రెండో రౌండ్‌లో సింధు
కశ్యప్, పవార్ ముందంజ
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్
బాసెల్: ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు... స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఏడోసీడ్ సింధు 21-18, 21-15తో సాంటాష్ సానిర్ (మలేసియా)పై విజయం సాధించి రెండోరౌండ్‌లోకి ప్రవేశించింది. 32 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి తొలి గేమ్‌లో చకచకా పాయింట్లు గెలుస్తూ 10-3కు దూసుకుపోయింది. ఈ దశలో పుంజుకున్న మలేసియా ప్లేయర్.. సింధు ఆధిక్యాన్ని 15-16కు తగ్గించి... 17-17, 18-18తో స్కోరును సమం చేసింది. అయితే సింధు భిన్నమైన షాట్లతో వరుసగా మూడు పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకుంది. స్కోరు 7-7 వరకు రెండో గేమ్ హోరాహోరీగా సాగింది.
అదే దూకుడును ప్రదర్శించిన సానిర్ 13-9 ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ పట్టు విడవకుండా పోరాడిన సింధు 14-14తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు. వరుస పాయింట్లతో హోరెత్తించి గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో సింగిల్స్ మ్యాచ్‌లో సయాలీ రాణే (భారత్) 8-21, 9-21తో మూడోసీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడికి చుక్కెదురైంది. తొలి రౌండ్‌లో జ్వాల-అశ్విని 19-21, 21-13, 18-21తో ఇస్బెల్ హెట్రిచ్-కార్లా నెల్టీ (జర్మనీ) చేతిలో ఓటమిపాలైంది.
కశ్యప్ హవా
మంగళవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఏపీ కుర్రాడు, మూడోసీడ్ పారుపల్లి కశ్యప్ 21-17, 21-15తో ఎరిక్ మిజిస్ (నెదర్లాండ్స్)పై గెలిచి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. 34 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. మరో మ్యాచ్‌లో ఆనంద్ పవార్ 21-17, 21-10తో కోక్ పోంగ్ లోక్ (మలేసియా)ను ఓడించాడు. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో తరుణ్ కోనా-అశ్విని జోడి 10-21, 21-16, 13-21తో రాబర్ట్ మట్‌సుయాక్-ఆగ్నేస్కా వొజ్‌కోవాస్కా (ఇండోనేసియా) చేతిలో ఓడింది.