పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధు ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. అటు పురుషుల విభాగంలో శ్రీకాంత్, అజయ్ జయరామ్, ఆనంద్ పవార్ కూడా ఓటమి చవిచూశారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ సైనా 22-20, 15-21, 20-22తో యోన్ జూ బే (దక్షిణకొరియా) చేతిలో కంగుతింది. గంటా 11 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏపీ అమ్మాయి తొలి గేమ్‌లో దూకుడును కనబర్చింది.
అయితే రెండో గేమ్‌లో స్థాయి మేరకు రాణించలేకపోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్ ఆరంభంలో 12-10తో పైచేయి సాధించింది. నెట్ వద్ద మెరుగ్గా ఆడిన జూ బే 12-12తో స్కోరును సమం చేసింది. ఇక ఇక్కడి నుంచి ఒక్కో పాయింట్ కోసం ఇద్దరు క్రీడాకారిణిలు హోరాహోరీగా తలపడ్డారు. ఓ దశలో 14-14, 17-17తో స్కోరు సమమైనా సైనా రెండు బలమైన స్మాష్‌లతో చెలరేగి 19-17 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ఆధిక్యాన్ని ఎక్కువసేపు కాపాడుకోలేకపోవడంతో 19-19, 20-20తో స్కోరు సమమైంది. చివరకు జూ బే రెండు గేమ్ పాయింట్లతో మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మరో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో కిర్‌స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్) 10-21, 21-19, 21-16తో సింధుపై నెగ్గింది. చకచకా వరుస పాయింట్లతో తొలి గేమ్‌ను సునాయసంగా గెలిచిన సింధు... రెండో గేమ్‌లోనూ అదే ఊపును కొనసాగించింది.
అయితే చివర్లో రెండు గేమ్ పాయింట్లను చేజార్చుకోవడంతో మూల్యం చెల్లించుకుంది. మూడో గేమ్‌లో స్కోరును 11-11తో సమం చేసినా ఆ తర్వాత క్రమంగా ఆటపై పట్టు కోల్పోయింది. పురుషుల విభాగంలో రైజింగ్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ 21-15, 18-21, 15-21తో ఆరోసీడ్ బూన్‌సక్ పొన్సానా (థాయ్‌లాండ్) చేతిలో; అజయ్ జయరామ్ 18-21, 18-21తో టాప్‌సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో; ఆనంద్ పవార్ 20-22, 18-21తో సెన్‌సోమ్‌బూన్‌సుక్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశారు.
‘ఫ్రెంచ్’లో ఖేల్ ఖతం
Published Fri, Oct 25 2013 1:25 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM
Advertisement
Advertisement