న్యూఢిల్లీ: ఈ ఏడాది సైనా నెహ్వాల్ కంటే మెరుగ్గా రాణించిన భారత బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధుతో ఒప్పందం చేసుకునేందుకు విఖ్యాత క్రీడాసామాగ్రి తయారీ సంస్థలు పోటీపడుతున్నాయి. ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలువడంతోపాటు సింధు మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్, మకావు గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లలో టైటిల్స్ సాధించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున’ అవార్డు కూడా అందుకుంది.
18 ఏళ్ల సింధు ప్రస్తుతం యోనెక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గడువు జనవరి 31న ముగుస్తుంది. దీంతో ఒప్పందం పొడిగించుకునేందుకు యోనెక్స్... తొలిసారి ఒప్పందం చేసుకోవాలని అడిడాస్, చైనాకు చెందిన లీ నింగ్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయాన్ని సింధు తండ్రి, అంతర్జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారుడు పి.వి.రమణ ధ్రువీకరించారు. ‘సింధుతో ఒప్పందం చేసుకోవాలని విఖ్యాత క్రీడాసామాగ్రి తయారీ సంస్థలు ఆసక్తితో ఉన్నాయి. లీ నింగ్‌తోపాటు మరో రెండు సంస్థలు ఆకట్టుకునే ప్రతిపాదనలతో మమ్మల్ని సంప్రదించాయి’ అని రమణ వివరించారు.
సింధు కోసం స్పాన్సర్ల పోటీ!
Published Sat, Dec 21 2013 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement