శ్రీకాంత్, ప్రణయ్‌ ముందుకు | Saina Nehwal, PV Sindhu crash out of Japan Open Super Series tournament | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్, ప్రణయ్‌ ముందుకు

Published Fri, Sep 22 2017 12:07 AM | Last Updated on Fri, Sep 22 2017 10:02 AM

శ్రీకాంత్, ప్రణయ్‌ ముందుకు

శ్రీకాంత్, ప్రణయ్‌ ముందుకు

సింధు, సైనా, సమీర్‌ ఇంటికి
∙ జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ


టోక్యో: భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌కు జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లగా... సమీర్‌ వర్మ  ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ పరాజయం చవిచూశారు.  

అలవోకగా...: వరుసగా మూడో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌పై దృష్టి పెట్టిన శ్రీకాంత్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఇండోనేసియా, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్స్‌ నెగ్గిన ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించాడు. ప్రపంచ 27వ ర్యాంకర్‌ హు యున్‌ (హాంకాంగ్‌)తో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ కేవలం 29 నిమిషాల్లో గెలుపొందాడు. ఎనిమిదో సీడ్‌ శ్రీకాంత్‌ 21–12, 21–11తో హు యున్‌ను ఓడించాడు. హు యున్‌తో గతంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి, మరో రెండింటిలో ఓడిన శ్రీకాంత్‌ ఈసారి మాత్రం ప్రత్యర్థికి ఏదశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌లో శ్రీకాంత్‌ ఒకసారి వరుసగా ఐదు పాయింట్లు, రెండుసార్లు వరుసగా నాలుగు పాయింట్లు చొప్పున సాధించడం విశేషం. ‘మ్యాచ్‌ బాగా జరిగింది. హు యున్‌ ప్రమాదకర ప్రత్యర్థి. అతనికి ఏమాత్రం కోలుకునే అవకాశం ఇచ్చినా ఇబ్బంది తప్పదు. అందుకే నిలకడగా పాయింట్లు సాధించడంపైనే దృష్టి పెట్టాను’ అని శ్రీకాంత్‌ వ్యాఖ్యానించాడు. మరో మ్యాచ్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 21–16, 23–21తో సు జెన్‌ హావో (చైనీస్‌ తైపీ)పై గెలుపొందగా... సమీర్‌ వర్మ 21–10, 17–21, 15–21తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ షి యుకి (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)తో శ్రీకాంత్‌... షి యుకితో ప్రణయ్‌ తలపడతారు.  

ఈసారి ఏకపక్షం...: మహిళల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. ప్రపంచ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)తో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పీవీ సింధు 18–21, 8–21తో ఓడిపోయింది. నెల రోజుల వ్యవధిలో వీరిద్దరూ మూడోసారి ముఖాముఖిగా తలపడటం విశేషం. ఈ విజయంతో గతవారం కొరియా ఓపెన్‌ ఫైనల్లో సింధు చేతిలో ఎదురైన ఓటమికి ఒకుహారా బదులు తీర్చుకుంది. 48 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో రెండుసార్లు ఆధిక్యంలో ఉన్నా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆరంభంలో 6–2తో ముందంజ వేసిన సింధు ఆ తర్వాత చివర్లో 18–16తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో ఒకుహారా వరుసగా ఐదు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో ఒకుహారా జోరు పెంచగా... సింధు డీలా పడిపోయింది. ఈ గేమ్‌లో ఒక్కసారి కూడా ఇద్దరి స్కోర్లు సమం కాకపోవడం గమనార్హం. ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో, కొరియా ఓపెన్‌ ఫైనల్లో వీరిద్దరి మధ్య పాయింట్ల కోసం సుదీర్ఘ ర్యాలీలు జరగ్గా, ఈసారి అవి అంతగా కనబడలేదు. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్‌ 16–21, 13–21తో రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌లో 14–10తో... రెండో గేమ్‌లో 6–4తో ఆధిక్యంలో వెళ్లినప్పటికీ దీనిని తనకు అనుకూలంగా మల్చుకోలేకపోయింది.  

క్వార్టర్స్‌లో సిక్కి–ప్రణవ్‌ జోడీ: మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా జంట క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సిక్కి–ప్రణవ్‌ ద్వయం 21–13, 21–17తో యుకి కనెకో–కొహారు యెనెమోటో (జపాన్‌) జంటను ఓడించింది. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్పప్ప (భారత్‌) జోడీ 27–29, 21–16, 12–21తో నాలుగో సీడ్‌ ప్రవీణ్‌ జోర్డాన్‌–డెబ్బీ సుశాంతో (ఇండోనేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement