జైల్లో ఉండేందుకే మొగ్గు చూపుతున్న జపాన్ వృద్ధ మహిళలు
అక్కడంతా.. చేతులు ముడతలు పడిపోయి, నడుములు ఒంగిపోయి.. కొందరు వాకర్ల సహాయంతో.. ఇంకొందరు సహాయకుల ఆసరాతో కారిడార్లలో నెమ్మదిగా తిరుగుతూ ఉంటారు. భోజనం, మందులు ఇచ్చేది కూడా సహాయకులే. అది కచ్చితంగా వృద్ధాశ్రమం అని అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే అది జపాన్ రాజధాని టోక్యోలోని అతి పెద్ద మహిళా జైలు. వృద్ధ మహిళలు నేరాలు చేసి మరీ ఈ జైలుకు వస్తున్నారు. ఇంటి దగ్గరకంటే వారు జైలులో ఉండటానికే ఇష్టపడటానికి కారణం తెలియాలంటే ఇది చదవాల్సిందే!
వినడానికి వింతగా ఉన్నా.. జపాన్‌లోని వృద్ధ మహిళలు జైళ్లలో ఉండేందుకే ఇష్టపడుతున్నారు. అందుకు ప్రధాన కారణం ఒంటరితనం. బయట వారికి లేని సాంగత్యం జైళ్లలో దొరుకుతోంది. అంతేకాదు క్రమం తప్పకుండా ఆహారం, ఉచిత ఆరోగ్య సంరక్షణ, వృద్ధాప్యంలో కావాల్సిన ఆసరా ఇక్కడ లభిస్తోంది. దీంతో జైలుకు వచ్చేందుకే ఇష్టపడుతున్నారు. యోకో అనే 51 ఏళ్ల మహిళ గత 25 ఏళ్లలో ఐదుసార్లు జైలు శిక్ష అనుభవించారు. తాను వచ్చిన ప్రతిసారీ జైలు జనాభా పెరిగినట్లు కని్పస్తోందని చెబుతున్నారు.
ఒంటరితనానికి తోడు పేదరికం..
జైలులోకి రావడానికి అత్యధిక మంది చేసే నేరం దొంగతనం. వృద్ధ ఖైదీలు, ముఖ్యంగా మహిళల్లో దొంగతనం సర్వసాధారణమైన నేరం. 2022లో దేశవ్యాప్తంగా 80 శాతానికి పైగా వృద్ధ మహిళా ఖైదీలు దొంగతనాలకు పాల్పడి జైళ్లలో ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కొందరు ఒంటరిగా ఉండలేక దొంగతనాలకు పాల్పడుతుంటే మరికొంతమంది మనుగడ కోసం చేస్తున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) ప్రకారం.. జపాన్‌లో 65 ఏళ్లు పైబడిన వారిలో 20% మంది పేదరికంలో నివసిస్తున్నారు.
సంస్థలో ఉన్న 38 సభ్య దేశాలలో ఈ సగటు 14.2% శాతం ఉండగా.. జపాన్‌దే అత్యధికం. పేదరికంలో ఉన్న పిల్లలు సైతం.. తమ తల్లిదండ్రులు ఆకలితో ఉండే కంటే ఇలా దూరంగా వెల్లిపోవడమే మంచిదని కోరుకుంటున్నారు. ఇదే జైలులో ఉన్న 81 ఏళ్ల అకియో పేదరికం, ఒంటరితనం రెండింటితో బాధపడుతున్నారు. రెండు నెలలకోసారి వచ్చే నామమాత్రపు పెన్షన్ ఆమెకు జీవనాధారం. ఆర్థిక స్థిరత్వం, సౌకర్యవంతమైన జీవనశైలిఉంటే కచి్చతంగా ఇలా చేసి ఉండేదాన్ని కాదని చెబుతారామె. గతంలో ఆహారాన్ని దొంగిలించిన కేసులో జైలు శిక్ష అనుభవించిన అకియో.. జైలుకు రావడం ఇదిరెండోసారి.
ఉచిత వైద్యం..
అనారోగ్యానికి గురైన వారు జైలులో ఉంటే వారికి ఉచిత వైద్యం అందుతుంది. బయటికి వెళ్తే దానికోసం ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తోంది. దీంతో కొంతమంది సాధ్యమైనంత ఎక్కువకాలం ఇక్కడ ఉండాలని కోరుకుంటారని జైలు గార్డు షిరానాగ తెలిపారు. ఇప్పటికీ జైళ్లు తెల్ల వెంట్రుకలు కలిగిన ఖైదీలతో నిండిపోయాయి. టోచిగిలో ఉన్న జైలులో ఐదుగురు ఖైదీలలో ఒకరు వృద్ధులు. ఇక్కడ ఒక్కచోటే కాదు.. జపాన్ అంతటా, 2003 నుంచి 2022 వరకు 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఖైదీల సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ఇది జైలు స్వభావాన్ని మార్చింది. ఇప్పుడవి వృద్ధాశ్రమాల్లా ఉన్నాయి. ఇక్కడ వారికి సహాయకులు ఖైదీలు తినడానికి, వారి స్నానానికి, డైపర్లు మార్చడానికి కూడా సహాయపడాలని షిరానాగ చెప్పారు. అది దోషులతో నిండిన జైలు కంటే నర్సింగ్ హోమ్ లాగా అనిపిస్తుందని చెబుతారాయన.
సహాయక సిబ్బంది కొరత..
జపాన్‌లో వయోవృద్ధుల జనాభా చాలా వేగంగా పెరుగుతోంది. దీంతో సహాయక సిబ్బంది కొరత కూడా పెరుగుతోంది. 2040 నాటికి 21 లక్షల మంది సంరక్షణ కారి్మకులు అవసరమవుతారని ప్రభుత్వం తెలిపింది. జనాభా మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేయడానికి విదేశాల నుంచి ఉద్యోగులను తీసుకోవడానకి తంటాలు పడుతోంది. ఇక జైలులో నర్సింగ్ అర్హతలు ఉన్న ఖైదీలను ఇతర వృద్ధ ఖైదీలకు నర్సింగ్ సంరక్షణను అందించమని అధికారులు కోరుతున్నారు. దీంతో వృద్ధ ఖైదీలను చూసుకోవడానికి తగినంత మంది జైలు సిబ్బంది లేనప్పుడు వారు సహాయపడుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment