మెగా వాక్‌ను జెండా ఊపి ప్రారంభిస్తున్న రైల్వే డీఆర్‌ఎం వి.జి.భూమా తదితరులు
గుంటూరు, గుంటూరు మెడికల్: పక్షవాతాన్ని ఆపండి (స్టాప్ స్ట్రోక్) అనే నినాదంతో ఆదివారం నవ్యాంధ్ర రాజధాని నగరం గుంటూరు దద్దరిల్లింది. పక్షవాతంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐఎంఏ గుంటూరుశాఖ నడుం బిగించింది. నగరమంతా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయటంతో పాటు మెగా వాక్ నిర్వహించింది. నగరానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, వైద్య, పారామెడికల్ సిబ్బంది, పలు విద్యాసంస్థలకు చెందిన నర్శింగ్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు సుమారు ఐదువేల మంది నడక కార్యక్రమానికి ఉత్సాహంగా హాజరయ్యారు. వివరాల్లోకి వెళితే..
ప్రపంచ పక్షవాత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) గుంటూరు శాఖ ఆధ్వర్యంలో గుంటూరులో మెగా వాక్ నిర్వహించారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఐటీసీ ఎదురుగా ఉన్న ఐఎంఏ హాల్ వరకు నడక కార్యక్రమం సాగింది. రైల్వే డీఆర్‌ఎం వి.జి భూమా పచ్చజెండా ఊపి మెగా వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పక్షవాతంపై అవగాహన కార్యక్రమం అభినందనీయమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో నిర్వహించాలని కోరారు.
పక్షవాతం వచ్చిన వ్యక్తిని మూడు గంటల్లో తీసుకొస్తే ప్రాణాలు నిలపవచ్చు
ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఐఎంఏ అధ్యక్షురాలు, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పమిడిముక్కల విజయ మాట్లాడుతూ పక్షవాతం వచ్చిన వారిని మూడు గంటల్లోనే న్యూరాలజిస్టు వద్దకు తెస్తే మంచి వైద్యం అందించి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీతోపాటుగా కుటుంబ సభ్యులు, సమాజం కూడా పక్షవాతానికి గురైన వ్యక్తికి నైతిక మద్దతు తెలియజేస్తే సాధారణ జీవితం గడిపేందుకు త్వరగా కోలుకుంటారని చెప్పారు. ప్రతి ఆదివారం ఐఎంఏ హాలులో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ పక్షవాత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ స్టేడియంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి 11 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. షుగర్, బీపీ, బాడీమాస్ ఇండెక్స్ తదితర వైద్య పరీక్షలు ఉచితంగా చేసి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా రాదా, స్ట్రోక్ రిస్క్ ఎంత ఉందనే విషయాలను తెలియజేస్తామన్నారు.
ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ ఆవుల శ్రీనివాస్ మాట్లాడుతూ స్ట్రోక్ వచ్చిన వెంటనే వైద్యం చేయించటం ద్వారా అంగవైకల్యం బారిన పడకుండా, మరణాలు సంభవించకుండా కాపాడవచ్చన్నారు. షుగర్ వైద్య నిపుణులు డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ స్మోకింగ్, ఆల్కాహాల్, డ్రగ్స్ వల్ల నేడు 30 ఏళ్లకే పక్షవాతం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ సర్వే ప్రకారం 100లో 15 మంది స్కూల్ పిల్లలకు బీపీ ఉందనే విషయం వెల్లడయ్యిందన్నారు. పక్షవాతం రావటానికి ప్రధాన కారణం బీపీ అని పేర్కొన్నారు. ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ గార్లపాటి నందకిషోర్, నగర మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఈదర కృష్ణమూర్తి సమావేశంలో పాల్గొన్నారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాగళ్ళకిషోర్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, నగరానికి చెందిన పలువురు వైద్యులు మెగా వాక్‌లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment