
పారిస్ (ఫ్రాన్స్): ఓర్లీన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో శ్రీకాంత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ 45వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–8, 21–14తో మాడ్స్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)పై గెలిచాడు.
అనంతరం రెండో రౌండ్‌లో శ్రీకాంత్ 21–11, 14–21, 21–12తో అర్నాడ్ మెర్కెల్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ మూడో గేమ్‌లో ఒకదశలో వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. భారత్‌కే చెందిన మరో ప్లేయర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ కూడా మెయిన్ ‘డ్రా’కు చేరుకున్నాడు.
క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో శంకర్ 21–19, 19–21, 21–19తో మాగ్నుస్ జొహాన్సెన్ (డెన్మార్క్)పై, రెండో రౌండ్‌లో 21–18, 21–12తో భారత్‌కే చెందిన రితి్వక్ సంజీవ్ సతీశ్ కుమార్‌పై గెలుపొందాడు. హైదరాబాద్‌కే చెందిన తరుణ్ మన్నేపల్లి మెయిన్ ‘డ్రా’కు చేరుకోవడంలో విఫలమయ్యాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో తరుణ్ 21–17, 9–21, 16–21తో జువో ఫు లియావో (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు.
ఉన్నతి, ఇషారాణి కూడా
మహిళల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్స్ ఉన్నతి హుడా, ఇషారాణి బారువా కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో ఉన్నతి 21–12, 21–16తో సియు టాంగ్ టుంగ్ (చైనీస్ తైపీ)పై, రెండో రౌండ్‌లో 21–13, 21–15తో కిసోనా (మలేసియా)పై గెలిచింది. ఇషారాణి క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో 12–21, 21–10, 21–12తో జుయ్‌ఫె కి (ఫ్రాన్స్)పై, రెండో రౌండ్‌లో 25–27, 21–16, 23–21తో అమెలీ షుల్జ్ (డెన్మార్క్)పై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment