సూపర్ సాత్విక్...
ఒకే రోజు నాలుగు మ్యాచ్‌ల్లో విజయం
►పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత
►జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ
అంతర్జాతీయస్థాయి బ్యాడ్మింటన్ ప్రమాణాలకు అనుగుణంగా ఒక రోజు ఒక మ్యాచ్ ఆడితే కోలుకోవడానికి తగినంత విశ్రాంతి కావాలి. మరి ఒకే రోజు ఎనిమిది గంటల వ్యవధిలో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి వస్తే ఫిట్‌నెస్‌తోపాటు మానసికంగా ఎంతో ధృడంగా ఉండాలి. జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే 17 ఏళ్ల సాత్విక్ సాయిరాజ్ ఎలాంటి తడబాటుకు లోనుకాకుండా నాలుగు మ్యాచ్‌ల్లోనూ తన భాగస్వాములతో కలిసి విజయం సాధించి అబ్బురపరిచాడు. ఫలితంగా ఆరు అడుగుల ఎత్తు ఉన్న ఈ అమలాపురం కుర్రాడు పురుషుల డబుల్స్‌లో చిరాగ్ శెట్టితో కలిసి... మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో కలిసి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు.
టోక్యో: అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ యువ డబుల్స్ ఆటగాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల ఈ కుర్రాడు ఒకే రోజు నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. మిక్స్‌డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో సాత్విక్–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 24 నిమిషాల్లో 21–13, 21–15తో హిరోకి మిదొరికావా–నత్సు సైతో (జపాన్) జోడీపై... రెండో రౌండ్‌లో 29 నిమిషాల్లో 21–18, 21–9తో హిరోకి ఒకముర–నారు షినోయా (జపాన్) జంటపై విజయం సాధించి మెయిన్ ‘డ్రా’కు దూసుకెళ్లింది. అనంతరం పురుషుల డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 59 నిమిషాల్లో 14–21, 22–20, 21–18తో హిరోకత్సు హషిమోటో–హిరోయుకి సెకి (జపాన్) జంటపై... రెండో రౌండ్‌లో 33 నిమిషాల్లో 21–18, 21–12తో కెచిరో మత్సు–యోషినోరి తెకుచి (జపాన్) ద్వయంపై గెలుపొంది మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించింది.
పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో పారుపల్లి కశ్యప్ (భారత్)కు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్‌లో కశ్యప్ 21–15, 21–14తో ఎమిల్ హోస్ట్ (డెన్మార్క్)పై గెలుపొంది... రెండో రౌండ్‌లో 11–21, 21–18, 14–21తో ఇగారషి (జపాన్) చేతిలో ఓడిపోయి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. మిక్స్‌డ్ డబుల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 21–19, 17–21, 21–15తో తొమాయా తకషినా–రి ఎతో (జపాన్) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో తియాన్ హువీ (చైనా)తో కిడాంబి శ్రీకాంత్; లిన్ డాన్ (చైనా)తో సౌరభ్ వర్మ; లీ డోంగ్ కెయున్ (దక్షిణ కొరియా)తో సాయిప్రణీత్; అండెర్స్ అంటోన్‌సెన్ (డెన్మార్క్) ప్రణయ్; ఫెట్‌ప్రదాబ్ (థాయ్‌లాండ్)తో సమీర్ వర్మ ఆడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మినత్సు మితాని (జపాన్)తో సింధు; పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సైనా నెహ్వాల్ తలపడతారు.
త్రీ స్టార్స్... త్రీ చీర్స్
టోక్యోలో జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ సందర్భంగా తన చిరకాల ప్రత్యర్థులు రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), ప్రపంచ చాంపియన్ ఒకుహారా (జపాన్)లతో పీవీ సింధు