న్యూయార్క్ : మనలో చాలామంది కొన్నిసార్లు ఒంటరితనాన్ని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం. ఒంటరిగా, సమాజానికి దూరంగా జీవించాలని అభిప్రాయపడుతుంటాం. అప్పుడే ఎలాంటి బాదరాబందీ ఉండవని భావిస్తుంటాం. అయితే అలా ఎక్కువ రోజులు ఎవరూ ఒంటరిగా జీవించలేమట. ఎక్కువ కాలం ఒంటరిగా బ్రతికే వాళ్లకి గుండెపోటులు, గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా సంభవిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. ఒంటరిగా, సమాజానికి దూరంగా జీవించేవాళ్లకి 29 శాతం ఎక్కువగా గుండెకు సంబంధించిన సమస్యలు, 32 శాతం హార్ట్ స్ట్రోకుల కలిగి ఉంటున్నారని తేల్చారు.
ఒంటరితనాన్ని, సమాజానికి దూరంగా జీవించేవాళ్లని గుర్తించి, ఈ రెండింటికి సంబంధించిన సమస్యల నుంచి వారిని కాపాడటం ప్రధానమైన కర్తవ్యంగా బ్రిగ్హం యంగ్ యూనివర్సిటీ పరిశోధకలు పేర్కొన్నారు. సంపన్న దేశాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
లక్షా 81 వేల మంది పెద్దలపై మూడు నుంచి 21 ఏళ్లు జరిపిన ఈ పరిశోధనలో, 4,628 కేసులు గుండెకు సంబంధించిన వ్యాధులుగా నమోదు అవగా, మూడువేల స్ట్రోకులను పరిశోధకులు గుర్తించారు. ఎలాంటి వ్యాధులు రాకుండా మనశ్శాంతిగా జీవించేందుకు సామాజికంగా అందరితో కలివిడిగా ఉండాలని తెలిపారు. అయితే టెక్నాలజీ అభివద్ధి చెందుతున్న నేపథ్యంలో సామాజికంగా సంబంధాలు ఏర్పరుచుకోవడం కోసం సమర్ధవంతమైన జోక్యాల రూపకల్పనే అతిపెద్ద సవాలని పరిశోధకులు తమ నివేదికల్లో పేర్కొన్నారు.