macau
-
కరోనా వైరస్ తీవ్రతరం
బీజింగ్/న్యూఢిల్లీ: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ రోజు రోజుకూ బలం పుంజుకుంటోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా మొత్తం 41 మంది మరణించగా ఒక్క చైనాలోనే 1287 మందికిపైగా వ్యాధి బారినపడినట్లు.. వీరిలో 237 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో 1,965 మంది వ్యాధిబారిన పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కరోనా వైరస్ ఇప్పటికే హాంకాంగ్, మకావు, తైవాన్, నేపాల్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, వియత్నాం, అమెరికాలకు విస్తరించగా భారత్‌లోనూ ఈ వ్యాధిపై ఆందోళన మొదలైంది. మధ్య చైనా ప్రాంతంలోని వూహాన్, హుబే యూనివర్సిటీల్లో సుమారు 700 మంది భారతీయ విద్యార్థులు ఉండటం దీనికి కారణమవుతోంది. భారత దౌత్య కార్యాలయం ఇప్పటికే ఈ విద్యార్థులను సంప్రదించేందుకు హాట్లైన్లను ఏర్పాటు చేయడం గమనార్హం. వూహాన్లో కొత్త ఆసుపత్రి... కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వైరస్‌కు మూలకేంద్రంగా భావిస్తున్న వూహాన్ నగరంలో కొత్తగా ఇంకో ఆసుపత్రిని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండు వారాల్లోపు ఇక్కడ 1000పడకలతో మరో ఆసుపత్రిని కడతామని ప్రభుత్వం చెబుతోంది. వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు మిలటరీ వైద్యులను రంగంలోకి దింపింది. వూహాన్‌తోపాటు పరిసరాల్లోని సుమారు 12 నగరాల్లో రవాణాపై నిషేధం కొనసాగుతూండగా, శనివారం నాటి కొత్త సంవత్సర వేడుకలపై దీని ప్రభావం కనిపించింది. బీజింగ్‌లోనూ కొత్త సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన పలు ప్రత్యేక కార్యక్రమాలు రద్దయ్యాయి. ఫర్బిడన్ సిటీ, షాంఘైలోని డిస్నీల్యాండ్ వంటి పర్యాటక ప్రాంతాలనూ మూసివేశారు. టీకా తయారీకీ యత్నాలు కరోనా వైరస్ బారి నుంచి కాపాడేందుకు చైనా, అమెరికన్ శాస్త్రవేత్తలు టీకా తయారీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ వైరస్ బారిన పడితే వ్యాధి లక్షణాలను నియంత్రించడం మినహా ప్రస్తుతం ఏరకమైన చికిత్స లేదు. చైనా మొత్తం తనిఖీలు కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశం మొత్తమ్మీద తనఖీలు చేపట్టాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. విమానాలు, రైళ్లు, బస్సుల్లోనూ వైరస్ సోకిన వారి కోసం పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టాలని, ప్రత్యేక తనిఖీ కేంద్రాల ద్వారా నుమోనియా లక్షణాలతో ఉన్న వారిని గుర్తించి ఎప్పటికప్పుడు వారిని వైద్య కేంద్రాలకు తరలించాలని నేషనల్ హెల్త్ కమిషన్ శనివారం ఒక ప్రకటనలో ఆదేశించింది. అమెరికాలో మరో కేసు అమెరికాలోని షికాగోలో తాజాగా ఒక మహిళ ఈ వ్యాధి బారిన పడింది. మరో యాభైమందిని పరిశీలనలో ఉంచారు. జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే నేపాల్లోనూ 32 ఏళ్ల పురుషుడు ఒకరు ఈ వ్యాధి బారిన పడ్డారు. వూహాన్ నుంచి ఇటీవలే నేపాల్ వచ్చిన ఇతడికి ప్రస్తుతం ఖట్మండూలో చికిత్స అందించి డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు. యూరప్‌లోని ఫ్రాన్స్‌లో ఇద్దరికి ఈ వ్యాధి సోకినట్లు వార్తలు వస్తూండటం ఆందోళన కలిగిస్తోంది. -
జెయింట్ పాండాకు కవలపిల్లలు పుట్టాయ్!
మకావుః చైనాలోని మకావులో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తొలిసారిగా ఓ పాండా కవలపిల్లలకు జన్మనివ్వడం ఇప్పుడక్కడ హాట్ టాపిక్ గా మారింది. మకావు కు చెందిన జిన్ జిన్ అనే పాండాకు దాని పెవిలియన్ లో రెండు మగ పాండా పిల్లలు పుట్టాయి. దీంతో మకావు ప్రాంతంలో పిల్లలు పెట్టిన మొదటి పాండాగా జిన్ జిన్ ను అధికారులు గుర్తించారు. పాండాకు పుట్టిన రెండు పిల్లల్లో ఒకటి పూర్తి ఆరోగ్యంగా ఉండగా, మరోటి కాస్త అనారోగ్యంతోనూ, బరువు తక్కువగా ఉండటంతో దాన్ని ఇంటెన్సివ్ కేర్ లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. పాండాల జాతి అంతరించిపోతున్న తరుణంలో మకావులోని జెయింట్ పాండా జిన్ జిన్ కు కవల పిల్లలు పుట్టడం అక్కడివారికి అపురూపంగా మారింది. అందుకే వాటి సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జ్యూ లో నివసించే పాండాల్లో గర్భధారణ సహజంగా జరగకపోవడంతో కృత్రిమ గర్భధారణ పద్ధతులను కూడ చేపట్టి పాండాల సంతతి పెంచేందుకు అధికారులు చర్యలు కృషి చేస్తున్నారు. సాధారణంగా కవల పిల్లలు ఒకరు ఆరోగ్యంగా ఉంటే, మరొకరు కాస్త బలహీనంగా ఉండటం చూస్తుంటాం. అలాగే ప్రస్తుతం జెయింట్ పాండాకు పుట్టిన రెండు పిల్లల్లో ఒకటి పూర్తి ఆరోగ్యంగా ఉండగా, మరొకటి కాస్త బలహీనంగా ఉండి, బరువు తక్కువగా ఉండటంతో దాని ఆరోగ్య రక్షణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతన్నారు. ఇంటెన్సివ్ కేర్ లో పెట్టి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. జిన్ జిన్.. కై కై.. జంటను గత ఏడాది చైనా మెయిన్ ల్యాండ్.. మకావుకు బహుమతిగా ఇచ్చింది. అదే జంటకు ప్రస్తుతం కవల పిల్లలు పుట్టడంతో మకావు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జెయింట్ పాండాకు పుట్టిన పిల్లల్లో ఒకటి 138 గ్రాముల బరువు ఉండగా, మరోటి మాత్రం కేవలం 53.8 గ్రాములే ఉండటంతో దాన్ని ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి, వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిన్ జిన్ ప్రసవం కోసం మకావు అధికారులు జూన్ 14 నుంచే పెవిలియన్ ను కూడ మూసి ఉంచారు. -
భారత జట్లకు మిశ్రమ ఫలితాలు
తైపీ: ఆసియా స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో పురుషుల జట్టు తొలుత జపాన్ చేతిలో 1-2తో ఓడింది. రెండో మ్యాచ్‌లో 3-0తో మకావుపై నెగ్గింది. మరోవైపు మహిళల జట్టు 1-2 తేడాతో మలేసియా చేతిలో ఓటమి పాలైంది. -
మకావులో కేక
అద్వితీయ విజయాలను అలవోకగా అందుకుంటున్న ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు.. మకావు ఓపెన్‌లోనూ సత్తా చాటింది. ఇటీవల జరిగిన నాలుగు ఈవెంట్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. ఈ టోర్నీలో మాత్రం చెలరేగింది. ఫైనల్లో మిచెల్లిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ కేవలం 38 నిమిషాల్లోనే టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది సింధుకు ఇది రెండో టైటిల్ కావడం విశేషం. మకావు: నెట్ వద్ద పూర్తి అప్రమత్తత... మెరుగైన డ్రాప్ షాట్లు.. అవసరమైనప్పుడు వరుసగా పాయింట్లు గెలవడం... ఆట ఆరంభం నుంచి చివరి దాకా పట్టువిడవని ఆధిపత్యం... మకావు ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పి.వి.సింధు ఆటతీరు ఇది. బలమైన స్మాష్‌లు లేకపోయినా... సుదీర్ఘ ర్యాలీలు ఆడకపోయినా... ప్రత్యర్థి ఆటతీరుకు అనుగుణంగా షాట్లలో భిన్నత్వాన్ని రాబట్టిన హైదరాబాద్ అమ్మాయి... మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్ట్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ సింధు 21-15, 21-12తో ఏడోసీడ్, ప్రపంచ 30వ ర్యాంకర్ లీ మిచెల్లి (కెనడా)పై విజయం సాధించింది. తద్వారా ఈ ఏడాది రెండో గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల జరిగిన నాలుగు ఈవెంట్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ ఏపీ ప్లేయర్ ఈ టోర్నీలో మాత్రం దుమ్మురేపింది. ఫైనల్లో 38 నిమిషాలలోనే ప్రత్యర్థిని ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. రెండు నిమిషాల్లోనే... ఆట ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే సింధు 7-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆరంభంలో సుదీర్ఘమైన ర్యాలీలు ఆడకుండా అటాకింగ్ గేమ్‌ను ఆడింది. అయితే ఒక్కో పాయింట్‌తో నెట్టుకొచ్చిన మిచెల్లి ఎట్టకేలకు ఓ దశలో సింధు ఆధిక్యాన్ని 9-6కి తగ్గించింది. అయినప్పటికీ ఏపీ అమ్మాయి దూకుడు మాత్రం తగ్గలేదు. స్కోరు 13-8 ఉన్న దశలో సింధు వరుసగా మూడు పాయింట్లు సాధించి 16-8 ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత ఒకటి, రెండు పాయింట్లతో 20-12కు చేరుకుంది. అయితే ఈ దశలో మిచెల్లి వరుసగా మూడు పాయింట్లు సాధించి ఊపుమీద కనిపించినా.. సింధు మెరుగైన డ్రాప్ షాట్‌తో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ ఆరంభంలో మిచెల్లి నెట్ వద్ద ఆధిపత్యం కనబర్చడంతో ఇద్దరు క్రీడాకారిణిలు పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడ్డారు. దీంతో స్కోరు 6-6తో సమమైంది. ఈ దశలో బేస్‌లైన్ ఆట తీరుతో చెలరేగిన సింధు వరుసగా 8 పాయింట్లు గెలిచి 14-6 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత షాట్లలో భిన్నత్వాన్ని రాబడుతూ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో సింధు స్మాష్‌ల ద్వారా 5, నెట్ వద్ద 4 పాయింట్లు గెలుచుకుంది. ఈ ఏడాది సూపర్... అంతర్జాతీయ సర్క్యూట్లో విశేషంగా రాణించిన సింధు... ఈ ఏడాది కూడా నిలకడగానే ఆడుతోంది. మధ్యలో కొన్ని రోజులు ఫామ్ కోల్పోయినా మెగా ఈవెంట్లలో మాత్రం తన జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉంది. మే నెలలో మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఆమె ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ సత్తా చాటింది. ఈ టోర్నీ వరుస మ్యాచ్‌ల్లో చైనా ప్రత్యర్థులను కంగుతినిపించి కాంస్య పతకం గెలుచుకుంది. దీంతో ఈ మెగా ఈవెంట్లో పతకాన్ని గెలుచుకున్న తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. 1983 (ప్రకాశ్ పదుకొనే) తర్వాత మళ్లీ భారత్‌కు పతకాన్ని అందించిన ఘనతనూ సొంతం చేసుకుంది. తర్వాత జపాన్, డెన్మార్క్, ఫ్రెంచ్, హాంకాంగ్ ఓపెన్‌లో ఫామ్ కోల్పోయినా మకావు టోర్నీలో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగి టైటిల్‌ను దక్కించుకుంది. ‘తప్పులు చేయకపోతే టైటిల్ గెలుస్తాననే నమ్మకంతో ఉన్నా. సెమీస్‌లో చైనా ప్లేయర్‌పై గెలవడం ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. దీంతో పూర్తి నమ్మకంతో ఫైనల్లోకి అడుగుపెట్టాను. కాబట్టి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఆడా’ - సింధు ‘సింధు మకావు ఓపెన్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది అద్భుతంగా నడుస్తోంది. అర్జున అవార్డు రావడం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలవడం, ఇప్పుడు ఈ టైటిల్‌ను సాధించడం. మొత్తానికి ఏడాది చివర్లో మేం చాలా సంతృప్తిగా ఉన్నాం. వచ్చే ఏడాది జరిగే పెద్ద టోర్నీల్లో కూడా సింధు మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని ఆశిస్తున్నా. ఈ విషయంలో కోచ్ గోపీచంద్ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు’. - పి.వి.రమణ, విజయ (సింధు తల్లిదండ్రులు) ‘చైనా ఓపెన్‌కు దూరంగా ఉండటం సింధుకు అనుకూలించింది. నెల రోజుల శిక్షణ, మా ప్రణాళికలు బాగా పని చేశాయి. ఈ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా ఆటలో వేగం, దూకుడుపై ఎక్కువగా దృష్టిపెట్టాం. మకావు ఓపెన్‌లో వీటిని సమర్థంగా ప్రయోగించింది’. - గోపీచంద్ (చీఫ్ కోచ్)