p.v sindhu
-
క్వార్టర్స్ లో శ్రీకాంత్, సింధు
పెనాంగ్ (మలేసియా): భారత టాప్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, పి.వి.సింధులు... మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండోసీడ్ శ్రీకాంత్ 21-17, 21-10తో 16వ సీడ్ బున్సాక్ పోన్సానా (థాయ్‌లాండ్)పై గెలిచాడు. 33 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... తొలి గేమ్‌లో స్కోరు 11-11తో సమమైన తర్వాత శ్రీ వెనుదిరిగి చూడలేదు. వరుస పాయింట్లతో ప్రత్యర్థిని కట్టిపడేశాడు. ఇక రెండో గేమ్‌లో ఆరంభం నుంచే శ్రీకాంత్ హవా చూపెట్టాడు. 7-0తో మొదలుపెట్టి చకచకా రెండు, మూడు పాయింట్లతో గేమ్‌ను ఏక పక్షంగా మార్చేశాడు. సింగిల్ పాయింట్లకే పరిమితమైన పోన్సానా ఏ దశలోనూ శ్రీకాంత్‌ను అందుకోలేకపోయాడు. మరో మ్యాచ్‌లో 10వ సీడ్ అజయ్ జయరామ్ 11-21, 21-8, 22-20తో జుల్ఫాద్లి జుల్కిఫ్లి (మలేసియా)ని ఓడించాడు. మహిళల ప్రిక్వార్టర్స్‌లో మూడోసీడ్ సింధు 21-13, 13-21, 21-14తో కారి ఇమాబీప్ (జపాన్)పై గెలిచింది. గంటా మూడు నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... హైదరాబాదీకి ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలి గేమ్‌లో హోరాహోరీగా తలపడిన సింధు... రెండో గేమ్‌ను చేజార్చుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తన అనుభవాన్ని రంగరించి స్పష్టమైన ఆధిక్యంతో చెలరేగింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో జ్వాల-అశ్విని 14-21, 17-21తో షిజుకా మత్స్వో-మామి నైటో (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. -
మాలవీయకు ‘భారతరత్న’
ఆయన కుటుంబానికి అందజేసిన రాష్ట్రపతి ఎల్కే అద్వానీ, ప్రకాశ్‌సింగ్ బాదల్‌లకు ‘పద్మ విభూషణ్’ షట్లర్ సింధుకు ‘పద్మశ్రీ’ న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు, బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవీయకు మరణానంతరం ప్రకటించిన ‘భారత రత్న’ అవార్డును ఆయన కుటుంబ సభ్యులు సోమవారం అందుకున్నారు. రాష్ట్రపతిభవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాలవీయ మనవరాళ్లు, మనవళ్లు హేమ్ శర్మ, సరస్వతిశర్మ, ప్రేమ్‌ధర్, గిరిధర్‌లకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అత్యున్నత అవార్డును ప్రదానం చేశారు. దీనితోపాటు ‘పద్మ’ పురస్కారాలనూ ఆయన ప్రదానం చేశారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్, జగద్గురు స్వామి రాంభద్రాచార్యలకు పద్మ విభూషణ్ అవార్డును, ప్రఖ్యాత న్యాయవాది హరీశ్ సాల్వే, జర్నలిస్టులు స్వపన్ దాస్‌గుప్తా, రజత్ శర్మ, నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌కు సహకరించిన జపనీయుడు సైచిరో మిసుమి, రెజ్లర్ సత్పాల్లకు పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేశారు. ఇక బాలీవుడ్ ప్రముఖులు సంజయ్ లీలా భన్సాలీ, ప్రసూన్ జోషితో పాటు తెలుగు వారైన షట్లర్ పి.వి.సింధు, డాక్టర్ మంజుల అనగాని, కన్యాకుమారి అవసరాల, జయకుమారి చిక్కాల, రఘురామ పిల్లారిశెట్టిలతో పాటు మరికొందరికి పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం మాజీ ప్రధానులు అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కానీ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సహా కాంగ్రెస్ నేతలెవరూ హాజరుకాకపోవడం గమనార్హం. కాగా ఎన్డీయే సర్కారు మొత్తంగా 109 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా.. 43 మందికి సోమవారం ప్రదానం చేశారు. మరో ఆరుగురికి ఆహ్వానం పంపినా.. వారు హాజరుకాలేదు. భారత మహిళ క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్ (క్రీడలు) తెలంగాణ, కోట శ్రీనివాసరావు (కళలు) ఆంధ్రప్రదేశ్, నోరి దత్తాత్రేయుడు (వైద్యం) యూఎస్ఏసహా మిగతా 60 మందికి ఏప్రిల్ 8వ తేదీన నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ‘పద్మ’ గ్రహీతలకు జగన్ అభినందనలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సోమవారం ఢిల్లీలో ‘పద్మ’ పురస్కారాలను అందుకున్న తెలుగు వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన తెలుగువారిని ఈ అవార్డులను ఎంపిక చేయడం ఎంతో సంతోషదాయకమని ఆయన చెప్పారు. వారందరికీ భవిష్యత్‌లో అంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. -
బ్యాడ్మింటన్‌లో ఏపీకి చోటు లేదు!
జాతీయ క్రీడల ఆర్గనైజర్ల నిర్వాకం సాక్షి, హైదరాబాద్: దేశంలో బ్యాడ్మింటన్ అంటేనే గుర్తొచ్చే పేరు హైదరాబాద్. సైనా, సింధు, శ్రీకాంత్‌లాంటి భారత స్టార్ క్రీడాకారులంతా ఇక్కడి వారే. కానీ కేరళలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14వరకు జరిగే జాతీయ క్రీడల్లో మాత్రం వీళ్లు ఆడటానికి అవకాశం లేకుండా పోయింది. క్రీడలను నిర్వహిస్తున్న కేరళ రాష్ట్రం వైఖరి కారణంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక కూడా బ్యాడ్మింటన్ జట్లను పంపలేకపోతున్నాయి. జాతీయ క్రీడల టీమ్ ఈవెంట్లో ఎనిమిది జట్లు బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. గత క్రీడల విజేత, ప్రస్తుత క్రీడల ఆతిథ్య జట్టుతో పాటు ఆరు జోన్స్ నుంచి విజేతలు టోర్నీలో పాల్గొనాలి. సౌత్‌జోన్ విజేత కేరళ కాగా... గత క్రీడల చాంపియన్, ఆతిథ్య రాష్ట్రం కూడా అదే కావడంతో... మరో రెండు జట్లు పాల్గొనేందుకు అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం గత క్రీడల రన్నరప్, సౌత్‌జోన్ రన్నరప్ గేమ్స్‌లో పాల్గోవచ్చు. దీని ప్రకారం గత క్రీడల రన్నరప్ ఆంధ్రప్రదేశ్, సౌత్‌జోన్ రన్నరప్ కర్ణాటకలతో ఎనిమిది జట్లను ప్రకటించారు. అయితే కేరళ దీనికి అభ్యంతరం తెలిపింది. మారిన నిబంధనల ప్రకారం రెండు స్లాట్లు ఖాళీ ఉంటే అన్ని జోన్ల రన్నరప్‌లతో డ్రా తీసి రెండు జట్లను ఎంపిక చేయాలని వాదించింది. దీంతో ఏపీ, కర్ణాటకలలో జ్వాల, అశ్విన్ సహా పలువురు స్టార్ క్రీడాకారులు టీమ్ ఈవెంట్స్‌లో గేమ్స్‌కు దూరం కావాల్సి వస్తోంది. కేరళ క్రీడాకారుల కోసమే... ఈసారి జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన తమ రాష్ట్ర క్రీడాకారుల కోసం కేరళ భారీగా నజరానాలు ప్రకటించింది. పతకాలు గెలిస్తే 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు ఇస్తారు. బ్యాడ్మింటన్‌లో ఏపీ క్రీడాకారులు వస్తే తమ వాళ్లకు పతకాలు రావని కేరళ సంఘం భావించింది. దీంతో నిబంధనలను మార్చాలని ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైంది. ‘నిబంధనల ప్రకారం కర్ణాటక, ఏపీలతో నేను ఎనిమిది జట్ల పేర్లు పంపాను. పాత సంప్రదాయాన్నే పాటించాలని వాదించాను. కానీ కేరళ మాటే చెల్లింది. మనవాళ్లు ఆడితే వాళ్లకు పతకాలు రావని తెలుసు. అందుకే విశ్వప్రయత్నాలు చేసి ఏపీని అడ్డుకున్నారు’ అని బాయ్ కార్యదర్శి పున్నయ్యచౌదరి చెప్పారు. మరోవైపు కర్ణాటక సంఘం అధ్యక్షుడు విమల్ కుమార్ కూడా కేరళ తీరుపై మండిపడ్డారు. నిబంధనలు ఎప్పుడు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ కేరళ సంఘం కార్యదర్శి మురళీధరన్ మాత్రం తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని చెబుతున్నారు. మొత్తానికి స్టార్స్ లేకుండానే జాతీయ క్రీడల బ్యాడ్మింటన్ జరగబోతోంది. -
ముగింపు అదిరేనా!
నేటి మధ్యాహ్నం గం. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం నేటి నుంచి వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ బరిలో సైనా, శ్రీకాంత్ ఇద్దరికీ అనుకూలమైన ‘డ్రా’ ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారత బ్యాడ్మింటన్‌కు ఎన్నో గొప్ప విజయాలు లభించాయి. సైనా నెహ్వాల్, శ్రీకాంత్, సింధు, పారుపల్లి కశ్యప్, ప్రణయ్ తదితరులు అంతర్జాతీయ వేదికలపై తమ రాకెట్‌తో రఫ్పాడించారు. నిలకడైన ఆటతీరుకు ప్రతిఫలంగా సైనా, శ్రీకాంత్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’కు అర్హత సాధిం చారు. బుధవారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్లోనూ ఈ ఇద్దరూ మెరిసి సీజన్ ముగింపును కూడా చిరస్మరణీయం చేస్తారో లేదో వేచి చూడాలి. దుబాయ్: ఈ ఏడాదిలో చివరి పరీక్షకు భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ సిద్ధమయ్యారు. బుధవారం మొదలయ్యే ప్రతిష్టాత్మక ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’లో ఈ ఇద్దరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రోజున మహిళల సింగిల్స్‌లో షిజియాన్ వాంగ్ (చైనా)తో సైనా; పురుషుల సింగిల్స్‌లో కెంటో మొమోటాతో శ్రీకాంత్ తలపడతారు. ‘డ్రా’ను పరిశీలిస్తే... స్థాయికి తగ్గట్టు ఆడితే సైనా, శ్రీకాంత్ కనీసం సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. ఈనెల 21 వరకు జరిగే ఈ టోర్నీ లో మొత్తం ఎనిమిది మందిని నలుగురు చొప్పున రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో సైనా నెహ్వాల్, షిజియాన్ వాంగ్ (చైనా), జీ హ్యున్ సుంగ్ (కొరియా), యోన్ జూ బే (కొరియా) ఉన్నారు. గ్రూప్ ‘బి’లో యిహాన్ వాంగ్ (చైనా), ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్), తై జూ యింగ్ (చైనీస్ తైపీ), అకానె యామగుచి (జపాన్)లకు చోటు కల్పించారు. లీగ్ పోటీల తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్ గ్రూప్‘బి’లో శ్రీకాంత్‌తో కలిపి టామీ సుగియార్తో (ఇండోనేసియా), కెంటో మొమోటా (జపాన్), జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్) ఉన్నారు. గ్రూప్ ‘ఎ’లో చెన్ లాంగ్ (చైనా), సన్ వాన్ హో (కొరియా), కెనిచి టాగో (జపాన్), క్రిస్టియాన్ విటిన్‌గస్ (డెన్మార్క్)లకు చోటు కల్పించారు. రెండు గ్రూప్‌ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 80 వేల డాలర్ల (రూ. 50 లక్షల 56 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ అందజేస్తారు. ఈ ఏడాది జరిగిన మొత్తం 12 సూపర్ సిరీస్ టోర్నమెంట్ల ద్వారా ఐదు విభాగాల్లో (మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) అత్యధికంగా పాయింట్లు సంపాదించిన టాప్-8 మందికి ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’లో ఆడే అవకాశం లభిస్తుంది. ‘‘ఈ టోర్నీ కోసం పకడ్బందీగా సిద్ధమయ్యాను. ఎనిమిది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణులు ఉన్నారు. ముందంజ వేయాలంటే అందరికంటే బాగా ఆడాల్సి ఉంటుంది. చైనా నుంచి యిహాన్ వాంగ్ కంటే షిజియాన్ వాంగ్‌తో ఆడేందుకే ప్రాధాన్యత ఇస్తాను. ఎప్పటిలాగే నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు కృషి చేస్తాను.’’ -సైనా నెహ్వాల్ -
ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తా
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సాక్షి, హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే లక్ష్యంతో వచ్చే ఏడాది మరింత కష్టపడతానని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించింది. ఇదే జోరును వచ్చే ఏడాది కూడా కొనసాగిస్తానని ఆమె చెప్పింది. మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ గెలిచిన తర్వాత స్వస్థలం చేరుకున్న సింధు, మంగళవారం గోపీచంద్ అకాడమీలో మీడియాతో మాట్లాడింది. ‘మకావులో విజయం సాధించడం సంతోషంగా ఉంది. ఈ ఏడాది బాగా ఆడాను. 2015 ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ సంవత్సరం. కాబట్టి ఆ లక్ష్యంతో సన్నద్ధమవుతున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం చైనాతో పాటు జపాన్, కొరియా క్రీడాకారిణులనుంచి కూడా గట్టి పోటీ ఉంటోందన్న సింధు, భవిష్యత్తులో సాధ్యమైనంత తొందరగా సూపర్ సిరీస్ టైటిల్ గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేసింది. ఆట శైలిలో తనకు, సైనాకు తేడా ఉందని సింధు చెప్పింది. సయ్యద్ మోడి టోర్నీతో సింధు కొత్త సీజన్‌ను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ...ఇటీవల భారత ఆటగాళ్లు మంచి విజయాలు సాధించినా ఉదాసీనత పనికి రాదని అన్నారు. మనతో పాటు ఇతర దేశాల యువ ఆటగాళ్లు విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని, ఈ స్థితిలో విశ్రాంతి తీసుకుంటే పరాజయాలు ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. -
టాప్-10లో సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు... తన ర్యాంక్‌ను కూడా మెరుగుపర్చుకుంది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె రెండు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంక్‌లో నిలిచింది. సైనా నెహ్వాల్ మాత్రం ఏడో ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. పురుషుల విభాగంలో కె.శ్రీకాంత్ 22వ ర్యాంక్‌కు ఎగబాకగా, పారుపల్లి కశ్యప్ ఒక స్థానం కోల్పోయి 28వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని 21వ ర్యాంక్‌లో కొనసా గుతున్నారు. -
అనుభవంతో అన్నీ నేర్చుకుంటా
ప్రతిసారీ 100 శాతం ప్రదర్శన ఇవ్వలేం బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: గత ఏడాది కాలంగా తన ఆటలో ఎంతో మార్పు వచ్చిందని, తప్పులు సరిదిద్దుకొని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించింది. డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన సింధు, మంగళవారం స్వస్థలం చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడింది. ‘ఏడాది కాలంలో ఎంతో మంది అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడించాను. నా ఆట కూడా ఎంతో మెరుగైంది. అయితే ప్రతిసారీ 100 శాతం ప్రదర్శన ఇవ్వడం సాధ్యం కాదు. అనుభవం పెరిగిన కొద్దీ తప్పులనుంచి పాఠాలు నేర్చుకుంటున్నాను. నా మొదటి కాంస్యంతో పోలిస్తే ఇదే నాకు ఎక్కువ సంతృప్తినిచ్చింది’ అని సింధు చెప్పింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో ఏడాది పతకం సాధించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ‘చాలా ఆనందంగా ఉంది. సెమీస్‌కు ముందు మ్యాచ్‌లలో అలసిపోవడం వల్ల ఓడానని సాకు చెప్పను. కరోలినా చాలా బాగా ఆడింది. ఆసియా క్రీడల్లో పతకం సాధించడమే ప్రస్తుత నా లక్ష్యం’ అని సింధు వెల్లడించింది. సంతృప్తిగా ఉంది టోర్నీలో భారత ఆటగాళ్ల ప్రదర్శన ఓవరాల్‌గా తనకు సంతృప్తినిచ్చిందని జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ‘సింధు పతకం నిలబెట్టుకోవడం సాధారణ విషయం కాదు. సైనాకు అదృష్టం కలిసి రాలేదు. కశ్యప్, శ్రీకాంత్‌ల నుంచి మరింత మంచి ఫలితాలను ఆశించినా సాధ్యం కాలేదు’ అని గోపి చెప్పారు. మరో వైపు పెద్ద టోర్నీలలో చైనా క్రీడాకారిణులను పరిమిత సంఖ్యలో అనుమతించాలన్న సైనా వ్యాఖ్యలపై స్పందిస్తూ...ఆ అవసరం లేదని, టాప్ టోర్నీల్లో టాప్ ప్లేయర్లు ఆడటం సరైందేనని అభిప్రాయ పడ్డారు. -
ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్స్ లో సైనా, సింధు
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణిలు సైనా నెహ్వాల్ , పి.వి సింధుల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఓపెన్ లో భాగంగా ఈ రోజు జరిగిన ప్రి క్వార్టర్స్ పోరులో వీరివురూ విజయాల్ని నమోదు చేసుకుని క్వార్టర్స్ లోకి ప్రవేశించారు. ఆరో సీడ్ సైనా నెహ్వాల్.. తన ప్రత్యర్థి తులసీని 21-18, 21-15 పాయింట్ల తేడాతో మట్టికరిపించింది. కేవలం 40 నిమిషాల్లో సైనా ఈ మ్యాచ్ ను ముగించి తన సత్తాను మరోసారి చాటింది. మరో ప్రి కార్టర్స్ లో పి.వి.సింధు 21-13, 21-7 తేడాతో నికాన్ జిందాపాన్ ను ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇదిలా ఉండగా పురుషల సింగిల్స్ లో సాయి ప్రణీత్ 15-21, 21-8,19-21 తేడాతో వాన్ జెన్ మింగ్ చేతిలో పరాజయం పాలైయ్యాడు. తొలి సెట్ ను చేజార్చుకున్న ప్రణీత్.. అనంతరం రెండో సెట్ ను గెలుచుకుని విజయం దిశగా పయనించాడు. కాగా, జింగ్ అద్వితీయంగా పుంజుకోవడంతో ప్రణీత్ కు ఓటమి తప్పలేదు. -
ప్రిక్వార్టర్స్‌లో సైనా, సింధు
ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిడ్నీ: భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు... ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్‌లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 9వ ర్యాంకర్, ఆరోసీడ్ సైనా 22-24, 21-17, 21-10తో అన్‌సీడెడ్ సన్ యు (చైనా)పై నెగ్గగా... 8వ సీడ్ సింధు 21-16, 21-14తో య ఓహోరి (జపాన్)ను అలవోకగా ఓడించింది మరో మ్యాచ్‌లో పి.సి.తులసీ 21-16, 21-18తో జెమీ సుబంది (అమెరికా)పై గెలిచింది. ప్రిక్వార్టర్స్‌లో సైనా... తులసీతో; సింధు... నికాన్ జిందాపాన్ (థాయ్‌లాండ్)తో తలపడతారు. సాయిప్రణీత్ విజయం: పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాయి ప్రణీత్ 21-7, 21-11తో హోయ్ కీట్ వూన్ (ఆస్ట్రేలియా)పై గెలవగా... హెచ్.ఎస్. ప్రణయ్ 14-21, 18-21తో మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ 21-16, 21-16తో టెరీ హీ-డెరెక్ వాంగ్ (సింగపూర్)పై; అల్విన్ ఫ్రాన్సిస్-అరుణ్ విష్ణు 21-7, 21-11తో ఫరిమన్ (ఆస్ట్రేలియా)-రేహాన్ (ఇండోనేసియా)పై గెలిచారు. -
మహిళల ‘మరో చరిత్ర’
-
మహిళల ‘మరో చరిత్ర’
తొలి సారి ఉబెర్ కప్ సెమీస్‌లో ప్రవేశం ఇండోనేసియాపై 3-0తో ఘన విజయం ఒలింపిక్స్ పతకం...వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మెడల్...పెద్ద సంఖ్యలో సూపర్ సిరీస్ సంచలనాలు...అనేకంగా గ్రాండ్ ప్రి టైటిల్స్...వ్యక్తిగతంగా భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణుల ఖాతాలో ఇలా చిరస్మరణీయ విజయాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు జట్టుగా, కలిసి కట్టుగా కూడా మన షట్లర్లు సత్తా చాటారు. ఫలితంగా వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్ ఈవెంట్ ఉబెర్ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌కి చేరింది. కనీసం కాంస్యాన్ని ఖాయం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ మహిళల టీమ్ చాంపియన్‌షిప్ ఉబెర్ కప్‌లో భారత జట్టు తొలి సారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇక్కడి సిరిఫోర్ట్ కాంప్లెక్స్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ ఇండోనేసియాను 3-0 తేడాతో చిత్తు చేసింది. తొలి రెండు సింగిల్స్‌లలో సైనా నెహ్వాల్, పీవీ సింధు విజయం సాధించి జట్టును ముందంజలో నిలపగా...ఆ తర్వాత డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడి విజయాన్ని పరిపూర్ణం చేసింది. దీంతో భారత్‌కు కనీసం కాంస్యం ఖాయమైంది. 2010 ఉబెర్‌కప్‌లో భారత్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. ఇప్పటివరకూ అదే అత్యుత్తమం. సెమీస్‌లో జపాన్‌తో భారత్ శుక్రవారం తలపడుతుంది. సైనా అలవోకగా... తొలి సింగిల్స్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-17, 21-10 స్కోరుతో లిండావెని ఫనేత్రిని చిత్తు చేసింది. 45 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ ఆరంభంలో తడబడ్డ సైనా 5-11తో వెనుకబడింది. అయితే ఆ తర్వాత కోలుకొని దూకుడు ప్రదర్శించింది. ఒక దశలో వరుసగా 7 పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఫనేత్రి కొద్దిగా పోరాడినా గేమ్ సైనా వశమైంది. రెండో గేమ్‌లో మాత్రం భారత స్టార్ జోరు కొనసాగింది. మొదటినుంచే చెలరేగిన ఆమె 11-4తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత ఇండోనేసియన్ కోలుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. హోరాహోరీ పోరులో గట్టెక్కిన సింధు రెండో సింగిల్స్‌లో మాత్రం సింధు తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. 84 నిమిషాల సేపు సాగిన ఈ పోరులో సింధు 21-16, 10-21, 25-23 తేడాతో బెలాట్రిక్స్ మనుపుట్టిని ఓడించింది. తొలి గేమ్‌లో సింధు తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చింది. ఒక దశలో 12-8, 17-12తో ఆధిక్యంలోకి వెళ్లింది. విరామం అనంతరం ప్రత్యర్థి కోలుకునే ప్రయత్నం చేసినా అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను ముగించింది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా విరుచుకు పడిన బెలాట్రిక్స్ సునాయాసంగా రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. మూడో గేమ్ మాత్రం హోరాహోరీగా సాగింది. ఇద్దరూ పోటీ పడి పాయింట్లు సాధించడంతో గేమ్ సుదీర్ఘంగా సాగింది. 15-15, 17-17, 20-20...ఇలా సాగిన గేమ్ చివరకు 23-23 వద్ద నిలిచింది. ఈ దశలో సింధు వరుసగా రెండు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను గెలుచుకుంది. డబుల్స్‌లో వరుస గేమ్‌లలో... అనంతరం జరిగిన మూడో మ్యాచ్‌లో విజయం సాధించి జ్వాల-అశ్విని జంట భారత్‌కు సెమీస్ స్థానం ఖరారు చేశారు. ఈ మ్యాచ్‌లో జ్వాల-అశ్విని 21-18, 21-18 స్కోరుతో గ్రేసియా పోలి-నిత్య మహేశ్వరిలపై విజయం సాధించారు. భారత డబుల్స్ ద్వయం చక్కటి సమన్వయంతో ఆడి 38 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. -
భారత్ శుభారంభం
కెనడాపై 5-0తో క్లీన్‌స్వీప్ సైనా, సింధు విజయం పురుషుల జట్టుకు నిరాశ థామస్, ఉబెర్ కప్ టోర్నీ న్యూఢిల్లీ: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత మహిళల జట్టు ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. ఆదివారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో భాగంగా జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 0-0తో కెనడాను ఓడించింది. మూడు సింగిల్స్‌లలో భారత క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి.సింధు, పి.సి.తులసీ తమ ప్రత్యర్థులపై అలవోకగా నెగ్గారు. డబుల్స్ మ్యాచ్‌ల్లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప; సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె జోడీలు గెలుపొందాయి. సైనా 21-14, 21-12తో జాయ్సిలిన్పై; సింధు 21-16, 21-3తో రాచెల్ హోండెరిచ్పై; తులసీ 21-11, 21-13తో టామ్ బ్రిట్నీలపై విజయం సాధించారు. జ్వాల-అశ్విని జోడి 21-11, 21-12తో అలెక్స్ బ్రూస్-చాన్ ఫిలిస్ ద్వయంపై; సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె జంట 20-22, 21-18, 21-16తో గావో గ్రేస్-రాచెల్ హోండెరిచ్ జోడిపై నెగ్గాయి. సోమవారం జరిగే మ్యాచ్‌లో హాంకాంగ్‌తో భారత్ పోటీపడుతుంది. మరోవైపు థామస్ కప్‌లో భారత పురుషుల జట్టుకు తొలి లీగ్ మ్యాచ్‌లో నిరాశ ఎదురైంది. మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-4తో ఓటమి పాలైంది. రెండు సింగిల్స్‌లలో కిడాంబి శ్రీకాంత్ 19-21, 12-21తో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ చేతిలో; పారుపల్లి కశ్యప్ 13-21, 6-21తో వీ ఫెంగ్ చోంగ్ చేతిలో ఓడిపోయారు. మూడో సింగిల్స్‌లో గురుసాయిదత్ 21-18, 13-21, 21-19తో డారెన్ లూపై గెలిచాడు. అయితే డబుల్స్ మ్యాచ్‌ల్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 14-21, 11-21తో బూన్ హోంగ్ తాన్-థియెన్ హూ హూన్ జోడి చేతిలో; అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా జంట 17-21, 21-14, 14-21తో షెమ్ గో-వీ కియోంగ్ తాన్ ద్వయం చేతిలో ఓడిపోయాయి. సోమవారం జరిగే మ్యాచ్‌లో కొరియాతో భారత్ ఢీ కొంటుంది. -
‘ఖేల్ రత్న’కు ఆరు నామినేషన్లు
జాబితాలో పి.వి.సింధు అర్జున అవార్డుకు మళ్లీ మహేశ్వరి పేరు న్యూఢిల్లీ: హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ‘ఖేల్ రత్న’ అవార్డుకు నామినేట్ అయింది. ఈ ఏడాదికిగాను ఖేల్త్న్రకు ఆరుగురు క్రీడాకారుల పేర్లు నామినేట్ కాగా, వారిలో సింధుతోపాటు టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, గోల్ఫ్ ఆటగాడు జీవ్ మిల్కాసింగ్, అథ్లెటిక్స్ నుంచి కృష్ణ పూనియా, వికాస్ గౌడ, పారా అథ్లెట్ దేవేంద్ర ఝఝారియాలు ఉన్నారు. సింధు గత ఏడాదే అర్జున అవార్డు అందుకోగా, కృష్ణ పూనియా చివరి నిమిషం దాకా ఖేల్త్న్ర రేసులో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక అర్జున అవార్డుల కోసం పిస్టల్ షూటర్లు హీనా సిద్ధు, గురుప్రీత్ సింగ్, బ్యాడ్మింటన్ ఆటగాడు అరవింద్ భట్, క్రికెటర్ ఆర్.అశ్విన్ నామినేట్ అయ్యారు. మహేశ్వరిని మళ్లీ నామినేట్ చేసిన ఏఎఫ్ఐ ట్రిపుల్ జంపర్ రంజిత్ మహేశ్వరి పేరును అర్జున అవార్డు కోసం భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ) మళ్లీ ప్రతిపాదించింది. గత ఏడాది మహేశ్వరిని అర్జున అవార్డుకు ఎంపిక చేసినా గతంలో డోప్ టెస్టులో పట్టుబడిన చరిత్ర వల్ల ప్రభుత్వం అతనికి అవార్డును నిరాకరించింది. అయితే 2008లో మహేశ్వరికి శాంపిల్స్‌ను పరీక్షించిన లేబొరేటరీకి అప్పట్లో గుర్తింపు లేదని, 2009లో మాత్రమే గుర్తింపు పొందిందని ఏఎఫ్ఐ అధికారి ఒకరు చెప్పారు. -
సరైన సమయంలో దక్కిన విజయమిది!
‘ఆసియా’ పతకంతో ఆత్మ విశ్వాసం పెరిగింది ఉబెర్ కప్‌లో రాణిస్తా ‘సాక్షి’తో పీవీ సింధు సాక్షి, హైదరాబాద్: గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించడం ద్వారా కెరీర్లో ఒక్కసారిగా దూసుకుపోయిన తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు అంతర్జాతీయ వేదికపై మరో సారి సత్తా చాటింది. ఇటీవలే కొరియాలో ముగిసిన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో కూడా ఆమె కాంస్యం గెలుచుకుంది. ఏబీసీలో మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన రెండో భారత క్రీడాకారిణి సింధు కావడం విశేషం. త్వరలో జరిగే ఉబెర్ కప్‌కు సిద్ధమవుతున్న సింధు... తాజా ప్రదర్శనపై ‘సాక్షి’తో ముచ్చటించింది. విశేషాలు ఆమె మాటల్లోనే... ‘ఆసియా’ కాంస్యం: ఆసియా చాంపియన్‌షిప్‌లో తొలి పతకం సాధించడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఫైనల్‌కు చేరకపోవడం స్వయంకృతం. షిజియాన్ వాంగ్ మంచి ప్లేయరే అయినా తొలి గేమ్ నెగ్గడంతో ఉత్సాహంగా రెండో గేమ్‌లో కూడా బాగా ఆడాను. అయితే ఒక్క పాయింట్ నాకు విజయాన్ని దూరం చేసింది. 20-19 వద్ద సుదీర్ఘ ర్యాలీ ఆడిన సమయంలో కాస్త ఒత్తిడికి గురయ్యా. ఇక మూడో గేమ్‌లో పూర్తిగా పట్టు తప్పాను. అయితే నిరాశ చెందను. ఇది నాకు మంచి అనుభవం. నాలో ఆత్మ విశ్వాసం పెరిగింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు దిద్దుకొని మరిన్ని విజయాలు సాధిస్తా. వరల్డ్ చాంపియన్‌షిప్ తర్వాత మేజర్ గెలుపు: గత ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన తర్వాత అనేక టోర్నీలు ఆడాను. మకావు ఓపెన్ గెలిచినా సూపర్ సిరీస్‌లు, ఇతర ప్రధాన టోర్నీలలో విఫలమయ్యాను. ఆ రకంగా చూస్తే కొంత విరామం తర్వాత మరో పెద్ద టోర్నీలో పతకం నెగ్గాను. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచి దాదాపు ఎనిమిది నెలలు అయింది. అంతర్జాతీయ వేదికపై నన్ను నేను నిరూపించుకోవాలంటే మరో కీలక విజయం అవసరం. అలాంటి సమయంలో ఈ గెలుపు లభించడం అదృష్టం. పైగా ఈ రెండు టోర్నీలలోనూ పతకం నెగ్గిన ఏకైక క్రీడాకారిణిని కావడం కూడా ఆనందంగా అనిపిస్తోంది. చైనా క్రీడాకారిణులతో పోటీ పడటం: ఆసియా చాంపియన్‌షిప్ అంటే సహజంగానే చైనా క్రీడాకారిణులూ ఉంటారు. అంటే దాదాపు ప్రపంచ చాంపియన్‌షిప్ స్థాయి పోరాటమే! ఎందుకంటే ఒక రౌండ్ కాకపోతే మరో రౌండ్‌లోనైనా వారితో పోటీ ఉంటుంది. దానికి సిద్ధమయ్యే వెళ్లాను. కానీ టోర్నీలో సెమీస్‌లో వాంగ్‌తో మినహా మొదటి మూడు మ్యాచుల్లో నేను చైనావాళ్లను ఎదుర్కోలేదు. అయితే ఆ మ్యాచ్‌లో నా ప్రదర్శన చూస్తే వారేమీ అజేయులు కాదని చెప్పవచ్చు. వంద శాతం శ్రమిస్తే ఎవరినైనా ఓడించవచ్చని నాకు నమ్మకం కలిగింది. రాబోయే టోర్నీలు: వచ్చే నెల 18నుంచి ఢిల్లీలోనే ఉబెర్ కప్ ఫైనల్స్ జరగనున్నాయి. ఈ టీమ్ ఈవెంట్లో క్రితం సారి ఆడినప్పుడు మేం విఫలమయ్యాం. అయితే సొంతగడ్డపై జరుగుతుండటం వల్ల మంచి ప్రదర్శన ఆశిస్తున్నాం. ఈ ఏడాది మన గ్రూప్‌లో థాయిలాండ్, కెనడా, హాంకాంగ్ ఉన్నాయి. లీగ్ దశను దాటితే క్వార్టర్స్, ఆపై కనీసం సెమీస్‌కు వెళ్లవచ్చు. నేను కూడా బాగా ఆడి జట్టును గెలిపించాలని పట్టుదలగా ఉన్నాను. ప్రస్తుతం ఈ టోర్నీపైనే దృష్టి పెట్టాం. ఆ తర్వాత కోచ్ గోపీచంద్ సూచనల ప్రకారం సూపర్ సిరీస్ టోర్నీ కోసం ప్రణాళిక రూపొందించుకుంటాను. ఇక ర్యాంకింగ్స్ గురించి ఆందోళన లేదు. నిలకడగా టాప్-10లో కొనసాగితే చాలు. కొత్తగా ఎండార్స్మెంట్లాంటివి: నా కెరీర్ ఆరంభంలోనే ఉంది. వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా చాంపియన్‌షిప్‌లాంటి రెండు పెద్ద మెడల్స్ గెలిచాను. కాబట్టి ఇప్పుడే కాకపోయినా తర్వాతైనా అవకాశాలు దక్కవచ్చు. ప్రస్తుతం ఎలాంటి ఒప్పందాలు లేకపోయినా... మున్ముందు ఎండార్స్మెంట్స్ వస్తాయనే ఆశిస్తున్నాను. -
మరిన్ని విజయాలు అందిస్తారు
సైనా, సింధు ప్రదర్శనపై గోపీచంద్ సాక్షి, తిరుమల: భారత అగ్రశ్రేణి క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధుల ప్రదర్శన పట్ల భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జరిగే టోర్నీల్లో వారు మరిన్ని విజయాలు సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం గోపీచంద్, ఆయన సతీమణి లక్ష్మి తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ‘శనివారం ఆసియా చాంపియన్‌షిప్‌లో సింధు కాంస్యం నెగ్గడం సంతృప్తిగా ఉంది. విశ్రాంతి అనంతరం సైనా నెహ్వాల్ కూడా మరిన్ని టోర్నీల్లో పాల్గొనబోతోంది. వీరిద్దరు నిలకడగా ఆడి విజయాలు సాధిస్తారని నాకు విశ్వాసం ఉంది’ అని గోపీచంద్ వ్యాఖ్యానించారు. భారత బ్యాడ్మింటన్‌కు మంచి జరగాలని కోరుకుంటూ, శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. గోపీచంద్ కుటుంబంతోపాటు హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కూడా ఉన్నారు. -
కాంస్యాలతో సరి
సెమీస్‌లో ఓడిన సింధు జ్వాల-అశ్విని జోడీకి నిరాశ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గిమ్‌చియోన్ (కొరియా): భారత రైజింగ్ స్టార్ పి.వి.సింధు, జ్వాల-అశ్విని జోడి... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 21-15, 20-22, 12-21తో టాప్‌సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓటమిపాలైంది. గంటా 18 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ ఆరంభంలో హైదరాబాద్ అమ్మాయి అద్భుతంగా ఆడింది. అటాకింగ్‌తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ అదే జోరు కనబరిచింది. 20-18తో రెండు మ్యాచ్ పాయింట్లను సంపాదించింది. అయితే కీలకదశలో ఒత్తిడికిలోనైన సింధు వరుసగా రెండు పాయింట్లను కోల్పోవడంతో స్కోరు 20-20 వద్ద సమమైంది. ఆ తర్వాత షిజియాన్ మరో రెండు పాయింట్లు నెగ్గి రెండో గేమ్‌ను 22-20తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. ఓటమి అంచుల్లోంచి బయటపడిన షిజియాన్ మూడో గేమ్‌లో విజృంభించడంతో సింధు చేతులెత్తేసింది. మహిళల డబుల్స్ సెమీస్‌లో జ్వాల-అశ్విని 12-21, 7-21తో లూ యింగ్-లూ యూ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. తొలి గేమ్ ఆరంభంలో నెట్ వద్ద జ్వాలా జోడి కొన్ని పాయింట్లు చేజార్చుకోవడం దెబ్బతీసింది. బ్యాక్ కోర్టులో అశ్విని అద్భుతంగా ఆడటంతో 3-3తో స్కోరు సమమైంది. కానీ చిన్న చిన్న తప్పిదాలతో 6-11, 6-15, 11-20తో వెనుకబడి గేమ్‌ను కోల్పోయారు. షాట్లలో భిన్నత్వాన్ని రాబట్టేందుకు ప్రయత్నించిన జ్వాల ద్వయం రెండో గేమ్‌లో సుదీర్ఘ ర్యాలీలు ఆడింది. కానీ చైనా జోడి మెరుగైన డిఫెన్స్‌తో 11-2 ఆధిక్యంలో నిలిచింది. అయితే సర్వీస్ తప్పిదాలతో భారత్‌కు కొన్ని పాయింట్లు సమర్పించుకున్నా విజయానికి సరిపోలేదు. 20-6 స్కోరుతో వద్ద జ్వాల-అశ్విని మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకున్నా.. తర్వాత సర్వీస్ కోల్పోయారు. ఆసియా బ్యాడ్మింటన్‌లో సెమీస్‌కు చేరితే కాంస్యం వస్తుంది. కాబట్టి అటు సింధు, ఇటు జ్వాల జోడిలకు కాంస్యాలు దక్కుతాయి. ‘ఓవరాల్‌గా సింధు బాగా ఆడింది. రెండో గేమ్‌లో 20-18తో ముందంజలో ఉన్న దశలో సింధు రెండు పాయింట్లను కోల్పోయింది. ఈ తరహా మ్యాచ్‌ల్లో కాస్త అదృష్టం కూడా కలసిరావాలి. ఒకరోజు మనం గెలుస్తాం. మరోరోజు ఓడిపోతాం. మొత్తానికి సింధు ఆటతీరుతో సంతృప్తిగా ఉన్నాను.’ - పుల్లెల గోపీచంద్, చీఫ్ కోచ్ -
‘రాకెట్’ తడాఖా
సెమీస్‌లో పి.వి.సింధు, జ్వాల అశ్విని జోడి కనీసం రెండు పతకాలు ఖాయం ఏబీసీ చరిత్రలో ఇదే తొలిసారి పోరాడి ఓడిన గురుసాయిదత్ భారత బ్యాడ్మింటన్‌లో మరో కొత్త అధ్యాయం. ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో మనోళ్ల రాకెట్ లాంటి ఆటతీరుకు ఒకేసారి రెండు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల సింగిల్స్‌లో యువతార పి.వి.సింధు... మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప ద్వయం సెమీఫైనల్‌కు దూసుకెళ్లి భారత సత్తాను చాటారు. 23 ఏళ్ల ఈ చాంపియన్‌షిప్‌లో చరిత్రలో భారత్‌కు ఒకేసారి రెండు పతకాలు రావడం ఇదే ప్రథమం. గిమ్‌చియోన్ (కొరియా): నిలకడగా రాణిస్తూ పి.వి.సింధు... తమ పని అయిపోయిందని వస్తున్న విమర్శలకు తగిన సమాధానమిస్తూ గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప ద్వయం... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో ముందంజ వేశారు. అయితే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గురుసాయిదత్ తీవ్రంగా శ్రమించినా విజయాన్ని దక్కించుకోలేకపోయాడు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 14-21, 21-13, 21-10తో ఒంగ్బుమ్రంగ్పాన్ బుసానన్ (థాయ్‌లాండ్)పై గెలుపొందగా... డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో జ్వాల-అశ్విని జోడి 21-12, 21-12తో అలిసియా-సూంగ్ ఫీ చో (మలేసియా) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో గురుసాయిదత్ 24-22, 9-21, 13-21తో లియు కాయ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. ఏబీసీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్ చేరుకున్న వారికి కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)తో సింధు... లూ యింగ్లూ యు (చైనా)లతో జ్వాల -అశ్విని తలపడతారు. 1991లో మొదలైన ఏబీసీ లో ఇప్పటివరకు భారత్‌కు రెండు కాంస్యాలు లభించాయి. 2007లో అనూప్ శ్రీధర్... 2010లో సైనా సెమీఫైనల్స్‌లో ఓడిపోయారు. గతంలో బుసానన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సింధుకు ఈసారి గట్టిపోటీనే లభించింది. మ్యాచ్‌లో కుదురుకునేలోపే సింధు తొలి గేమ్‌ను చేజార్చుకుంది. అయితే వెంటనే తేరుకున్న ఈ తెలుగమ్మాయి రెండో గేమ్‌లో ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లోనూ ఇదే జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. డబుల్స్ మ్యాచ్‌లో జ్వాల జోడి ఏదశలోనూ ప్రత్యర్థి జంటకు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. దూకుడుగా ఆడుతూ 40 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించారు. ఆత్మవిశ్వాసం పెరగడంలో ఈ గొప్ప విజయం ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ మ్యాచ్‌లో మేమిద్దరం చాలా బాగా ఆడాం. నిలకడగా రాణిస్తే మంచి ఫలితాలు వాటంతటవే వస్తాయని మా ఇద్దరికీ తెలుసు. జోడిగా మరింత ప్రాక్టీస్ చేసి, మరిన్ని మ్యాచ్‌లు ఆడితే పూర్వపు ఫామ్‌ను సాధిస్తాం. అశ్విని పొనప్ప తొలి గేమ్‌లో మినహా సింధు అద్భుతంగా ఆడింది. రెండో గేమ్ నుంచి సింధు స్మాష్‌లలో పదును పెరిగింది. ఈ అంశం విజయంలో కీలకపాత్ర పోషించింది గోపీచంద్, కోచ్ షిజియాన్ వాంగ్‌తో జరిగే సెమీఫైనల్లో సింధు ఆమెను ఓడిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాను. వాంగ్ బలాబలాలు, బలహీనతలపై సింధుకు మంచి అవగాహన ఉంది. రమణ (సింధు తండ్రి) 1 భారత్ తరఫున ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ, ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ పతకాలు నెగ్గిన తొలి క్రీడాకారిణులుగా సింధు, జ్వాల, అశ్విని. -
క్వార్టర్స్‌లో సింధు, గురుసాయిదత్
జ్వాల జోడి కూడా... కశ్యప్‌కు చుక్కెదురు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గిమ్‌చియోన్ (కొరియా): భారత బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధు... ఆసియా చాంపియన్‌షిప్‌లో దూసుకెళ్తోంది. మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుని సత్తా చాటింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 14-21, 21-13, 21-18తో హిరోస్ ఎరికో (జపాన్)పై విజయం సాధించింది. గంటా 13 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి తొలి గేమ్‌లో ఓడినా... మిగతా రెండు గేమ్‌ల్లో స్థాయి మేరకు రాణించింది. క్వార్టర్స్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్ బుసానన్ ఆంగ్‌బుమ్రాంగపన్ (థాయ్‌లాండ్)తో సింధు తలపడుతుంది. గతంలో ఈమెతో తలపడిన రెండుసార్లూ ఏపీ అమ్మాయి పైచేయి సాధించింది. పురుషుల సింగిల్స్‌లో చాలా కాలం తర్వాత ప్రపంచ 38వ ర్యాంకర్ ఆర్.ఎం.వి. గురుసాయిదత్ జోరు కనబర్చాడు. ప్రిక్వార్టర్స్‌లో అతను 17-21, 21-13, 21-19తో వాంగ్ జూ వీ (చైనీస్ తైపీ)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏపీ కుర్రాడు చాలా ఓపికగా ఆడాడు. తొలి గేమ్ ఓడిన తర్వాత రెండో గేమ్‌లోనూ 3-7తో వెనుకబడ్డాడు. కానీ నెట్ వద్ద భిన్నమైన ఆటతీరుతో అదరగొట్టాడు. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ ప్రత్యర్థిని అలసిపోయేలా చేసి తర్వాత బలమైన స్ట్రోక్స్‌తో వరుసగా పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్ 23-25, 17-21తో సు జెన్ హో (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడాడు. మహిళల డబుల్స్‌లో జ్వాల గుత్తా-అశ్విని పొనప్ప జోడి (భారత్) 21-11, 21-18తో డుంగానోంగ్-కుంచాల ఉర్విచెత్‌చైకుల్ (థాయ్‌లాండ్)పై గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. -
సైనా, కశ్యప్‌లకు చుక్కెదురు
సింగపూర్: భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లకు సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్ విభాగంలో కశ్యప్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పి.వి.సింధు తొలి రౌండ్ అడ్డంకిని దాటేందుకు శ్రమించగా... కిడాంబి శ్రీకాంత్, భమిడిపాటి సాయిప్రణీత్ మాత్రం అలవోక విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా 21-16, 15-21, 11-21తో ప్రపంచ 15వ ర్యాంకర్ ఎరికో హిరోస్ (జపాన్) చేతిలో ఓడిపోయింది. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌ను నెగ్గినా... అదే జోరును తర్వాత కనబరచడంలో విఫలమైంది. రెండో గేమ్‌లోనైతే సైనా ఒకదశలో తన ప్రత్యర్థికి వరుసగా 8 పాయింట్లు కోల్పోవడం గమనార్హం. మూడో గేమ్‌లోనూ సైనా కోలుకోలేకపోయింది. తొలుత 0-5తో వెనుకబడిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఆ తర్వాత తేరుకొని 9-13తో తేడాను నాలుగు పాయింట్లకు తగ్గించింది. ఈ దశలో సైనా తప్పిదాలు చేసి వరుసగా 6 పాయింట్లు సమర్పించుకొని ఓటమిని ఖాయం చేసుకుంది. 2011 తర్వాత సైనా ఓ సూపర్ సిరీస్ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓడిపోవడం ఇదే ప్రథమం. మహిళల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ పి.వి.సింధు 21-9, 19-21, 22-20తో ప్రపంచ 67వ ర్యాంకర్ మిలిసెంట్ విరాంతో (ఇండోనేసియా)పై శ్రమించి గెలిచింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో 123వ ర్యాంకర్ షిజుకా ఉచెద (జపాన్)తో సింధు ఆడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో కేరళ అమ్మాయి పి.సి.తులసీ 21-13, 21-16తో అనా రాన్‌కిన్ (న్యూజిలాండ్)ను ఓడించగా... అరుంధతి పంతవానె 21-16, 11-21, 15-21తో షిజుకా ఉచెద (జపాన్) చేతిలో; తన్వీ లాడ్ 6-21, 11-21తో టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా) చేతిలో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్‌లో 76 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ 21-16, 15-21, 20-22తో ప్రపంచ 35వ ర్యాంకర్ లీ డాంగ్ క్యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. మూడో గేమ్‌లో కశ్యప్ 19-17తో ముందంజలో ఉన్నా ఫలితం లేకపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 21-13, 21-15తో అబ్దుల్ లతీఫ్ (మలేసియా)పై... శ్రీకాంత్ 23-21, 21-15తో టకుమా ఉయెదా (జపాన్)పై, ప్రణయ్ 21-17, 14-21, 21-11తో సితికామ్ (థాయ్‌లాండ్)పై గెలిచారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప 15-21, 16-21తో లూ యింగ్-లూ యు (చైనా) చేతిలో... మిక్స్డ్ డబుల్స్‌లో కోనా తరుణ్-అశ్విని పొనప్ప 15-21, 10-21తో క్రిసినాంతా-వానెస్సా (సింగపూర్) చేతిలో ఓడిపోయారు. -
సింధు నిష్ర్కమణ
కశ్యప్ సంచలన విజయం ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ న్యూఢిల్లీ: సింధుపై ఈ సారి షిజియాన్ వాంగ్‌దే పైచేయి అయింది. గతంలో ఈ ఏపీ అమ్మాయి చేతిలో మూడు సార్లు ఓడిన ఈ చైనా షట్లర్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో సత్తా చాటింది. రెండో సీడ్ వాంగ్ జోరుకు సింధు తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం ఇక్కడి సిరిఫోర్ట్ స్పోర్ట్స్ కాంపెక్స్‌లో 70 నిమిషాలపాటు జరిగిన మారథాన్ మ్యాచ్‌లో సింధు 15-21, 21-12, 10-21 స్కోరుతో రెండో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయింది. తొలి గేమ్‌ను కోల్పోయిన అనంతరం సింధు కోలుకుని రెండో గేమ్‌లో చెలరేగింది. అయితే చివరి గేమ్‌లో సింధు ఒక దశలో 3-0తో ఆధిక్యంలో నిలిచినప్పటికీ.. షిజియాన్ తన నైపుణ్యంతో 16-4తో పైచేయి సాధించింది. చివరికి షిజియాన్ వాంగ్ 21-10తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా నెగ్గింది. ఇక స్టార్ షట్లర్, ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్ 21-7, 21-9తో సిమోన్ (ఆస్ట్రియా)పై అలవోకగా నెగ్గి రెండోరౌండ్లోకి ప్రవేశించింది. కశ్యప్ అదుర్స్ తెలుగుతేజం కశ్యప్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కశ్యప్ 21-12, 17-21, 21-12తో ప్రపంచ ఏడో ర్యాంకర్, ఆరో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా)పై విజయం సాధించాడు. కశ్యప్ గతంలో రెండు సార్లు (2012లో చైనా, 2013లో హాంకాంగ్ టోర్నీ) వాంగ్ చేతిలో ఓడిపోయాడు. అయితే మూడో ప్రయత్నంలో సఫలమయ్యాడు. మరో మ్యాచ్‌లో మలేసియా గ్రాండ్ ప్రి గోల్డ్ ఫైనలిస్ట్ సౌరభ్ వర్మ 21-16, 17-21, 21-14తో వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా)పై నెగ్గాడు. ఇక తెలుగుతేజం గురుసాయిదత్ 17-21, 21-16, 21-17తో తిన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. ఇతర భారత ఆటగాళ్లు ప్రణయ్, కె. శ్రీకాంత్, సాయి ప్రణీత్, అనూప్ శ్రీధర్, శ్రేయాంష్ జైస్వాల్, ఆనంద్ పవార్, అజయ్ కుమార్ తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. మహిళల సింగిల్స్‌లో సయాలీ గోఖలె, తృప్తి ముర్గండే రెండో రౌండ్‌కి చేరగా... సయాలీ రాణే, తాన్వీలాడ్, శృతి, తులసి నిష్ర్కమించారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడి 21-19, 17-21, 21-14తో చాయానిత్-ముంకితామొర్న్ (థాయ్‌లాండ్)పై గెలిచి ప్రి క్వార్టర్ ఫైన్లలోకి ప్రవేశించింది. ఐబీఎల్‌లో ఆడతారా ? ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) రెండో ఎడిషన్‌కు స్టార్ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధుతో పాటు ప్రపంచ స్టార్లు ఐబీఎల్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ఐబీఎల్-2 సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 14 వరకు జరగనుంది. అయితే ఈ టోర్నీ ముగిసే లోపే (అక్టోబర్ 14 నుంచి) డెన్మార్క్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ ప్రారంభమవుతుంది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) నిబంధనల ప్రకారం టాప్-10 ప్లేయర్లు సూపర్ సిరీస్ టోర్నీల్లో కచ్చితంగా పాల్గొనాలి. గాయపడిన వారికి మినహాయింపు ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఐబీఎల్-2 చివరి దశలో మ్యాచ్‌లకు స్టార్ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే ఐబీఎల్ నిర్వాహకులు మాత్రం డెన్మార్క్ సూపర్ సిరీస్ వల్ల ఐబీఎల్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. స్టార్ ప్లేయర్లు ఐబీఎల్‌లో పాల్గొంటారని... అవసరమైతే షెడ్యూల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. -
షిజియాన్‌ను నాలుగోసారీ ఓడిస్తా
సింధు ధీమా ఇండియా ఓపెన్ డ్రా క్లిష్టం న్యూఢిల్లీ: ప్రపంచ మూడో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా)ను వరుసగా నాలుగోసారి ఓడిస్తానని హైదరాబాద్ షట్లర్ పి.వి.సింధు ధీమా వ్యక్తం చేసింది. మంగళవారం నుంచి జరిగే ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ తొలి రౌండ్లో షిజియాన్‌తో తలపడనున్న నేపథ్యంలో సింధు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇండియా ఓపెన్ విజేతలకు అందించే ట్రోఫీలను శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింధుతోపాటు పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్, భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేశ్ దాస్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. 2012, 2013 ఇండియా ఓపెన్‌లో సెమీస్‌కు చేరుకున్న సింధు ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనను కనబరుస్తానని విశ్వాసం వ్యక్తం చేసింది. ‘ఈసారి డ్రా చాలా క్లిష్టంగా ఉంది. తొలి రౌండ్లోనే షిజియాన్ ఎదురుకానుంది. గతంలో మూడుసార్లు ఆమెను ఓడించా. కాబట్టి నాలుగోసారి కూడా గెలుస్తాననే నమ్మకం ఉంది’ అని సింధు వ్యాఖ్యానించింది. -
సైనా, సింధులకు క్లిష్టమైన ‘డ్రా’
ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగే ఏకైక సూపర్ సిరీస్ టోర్నమెంట్ ఇండియా ఓపెన్‌లో భారత స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి.సింధులకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఈ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ వివరాలను మంగళవారం విడుదల చేశారు. గతంలో ఈ టోర్నీలో ఆడిన మూడు పర్యాయాల్లో రెండో రౌండ్‌ను దాటలేకపోయిన సైనా ఈసారి ఆ అడ్డంకిని అధిగమించే అవకాశముంది. తొలి రౌండ్లో సిమోన్ ప్రుశ్ (ఆస్ట్రియా)తో ఆడనున్న సైనాకు రెండో రౌండ్లో రాన్‌కిన్ (న్యూజిలాండ్) లేదా నచా సెంగ్‌చోటి (థాయ్‌లాండ్) ఎదురవుతారు. అయితే క్వార్టర్ ఫైనల్లో ఈ హైదరాబాద్ అమ్మాయికి మూడో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) రూపంలో అగ్ని పరీక్ష సిద్ధంగా ఉండే అవకాశముంది. యిహాన్ వాంగ్‌తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో సైనా ఏడుసార్లు ఓడిపోవడం గమనార్హం. మరోవైపు సింధు తొలి రౌండ్లో రెండో సీడ్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిజియాన్ వాంగ్ (చైనా)తో ఆడనుంది. షిజియాన్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో సింధు నెగ్గినప్పటికీ చైనా క్రీడాకారిణులను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది. ఒకవేళ సింధు తొలి రౌండ్‌ను దాటితే క్వార్టర్ ఫైనల్లో ఆమెకు ఆరో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)... సెమీఫైనల్లో సైనా లేదా యిహాన్ వాంగ్ ఎదురవుతారు. మరో పార్శ్వం నుంచి ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ (చైనా), ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్) సెమీఫైనల్‌కు చేరుకోవచ్చు. పురుషుల సింగిల్స్ విభాగంలోనూ భారత క్రీడాకారులకు కష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్లో ఆరో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా)తో పారుపల్లి కశ్యప్; చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో గురుసాయిదత్; ఏడో సీడ్ డూ పెంగ్యూ (చైనా)తో సాయిప్రణీత్; టకుమా ఉయెదా (జపాన్)తో కిడాంబి శ్రీకాంత్ తలపడతారు. -
పోరాడి ఓడిన సింధు
స్విస్ ఓపెన్ టోర్నీ బాసెల్: ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ పి.వి.సింధు స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో పోరాడి ఓడింది. శనివారం జరిగి న మహిళల సెమీఫైనల్లో ఏడోసీడ్ సింధు 21-18, 12-21, 19-21తో సున్ యూ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. గంటా 19 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ చెరో గేమ్ గెలిచారు. హోరాహోరీగా జరిగిన నిర్ణయాత్మక మూడో గేమ్‌లో హైదరాబాద్ అమ్మాయి చివరి వరకు గట్టిపోటీ ఇచ్చింది. అయితే చివర్లో నెట్ వద్ద విఫలం కావడంతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. పురుషుల సెమీస్‌లో పారుపల్లి కశ్యప్ 17-21, 11-21తో హూవీ తియాన్ (చైనా) చేతిలో ఓడాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ఫైనల్లో ఆరోసీడ్ సైనా నెహ్వాల్ 17-21, 12-21తో ప్రపంచ మూడో ర్యాంకర్, టాప్‌సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడింది. 38 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిగేమ్‌లో 14-14 స్కోరు వరకు సైనా గట్టిపోటీ ఇచ్చినా ఆ తర్వాత క్రమంగా వెనుకబడింది. రెండో గేమ్‌లో 5-9, 8-9తో వెనుకబడి ఆ తర్వాత పుంజుకోలేకపోయింది. వాంగ్ చేతిలో సైనా ఓడటం ఇది ఏడోసారి. -
రెండో రౌండ్లో సింధు
కశ్యప్, పవార్ ముందంజ స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ బాసెల్: ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు... స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడోసీడ్ సింధు 21-18, 21-15తో సాంటాష్ సానిర్ (మలేసియా)పై విజయం సాధించి రెండోరౌండ్లోకి ప్రవేశించింది. 32 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి తొలి గేమ్‌లో చకచకా పాయింట్లు గెలుస్తూ 10-3కు దూసుకుపోయింది. ఈ దశలో పుంజుకున్న మలేసియా ప్లేయర్.. సింధు ఆధిక్యాన్ని 15-16కు తగ్గించి... 17-17, 18-18తో స్కోరును సమం చేసింది. అయితే సింధు భిన్నమైన షాట్లతో వరుసగా మూడు పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకుంది. స్కోరు 7-7 వరకు రెండో గేమ్ హోరాహోరీగా సాగింది. అదే దూకుడును ప్రదర్శించిన సానిర్ 13-9 ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ పట్టు విడవకుండా పోరాడిన సింధు 14-14తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు. వరుస పాయింట్లతో హోరెత్తించి గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో సింగిల్స్ మ్యాచ్‌లో సయాలీ రాణే (భారత్) 8-21, 9-21తో మూడోసీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడికి చుక్కెదురైంది. తొలి రౌండ్లో జ్వాల-అశ్విని 19-21, 21-13, 18-21తో ఇస్బెల్ హెట్రిచ్-కార్లా నెల్టీ (జర్మనీ) చేతిలో ఓటమిపాలైంది. కశ్యప్ హవా మంగళవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఏపీ కుర్రాడు, మూడోసీడ్ పారుపల్లి కశ్యప్ 21-17, 21-15తో ఎరిక్ మిజిస్ (నెదర్లాండ్స్)పై గెలిచి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. 34 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. మరో మ్యాచ్‌లో ఆనంద్ పవార్ 21-17, 21-10తో కోక్ పోంగ్ లోక్ (మలేసియా)ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో తరుణ్ కోనా-అశ్విని జోడి 10-21, 21-16, 13-21తో రాబర్ట్ మట్సుయాక్-ఆగ్నేస్కా వొజ్కోవాస్కా (ఇండోనేసియా) చేతిలో ఓడింది. -
‘ మెట్రో’ సైకిల్ రైడ్
-
మళ్లీ టాప్-10లోకి సింధు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం పి.వి.సింధు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్-10లోకి దూసుకెళ్లింది. గురువారం ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు తొమ్మిదో ర్యాంకు సాధించి భారత నంబర్‌వన్ షట్లర్ సైనా నెహ్వాల్ (7వ ర్యాంకు)కు మరింత చేరువైంది. ఇటీవల జరిగిన సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన 18 ఏళ్ల సింధు.. ఆ తరువాత ఆలిండియా ఓపెన్ సీనియర్ ర్యాంకింగ్ టోర్నీలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో తన పాయింట్లను 55,752కు పెంచుకున్న సింధు.. సైనా కన్నా 3928 పాయింట్లు మాత్రమే వెనకబడి ఉంది. ఇక పురుషుల విభాగంలో భారత్ నుంచి అత్యుత్తమంగా పారుపల్లి కశ్యప్ 18వ ర్యాంకులో ఉండగా, సౌరభ్‌వర్మ ఏకంగా తొమ్మిది స్థానాలు ఎగబాకి 41వ ర్యాంకులో నిలిచాడు. -
మూడు లక్ష్యాలతో ముందుకు...
న్యూఢిల్లీ: గతేడాదిని విజయవంతంగా ముగించిన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ ఏడాది కూడా అదే రీతిన ఆరంభించింది. ఇప్పటికే సయ్యద్ మోడి అంతర్జాతీయ టోర్నీలో రన్నరప్‌గా నిలువగా... ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నీలో విజేతగా నిలిచి మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇదే జోరును రానున్న టోర్నీల్లోనూ కొన సాగిస్తానని విశ్వా సం వ్యక్తం చేసింది. ప్రస్తుతానికైతే వచ్చే నెల 4 నుంచి 9 వరకు జరిగే ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌పై దృష్టి సారించానని ప్రపంచ పదో ర్యాంకర్ సింధు తెలిపింది. అలాగే ఈ ఏడాదే జరిగే కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో పతకాలు నెగ్గడంతోపాటు...సీజన్ ముగింపు దశకు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-6కు చేరడమే తన లక్ష్యమని పేర్కొంది. తన కొత్త స్పాన్సర్ లీ నింగ్ సంస్థ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సింధు పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... ఈ ఏడాది షెడ్యూల్ కాస్త కఠినంగానే ఉంది. వెంటవెంటనే టోర్నీలున్నాయి. ఈనెల అయితే మొత్తం విశ్రాంతి దొరికింది. కాబట్టి నా స్ట్రోక్స్, డిఫెన్స్‌పై దృష్టి సారించాను. వచ్చే నెలలో జరిగే ఆల్ ఇంగ్లండ్ టోర్నీకి నా సన్నాహాలు బాగానే సాగుతున్నాయి. ఆ తర్వాత స్విస్ ఓపెన్ ఉంటుంది. వెంటనే సూపర్ సిరీస్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు జరుగనున్నాయి. నేను ఏయే టోర్నీలు ఆడాలనే విషయం కోచ్ గోపీచంద్ నిర్ణయిస్తాడు. అయితే కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి ఆడబోతున్నందుకు చాలా ఆసక్తిగా ఉంది. ఈసారి భారత ఆటగాళ్లు ఎక్కువ పతకాలు గెలుస్తారనుకుంటున్నాను. ఈ ఏడాది చివరి వరకు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడు లేక ఆరో స్థానంలో ఉండాలని నా ఆలోచన. అయితే నా స్ట్రోక్స్ విషయంలో ఇంకా రాణించాల్సి ఉంది. మేలో న్యూఢిల్లీలో జరిగే ఉబెర్ కప్ టీమ్ చాంపియన్‌షిప్‌లో మేం విశేషంగా రాణించాలని భావిస్తున్నాం. క్రితం సారి నేను బాగానే ఆడాను. సైనాపై ఐబీఎల్లోకన్నా సయ్యద్ మోడి టోర్నీలోనే మెరుగ్గా ఆడాను. అటాకింగ్ గేమ్ ఆడాలనుకున్నా సాధ్యం కాలేదు. సైనా చాలా అనుభవజ్ఞురాలు. -
సింధుకు ఫిక్కీ అవార్డు
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ యువ సంచలనం పి.వి. సింధుకు ఫిక్కీ ‘బ్రేక్‌త్రూ స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును ప్రకటించింది. ఆర్చర్ దీపికా కుమారిని ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపిక చేసింది. ఇక దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు జీవిత సాఫల్య పురస్కారం దక్కగా, హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్‌కు కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్, బల్దేవ్సింగ్కు సహాయక సిబ్బంది కేటగిరిలో అవార్డులు దక్కాయి. కాగా, దేవేందర్ ఝఝారియా పారా స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికవగా, భారత మహిళల ఆర్చరీ జట్టు ‘టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును దక్కించుకుంది. -
చాంప్ సింధు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టార్ షట్లర్ పి.వి.సింధు అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచింది. కొచ్చిలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో టాప్ సీడ్ సింధు 21-11, 21-11తో మూడో సీడ్ పి.సి.తులసి (కేరళ)పై ఘనవిజయం సాధించింది. ఇక మహిళల డబుల్స్‌లోనూ రాష్ట్రానికి చెందిన సిక్కిరెడ్డి జోడి టైటిల్ సాధించింది. ఫైనల్లో అపర్ణ బాలన్ జతగా మూడో సీడ్ సిక్కి రెడ్డి 21-16, 21-13తో టాప్ సీడ్ ప్రజక్తా సావంత్-ఆరతి సారా జంటను కంగు తినిపించింది. కాగా, పురుషుల సింగిల్స్ టైటిల్‌ను హెచ్.ఎస్.ప్రణయ్ గెలుచుకోగా... డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ ద్వయం చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ప్రణయ్ 21-13, 21-2తో అనూప్ శ్రీధర్‌పై ఏకపక్ష విజయం నమోదు చేశాడు. డబుల్స్‌లో టాప్ సీడ్ ప్రణవ్-దివాల్కర్ జోడి 21-9, 23-25, 21-19 తో రెండో సీడ్ ఆల్విన్ ఫ్రాన్సిస్-అరుణ్ విష్ణు జంటపై గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ ద్వయం విజేతగా నిలిచింది. -
మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు
కొచ్చి: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ స్టార్ పి.వి. సింధు టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. మహిళల డబుల్స్‌లో రాష్ట్రానికి చెందిన సిక్కి రెడ్డి జోడి కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సింధు 19-21, 21-19, 21-9తో ఆరో సీడ్ సయాలీ గోఖలేపై విజయం సాధించింది. మరో సెమీస్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన 8వ సీడ్ రుత్విక శివాని 19-21, 19-21తో మూడో సీడ్ పి.సి.తులసి (కేరళ) చేతిలో ఓడింది. ఆదివారం జరిగే ఫైనల్లో తులసీతో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. మహిళల డబుల్స్ ఈవెంట్లో మూడో సీడ్ సిక్కిరెడ్డి (ఏపీ) -అపర్ణా బాలన్ జంట 21-12, 21-14తో రెండో సీడ్ మనీషా (ఏపీ)-సంయోగిత గోర్పడే జోడికి షాకిచ్చింది. మరో సెమీస్‌లో మేఘన-రీతుపర్ణా దాస్ (ఆంధ్రప్రదేశ్) జోడి 12-21, 21-18, 15-21తో టాప్ సీడ్ ప్రజక్తా సావంత్- ఆరతి సారా జంట చేతిలో పరాజయం చవిచూసింది. ఫైనల్లో సిక్కిరెడ్డి జోడి... ప్రజక్తా జంటతో తలపడుతుంది. పురుషుల డబుల్స్‌లో హేమ నాగేంద్రబాబు-నందగోపాల్ (ఏపీ) 15-21, 14-21తో అల్విన్ ఫ్రాన్సిస్- అరుణ్ విష్ణు జంట చేతిలో, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-నందగోపాల్ (ఏపీ) జోడి 18-21, 19-21తో ప్రజక్తా- సనావే థామస్ జంట చేతిలో పరాజయం చవిచూశారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ ప్రణయ్ 21-18, 13-21, 16-21తో ఏపీ యువ సంచలనం, టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్‌కు షాకిచ్చాడు. -
ఏడాదికి రూ.85 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడా పరికరాల సంస్థ లీ నింగ్... ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి పి.వి.సింధుతో ఒప్పందం కుదుర్చుకుంది. రెండేళ్ల పాటు ఏడాదికి రూ.85 లక్షల చొప్పున సింధుకు ఈ సంస్థ చెల్లిస్తుంది. ఇకపై సింధు ఈ సంస్థకు చెందిన లోగోతో, క్రీడా పరికరాలతో బరిలోకి దిగుతుంది. యోనెక్స్‌తో సింధుకు ఉన్న ఒప్పందం శుక్రవారంతో ముగిసింది. నేటి నుంచి సింధు లీనింగ్ బ్రాండ్ దుస్తులతో ఆడుతుంది. తొలుత అడిడాస్ కూడా సింధుతో చర్చలు జరిపినా... లీనింగ్ ఆకర్షణీయమైన మొత్తం ఆఫర్ చేయడంతో డీల్ కుదిరింది. రూ.4 కోట్లు అడుగుతున్న సైనా మరోవైపు సైనా నెహ్వాల్ కూడా త్వరలో కొత్త ఒప్పందం చేసుకోనుంది. ప్రస్తుతం యోనెక్స్ సైనాకు ఏడాదికి రూ.2 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకునేందుకు సైనా రూ.4 కోట్లు డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. రూ.3 కోట్ల దగ్గర ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. -
క్వార్టర్స్‌లో సింధు, రుత్విక
కొచ్చి: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి.వి.సింధు, రుత్విక శివాని క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సింధు 21-7, 21-6తో మొహితా సచ్‌దేవ్‌పై, రుత్విక శివాని 21-13, 21-12తో రసిక రాజే (మహారాష్ట్ర)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన శ్రీ కృష్ణప్రియ 18-21, 19-21తో శైలి రాణే (ఎయిరిండియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ (ఆంధ్రప్రదేశ్) క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టగా... సిరిల్ వర్మ, రోహిత్ యాదవ్ నిష్ర్కమించారు. రెండో రౌండ్లో శ్రీకాంత్ 21-17, 21-11తో ప్రకాశ్ (కర్ణాటక)పై నెగ్గగా... సిరిల్ వర్మ 13-21, 16-21తో సౌరభ్ వర్మ (మధ్యప్రదేశ్) చేతిలో; రోహిత్ యాదవ్ 18-21, 14-21తో అనూప్ శ్రీధర్ (కర్ణాటక) చేతిలో ఓటమి పాలయ్యారు. -
ఎట్టకేలకు టైటిల్
-
ఎట్టకేలకు టైటిల్
‘నాకు ఇవి ఉద్వేగభరిత క్షణాలు. లక్నోతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. 2009లో ఇక్కడ తొలిసారి టైటిల్ నెగ్గాను. ఎన్నో రోజుల తర్వాత దక్కిన టైటిల్ కాబట్టి ఇది ఇంకా ప్రత్యేకం. చాలా విరామం తర్వాత ఫైనల్ ఆడుతుండటంతో కొంత ఒత్తిడికి లోనయ్యాను. అయితే నాకు అంతా అనుకూలించింది. సింధు కూడా బాగా ఆడింది. టాప్-10లో ఉన్న ఆమెను ఓడించడం ఆనందంగా ఉంది.’ - సైనా నెహ్వాల్ లక్నో: భారత నంబర్‌వన్ షట్లర్ సైనా నెహ్వాల్ చాలా కాలం తర్వాత తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చింది. దాదాపు 15 నెలల ఎదురుచూపులకు తెరదించుతూ అంతర్జాతీయ టోర్నీలో విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడ ముగిసిన సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ ఇండియా గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీని సైనా కైవసం చేసుకుంది. 40 నిమిషాల పాటు సాగిన ఫైనల్ మ్యాచ్‌లో సహచర హైదరాబాదీ పీవీ సింధుపై 21-14, 21-17 స్కోరుతో సైనా నెగ్గింది. 2012 అక్టోబర్‌లో డెన్మార్క్ ఓపెన్ గెలిచిన అనంతరం సైనాకు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. కొనసాగిన ఆధిక్యం సైనా, పీవీ సింధు ఒక అంతర్జాతీయ టోర్నీలో ముఖాముఖిగా తలపడటం ఇదే తొలిసారి. గతేడాది ఐబీఎల్‌లో జరిగిన రెండు మ్యాచుల్లోనూ నెగ్గిన సైనా, ఈసారీ తన జోరు కొనసాగించింది. ఈ టోర్నీలో గత ఏడాది రన్నరప్ అయిన సింధు పోటీ ఇవ్వలేకపోయింది. తొలి గేమ్‌లో శుభారంభం చేస్తూ సైనా 5-0 తో దూసుకుపోయింది. ఈ దశలో లైన్‌కాల్స్ కూడా సైనాకు కలిసొచ్చాయి. అయితే కోలుకున్న సింధు స్కోరును 12-14కు చేర్చింది. ఆ తర్వాత వేగవంతమైన స్మాష్‌లతో వరుస పాయింట్లు సాధించి సైనా గేమ్ గెలుచుకుంది. రెండో గేమ్‌లో సింధు మెరుగ్గా ఆడింది. ముందుగా 4-0తో ముందంజ వేసిన ఆమె, మ్యాచ్‌లో తొలిసారి 10-9తో ఆధిక్యంలో నిలిచింది. అయితే చక్కటి ర్యాలీలతో పాయింట్లు సొంతం చేసుకుంటూ సైనా మళ్లీ 18-12తో దూసుకుపోయింది. చివర్లో సింధు పోరాడినా అప్పటికే ఆలస్యమైంది. భారీ సంఖ్యలో ప్రేక్షకులు గత ఏడాది ఐబీఎల్‌లో భాగంగా తొలిసారి ఆగస్టు 15న తలపడిన సైనా, సింధు ఈసారి జనవరి 26న మ్యాచ్ ఆడటం విశేషం. ఈ ఇద్దరి తుదిపోరును చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. ఎవరికీ ప్రత్యేకంగా మద్దతుగా నిలవకుండా వారంతా ఇద్దరు షట్లర్ల ఆటను కూడా ప్రోత్సహించారు. సైనా కెరీర్లో ఇది 22వ ఫైనల్ మ్యాచ్. ఈ గెలుపుతో ఆమె ఖాతాలో 7000 పాయింట్లు చేరాయి. టోర్నీ విజేతగా నిలిచిన సైనాకు 9 వేల డాలర్లు (రూ. 5 లక్షల 65 వేలు), రన్నరప్ సింధుకు 4,560 డాలర్లు (రూ. 2 లక్షల 87 వేలు) బహుమతిగా లభించాయి. చేజేతులా ఓడిన శ్రీకాంత్ పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. ఫైనల్లో 9వ సీడ్ జు సంగ్ (చైనా) 16-21, 21-19, 21-13 స్కోరుతో ఆరో సీడ్ శ్రీకాంత్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిక్యం ప్రదర్శించిన వరల్డ్ 30వ ర్యాంకర్ శ్రీకాంత్ చేజేతులా పరాజయం కొనితెచ్చుకున్నాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా నెగ్గిన అతను రెండో గేమ్‌లో ఒక దశలో 19-12తో ఆధిక్యంలో నిలిచి విజయానికి చేరువయ్యాడు. అయితే అద్భుతమైన పోరాటపటిమ కనబర్చిన సంగ్ ఒక్కసారిగా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా వరుసగా 9 పాయింట్లు సాధించి రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో గేమ్‌లో 6-0తో దూసుకుపోయిన చైనా షట్లర్ చివరి వరకు పట్టు కోల్పోలేదు. -
సింధు x సైనా
ఫైనల్స్ మ.గం.2.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్షప్రసారం లక్నో: గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో సైనా, సింధుల మధ్య మ్యాచ్ జరిగింది. అందులో సైనా గెలిచింది. కాకతాళీయమే అయినా... గణతంత్ర దినోత్సవం రోజున మళ్లీ ఈ ఇద్దరి మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ సారి ఇండియా గ్రాండ్ ప్రి ఫైనల్లో ఈ ఇద్దరూ తలపడుతున్నారు. శనివారం జరిగిన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ సెమీస్‌లో టాప్‌సీడ్ సైనా 21-14, 17-21, 21-19తో ఆరోసీడ్ జువాన్ డెంగ్ (చైనా)పై నెగ్గగా; రెండోసీడ్ సింధు 21-6, 12-21, 21-17తో నాలుగోసీడ్ లిండ్వెని పెనెట్రీ (ఇండోనేసియా)ను ఓడించింది. పురుషుల సెమీస్‌లో ఆరోసీడ్ కె.శ్రీకాంత్ 21-18, 22-20తో ఏడోసీడ్ హెచ్.ఎస్.ప్రణయ్ (భారత్)పై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించాడు. మరో సెమీస్‌లో ఆదిత్య ప్రకాశ్ 10-21, 7-21తో జు సంగ్ (చైనా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్ సెమీస్‌లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ 18-21, 15-21తో లి జున్హ్-లి యుచెన్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. -
సైనాకు పరీక్ష
లక్నో: గతేడాది ఒక్క టోర్నీలోనూ ఫైనల్‌కు చేరుకోలేకపోయిన భారత స్టార్ సైనా నెహ్వాల్ ఈ ఏడాది స్వదేశంలో సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉంది. బుధవారం మొదలయ్యే ఇండియా గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ మెయిన్ ‘డ్రా’ పోటీల్లో సైనాకు టాప్ సీడింగ్ లభించింది. తొలి రౌండ్లో ఈ హైదరాబాద్ అమ్మాయి మటిల్డా పీటర్సన్ (స్వీడన్)తో ఆడుతుంది. మరో పార్శ్వంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పి.వి.సింధుకు రెండో సీడింగ్ దక్కింది. తొలి రౌండ్లో ఆమె లీ లియాన్ యాంగ్ (మలేసియా)తో తలపడుతుంది. అన్ని అడ్డంకులను అధిగమిస్తే సైనా, సింధు ఫైనల్లో ఎదురుపడతారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పారుపల్లి కశ్యప్ టాప్ సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. తొలి రౌండ్లో అనూప్ శ్రీధర్ (భారత్)తో కశ్యప్ ఆడతాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మహ్మద్ ఆదిబ్ (మలేసియా)తో చేతన్ ఆనంద్; సౌరవ్ అగర్వాల్ (భారత్) ఎన్వీఎస్ విజేత; వాసుదేవన్ (భారత్)తో గురుసాయిదత్; అభినవ్ ప్రకాశ్ (భారత్)తో సాయిప్రణీత్; మయాంక్ బెహల్ (భారత్)తో కిడాంబి శ్రీకాంత్; సూన్ హువాట్ (మలేసియా)తో రోహిత్ యాదవ్ ఆడతారు. మెయిన్ ‘డ్రా’కు సంతోషి ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సంతోషి హాసిని మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో సంతోషి ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. -
మలేసియా సూపర్ సిరీస్ లో పి.వి.సింధు ఓటమి
కౌలాలంపూర్: మలేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ స్టార్ క్రీడాకారిణి పి.వి. సింధు కథ ముగిసింది. ఈ రోజు జరిగిన పోరులో ఆరో సీడ్ క్రీడాకారిణి జు బే (కొరియన్) చేతిలో 21-16,21-19 పాయింట్ల తేడాతో సింధు ఓటమి పాలైంది. తొలి రౌండ్ లో ఆకట్టుకున్నసింధు ఈ గేమ్ లో మాత్రం పేలవంగా ఆడింది.ఆద్యంతం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ జు బే తనదైన శైలిలో ఆడి మూడో రౌండ్ కు చేరింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పి.వి.సింధు 21-17, 21-18తో ఫానెత్రి (ఇండోనేసియా)పై చెమటోడ్చి నెగ్గింది. 43 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సింధుకు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. -
సైనా, సింధు శుభారంభం
కౌలాలంపూర్: మలేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ స్టార్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధు శుభారంభం చేశారు. ఎనిమిదో సీడ్ సైనా బుధవారం జరిగిన తొలి రౌండ్లో 21-10, 21-16తో ఇండోనేసియాకు చెందిన హిరా దేసిని 36 నిమిషాల్లో ఓడించింది. మరో మ్యాచ్‌లో పి.వి.సింధు 21-17, 21-18తో ఫానెత్రి (ఇండోనేసియా)పై చెమటోడ్చి నెగ్గింది. 43 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సింధుకు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. రెండో రౌండ్లో సైనా... జుయ్ యావో (చైనా)తో, సింధు... ఆరో సీడ్ జు బే (దక్షిణ కొరియా)తో తలపడతారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కశ్యప్, శ్రీకాంత్ శుభారంభం చేశారు. పారుపల్లి కశ్యప్ 21-19, 21-13తో జర్మనీకి చెందిన మార్క్ జ్విబ్లెర్‌పై గెలుపొందగా, శ్రీకాంత్ 21-17, 18-21, 21-16తో హూ యున్ (హాంకాంగ్)పై పోరాడి గెలిచాడు. గురుసాయిదత్ 18-21, 21-11, 21-23తో ఎరిక్ పాంగ్ (నెదర్లాండ్స్) చేతిలో పోరాడి ఓడగా... ఆనంద్ పవార్ 12-21, 11-21తో జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా) ధాటికి చేతులెత్తేశాడు. -
సింధు కోసం స్పాన్సర్ల పోటీ!
న్యూఢిల్లీ: ఈ ఏడాది సైనా నెహ్వాల్ కంటే మెరుగ్గా రాణించిన భారత బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధుతో ఒప్పందం చేసుకునేందుకు విఖ్యాత క్రీడాసామాగ్రి తయారీ సంస్థలు పోటీపడుతున్నాయి. ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలువడంతోపాటు సింధు మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్, మకావు గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లలో టైటిల్స్ సాధించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున’ అవార్డు కూడా అందుకుంది. 18 ఏళ్ల సింధు ప్రస్తుతం యోనెక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గడువు జనవరి 31న ముగుస్తుంది. దీంతో ఒప్పందం పొడిగించుకునేందుకు యోనెక్స్... తొలిసారి ఒప్పందం చేసుకోవాలని అడిడాస్, చైనాకు చెందిన లీ నింగ్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయాన్ని సింధు తండ్రి, అంతర్జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారుడు పి.వి.రమణ ధ్రువీకరించారు. ‘సింధుతో ఒప్పందం చేసుకోవాలని విఖ్యాత క్రీడాసామాగ్రి తయారీ సంస్థలు ఆసక్తితో ఉన్నాయి. లీ నింగ్తోపాటు మరో రెండు సంస్థలు ఆకట్టుకునే ప్రతిపాదనలతో మమ్మల్ని సంప్రదించాయి’ అని రమణ వివరించారు. -
మకావులో కేక
అద్వితీయ విజయాలను అలవోకగా అందుకుంటున్న ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు.. మకావు ఓపెన్‌లోనూ సత్తా చాటింది. ఇటీవల జరిగిన నాలుగు ఈవెంట్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. ఈ టోర్నీలో మాత్రం చెలరేగింది. ఫైనల్లో మిచెల్లిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ కేవలం 38 నిమిషాల్లోనే టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది సింధుకు ఇది రెండో టైటిల్ కావడం విశేషం. మకావు: నెట్ వద్ద పూర్తి అప్రమత్తత... మెరుగైన డ్రాప్ షాట్లు.. అవసరమైనప్పుడు వరుసగా పాయింట్లు గెలవడం... ఆట ఆరంభం నుంచి చివరి దాకా పట్టువిడవని ఆధిపత్యం... మకావు ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పి.వి.సింధు ఆటతీరు ఇది. బలమైన స్మాష్‌లు లేకపోయినా... సుదీర్ఘ ర్యాలీలు ఆడకపోయినా... ప్రత్యర్థి ఆటతీరుకు అనుగుణంగా షాట్లలో భిన్నత్వాన్ని రాబట్టిన హైదరాబాద్ అమ్మాయి... మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్ట్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ సింధు 21-15, 21-12తో ఏడోసీడ్, ప్రపంచ 30వ ర్యాంకర్ లీ మిచెల్లి (కెనడా)పై విజయం సాధించింది. తద్వారా ఈ ఏడాది రెండో గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల జరిగిన నాలుగు ఈవెంట్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ ఏపీ ప్లేయర్ ఈ టోర్నీలో మాత్రం దుమ్మురేపింది. ఫైనల్లో 38 నిమిషాలలోనే ప్రత్యర్థిని ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. రెండు నిమిషాల్లోనే... ఆట ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే సింధు 7-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆరంభంలో సుదీర్ఘమైన ర్యాలీలు ఆడకుండా అటాకింగ్ గేమ్‌ను ఆడింది. అయితే ఒక్కో పాయింట్‌తో నెట్టుకొచ్చిన మిచెల్లి ఎట్టకేలకు ఓ దశలో సింధు ఆధిక్యాన్ని 9-6కి తగ్గించింది. అయినప్పటికీ ఏపీ అమ్మాయి దూకుడు మాత్రం తగ్గలేదు. స్కోరు 13-8 ఉన్న దశలో సింధు వరుసగా మూడు పాయింట్లు సాధించి 16-8 ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత ఒకటి, రెండు పాయింట్లతో 20-12కు చేరుకుంది. అయితే ఈ దశలో మిచెల్లి వరుసగా మూడు పాయింట్లు సాధించి ఊపుమీద కనిపించినా.. సింధు మెరుగైన డ్రాప్ షాట్‌తో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ ఆరంభంలో మిచెల్లి నెట్ వద్ద ఆధిపత్యం కనబర్చడంతో ఇద్దరు క్రీడాకారిణిలు పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడ్డారు. దీంతో స్కోరు 6-6తో సమమైంది. ఈ దశలో బేస్‌లైన్ ఆట తీరుతో చెలరేగిన సింధు వరుసగా 8 పాయింట్లు గెలిచి 14-6 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత షాట్లలో భిన్నత్వాన్ని రాబడుతూ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో సింధు స్మాష్‌ల ద్వారా 5, నెట్ వద్ద 4 పాయింట్లు గెలుచుకుంది. ఈ ఏడాది సూపర్... అంతర్జాతీయ సర్క్యూట్లో విశేషంగా రాణించిన సింధు... ఈ ఏడాది కూడా నిలకడగానే ఆడుతోంది. మధ్యలో కొన్ని రోజులు ఫామ్ కోల్పోయినా మెగా ఈవెంట్లలో మాత్రం తన జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉంది. మే నెలలో మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఆమె ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ సత్తా చాటింది. ఈ టోర్నీ వరుస మ్యాచ్‌ల్లో చైనా ప్రత్యర్థులను కంగుతినిపించి కాంస్య పతకం గెలుచుకుంది. దీంతో ఈ మెగా ఈవెంట్లో పతకాన్ని గెలుచుకున్న తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. 1983 (ప్రకాశ్ పదుకొనే) తర్వాత మళ్లీ భారత్‌కు పతకాన్ని అందించిన ఘనతనూ సొంతం చేసుకుంది. తర్వాత జపాన్, డెన్మార్క్, ఫ్రెంచ్, హాంకాంగ్ ఓపెన్‌లో ఫామ్ కోల్పోయినా మకావు టోర్నీలో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగి టైటిల్‌ను దక్కించుకుంది. ‘తప్పులు చేయకపోతే టైటిల్ గెలుస్తాననే నమ్మకంతో ఉన్నా. సెమీస్‌లో చైనా ప్లేయర్‌పై గెలవడం ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. దీంతో పూర్తి నమ్మకంతో ఫైనల్లోకి అడుగుపెట్టాను. కాబట్టి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఆడా’ - సింధు ‘సింధు మకావు ఓపెన్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది అద్భుతంగా నడుస్తోంది. అర్జున అవార్డు రావడం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలవడం, ఇప్పుడు ఈ టైటిల్‌ను సాధించడం. మొత్తానికి ఏడాది చివర్లో మేం చాలా సంతృప్తిగా ఉన్నాం. వచ్చే ఏడాది జరిగే పెద్ద టోర్నీల్లో కూడా సింధు మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని ఆశిస్తున్నా. ఈ విషయంలో కోచ్ గోపీచంద్ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు’. - పి.వి.రమణ, విజయ (సింధు తల్లిదండ్రులు) ‘చైనా ఓపెన్‌కు దూరంగా ఉండటం సింధుకు అనుకూలించింది. నెల రోజుల శిక్షణ, మా ప్రణాళికలు బాగా పని చేశాయి. ఈ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా ఆటలో వేగం, దూకుడుపై ఎక్కువగా దృష్టిపెట్టాం. మకావు ఓపెన్‌లో వీటిని సమర్థంగా ప్రయోగించింది’. - గోపీచంద్ (చీఫ్ కోచ్) -
సెమీస్‌లో సింధు
సాక్షి, హైదరాబాద్: తన విజయపరంపరను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మకావు సిటీలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు 21-17, 21-12తో ఐదో సీడ్ సాజ్ కా చాన్ (హాంకాంగ్)పై అలవోకగా గెలిచింది. తొలి రెండు రౌండ్ మ్యాచ్‌ల్లో మూడు గేమ్‌ల చొప్పున ఆడి విజయం సాధించిన ఈ హైదరాబాద్ అమ్మాయి క్వార్టర్ ఫైనల్లో మాత్రం వరుస గేముల్లో విజయాన్ని దక్కించుకుంది. 29 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు స్మాష్‌లతో ఎనిమిది పాయింట్లు, నెట్‌వద్ద ఆరు పాయింట్లు సాధించింది. గతంలో ఈ హాంకాంగ్ ప్లేయర్‌తో ఆడిన రెండుసార్లూ నెగ్గిన సింధు మూడోసారీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలి గేమ్‌లో సింధు ఒకదశలో 15-17తో వెనుకబడింది. అయితే ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం సింధు పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. ఆరంభంలోనే వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 7-1తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె అదే జోరులో గేమ్‌ను, మ్యాచ్‌ను ముగించింది. శనివారం జరిగే సెమీఫైనల్లో క్వాలిఫయర్, ప్రపంచ 780వ ర్యాంకర్ కిన్ జిన్‌జింగ్ (చైనా)తో సింధు ఆడుతుంది. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
సాక్షి, హైదరాబాద్: తొలి రౌండ్ మాదిరిగానే రెండో రౌండ్లోనూ గట్టిపోటీ ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మకావు సిటీలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సింధు 18-21, 21-18, 21-14తో సలక్‌జిత్ పొన్సానా (థాయ్‌లాండ్)పై గెలిచింది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన ఈ ప్రపంచ 11వ ర్యాంకర్ తర్వాత వరుసగా రెండు గేమ్‌లను నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకుంది. తొలి గేమ్ తర్వాత పొన్సానా ఆటతీరును అంచనా వేసిన సింధు నిలకడగా పాయింట్లు స్కోరు చేసింది. రెండో గేమ్‌లో ఈ తెలుగు అమ్మాయి రెండుసార్లు వరుసగా ఆరు పాయింట్లు సాధించింది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో ఇద్దరు పోటాపోటీగా తలపడ్డారు. అయితే స్కోరు 4-4తో సమంగా ఉన్నపుడు సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా తొమ్మిది పాయింట్లు స్కోరు చేసి 13-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పొన్సానా పుంజుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ సాజ్ కా చాన్ (హాంకాంగ్)తో సింధు ఆడుతుంది. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగం రెండో రౌండ్లో ఆడిన భారత్‌కే చెందిన సయాలీ గోఖలే, పి.సి.తులసిలకు ఓటమి ఎదురైంది. పోర్న్‌పవీ (థాయ్‌లాండ్) 21-19, 10-21, 21-15తో సయాలీపై, దీ సువో (చైనా) 21-15, 21-7తో తులసిపై గెలిచారు. -
సింధు శుభారంభం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మకావు సిటీలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సింధు 15-21, 21-12, 21-9తో కిమ్ సూ జిన్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు స్మాష్‌లతో చెలరేగి 26 పాయింట్లు సంపాదించింది. ఇదే టోర్నీలో భారత్‌కే చెందిన సయాలీ గోఖలే, పి.సి.తులసీ కూడా రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. తొలి రౌండ్లో మహారాష్ట్ర క్రీడాకారిణి సయాలీ 24-22, 21-15తో చీ యా చెంగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గగా... కేరళ అమ్మాయి తులసీ 22-20, 21-19లో రెండో సీడ్ నిచావోన్ జిందాపోన్ (థాయ్‌లాండ్)ను బోల్తా కొట్టించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్ 19-21, 17-21తో సోల్ కూ చోయ్ (దక్షిణ కొరియా)చేతిలో ఓటమి పాలయ్యాడు. పీ రోంగ్ వాంగ్-కువో యూ వెన్ (చైనీస్ తైపీ) జంటతో జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం తొలి గేమ్‌లో 0-2తో వెనుకంజలో ఉన్న దశలో గాయం కారణంగా వైదొలిగింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో కోనా తరుణ్-అశ్విని పొన్నప్ప జోడి 10-21, 21-17, 13-21తో నిపిత్పోన్-పుతియా సుపాజిర్కుల్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. గురువారం జరిగే రెండో రౌండ్లో ప్రపంచ 62వ ర్యాంకర్ సలక్‌జిత్ పొన్సానా (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. -
‘ఫ్రెంచ్’లో ఖేల్ ఖతం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధు ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. అటు పురుషుల విభాగంలో శ్రీకాంత్, అజయ్ జయరామ్, ఆనంద్ పవార్ కూడా ఓటమి చవిచూశారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ సైనా 22-20, 15-21, 20-22తో యోన్ జూ బే (దక్షిణకొరియా) చేతిలో కంగుతింది. గంటా 11 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏపీ అమ్మాయి తొలి గేమ్‌లో దూకుడును కనబర్చింది. అయితే రెండో గేమ్‌లో స్థాయి మేరకు రాణించలేకపోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్ ఆరంభంలో 12-10తో పైచేయి సాధించింది. నెట్ వద్ద మెరుగ్గా ఆడిన జూ బే 12-12తో స్కోరును సమం చేసింది. ఇక ఇక్కడి నుంచి ఒక్కో పాయింట్ కోసం ఇద్దరు క్రీడాకారిణిలు హోరాహోరీగా తలపడ్డారు. ఓ దశలో 14-14, 17-17తో స్కోరు సమమైనా సైనా రెండు బలమైన స్మాష్‌లతో చెలరేగి 19-17 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ఆధిక్యాన్ని ఎక్కువసేపు కాపాడుకోలేకపోవడంతో 19-19, 20-20తో స్కోరు సమమైంది. చివరకు జూ బే రెండు గేమ్ పాయింట్లతో మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మరో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్) 10-21, 21-19, 21-16తో సింధుపై నెగ్గింది. చకచకా వరుస పాయింట్లతో తొలి గేమ్‌ను సునాయసంగా గెలిచిన సింధు... రెండో గేమ్‌లోనూ అదే ఊపును కొనసాగించింది. అయితే చివర్లో రెండు గేమ్ పాయింట్లను చేజార్చుకోవడంతో మూల్యం చెల్లించుకుంది. మూడో గేమ్‌లో స్కోరును 11-11తో సమం చేసినా ఆ తర్వాత క్రమంగా ఆటపై పట్టు కోల్పోయింది. పురుషుల విభాగంలో రైజింగ్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ 21-15, 18-21, 15-21తో ఆరోసీడ్ బూన్సక్ పొన్సానా (థాయ్‌లాండ్) చేతిలో; అజయ్ జయరామ్ 18-21, 18-21తో టాప్‌సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో; ఆనంద్ పవార్ 20-22, 18-21తో సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశారు. -
సూపర్ సింధు
పారిస్: వారం రోజుల క్రితం డెన్మార్క్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిన భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ పి.వి.సింధు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో మాత్రం శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సంచలనం సృష్టించింది. ప్రపంచ ఆరో ర్యాంకర్, డెన్మార్క్ ఓపెన్ రన్నరప్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 21-8, 21-12తో విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కేవలం 29 నిమిషాల్లో తన ప్రత్యర్థిని చిత్తు చేసిన సింధు స్మాష్‌ల ద్వారా 14 పాయింట్లు, నెట్‌వద్ద 10 పాయింట్లు గెలిచింది. తొలి గేమ్‌లోనైతే ప్రపంచ పదో ర్యాంకర్ సింధు ఒకదశలో వరుసగా తొమ్మిది పాయింట్లు సంపాదించింది. ఓవరాల్‌గా సుంగ్ జీ హున్‌పై సింధుకిది మూడో విజయం కావడం విశేషం. గత ఏడాది ఇండియా ఓపెన్‌లో, ఈ ఏడాది స్విస్ ఓపెన్‌లోనూ సింధు చేతిలో సుంగ్ జీ హున్ ఓడిపోయింది. మరోవైపు నాలుగో సీడ్ సైనా నెహ్వాల్ అతికష్టమ్మీద తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించింది. ప్రపంచ 15వ ర్యాంకర్ నిచావోన్ జిందాపోన్ (థాయ్‌లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో నిరుటి రన్నరప్ సైనా 16-21, 21-16, 21-13తో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా స్మాష్‌ల ద్వారా తొమ్మిది పాయింట్లు, నెట్‌వద్ద 16 పాయింట్లు సంపాదించింది. మరో మ్యాచ్‌లో భారత్‌కే చెందిన అరుంధతి పంతవానె 17-21, 21-16, 14-21తో పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో యోన్ జూ బే (దక్షిణ కొరియా)తో సైనా నెహ్వాల్; క్రిస్టినా (చెక్ రిపబ్లిక్) లేదా కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)తో సింధు తలపడతారు. ఆనంద్ పవార్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు కిడాంబి శ్రీకాంత్... మహారాష్ట్ర ప్లేయర్ ఆనంద్ పవార్ ముందంజ వేశారు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 30వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-14, 17-21, 21-10తో ప్రపంచ 12వ ర్యాంకర్ వింగ్ కీ వోంగ్ (హాంకాంగ్)పై సంచలన విజయం సాధించగా... ఆనంద్ పవార్ 21-9, 24-22తో థామస్ రూక్సెల్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. మంగళవారం రాత్రి ఆలస్యంగా జరిగిన మరో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గురుసాయిదత్ 9-21, 14-21తో చెన్ యుకున్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ బూన్సక్ పొన్సానా (థాయ్‌లాండ్)తో శ్రీకాంత్; సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్)తో ఆనంద్ పవార్; టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)తో అజయ్ జయరామ్ పోటీపడతారు. పోరాడి ఓడిన జ్వాల జోడి మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జోడికి తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. జ్వాల-అశ్విని జంట 18-21, 21-13, 17-21తో గెబ్బీ రిస్తియాని-తియారా రొసాలియా (ఇండోనేసియా) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. -
సైనా x సింధు!
పారిస్: అంతా అనుకున్నట్టు జరిగితే... అంతర్జాతీయస్థాయిలో తొలిసారి భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పి.వి.సింధు ముఖాముఖి పోరును చూసే అవకాశముంది. ఈనెల 22 నుంచి 27 వరకు పారిస్‌లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులిద్దరూ ఒకే పార్శ్వంలో ఉన్నారు. మంగళవారం విడుదల చేసిన ‘డ్రా’ ప్రకారం ఆరంభ విఘ్నాలను అధిగమిస్తే మహిళల సింగిల్స్‌లో సైనా, సింధులు క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడతారు. తొలి రౌండ్లో ఆరో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో ఆడనున్న సింధు ఈ మ్యాచ్‌లో గెలిస్తే రెండో రౌండ్లో కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్) లేదా క్రిస్టినా గావన్హోల్ట్ (చెక్ రిపబ్లిక్)లలో ఒకరితో పోటీపడుతుంది. మరోవైపు నాలుగో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సైనా తొలి రౌండ్లో నిచావోన్ జిందాపోన్ (థాయ్‌లాండ్)తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రెండో రౌండ్లో ఈ హైదరాబాద్ అమ్మాయికి యోన్ జూ బే (దక్షిణ కొరియా) ఎదురుకావొచ్చు. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గితే క్వార్టర్ ఫైనల్లో సింధు, సైనా పోటీపడతారు. గత ఆగస్టులో జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో సైనా, సింధు రెండుసార్లు పోటీపడగా... రెండు మ్యాచ్‌ల్లో సైనానే గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పారుపల్లి కశ్యప్‌కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. అతను తొలి రౌండ్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా)తో ఆడాల్సి ఉంది. గతంలో లీ చోంగ్ వీతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కశ్యప్ వరుస గేముల్లో ఓడిపోయాడు. కశ్యప్‌తోపాటు అజయ్ జయరామ్, గురుసాయిదత్ కూడా మెయిన్ ‘డ్రా’లో ఉన్నారు. తొలి రౌండ్లో సకాయ్ కజుమాసా (జపాన్)తో జయరామ్; చెన్ యుకెన్ (చైనా)తో గురుసాయిదత్ ఆడతారు. -
ప్రిక్వార్టర్స్‌లో సింధు
టోక్యో: బలమైన స్మాష్‌లు... మెరుగైన డ్రాప్ షాట్లు... నెట్ వద్ద పూర్తి అప్రమత్తంగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు... జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సత్తా చాటింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ సింధు 21-12, 21-13తో యుకినో నకాయ్ (జపాన్)పై విజయం సాధించింది. కేవలం 29 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో 3-0 ఆధిక్యంలో నిలిచిన సింధు తర్వాత చెలరేగింది. దీంతో స్కోరు 10-4కు వెళ్లింది. ఈ దశలో మరోసారి విజృంభించిన ఆమె వరుసగా ఏడు పాయింట్లు నెగ్గింది. యుకినో ఒకటి, రెండు పాయింట్లకే పరిమితం కావడంతో సింధు సులువుగా గేమ్‌ను సొంతం చేసుకుంది. 6-0తో రెండో గేమ్‌లో ఆధిక్యంలోకి వచ్చాక సింధు కాస్త నెమ్మదించింది. దీంతో ఇరువురు ఒకటి, రెండు పాయింట్లతో సరిపెట్టుకున్నారు. అయితే స్కోరు 16-13 ఉన్న దశలో సింధు డ్రాప్ షాట్లతో ఐదు పాయింట్లు నెగ్గి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో నెట్ వద్ద 21 పాయి ంట్లు గెలుచుకుంది. ప్రిక్వార్టర్స్‌లో సింధు... యమగుచి (జపాన్)తో తలపడుతుంది. శ్రీకాంత్ జోరు బ్యాడ్మింటన్ లీగ్‌లో మెరుగైన ర్యాంక్ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన ఏపీ రైజింగ్ స్టార్ కె.శ్రీకాంత్ ఈ టోర్నీలోనూ జోరు కనబర్చాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అన్‌సీడ్ శ్రీకాంత్ 22-20, 22-24, 21-18తో ప్రపంచ 22వ ర్యాంకర్ షో ససాకి (జపాన్)పై నెగ్గాడు. తద్వారా ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. మరో మ్యాచ్‌లో ప్రపంచ 56వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ 15-21, 21-17, 24-22తో ప్రపంచ 14వ ర్యాంకర్ వింగ్ కి వాంగ్ (హాంకాంగ్)పై నెగ్గి సంచలనం సృష్టించాడు. ఇతర గేమ్‌ల్లో ఆనంద్ పవార్ 21-17, 7-21, 21-18తో సోని ద్వికుంకురో (ఇండోనేసియా)పై; అజయ్ జయరామ్ 21-11, 21-18తో టియాన్ చెన్ చో (చైనీస్‌తైపీ)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. ఇతర మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్, సౌరభ్ వర్మ ఓడిపోయారు. -
ఫైనల్ ‘షాట్’
ముంబై: ఒకరిదేమో నిలకడ.. మరొకరిదేమో సంచలనం. అంతర్జాతీయ యవనికపై భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్... పి.వి.సింధుల నేపథ్యం ఇది. అలాంటి వీరిద్దరు ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) తొలి ట్రోఫీ కోసం మరోసారి ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. శనివారం ఇక్కడి ఎన్ఎస్సీఏ స్టేడియంలో జరిగే ఫైనల్లో హైదరాబాద్ హాట్‌షాట్స్, అవధ్ వారియర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఓవరాల్‌గా ఈ పోటీలో హాట్‌షాట్స్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా... సింధు బృందం నుంచి గట్టి పోటీ తప్పకపోవచ్చు. ఇప్పటి వరకు వ్యక్తిగతంగా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన సైనా... మరో విజయంపై దృష్టిపెట్టింది. అలాగే కీలకమైన సమయంలో సహచరులను ప్రోత్సహిస్తూ జట్టును ముందుండి నడిపిస్తోంది. ఆగస్టు 15న సింధుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ప్రపంచ నాలుగో ర్యాంకర్ సులువుగా గెలిచినా... ఈసారి మాత్రం ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన తప్పకపోవచ్చు. ఎందుకంటే ప్రపంచస్థాయి క్రీడాకారిణిలను ఓడించిన సింధు కూడా సూపర్ ఫామ్‌లో ఉంది. గతంలోలాగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ గెలుపుపైనే హైదరాబాద్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. రెండో సింగిల్స్‌లో తనోంగ్సుక్ సత్తా చాటేందుకు సిద ్ధంగా ఉన్నాడు. డబుల్స్‌లో షెమ్ గో, వాహ్ లిమ్; మిక్స్‌డ్‌లో తరుణ్ కోనా-ప్రద్న్యా గాద్రె ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. మరోవైపు సింధు కూడా ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది. సైనాను ఓడిస్తే మిగతా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి గెలుపే లక్ష్యంగా ఆమె బరిలోకి దిగుతోంది. అయితే సింధు నిరాశపర్చినా... మిగతా మ్యాచ్‌ల్లో గెలిచే ఆటగాళ్లు ఉండటం అవధ్‌కు లాభిస్తోంది. శ్రీకాంత్ సంచనలం సృష్టిస్తే.. గురుసాయిదత్ రెండో సింగిల్స్‌లో ఓడినా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే డబుల్స్, మిక్స్‌డ్‌లో మార్సిస్ కిడో విశేషంగా రాణిస్తున్నాడు. ఇతనికి మథియాస్ బోయే, పియా బెర్నాడెత్ల నుంచి మంచి సహకారం అందుతోంది. ఏదేమైనా ఇరుజట్లలో అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉండటంతో పోటీ రసవత్తరంగా జరగడం ఖాయం. ఫైనల్‌కు చేరారిలా హాట్‌షాట్స్ 3-2తో అవధ్‌పై గెలుపు 2-3తో ఢిల్లీ చేతిలో ఓటమి 4-1తో పుణేపై గెలుపు 3-2తో ముంబైపై గెలుపు 2-3తో బంగాబీట్స్ చేతిలో ఓటమి 3-0తో పుణేపై గెలుపు (సెమీస్) అవధ్ వారియర్స్ 2-3తో హాట్‌షాట్స్ చేతిలో ఓటమి 1-4తో బంగా బీట్స్ చేతిలో ఓటమి 4-1తో ఢిల్లీపై గెలుపు 3-2తో ముంబైపై గెలుపు 3-2తో పుణేపై గెలుపు 3-2తో ముంబైపై గెలుపు (సెమీస్) -
సింధు ఇంకా నేర్చుకోవాలి
న్యూఢిల్లీ: అచిరకాలంలోనే సింధు అసాధారణ ఫలితాలు సాధిస్తున్నప్పటికీ ఆమె ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణి టిన్ బౌన్ తెలిపింది. డెన్మార్క్‌కు చెందిన ఈ దిగ్గజం... భారత స్టార్లు సింధు, సైనా నెహ్వాల్‌ల ప్రతిభను కొనియాడింది. మూడు సార్లు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌గా నిలిచిన బౌన్... సింధు ఎత్తే ఆమెకు వరమని ప్రత్యర్థులపై అటాకింగ్ గేమ్ ఆడేందుకు ఆ ఎత్తే కలిసి వస్తుందని చెప్పింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో ఈ డెన్మార్క్ స్టార్ ముంబై మాస్టర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘సైనా, సింధులిద్దరు నాలాగే అగ్రశ్రేణి ప్లేయర్లు. అయితే యువతార సింధు కంటే ఓవరాల్‌గా సైనాయే గొప్ప క్రీడాకారిణి. ఆమె చాన్నాళ్ల నుంచి నిలకడగా ఆడుతోంది. ఆటపై వంద శాతం అంకితభావాన్ని కనబరుస్తోంది కాబట్టే స్థిరంగా టాప్-5లో కొనసాగుతోంది. ఇలా తొలి ఐదు ర్యాంకుల్లో స్థిరంగా నిలవడమంటే మాటలు కాదు... చేతలు కావాలి. సైనా నిజంగా చేతలతో మెప్పించే క్రీడాకారిణి. సింధు కూడా మేటి క్రీడాకారిణికేం తక్కువ కాదు. కానీ ఆమె ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతోంది. ఆమె ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆటకు మెరుగులు దిద్దుకొని స్థిరంగా రాణించడంపైనే ఆమె దృష్టిసారించాలి’ అని బౌన్ పేర్కొంది. సింధు బాగానే ఆడుతున్నప్పటికీ... వరుసగా కొన్ని పాయింట్లు కోల్పోగానే ఆత్మరక్షణలో పడుతోందని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె సరైన దృక్పథంతో ముందడుగు వేయాలని తెలిపింది. సైనాలాగే ఆమె కూడా రాణించాలంటే... స్వల్పకాలంలో సాధించిన విజయాలకు మురిసిపోకుండా ఆటపైనే ధ్యాస పెట్టాలని బౌన్ సూచించింది. ముఖ్యంగా ప్రత్యర్థులపై ఆధిపత్యం చాటేందుకు అవసరమైన అస్త్రాలతో ఆమె సిద్ధం కావాలని చెప్పింది. ‘తాజాగా టాప్-10లోకి ఎగబాకిన సింధు టాప్-5 లక్ష్యంగా తన ఆటతీరును మెరుగుపర్చుకోవాలి. చైనీయులను సైతం ఓడించే సత్తా ఆమెలో ఉంది. అంతకుమించి ఆమెకు మంచి భవిష్యత్తు కూడా ఉంది’ అని బౌన్ చెప్పుకొచ్చింది. సరైన గుర్తింపు దక్కకపోవడం వల్లే భారత్‌లో ‘డబుల్స్’ ప్రాధాన్యం తగ్గుతోందని టిన్ బౌన్ చెప్పింది. ‘అంతా సింగిల్స్‌నే గొప్పగా చూస్తే... సహజంగా మిగతా కేటగిరీలపై ఆసక్తి సన్నగిల్లుతుంది. మా డెన్మార్క్ డబుల్స్‌కు పెట్టింది పేరు. దీంతో అక్కడ వాళ్లే ఐకాన్ ప్లేయర్లు. కానీ భారత్‌లో సింగిల్స్ క్రీడాకారులే స్టార్లుగా వెలుగొందడంతో డబుల్స్ ప్రాముఖ్యత తగ్గుతోంది’ అని బౌన్ వివరించింది. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌పై చెప్పిన ఆమె కుటుంబంతో సేదతీరుతోంది. అయితే ప్రస్తుత ఐబీఎల్ టోర్నీలో ఆడటం ద్వారా తనలో ఆటకు దూరమయ్యాననే భావన తొలగిపోయిందని ఆమె చెప్పింది. -
ఇద్దరు బ్యాడ్మింటన్ రాణుల తొలి సమరం
-
పదో ర్యాంక్‌కు సింధు
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను నమోదు చేసింది. గురువారం తాజాగా విడుదల చేసిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకుల్లో ఆమె పదో స్థానానికి ఎగబాకింది. 55172 పాయింట్లతో రెండు స్థానాలు మెరుగుపర్చుకుంది. సైనా నెహ్వాల్ నాలుగో ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. పురుషుల విభాగంలో కశ్యప్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 14వ ర్యాంక్‌లో నిలిచాడు. ఆర్ఎమ్వీ గురుసాయిదత్ 20వ, అజయ్ జయరామ్ 24వ ర్యాంకుల్లో ఉన్నారు. -
సింధును చిత్తు చేసిన నెహ్వాల్
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా చెప్పుకోదగ్గ విజయాలు లేని సైనా నెహ్వాల్ ఒక వైపు...ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి కొత్త ఉత్సాహంతో ఉన్న పీవీ సింధు మరో వైపు...భారత బ్యాడ్మింటన్‌కు చిరునామాగా మారిన వీరిద్దరి మధ్య పోరు ఐబీఎల్‌లో మొదటినుంచి ఆసక్తి రేపింది. చివరకు స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఆ ఘడియ వచ్చింది. అయితే ఒలింపిక్ పతక విజేత అంతర్జాతీయ అనుభవం ముందు.... సింధు ‘బిందు’వుగా మారింది. తొలి గేమ్‌లో గట్టి పోటీ ఇచ్చిన సింధు, రెండో గేమ్‌లో పూర్తిగా తలవంచింది. ఫలితంగా హాట్ షాట్ సైనా 21-19, 21-8తో అవధ్ అమ్మాయి సింధుపై ఘన విజయం సాధించింది. హోరాహోరీ... తొలి గేమ్‌లో రెండు పాయింట్లు గెలిచిన సైనా ముందుగా 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే క్రాస్ కోర్ట్ స్మాష్‌లతో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గిన సింధు 4-2తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఒక్కో పాయింట్ కోసం ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. చక్కటి ప్లేసింగ్‌తో సింధు పాయింట్లు రాబట్టి ముందుకు దూసుకెళితే, స్మాష్‌లతో సైనా స్కోరును సమం చేస్తూ వచ్చింది. సింధు 15-12తో ముందంజలో ఉన్న దశలో గేమ్ మలుపు తిరిగింది. ఒక్కసారిగా విజృంభించిన సైనా వరుసగా ఐదు పాయింట్లు తన ఖాతాలో వేసుకొని 17-15తో ఆధిక్యం అందుకుంది. ఆ తర్వాత సింధు 2 పాయింట్లు...సైనాకు 2...ఇలా ఇద్దరూ పోటీ పడ్డారు. గేమ్ పాయింట్ వద్ద సింధు ఒక పాయింట్ కాచుకున్నా, స్మాష్‌తో సైనా గేమ్ ముగించింది. ఏకపక్షం... రెండో గేమ్‌లో మాత్రం సైనా జోరును ఏ దశలోనూ సింధు అడ్డుకోలేకపోయింది. ఆరంభంనుంచి దూకుడు ప్రదర్శించిన సైనా వరుసగా 4 పాయింట్లు గెల్చుకొని 6-3 ఆధిక్యంలోకి వెళ్లింది. నెహ్వాల్ ఒక వైపు వరుస పాయింట్లతో దూసుకుపోతుంటే సింధు కోలుకోలేకపోయింది. 9-5, 13-6, 17-7...ఇలా సైనా చెలరేగింది. 17-8 వద్ద మళ్లీ నాలుగు పాయింట్లు సాధించి సైనా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ‘అకాడమీలో నేను, సింధు కలిసి ఆడుతూనే ఉంటాం. అయితే ఈ మ్యాచ్‌కు మీడియా అతిగా ప్రచారం కల్పించడం, తీవ్రంగా చర్చ జరగడంతో నాపై ఒత్తిడి పెరిగింది. దాంతో ఆరంభంలో ఇబ్బంది పడ్డాను. సింధు బాగా ఆడింది. అయితే ప్రత్యర్థి ఎవరైనా... ఆటను బట్టి వ్యూహాలు మార్చుకోవడమే తప్ప ప్రత్యేక ప్రణాళిక ఏమీ లేదు. నా సహజసిద్ధమైన శైలిలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాను. ఈ రోజు ఇద్దరం మెరుగ్గా ఆడినా మ్యాచ్ గెలవడం నా అదృష్టం’ - సైనా నెహ్వాల్ ప్రేక్షకుల్లో ప్రముఖులు... సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇద్దరు భారత అగ్రశ్రేణి క్రీడాకారుల మధ్య పోరును తిలకించేందుకు స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రముఖులతో స్టేడియం నిండిపోయింది. తన అలవాటుకు భిన్నంగా టీ షర్ట్, ట్రౌజర్‌లో వచ్చిన కేంద్ర ఆర్ధిక మంత్రి పి.చిదంబరం సతీ సమేతంగా మొత్తం మ్యాచ్‌ను వీక్షించారు. ఒలింపిక్స్ రజత విజేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌తో పాటు హీరో నాగార్జున తదితరులు మ్యాచ్ తిలకించారు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన సింధును మ్యాచ్‌కు ముందు చిదంబరం సన్మానించారు. -
మహిళల సింగిల్స్ లో సైనా,సింధు
ఇన్నాళ్లూ గోపీచంద్ అకాడమీలో కలిసి ప్రాక్టీస్ చేసిన సైనా నెహ్వాల్, పి.వి.సింధు తొలిసారి ముఖాముఖిగా పోరాడనున్నారు. ఐబీఎల్‌లో గురువారం ఈ దృశ్యం కనిపించనుంది. మహిళల సింగిల్స్ ఏకైక మ్యాచ్‌లో హైదరాబాద్ హాట్‌షాట్స్ తరఫున సైనా... అవధ్ వారియర్స్ నుంచి సింధు బరిలోకి దిగనున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి సింధు జోరు మీద ఉండగా... వరుసగా నాలుగోసారీ ప్రపంచ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా ఒత్తిడిలో ఉంది. ఈ ఇద్దరి స్టార్స్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితానికి అధికారిక గుర్తింపు లేకపోయినా...టోర్నీకి హైలైట్ కావచ్చు. ఐబీఎల్‌లో నేడు హైదరాబాద్ హాట్‌షాట్స్ x అవధ్ వారియర్స్ సాయంత్రం గం. 4.00 నుంచి ముంబై మాస్టర్స్ x బంగా బీట్స్ రాత్రి గం. 8.00 నుంచి ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సింధు, కోహ్లిలకు ‘అర్జున’అవార్డులు, రంజన్ సోధి కి ‘ఖేల్ రత్న’!
న్యూఢిల్లీ: వరుస ప్రపంచకప్‌ల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారతీయ ట్రాప్ షూటర్ రంజన్ సోధి పేరును... ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర’కు సిఫారసు చేశారు. హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిలను ‘అర్జున’ అవార్డులు వరించనున్నాయి. బిలియర్డ్స్ దిగ్గజం మైకేల్ పెరీరా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది క్రీడాకారులను ఈ అవార్డుల కోసం ఎంపిక చేసింది. 2010 కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత రంజిత్ మహేశ్వరి (ట్రిపుల్ జంప్), రైజింగ్ గోల్ఫ్ స్టార్ గగన్జిత్ బుల్లర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఖేల్త్న్ర అవార్డుకు క్రీడా శాఖ నుంచి ఆమోదం లభిస్తే... ఈ పురస్కారం దక్కించుకున్న ఏడో షూటర్‌గా సోధి రికార్డులకెక్కుతాడు. ఆశ్చర్యకర విషయమేమిటంటే గత మూడేళ్లలో ఈ అవార్డు షూటర్లకే దక్కడం విశేషం. 2011లో గగన్ నారంగ్, 2012లో రెజ్లర్ యోగేశ్వర్ దత్తో కలిసి లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత విజయ్ కుమార్‌కు ఈ పురస్కారం లభించింది. పంజాబ్‌లోని ఫెరోజ్‌పూర్ జన్మించిన రంజన్ సోధి... 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు రజత పతకాలు సాధించాడు. అయితే లండన్ ఒలింపిక్స్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. గతేడాది జరిగిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించాడు. 33 ఏళ్ల సోధి 2009లో అర్జున అవార్డును దక్కించుకున్నాడు. అర్జున అవార్డీలు: కోహ్లి (క్రికెట్), చక్రవోల్ సువురో (ఆర్చరీ), రంజిత్ మహేశ్వరి (అథ్లెటిక్స్), పి.వి.సింధు (బ్యాడ్మింటన్), కవితా చాహల్ (బాక్సింగ్), రూపేశ్ షా (స్నూకర్), గగన్జిత్ బుల్లర్ (గోల్ఫ్), సాబా అంజుమ్ (హాకీ), రాజ్‌కుమారీ రాథోర్ (షూటింగ్), జోత్స్న చినప్ప (స్క్వాష్), మౌమా దాస్ (టేబుల్ టెన్నిస్), నేహా రాతీ (రెజ్లింగ్), ధర్మేంద్ర దలాల్ (రెజ్లింగ్), అభిజిత్ గుప్తా (చెస్), అమిత్ కుమార్ సరోహా (ప్యారా స్పోర్ట్స్). (కమిటీ ఎంపిక చేసిన వారికి అవార్డులు ప్రకటించడం లాంఛనమే. క్రీడాశాఖ ఆమోదం తర్వాత ఈ జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు) -
సింధుకు ఉజ్వల భవిష్యత్
సాక్షి క్రీడావిభాగం సైనా తర్వాత ఎవరు? అన్న ప్రశ్నకు సింధు రూపంలో సమాధానం దొరికింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ తెలుగుతేజం ప్రదర్శన చూశాక భారత బ్యాడ్మింటన్ భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండబోతుందనే నమ్మకం కలిగింది. ఇన్నాళ్లూ భారత బ్యాడ్మింటన్ అంటే ప్రధానంగా సైనా పేరును ప్రస్తావించేవారు. ఇక నుంచి ఈ ఇద్దరి పేర్లూ వినిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకంతో సింధు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మాయి పదేళ్ల కఠోర శ్రమకు ఫలితాలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఒక్క ఘనతతో సింధును అగ్రశ్రేణి క్రీడాకారిణుల జాబితాలో చేర్చడం తొందరపాటే అవుతుంది. 5 అడుగుల 11 అంగుళాల ఎత్తున్న ఈ హైదరాబాద్ అమ్మాయి ఇంకా రాటుదేలాల్సి ఉంది. స్టార్‌గా ఎదగాలంటే సింధు ఆటతీరు మెరుగుపడాల్సిన అవసరముందని రత్చనోక్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌తో రుజువైంది. దూకుడుగా ఆడే చైనీయుల ఆటతీరుకు సింధు శైలి సరిపోతుంది. కానీ ప్రత్యర్థి బలాబలాలను బేరీజు వేసి సందర్భాన్నిబట్టి ఆడే రత్చనోక్లాంటి క్రీడాకారిణులను ఓడించాలంటే ఫిట్నెస్... షాట్లలో వైవిధ్యం... మానసిక దృఢత్వం... ఇలా పలు అంశాల్లో రాటుదేలాల్సిన అవసరం ఉంది. గత ఏప్రిల్‌లో మోకాలి గాయం కారణంగా రెండు నెలలపాటు సింధు ఆటకు దూరమైంది. సింధు ఇంకా నేర్చుకునేదశలోనే ఉందని ఆమె పరిపూర్ణ క్రీడాకారిణిగా మారాలంటే మరో రెండేళ్లు పడుతుందని ఇటీవల చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. సింధు పూర్తి ఫిట్నెస్తో ఉంటే... సహజశైలిలో ఆడితే... ఎలాంటి ఫలితాలు వస్తాయో తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కనిపించింది. ఒకట్రెండు విజయాలతో ఉప్పొంగిపోకుండా తన కెరీర్ మరింత ఉజ్వలంగా మారాలంటే సింధు ఆటతీరులో స్థిరత్వం కనిపించాలి. అప్పుడే మరిన్ని విజయాలు వస్తాయి. -
సెమీఫైనల్లో సింధు పరాజయం
ఊహకందని ప్రదర్శనతో ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ఫలితాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ యువతార పూసర్ల వెంకట సింధు జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. ఒక్క విజయం సాధించి ఉంటే ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ ప్లేయర్‌గా సింధు కొత్త చరిత్ర సృష్టించేది. అయితే ఒక్కసారిగా పెరిగిన అంచనాలు... అలసట... ఒత్తిడి... ప్రత్యర్థి పకడ్బందీ ఆటతీరు... వెరసి ఈ మెగా ఈవెంట్లో ఈ 18 ఏళ్ల తెలుగు తేజానికి సెమీఫైనల్లో ఓటమి ఎదురైంది. అయితేనేం ఈ పోటీల చరిత్రలో మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సింధు గుర్తింపు పొందింది. గ్వాంగ్జూ (చైనా): ఆశ ఆవిరైంది. అద్భుతం మహాద్భుతంగా మారలేకపోయింది. అందరి అంచనాలను తారుమారు చేసి ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీఫైనల్‌కు చేరిన తెలుగు అమ్మాయి పి.వి. సింధు సంచలనాలకు తెరపడింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ యిహాన్ వాంగ్ (చైనా)ను... 2010 ఆసియా క్రీడల విజేత షిజియాన్ వాంగ్ (చైనా)ను వారి గడ్డపైనే బోల్తా కొట్టించిన సింధు సెమీఫైనల్లో సహజశైలిలో ఆడలేకపోయింది. ప్రపంచ మూడో ర్యాంకర్, హ్యాట్రిక్ జూనియర్ వరల్డ్ మాజీ చాంపియన్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్)తో 36 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సింధు 10-21, 13-21తో ఓటమి పాలై కాంస్య పతకంతో సంతృప్తి పడింది. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ లీ జురుయ్ (చైనా) 21-5, 21-11తో యోన్ జూ బే (దక్షిణ కొరియా)ను ఓడించి ఆదివారం జరిగే ఫైనల్లో రత్చనోక్‌తో అమీతుమీకి సిద్ధమైంది. సింధును ఓడించడంద్వారా ఈ పోటీల చరిత్రలో థాయ్‌లాండ్ తరఫున ఫైనల్‌కు చేరిన తొలి ప్లేయర్‌గా 18 ఏళ్ల రత్చనోక్ చరిత్ర సృష్టించింది. ఇద్దరు చైనా స్టార్స్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరిన సింధును రత్చనోక్ ఏమాత్రం తక్కువ అంచనా వేయలేదు. సింధు దూకుడుగా ఆడితే తనకూ భంగపాటు తప్పదని భావించిన రత్చనోక్ ఏదశలోనూ ఆ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. ఆద్యంతం తన షాట్లలో వైవిధ్యం ఉండేలా పక్కా వ్యూహంతో ఆడి సింధును పూర్తిగా కట్టడి చేయడంలో సఫలమైంది. క్రాస్‌కోర్టు హాఫ్ స్మాష్‌లను ప్రయోగిస్తూ పలు పాయింట్లు నెగ్గిన ఈ థాయ్‌లాండ్ స్టార్ నెట్‌వద్ద కూడా పైచేయి సాధించింది. తొలి గేమ్‌లో 11-4తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె ఆ తర్వాత అదే జోరును కనబరిచింది. మ్యాచ్ మొత్తంలో రత్చనోక్ ఆటతీరును అంచనా వేయలేకపోయిన సింధు చాలాసార్లు అనవసర తప్పిదాలు చేసింది. షటిల్స్ గమనాన్ని అంచనా వేయడంలోనూ తడబడింది. ఆమె కొట్టిన కొన్ని షాట్లు గతితప్పి అవుట్‌గా వెళ్లాయి. కొన్నేమో నెట్‌కు తగిలాయి. ఫలితంగా రెండో గేమ్ ఆరంభంలో రత్చనోక్ 8-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. వ్యూహం మార్చి తన ప్రత్యర్థి జోరును అడ్డుకట్ట వేయాలని సింధు అనుకున్నా రత్చనోక్ ఆ అవకాశమే ఇవ్వలేదు. దాంతో సింధుకు ఓటమి తప్పలేదు. ప్రైజ్‌మనీ లేదు... పాయింట్లే వస్తాయి సెమీఫైనల్లో ఓడిన సింధుకు కాంస్య పతకంతోపాటు 8400 ర్యాంకింగ్ పాయింట్లు వస్తాయి. సింధుకే కాకుండా ఈ పోటీల్లో ఎవరికీ ప్రైజ్‌మనీ రావడంలేదు. కారణం 1977లో ప్రపంచ చాంపియన్‌షిప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఈవెంట్‌కు ఎలాంటి ప్రైజ్‌మనీని కేటాయించడంలేదు. విజేతకు స్వర్ణ పతకం... రన్నరప్‌కు రజత పతకం... సెమీఫైనల్లో ఓడిన ఇద్దరికి కాంస్య పతకాలు మాత్రం ఇస్తారు. ఈ ప్రదర్శనతో ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న సింధు వచ్చే గురువారం విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్-10లోకి వచ్చే అవకాశముంది. ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడిన తొలిసారే కాంస్యం సాధించడం గొప్ప ఘనతగా భావిస్తున్నాను. నిజానికి నా డ్రా చాలా కఠినంగా ఉంది. ఇద్దరు చైనా క్రీడాకారిణులు ఉన్నా.. గెలుస్తాననే నమ్మకంతోనే టోర్నీని ప్రారంభించాను. గాయం నుంచి కోలుకుని టోర్నీ బరిలోకి దిగాను. వచ్చే ఏడాది మరింత బాగా ఆడేందుకు ప్రయత్నిస్తా. సెమీస్‌లో చాలా తప్పులు చేశాను. ప్రాక్టీస్‌లో నా బలహీనతలపై దృష్టిపెడతా. గోపీ సర్ ఎలా చేయమంటే అలా చేస్తా. నాపై ఉన్న అంచనాలను అధిగమించేందుకు ప్రయత్నించా. అయితే ఇది ఒత్తిడి మాత్రం కాదు’ - సింధు ‘సంతోషంగా ఉన్నాం’ ఈ రోజు సింధు ప్రదర్శన సరిగా లేదు. తన సహజశైలిలో ఆడలేకపోయింది. తర్వాతి టోర్నమెంట్లో బాగా ఆడుతుందని ఆశిస్తున్నాను. రత్చనోక్ స్ట్రోక్స్‌ను సింధు తీయలేకపోయింది. కొన్ని తప్పులు చేసింది. ఈ స్థాయిలో అవి చేయాల్సినవి కావు. ఇప్పుడు కోచ్ గోపీచంద్ వీటిపై దృష్టి పెడతారనుకుంటా. ఏమైనా ఈ పతకంతో సంతోషంగా ఉన్నాం. డ్రా చాలా కఠినంగా ఉన్నా సెమీస్‌కు చేరి కాంస్యం సాధించడం గర్వంగా ఉంది. - పి.వి. రమణ, విజయ (సింధు తల్లిదండ్రులు)