
సెమీఫైనల్ బెర్త్ కోసం ఇరు జట్ల పోరు
గెలిచిన జట్టుకు కాంస్యం ఖాయం
చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియా చేతిలో టీమిండియా ఓటమి
కింగ్‌డావో (చైనా): ఆసియా మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు కాంస్య పతకాన్ని నిలబెట్టుకునేందుకు విజయం దూరంలో నిలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్ జట్టుతో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటుంది. గురువారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో పోరాడి ఓడిపోయింది.
తొలి మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో ద్వయం 21–11, 12–21, 15–21తో కి డాంగ్ జు–జియోంగ్ నా యున్ (కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో మాళవిక బన్సోద్ 9–21, 10–21తో సిమ్ యు జిన్ చేతిలో పరాజయం పాలైంది. దాంతో భారత్ 0–2తో వెనుకబడింది. మూడో మ్యాచ్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్ 17–21, 21–18, 21–19తో చో జియోన్‌యోప్‌పై గెలుపొందాడు.
నాలుగో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 19–21, 21–16, 21–11తో కిమ్ ఇన్ జి–కిమ్ యు జుంగ్ జంటను ఓడించడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో సాతి్వక్ సాయిరాజ్–అర్జున్ జంట 14–21, 21–23తో జిన్ యోంగ్–నా సుంగ్ సెయోంగ్ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖరారైంది.
Comments
Please login to add a commentAdd a comment