![Team Indias shuttlers won all five matches](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/shuttle.jpg.webp?itok=NV6HSmmo)
క్వార్టర్ ఫైనల్లో భారత్
ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన టీమిండియా షట్లర్లు
కింగ్‌డావో (చైనా): ఆసియా మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. మకావు జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5–0 తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో భారత జట్టుకు క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. మంగళవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియా చేతిలో ఓడిన మకావు జట్టు వరుసగా రెండో ఓటమితో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.
ఇప్పటికే క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన దక్షిణ కొరియా నేడు భారత జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్ ‘డి’ టాపర్‌గా నిలుస్తుంది. తొలి మ్యాచ్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్యా వరియత్ జోడీ 21–10, 21–9తో లోక్ చోంగ్ లియోంగ్–వెంగ్ చి ఎన్జీ జంటను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21–16, 21–12తో పాంగ్ ఫాంగ్ పుయ్‌పై గెలవడంతో భారత ఆధిక్యం 2–0కు పెరిగింది.
మూడో మ్యాచ్‌లో రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ 21–15, 21–9తో హావో వాయ్ చాన్‌ను ఓడించడంతో భారత్ 3–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది.నాలుగో మ్యాచ్‌లో చిరాగ్ శెట్టి–అర్జున్ ద్వయం 21–15, 21–19తో చిన్ పోన్ పుయ్–కోక్ వెన్ వోంగ్ జోడీపై... ఐదో మ్యాచ్‌లో ట్రెసా జాలీ–పుల్లెల గాయత్రి జంట 21–10, 21–5తో ఎన్జీ వెంగ్ చి–పుయ్ చి వా ద్వయంపై గెలుపొందడంతో భారత విజయం 5–0తో సంపూర్ణమైంది. 2023లో దుబాయ్‌లో జరిగిన ఆసియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment