క్వార్టర్స్ లో శ్రీకాంత్, సింధు
పెనాంగ్ (మలేసియా): భారత టాప్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, పి.వి.సింధులు... మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండోసీడ్ శ్రీకాంత్ 21-17, 21-10తో 16వ సీడ్ బున్సాక్ పోన్సానా (థాయ్‌లాండ్)పై గెలిచాడు. 33 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... తొలి గేమ్‌లో స్కోరు 11-11తో సమమైన తర్వాత శ్రీ వెనుదిరిగి చూడలేదు. వరుస పాయింట్లతో ప్రత్యర్థిని కట్టిపడేశాడు.
ఇక రెండో గేమ్‌లో ఆరంభం నుంచే శ్రీకాంత్ హవా చూపెట్టాడు. 7-0తో మొదలుపెట్టి చకచకా రెండు, మూడు పాయింట్లతో గేమ్‌ను ఏక పక్షంగా మార్చేశాడు. సింగిల్ పాయింట్లకే పరిమితమైన పోన్సానా ఏ దశలోనూ శ్రీకాంత్‌ను అందుకోలేకపోయాడు. మరో మ్యాచ్‌లో 10వ సీడ్ అజయ్ జయరామ్ 11-21, 21-8, 22-20తో జుల్ఫాద్లి జుల్కిఫ్లి (మలేసియా)ని ఓడించాడు. మహిళల ప్రిక్వార్టర్స్‌లో మూడోసీడ్ సింధు 21-13, 13-21, 21-14తో కారి ఇమాబీప్ (జపాన్)పై గెలిచింది.
గంటా మూడు నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... హైదరాబాదీకి ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలి గేమ్‌లో హోరాహోరీగా తలపడిన సింధు... రెండో గేమ్‌ను చేజార్చుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తన అనుభవాన్ని రంగరించి స్పష్టమైన ఆధిక్యంతో చెలరేగింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో జ్వాల-అశ్విని 14-21, 17-21తో షిజుకా మత్స్‌వో-మామి నైటో (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది.