ఆరోగ్యానికి, పర్యావరణానికీ ఎలాగూ ముప్పు చేకూరుతుందన్నది కనబడే సత్యం. కాకపోతే మనం విస్మరించే ఇంకో వాస్తవం ఉంది. సిగరెట్ తాగాక మిగిలిపోయే పీకల (బట్స్) బరువు 77 కోట్ల కిలోలు, అంటే 7.70 లక్షల టన్నులు. ఏటా ఇన్నేసి టన్నుల మొత్తంలో సిగరెట్ వ్యర్థాలు మనం నివాసం ఉంటున్న ఈ భూమిని కలుషితం చేస్తున్నాయి. పొగాకు ఉత్పాదనల కోసం ప్రపంచంలోనే అసహ్యకరమైన రంగు పాంటోన్ 448–సి అనేది ప్రపంచంలోనే అత్యంత అసహ్యకరమైన రంగు. దీన్ని చావును సూచించే రంగుగా కూడా చెబుతారు. ఈ రంగుతోనే సిగరెట్ ప్యాక్‌లు తయారవుతున్నప్పటికీ... పొగతాగేవారిని ఆకర్షించడం కోసం దాన్ని మరింత ఆకర్షణీయంగా చేసి వాడుతుంటారు. బానిసగా చేసుకునేది నికోటిన్... పొగాకులోని నికోటిన్... ఆ ఉత్పాదనలకు బానిసయ్యేలా చేస్తుంది. సిగరెట్‌లోని పొగపీల్చిన 10 సెకండ్లలో నికోటిన్ మెదడును చేరుతుంది. ఏదైనా సంతోషం కలిగించే పనిని చేయగానే... మెదడులో డోపమైన్ అనే రసాయనం వెలువడుతుంది. నికోటిన్ మెదడును చేరగానే వెలువడే ఈ డోపమైన్ కారణంగానే హాయిగా, రిలాక్స్డ్గా ఉన్న భావన కలుగుతుంది. ఆ అనుభూతిని తరచూ పొందేందుకు స్మోకింగ్‌ను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత్తర్వాత అదే అనుభూతి కలగడం మునపటంత బలంగా లేకపోయినప్పటికీ... ఆ అనుభవం కోసం వెంపర్లాడటంతో నికోటిన్‌కు బానిసవుతారు. నికోటిన్ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే... ప్రఖ్యాత మనస్తత్వ నిపుణుడు సిగ్మండ్ ఫ్రాయిడ్‌కు ‘స్క్వామస్ సెల్ కార్సినోమా ఆఫ్ పాలెట్’ అనే రకం క్యాన్సర్ సోకింది. అంగిలిలో వచ్చిన ఈ నోటిక్యాన్సర్ నుంచి విముక్తి కల్పించడం కోసం డాక్టర్లు ఆయనకు దాదాపు 30కి పైగా సర్జరీలు చేశారు. దవడను, సైనస్నూ తొలగించారు. అయినా ఆయన సిగరెట్ మానేయలేదు. చివరకు అంగిలికీ... కంటిగూడుకూ మధ్య ఉన్న క్యాన్సర్ గడ్డను శస్త్రచికిత్సతో తొలగించడం సాధ్యం కాలేదు. దాదాపు 16 ఏళ్ల పాటు పొగాకు మానేయమని ఎందరు ప్రాధేయపడ్డా ఫ్రాయిడ్ మానలేదు. ఇదీ నికోటిన్ పవర్. -డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ -
స్టాప్ స్ట్రోక్.. మెగా వాక్
గుంటూరు, గుంటూరు మెడికల్: పక్షవాతాన్ని ఆపండి (స్టాప్ స్ట్రోక్) అనే నినాదంతో ఆదివారం నవ్యాంధ్ర రాజధాని నగరం గుంటూరు దద్దరిల్లింది. పక్షవాతంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐఎంఏ గుంటూరుశాఖ నడుం బిగించింది. నగరమంతా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయటంతో పాటు మెగా వాక్ నిర్వహించింది. నగరానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, వైద్య, పారామెడికల్ సిబ్బంది, పలు విద్యాసంస్థలకు చెందిన నర్శింగ్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు సుమారు ఐదువేల మంది నడక కార్యక్రమానికి ఉత్సాహంగా హాజరయ్యారు. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ పక్షవాత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) గుంటూరు శాఖ ఆధ్వర్యంలో గుంటూరులో మెగా వాక్ నిర్వహించారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఐటీసీ ఎదురుగా ఉన్న ఐఎంఏ హాల్ వరకు నడక కార్యక్రమం సాగింది. రైల్వే డీఆర్ఎం వి.జి భూమా పచ్చజెండా ఊపి మెగా వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పక్షవాతంపై అవగాహన కార్యక్రమం అభినందనీయమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో నిర్వహించాలని కోరారు. పక్షవాతం వచ్చిన వ్యక్తిని మూడు గంటల్లో తీసుకొస్తే ప్రాణాలు నిలపవచ్చు ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఐఎంఏ అధ్యక్షురాలు, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పమిడిముక్కల విజయ మాట్లాడుతూ పక్షవాతం వచ్చిన వారిని మూడు గంటల్లోనే న్యూరాలజిస్టు వద్దకు తెస్తే మంచి వైద్యం అందించి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీతోపాటుగా కుటుంబ సభ్యులు, సమాజం కూడా పక్షవాతానికి గురైన వ్యక్తికి నైతిక మద్దతు తెలియజేస్తే సాధారణ జీవితం గడిపేందుకు త్వరగా కోలుకుంటారని చెప్పారు. ప్రతి ఆదివారం ఐఎంఏ హాలులో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ పక్షవాత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ స్టేడియంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి 11 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. షుగర్, బీపీ, బాడీమాస్ ఇండెక్స్ తదితర వైద్య పరీక్షలు ఉచితంగా చేసి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా రాదా, స్ట్రోక్ రిస్క్ ఎంత ఉందనే విషయాలను తెలియజేస్తామన్నారు. ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ ఆవుల శ్రీనివాస్ మాట్లాడుతూ స్ట్రోక్ వచ్చిన వెంటనే వైద్యం చేయించటం ద్వారా అంగవైకల్యం బారిన పడకుండా, మరణాలు సంభవించకుండా కాపాడవచ్చన్నారు. షుగర్ వైద్య నిపుణులు డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ స్మోకింగ్, ఆల్కాహాల్, డ్రగ్స్ వల్ల నేడు 30 ఏళ్లకే పక్షవాతం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ సర్వే ప్రకారం 100లో 15 మంది స్కూల్ పిల్లలకు బీపీ ఉందనే విషయం వెల్లడయ్యిందన్నారు. పక్షవాతం రావటానికి ప్రధాన కారణం బీపీ అని పేర్కొన్నారు. ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ గార్లపాటి నందకిషోర్, నగర మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఈదర కృష్ణమూర్తి సమావేశంలో పాల్గొన్నారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాగళ్ళకిషోర్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, నగరానికి చెందిన పలువురు వైద్యులు మెగా వాక్‌లో పాల్గొన్నారు. -
ఉప్పుతో భారతీయులకు పెనుముప్పే!
శరీరానికి ఉప్పు చేసే మేలు గొప్పదే. కానీ ఉప్పు మోతాదుకు మించి తింటే ముప్పు తప్పదు అంటున్నాయి పరిశోధనలు. మరీముఖ్యంగా ఉప్పు విషయంలో భారతీయులు పెద్ద తప్పు చేస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించిన దాని కన్నా రెట్టింపు మొత్తంలో భారతీయులు తమ ఆహారంలో ఉప్పు తీసుకుంటున్నారని, దీనివల్ల గుండె సంబంధిత జబ్బుల ముప్పు పెరగడమే కాకుండా.. హఠాన్మరణాలు కూడా సంభవిస్తున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్‌వో ప్రతిరోజు ఐదుగ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని సిఫారసు చేయగా.. 19 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు కలిగిన భారతీయులు ప్రతిరోజూ 10.98 గ్రాముల మేర ఉప్పు తమ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ఉప్పును మరీ అధికంగా తీసుకుంటున్నారని తెలిపింది. ఉప్పును తీసుకునే విషయంలో త్రిపుర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, ఇక్కడ రోజుకు ఏకంగా 14గ్రాముల వరకు ఉప్పు తీసుకుంటున్నారని, ఇది డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసిన దానికన్నా మూడు రెట్లు అధికమని తెలిపింది. ‘గత 30 ఏళ్లలో భారతీయుల సగటు ఆహార అలవాట్లు మారిపోయాయి. వారు పప్పులు, కూరగాయలు, పండ్లు తీసుకోవడం తగ్గిపోయి.. ప్రాసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకుంటున్నారు. దీనివల్ల వారి ఆహారంలో పూర్తిస్థాయిలో ఉప్పు, చక్కెర, హానిచేసే కొవ్వు పదార్థాలు ఉంటున్నాయి. దీనివల్ల అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె సంబంధిత జబ్బుల బారిన పడుతున్నారు. గుండెపోటు, స్ట్రోక్‌లు ఎక్కువగా సంభవిస్తున్నాయి’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన క్లైర్ జాన్సన్ తెలిపారు. ఉప్పు అధికంగా తీసుకోవడం అధిక రక్తపోటు (హై బ్లడ్‌ప్రెషర్)కు దారితీస్తున్నదని, ఇది గుండె జబ్బులకు కారణంగా మారుతున్నదని అధ్యయనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఉప్పు తీసుకోవడం తగ్గించడానికి సత్వరమే చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. ఉప్పును తీసుకొనే విషయంలో పట్టణ ప్రాంతాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎలాంటి తేడా లేదని, అయితే, పట్టణప్రాంత ప్రజలు తక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నప్పటికీ పచ్చళ్లరూపంలో అధికమొత్తం ఉప్పును స్వీకర్తిస్తున్నారని అధ్యయనం స్పష్టం చేసింది. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక మరణాలకు గుండెజబ్బులే కారణంగా నిలుస్తున్నాయి. ప్రతి ఏడాది గుండెజబ్బుల కారణంగా 23 లక్షలమంది ప్రాణాలు విడుస్తున్నారు. 2030నాటికి ఏకంగా అధిక రక్తపోటు బారిన పడే వారి సంఖ్య రెట్టింపు అయి.. దేశ జనాభాలో 21.3 కోట్లమందికి చేరుకుంటుందని ఈ అధ్యయనం ఆందోళనపరిచే విషయాలు తెలిపింది. ‘భారత్ ఎదుర్కొంటున్న ఈ పెను సంక్షోభం గురించి ఆలోచిస్తేనే కష్టంగా ఉంది. అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా లక్షలాది మంది ప్రతి ఏడాది ప్రాణాలు విడుస్తున్నారు’ అని జాన్సన్ పేర్కొన్నారు. జాతీయంగా ఉప్పు తినడం తగ్గించేందుకు సెంటర్ ఫర్ క్రోనిక్ డిసీజ్ కంట్రోల్ (సీసీడీసీ)తో జార్జ్ ఇన్స్టిట్యూ్ట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పనిచేస్తోంది. 2025నాటికైనా డబ్ల్యూహెచ్‌వో లక్ష్యం మేరకు దేశవ్యాప్తంగా ఉప్పు తీసుకోవడాన్ని 30శాతం మేర తగ్గించడానికి భారత్ ఇప్పటినుంచే సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరముందని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివేక్ ఝా తెలిపారు. -
ఒంటరితనం ‘గుండె’కు చేటు
న్యూయార్క్ : మనలో చాలామంది కొన్నిసార్లు ఒంటరితనాన్ని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం. ఒంటరిగా, సమాజానికి దూరంగా జీవించాలని అభిప్రాయపడుతుంటాం. అప్పుడే ఎలాంటి బాదరాబందీ ఉండవని భావిస్తుంటాం. అయితే అలా ఎక్కువ రోజులు ఎవరూ ఒంటరిగా జీవించలేమట. ఎక్కువ కాలం ఒంటరిగా బ్రతికే వాళ్లకి గుండెపోటులు, గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా సంభవిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. ఒంటరిగా, సమాజానికి దూరంగా జీవించేవాళ్లకి 29 శాతం ఎక్కువగా గుండెకు సంబంధించిన సమస్యలు, 32 శాతం హార్ట్ స్ట్రోకుల కలిగి ఉంటున్నారని తేల్చారు. ఒంటరితనాన్ని, సమాజానికి దూరంగా జీవించేవాళ్లని గుర్తించి, ఈ రెండింటికి సంబంధించిన సమస్యల నుంచి వారిని కాపాడటం ప్రధానమైన కర్తవ్యంగా బ్రిగ్హం యంగ్ యూనివర్సిటీ పరిశోధకలు పేర్కొన్నారు. సంపన్న దేశాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. లక్షా 81 వేల మంది పెద్దలపై మూడు నుంచి 21 ఏళ్లు జరిపిన ఈ పరిశోధనలో, 4,628 కేసులు గుండెకు సంబంధించిన వ్యాధులుగా నమోదు అవగా, మూడువేల స్ట్రోకులను పరిశోధకులు గుర్తించారు. ఎలాంటి వ్యాధులు రాకుండా మనశ్శాంతిగా జీవించేందుకు సామాజికంగా అందరితో కలివిడిగా ఉండాలని తెలిపారు. అయితే టెక్నాలజీ అభివద్ధి చెందుతున్న నేపథ్యంలో సామాజికంగా సంబంధాలు ఏర్పరుచుకోవడం కోసం సమర్ధవంతమైన జోక్యాల రూపకల్పనే అతిపెద్ద సవాలని పరిశోధకులు తమ నివేదికల్లో పేర్కొన్నారు.