కిడాంబి శ్రీకాంత్
టోక్యో: గతేడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్‌తో దుమ్మురేపిన భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు ఈ ఏడాది మాత్రం కలిసి రావడంలేదు. తాజాగా జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్‌లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–19, 16–21, 18–21తో ప్రపంచ 33వ ర్యాంకర్ లీ డాంగ్ కెయున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. గంటా 18 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మూడు గేమ్‌లూ హోరాహోరీగా సాగాయి.
అయితే కీలకదశలో లీ డాంగ్ పైచేయి సాధించాడు. శ్రీకాంత్‌పై లీ డాంగ్‌కిది వరుసగా రెండో విజయం. 2016 ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ శ్రీకాంత్‌పై మూడు గేముల్లో లీ డాంగ్ గెలిచాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21–15, 21–14తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై నెగ్గి ఆసియా క్రీడల్లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకున్నాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ (భారత్) 14–21, 17–21తో గిన్‌టింగ్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశాడు.
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్, భారత స్టార్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. గావో ఫాంగ్‌జి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 18–21, 19–21తో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 18–21, 21–16, 12–21తో హీ జిటింగ్–తాన్ కియాంగ్ (చైనా) జోడీ చేతిలో పోరాడి ఓడింది. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 16–21, 16–21తో చాన్ పెంగ్ సూన్–గో లియు యింగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment