మకావులో కేక
అద్వితీయ విజయాలను అలవోకగా అందుకుంటున్న ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు.. మకావు ఓపెన్‌లోనూ సత్తా చాటింది. ఇటీవల జరిగిన నాలుగు ఈవెంట్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. ఈ టోర్నీలో మాత్రం చెలరేగింది. ఫైనల్లో మిచెల్లిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ కేవలం 38 నిమిషాల్లోనే టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది సింధుకు ఇది రెండో టైటిల్ కావడం విశేషం.
మకావు: నెట్ వద్ద పూర్తి అప్రమత్తత... మెరుగైన డ్రాప్ షాట్లు.. అవసరమైనప్పుడు వరుసగా పాయింట్లు గెలవడం... ఆట ఆరంభం నుంచి చివరి దాకా పట్టువిడవని ఆధిపత్యం... మకావు ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పి.వి.సింధు ఆటతీరు ఇది. బలమైన స్మాష్‌లు లేకపోయినా... సుదీర్ఘ ర్యాలీలు ఆడకపోయినా... ప్రత్యర్థి ఆటతీరుకు అనుగుణంగా షాట్లలో భిన్నత్వాన్ని రాబట్టిన హైదరాబాద్ అమ్మాయి... మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్ట్ టోర్నీలో విజేతగా నిలిచింది.
ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ సింధు 21-15, 21-12తో ఏడోసీడ్, ప్రపంచ 30వ ర్యాంకర్ లీ మిచెల్లి (కెనడా)పై విజయం సాధించింది. తద్వారా ఈ ఏడాది రెండో గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల జరిగిన నాలుగు ఈవెంట్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ ఏపీ ప్లేయర్ ఈ టోర్నీలో మాత్రం దుమ్మురేపింది. ఫైనల్లో 38 నిమిషాలలోనే ప్రత్యర్థిని ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.
రెండు నిమిషాల్లోనే...
ఆట ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే సింధు 7-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆరంభంలో సుదీర్ఘమైన ర్యాలీలు ఆడకుండా అటాకింగ్ గేమ్‌ను ఆడింది. అయితే ఒక్కో పాయింట్‌తో నెట్టుకొచ్చిన మిచెల్లి ఎట్టకేలకు ఓ దశలో సింధు ఆధిక్యాన్ని 9-6కి తగ్గించింది. అయినప్పటికీ ఏపీ అమ్మాయి దూకుడు మాత్రం తగ్గలేదు. స్కోరు 13-8 ఉన్న దశలో సింధు వరుసగా మూడు పాయింట్లు సాధించి 16-8 ఆధిక్యంలోకి వెళ్లింది.
తర్వాత ఒకటి, రెండు పాయింట్లతో 20-12కు చేరుకుంది. అయితే ఈ దశలో మిచెల్లి వరుసగా మూడు పాయింట్లు సాధించి ఊపుమీద కనిపించినా.. సింధు మెరుగైన డ్రాప్ షాట్‌తో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ ఆరంభంలో మిచెల్లి నెట్ వద్ద ఆధిపత్యం కనబర్చడంతో ఇద్దరు క్రీడాకారిణిలు పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడ్డారు. దీంతో స్కోరు 6-6తో సమమైంది. ఈ దశలో బేస్‌లైన్ ఆట తీరుతో చెలరేగిన సింధు వరుసగా 8 పాయింట్లు గెలిచి 14-6 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత షాట్లలో భిన్నత్వాన్ని రాబడుతూ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో సింధు స్మాష్‌ల ద్వారా 5, నెట్ వద్ద 4 పాయింట్లు గెలుచుకుంది.
ఈ ఏడాది సూపర్...
అంతర్జాతీయ సర్క్యూట్‌లో విశేషంగా రాణించిన సింధు... ఈ ఏడాది కూడా నిలకడగానే ఆడుతోంది. మధ్యలో కొన్ని రోజులు ఫామ్ కోల్పోయినా మెగా ఈవెంట్లలో మాత్రం తన జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉంది. మే నెలలో మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఆమె ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ సత్తా చాటింది.
ఈ టోర్నీ వరుస మ్యాచ్‌ల్లో చైనా ప్రత్యర్థులను కంగుతినిపించి కాంస్య పతకం గెలుచుకుంది. దీంతో ఈ మెగా ఈవెంట్‌లో పతకాన్ని గెలుచుకున్న తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. 1983 (ప్రకాశ్ పదుకొనే) తర్వాత మళ్లీ భారత్‌కు పతకాన్ని అందించిన ఘనతనూ సొంతం చేసుకుంది. తర్వాత జపాన్, డెన్మార్క్, ఫ్రెంచ్, హాంకాంగ్ ఓపెన్‌లో ఫామ్ కోల్పోయినా మకావు టోర్నీలో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగి టైటిల్‌ను దక్కించుకుంది.
‘తప్పులు చేయకపోతే టైటిల్ గెలుస్తాననే నమ్మకంతో ఉన్నా. సెమీస్‌లో చైనా ప్లేయర్‌పై గెలవడం ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. దీంతో పూర్తి నమ్మకంతో ఫైనల్లోకి అడుగుపెట్టాను. కాబట్టి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఆడా’
- సింధు
‘సింధు మకావు ఓపెన్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది అద్భుతంగా నడుస్తోంది. అర్జున అవార్డు రావడం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలవడం, ఇప్పుడు ఈ టైటిల్‌ను సాధించడం. మొత్తానికి ఏడాది చివర్లో మేం చాలా సంతృప్తిగా ఉన్నాం. వచ్చే ఏడాది జరిగే పెద్ద టోర్నీల్లో కూడా సింధు మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని ఆశిస్తున్నా. ఈ విషయంలో కోచ్ గోపీచంద్ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు’.
- పి.వి.రమణ, విజయ (సింధు తల్లిదండ్రులు)
‘చైనా ఓపెన్‌కు దూరంగా ఉండటం సింధుకు అనుకూలించింది. నెల రోజుల శిక్షణ, మా ప్రణాళికలు బాగా పని చేశాయి. ఈ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా ఆటలో వేగం, దూకుడుపై ఎక్కువగా దృష్టిపెట్టాం. మకావు ఓపెన్‌లో వీటిని సమర్థంగా ప్రయోగించింది’.
- గోపీచంద్ (చీఫ్ కోచ్)