Japan Open Super Series tournament
-
సింధు ముందుకు... శ్రీకాంత్ ఇంటికి
టోక్యో: ఈ సీజన్లో తన నిరాశాజనక ప్రదర్శన కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 11–21, 20–22తో భారత్‌కే చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ చేతిలో ఓడిపోయాడు. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీకాంత్ చేతిలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన ప్రణయ్ ఈసారి మాత్రం సంచలన ప్రదర్శన చేసి తన సహచరుడికి షాక్ ఇచ్చాడు. 2011లో ఏకైకసారి శ్రీకాంత్‌ను ఓడించిన ప్రణయ్ ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ అతడిపై గెలుపొందడం విశేషం. మరో సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సమీర్ వర్మ (భారత్) 17–21, 12–21తో ఆంటోన్సన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సింధు 21–9, 21–17తో హాన్ యుయె (చైనా)పై గెలిచింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు రెండో గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 11–21, 14–21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జోడీ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 16–21, 14–21తో కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (కొరియా) జంట చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–16, 21–17తో మార్కస్ ఇలిస్–క్రిస్ లాంగ్రిడ్జ్ (ఇంగ్లండ్) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. నేడు జరిగే సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అయా ఒహోరి (జపాన్)తో సింధు; కాంటా సునెయామ (జపాన్)తో సాయిప్రణీత్; రాస్ముస్ గెమ్కే (డెన్మార్క్)తో ప్రణయ్ తలపడతారు. -
శ్రీకాంత్‌కు మళ్లీ నిరాశ
టోక్యో: గతేడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్‌తో దుమ్మురేపిన భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు ఈ ఏడాది మాత్రం కలిసి రావడంలేదు. తాజాగా జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–19, 16–21, 18–21తో ప్రపంచ 33వ ర్యాంకర్ లీ డాంగ్ కెయున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. గంటా 18 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మూడు గేమ్‌లూ హోరాహోరీగా సాగాయి. అయితే కీలకదశలో లీ డాంగ్ పైచేయి సాధించాడు. శ్రీకాంత్‌పై లీ డాంగ్కిది వరుసగా రెండో విజయం. 2016 ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ శ్రీకాంత్‌పై మూడు గేముల్లో లీ డాంగ్ గెలిచాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21–15, 21–14తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై నెగ్గి ఆసియా క్రీడల్లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకున్నాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ (భారత్) 14–21, 17–21తో గిన్టింగ్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్, భారత స్టార్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. గావో ఫాంగ్‌జి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 18–21, 19–21తో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 18–21, 21–16, 12–21తో హీ జిటింగ్–తాన్ కియాంగ్ (చైనా) జోడీ చేతిలో పోరాడి ఓడింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 16–21, 16–21తో చాన్ పెంగ్ సూన్–గో లియు యింగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
శ్రీకాంత్, ప్రణయ్ ముందుకు
∙ సింధు, సైనా, సమీర్ ఇంటికి ∙ జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ టోక్యో: భారత బ్యాడ్మింటన్ స్టార్స్‌కు జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... సమీర్ వర్మ ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ పరాజయం చవిచూశారు. అలవోకగా...: వరుసగా మూడో సూపర్ సిరీస్ టైటిల్‌పై దృష్టి పెట్టిన శ్రీకాంత్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఇండోనేసియా, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన ఈ హైదరాబాద్ ప్లేయర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. ప్రపంచ 27వ ర్యాంకర్ హు యున్ (హాంకాంగ్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ కేవలం 29 నిమిషాల్లో గెలుపొందాడు. ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–12, 21–11తో హు యున్ను ఓడించాడు. హు యున్‌తో గతంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి, మరో రెండింటిలో ఓడిన శ్రీకాంత్ ఈసారి మాత్రం ప్రత్యర్థికి ఏదశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌లో శ్రీకాంత్ ఒకసారి వరుసగా ఐదు పాయింట్లు, రెండుసార్లు వరుసగా నాలుగు పాయింట్లు చొప్పున సాధించడం విశేషం. ‘మ్యాచ్ బాగా జరిగింది. హు యున్ ప్రమాదకర ప్రత్యర్థి. అతనికి ఏమాత్రం కోలుకునే అవకాశం ఇచ్చినా ఇబ్బంది తప్పదు. అందుకే నిలకడగా పాయింట్లు సాధించడంపైనే దృష్టి పెట్టాను’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. మరో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 21–16, 23–21తో సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై గెలుపొందగా... సమీర్ వర్మ 21–10, 17–21, 15–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకి (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్... షి యుకితో ప్రణయ్ తలపడతారు. ఈసారి ఏకపక్షం...: మహిళల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు 18–21, 8–21తో ఓడిపోయింది. నెల రోజుల వ్యవధిలో వీరిద్దరూ మూడోసారి ముఖాముఖిగా తలపడటం విశేషం. ఈ విజయంతో గతవారం కొరియా ఓపెన్ ఫైనల్లో సింధు చేతిలో ఎదురైన ఓటమికి ఒకుహారా బదులు తీర్చుకుంది. 48 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో రెండుసార్లు ఆధిక్యంలో ఉన్నా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆరంభంలో 6–2తో ముందంజ వేసిన సింధు ఆ తర్వాత చివర్లో 18–16తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో ఒకుహారా వరుసగా ఐదు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో ఒకుహారా జోరు పెంచగా... సింధు డీలా పడిపోయింది. ఈ గేమ్‌లో ఒక్కసారి కూడా ఇద్దరి స్కోర్లు సమం కాకపోవడం గమనార్హం. ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో, కొరియా ఓపెన్ ఫైనల్లో వీరిద్దరి మధ్య పాయింట్ల కోసం సుదీర్ఘ ర్యాలీలు జరగ్గా, ఈసారి అవి అంతగా కనబడలేదు. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 16–21, 13–21తో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌లో 14–10తో... రెండో గేమ్‌లో 6–4తో ఆధిక్యంలో వెళ్లినప్పటికీ దీనిని తనకు అనుకూలంగా మల్చుకోలేకపోయింది. క్వార్టర్స్‌లో సిక్కి–ప్రణవ్ జోడీ: మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి–ప్రణవ్ ద్వయం 21–13, 21–17తో యుకి కనెకో–కొహారు యెనెమోటో (జపాన్) జంటను ఓడించింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్పప్ప (భారత్) జోడీ 27–29, 21–16, 12–21తో నాలుగో సీడ్ ప్రవీణ్ జోర్డాన్–డెబ్బీ సుశాంతో (ఇండోనేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది. -
సూపర్ సాత్విక్...
ఒకే రోజు నాలుగు మ్యాచ్‌ల్లో విజయం ►పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత ►జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ అంతర్జాతీయస్థాయి బ్యాడ్మింటన్ ప్రమాణాలకు అనుగుణంగా ఒక రోజు ఒక మ్యాచ్ ఆడితే కోలుకోవడానికి తగినంత విశ్రాంతి కావాలి. మరి ఒకే రోజు ఎనిమిది గంటల వ్యవధిలో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి వస్తే ఫిట్నెస్తోపాటు మానసికంగా ఎంతో ధృడంగా ఉండాలి. జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే 17 ఏళ్ల సాత్విక్ సాయిరాజ్ ఎలాంటి తడబాటుకు లోనుకాకుండా నాలుగు మ్యాచ్‌ల్లోనూ తన భాగస్వాములతో కలిసి విజయం సాధించి అబ్బురపరిచాడు. ఫలితంగా ఆరు అడుగుల ఎత్తు ఉన్న ఈ అమలాపురం కుర్రాడు పురుషుల డబుల్స్‌లో చిరాగ్ శెట్టితో కలిసి... మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో కలిసి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. టోక్యో: అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ యువ డబుల్స్ ఆటగాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల ఈ కుర్రాడు ఒకే రోజు నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో సాత్విక్–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 24 నిమిషాల్లో 21–13, 21–15తో హిరోకి మిదొరికావా–నత్సు సైతో (జపాన్) జోడీపై... రెండో రౌండ్లో 29 నిమిషాల్లో 21–18, 21–9తో హిరోకి ఒకముర–నారు షినోయా (జపాన్) జంటపై విజయం సాధించి మెయిన్ ‘డ్రా’కు దూసుకెళ్లింది. అనంతరం పురుషుల డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 59 నిమిషాల్లో 14–21, 22–20, 21–18తో హిరోకత్సు హషిమోటో–హిరోయుకి సెకి (జపాన్) జంటపై... రెండో రౌండ్లో 33 నిమిషాల్లో 21–18, 21–12తో కెచిరో మత్సు–యోషినోరి తెకుచి (జపాన్) ద్వయంపై గెలుపొంది మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించింది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో పారుపల్లి కశ్యప్ (భారత్)కు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో కశ్యప్ 21–15, 21–14తో ఎమిల్ హోస్ట్ (డెన్మార్క్)పై గెలుపొంది... రెండో రౌండ్లో 11–21, 21–18, 14–21తో ఇగారషి (జపాన్) చేతిలో ఓడిపోయి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. మిక్స్డ్ డబుల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 21–19, 17–21, 21–15తో తొమాయా తకషినా–రి ఎతో (జపాన్) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో తియాన్ హువీ (చైనా)తో కిడాంబి శ్రీకాంత్; లిన్ డాన్ (చైనా)తో సౌరభ్ వర్మ; లీ డోంగ్ కెయున్ (దక్షిణ కొరియా)తో సాయిప్రణీత్; అండెర్స్ అంటోన్సెన్ (డెన్మార్క్) ప్రణయ్; ఫెట్‌ప్రదాబ్ (థాయ్‌లాండ్)తో సమీర్ వర్మ ఆడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మినత్సు మితాని (జపాన్)తో సింధు; పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సైనా నెహ్వాల్ తలపడతారు. త్రీ స్టార్స్... త్రీ చీర్స్ టోక్యోలో జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ సందర్భంగా తన చిరకాల ప్రత్యర్థులు రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), ప్రపంచ చాంపియన్ ఒకుహారా (జపాన్)లతో పీవీ సింధు -
మరో ‘సూపర్’ టైటిల్ లక్ష్యంగా...
►జపాన్ ఓపెన్ బరిలో సింధు ►సైనా, శ్రీకాంత్‌లపై దృష్టి టోక్యో: వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ బరిలోకి దిగనుంది. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీలో... మహిళల సింగిల్స్‌లో సింధుతోపాటు సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సౌరభ్ వర్మ, సమీర్ వర్మ, ప్రణయ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. తొలి రోజు క్వాలిఫయింగ్‌తోపాటు మిక్స్డ్ డబుల్స్‌లో మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ఎమిల్ హోస్ట్ (డెన్మార్క్)తో కశ్యప్ ఆడతాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మితాని మినత్సు (జపాన్)తో సింధు... పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సైనా తలపడతారు. ఒకవేళ సింధు తొలి రౌండ్ దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) లేదా చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)లతో ఆడే చాన్స్ ఉంది. మరోవైపు సైనాకు ప్రిక్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి గా రియో ఒలింపిక్స్ విజేత కరోలినా మారిన్ (స్పెయిన్) లేదా చెన్ జియోజిన్ (చైనా) ఎదురవుతారు. ఆదివారం జరిగిన కొరియా ఓపెన్ ఫైనల్లో ఒకుహారాపై సింధు గెలిచి టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే. సింధు, సైనా ఒకే పార్శ్వంలో ఉండటంతో వీరిద్దరూ సెమీఫైనల్లో తలపడే అవకాశముంది.